అయోధ్య రాముడిని దొంగిలిస్తేనే దసరా పండుగ చేసుకునే ప్రాంతం గురించి తెలుసా..


దసరా అంటే దేశం మొత్తం ఎంతో వైభవంగా అమ్మవారిని ఆరాధించడం అందరికీ గుర్తు వస్తుంది.  ప్రాంతాలను బట్టి ఆచారాలు, సంప్రదాయాలు వేరుగా ఉండటం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం.  సాధారణంగా దసరా అంటే ఆశ్వయుజ మాస పాడ్యమి రోజు మొదలై.. విజయ దశమితో ముగుస్తుంది. కానీ ఒక ప్రాంతంలో మాత్రం అయోధ్య రాముడిని దొంగిలించిన తరువాతే దసరా పండుగ మొదలవుతుంది.  అసలు దసరాకు.. అయోధ్య రాముడి దొంగతనానికి సంబంధం ఏంటి? ఈ ఆచారం ఎక్కడుంది? పూర్తీగా తెలుసుకుంటే..

హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో జరిగే  దసరా భారతదేశంలో ప్రసిద్ధి పొందిన ప్రత్యేక ఉత్సవం. ఇది దేశంలోని ఇతర ప్రాంతాల్లోలాగా రావణ దహనంతో ముగియదు. కులు దసరా విజయదశమి రోజున మొదలై, ఒక వారం పాటు కొనసాగుతుంది.

ఇక్కడ చాలా మందిని ఆశ్చర్యపరిచేది,  అందరినీ ఆకట్టుకునేది ఏంటంటే.. అయోధ్య రాముడిని "దొంగిలించడం" అనే కథనం.  నిజానికి ఇదే ఇక్కడ విజయదశమి పండుగ చేసుకోవడానికి మూలం కూడా.  దీని వెనుక ఒక కథనం ఉంది.


16వ శతాబ్దంలో కులు రాజు జగత్ సింగ్ ఒక శాపం వల్ల తీవ్ర కష్టాల్లో పడ్డాడట. అతనికి పాప విమోచనం కావాలంటే  రాముడిని ఆరాధించాలి అని సలహా ఇచ్చారు.  అలా రాముడిని ఆరాధించడం కోసం అయోధ్య నుంచి ఒక రామమూర్తి విగ్రహాన్ని రహస్యంగా తీసుకువచ్చి కులు లో ప్రతిష్టించారట. ఇలా రహస్యంగా రామచంద్రుడి విగ్రహాన్ని తీసుకురావడాన్నే "రాముడిని దొంగిలించడం" అని స్థానికులు భావించారు. ఇదే కులు దసరా ఆరంభానికి మూలం అయ్యిందట. ఆ రోజునుంచి ప్రతి సంవత్సరం దసరా నాడు కులు లో రాముడిని  ఆరాధిస్తూ ఉత్సవం చేస్తున్నారు.

 ఉత్సవం ప్రత్యేకత..

దేశమంతటా దసరా రోజున పండుగ ముగుస్తుంది, కానీ కులు దసరా  మాత్రం విజయదశమి  రోజు ప్రారంభమై 7 రోజులు జరుగుతుందట. 300 కి పైగా దేవతామూర్తులు  రాముడిని దర్శించేందుకు కులు లోకి రథయాత్రగా వస్తారట. వీరంతా హిమాచల్ గ్రామ దేవతలు అని చెబుతారు. చివరి రోజు "బియాస్ నది తీరంలో" రాముడి రథాన్ని నిలిపి రావణదహనం లేకుండా, దేవతలందరినీ సమూహంగా ఆరాధించడంతో పండుగ ముగుస్తుంది.

ఎందుకు రావణదహనం ఉండదంటే..

ఇక్కడ రాముడి విజయం కంటే.. రాముడి ఆరాధన , రాజు జగత్ సింగ్ పాప విమోచనం అనే సంఘటన ప్రధానంగా పరిగణిస్తారు. అందుకే ఇతర ప్రాంతాల్లోలాగా ఇక్కడ  దహనం జరగదు.

సంప్రదాయం ఎప్పటి నుండి?

ఈ పద్దతి 16వ శతాబ్దం నుంచి ఉందట. అంటే  రాజు జగత్ సింగ్ కాలం నుంచి కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఉత్సవం ఇది.

                             *రూపశ్రీ.


More Dasara - Navaratrulu