రాజా విక్రమార్కుడిని అనుగ్రహించిన హర్సిద్ధి మాత..!
.webp)
దేశవ్యాప్తంగా నవరాత్రి గొప్ప ఉత్సాహంతో ప్రారంభమైంది. మహాకాళ నగరమైన ఉజ్జయిని కూడా ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటోంది. అమ్మవారి ఆశీస్సులు కోరుతూ దేవాలయాలలో ప్రతిచోటా భక్తుల రద్దీ కనిపిస్తుంది. ఉజ్జయినిలోని ప్రసిద్ధ హర్సిద్ధి మాత ఆలయం వద్ద నవరాత్రి రోజుల్లో భక్తుల హడావిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయానికి హిందూ గ్రంథాలలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సతీ శరీర భాగాలు వివిధ ప్రదేశాలలో పడిపోగా, ఆమె కుడి మోచేయి ఉజ్జయినిలోని శిప్రా నది ఒడ్డున పడిపోయిందని నమ్ముతారు.
అమ్మవారి శరీర భాగాలలో కుడి మోచేయి పడిపోయిన ఈ ప్రాంతంలో శక్తి పీఠం వెలిసింది. పురాణాల ప్రకారం రాజు విక్రమాదిత్యుడికి, ఈ ఆలయానికి చాలా గాఢమైన సంబందం ఉంది. ఇక్కడి అమ్మవారిని ఆరాధించడం వల్లనే విక్రమార్కుడు చక్రవర్తి అయ్యాడని అంటారు. ఈ కారణంగా ఈ ఆలయం తంత్ర ఆచారాలు, సిద్ధి సాధనకు ముఖ్యమైన కేంద్రంగా మారింది.
ఆలయం నుండి దాదాపు 200 మీటర్ల దూరంలో శివుని మహాకాళ జ్యోతిర్లింగం ఉంది. ఈ ఆలయంలో ఒక యంత్రం ప్రతిష్టించబడింది. ఈ ప్రదేశం తాంత్రిక సంప్రదాయంలో సిద్ధ పీఠంగా పరిగణించబడుతుంది.
విక్రమాదిత్యుడు ఇక్కడి నుండే యంత్ర సిద్ధిని పొందాడని చెబుతారు. స్కంద పురాణం ప్రకారం ఇక్కడి అమ్మవారు ప్రచండ రాక్షస అనే రాక్షసుడిని చంపిందని, ఆ తర్వాత హర్సిద్ధి అని పిలువబడిందని చెబుతారు. ప్రసిద్ధ నమ్మకం ప్రకారం హర్సిద్ధి అమ్మవారు విక్రమాదిత్యుడి ఇలవేల్పు అని అంటారు.
విక్రమాదిత్యుడు ఇక్కడ దేవతను శాంతింపజేసి శ్రీ యంత్ర శక్తులను పొందాడని నమ్ముతారు. ఈ శక్తులను పొందిన తర్వాత ఆయన దేశం మొత్తాన్ని ఏక ఛత్రాదిపత్యం కింద చక్రవర్తిగా పాలించాడని చెబుతారు.
ఈ హర్సిద్ది దేవాలయంలో ఉన్న మరొక విశిష్టత ఏమిటంటే.. ఒకేసారి 1100 దీపాలను వెలిగిస్తారు.
ఆలయ సముదాయంలోని 51 అడుగుల ఎత్తైన భారీ దీప స్తంభం భక్తుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ స్తంభంపై ఒకేసారి దాదాపు 1,100 దీపాలను వెలిగిస్తారు. దీనికి దాదాపు 60 లీటర్ల నూనె, 4 కిలోగ్రాముల పత్తి అవసరం.
భక్తులు తమ కోరికలు నెరవేరాలని కోరుకున్నప్పుడు ఇక్కడ దీపాలను వెలిగిస్తారట. ఈ ప్రత్యేకమైన సంప్రదాయం వల్ల దీపాలు వెలిగించడానికి చాలాసేపు వేచి ఉండాల్సి వస్తుంది.
తొమ్మిది రోజులు నిద్ర హారతి చేయరు..
హర్సిద్ధి ఆలయంలో తొమ్మిది రోజుల నవరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో, దానిమ్మ గింజలు, తేనె, అల్లం ప్రత్యేక నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు. ఈ రోజుల్లో దేవత నిద్రపోదని నమ్ముతారు. అందుకే ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి శయన హారతి చేయరు.
*రూపశ్రీ.



