పాకిస్తాన్‌లోని ‘గాజుల అమ్మవారు’

 


దేశ విభజన ముందు ఇప్పటి పాకిస్తాన్‌లో కూడా లెక్కలేనన్ని హిందూ దేవాలయాలు ఉండేవి. హిందూ, ముస్లిం తారతమ్యాలు లేకుండా స్థానికులంతా వాటిని ఆదరించేవారు. కానీ ప్రత్యేక దేశం ఏర్పడిన తర్వాత హిందూ ఆలయాలు జీర్ణావస్థకు చేరుకోసాగాయి. స్థానికుల స్వార్థం వల్లనో, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానో ఘనత వహించిన ఆలయాలెన్నో శిథిలమైపోయాయి. వాటిలో ఒకటే ‘చూరియా దుర్గ’ ఆలయం.

 

పాకిస్తాన్‌లోని సింధ్‌ రాష్ట్రంలో ‘నంగర్‌పార్‌కర్‌’ అనే ఊరు ఉంది. ఒకప్పుడు అక్కడ అంతా నీరు ఉండేదట. ఆ నీటిని దాటుకుని ఆవలి ఒడ్డుకి చేరుకుంటేనే నాగరికత కనిపించేదట. అందుకనే ఈ ప్రాంతానికి ‘పార్‌కర్’ (దాటి వెళ్లాలి) అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ ఊరిలో ‘చూరియా జబల్‌’ అనే గ్రానైటు కొండ ఉంది. మిగతా ఎక్కడా కనిపించని విధంగా ఈ కొండరాయి ఎర్రటి రంగులో ఉండటం ఓ విశేషం. వేసవిలో ఈ కొండ నుంచి చిత్రవిచిత్రమైన శబ్దాలు రావడం మరో వింత. ఇవన్నీ కూడా ఆ కొండ మీద వెలిసిన అమ్మవారి మహత్తే అని కొందరి నమ్మకం.

 

చూరియా జబల్‌ కొండ మీద వెలసిన దేవిని ‘చూరియా దుర్గ’ అని పిలుస్తారు. చూరియా అంటే సింధీ భాషలో ‘గాజులు’ అని అర్థం. హిందూ సంప్రదాయంలో గాజులు సౌభాగ్యానికి చిహ్నం కాబట్టి, ఇక్కడి అమ్మవారికి ఆ పేరు పెట్టి ఉండవచ్చు. పేరు పెట్టడమే కాదు, ఈ కొండ చుట్టుపక్కల ఉండే జనం గాజుల తయారీ మీదే ఆధారపడుతూ ఉంటారు. తమ వృత్తిని ప్రతిబింబించేలా ఒంటినిండా గాజులు వేసుకుని కనిపిస్తారట.

 

చూరియా జబల్‌ ఆలయం భారత సరిహద్దుకి కేవలం 16 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కాబట్టి పాకిస్తాన్లోని హిందువులు మాత్రమే కాకుండా... ఇండియా, నేపాల్‌ దేశాల నుంచి కూడా భక్తులు ఈ అమ్మవారిని చూసేందుకు ఉబలాటపడుతూ ఉంటారు. ముఖ్యంగా దసరా, శివరాత్రి సందర్భాలలో ఈ ఆలయానికి లక్షలాదిమంది భక్తులు పోటెత్తుతారు.

 

అసలే హిందూ దేవాలయం, పైగా అరుదైన గ్రానైటు కొండ మీద ఉంది. దాంతో స్వార్థపరుల చూపు దీని మీద పడనే పడింది. 2011 శివరాత్రి తర్వాత ఈ కొండని తవ్వడం మొదలుపెట్టారు. వారి తవ్వకాలలో అమ్మవారి గుడిని చేరుకునే మార్గం కూడా ధ్వంసమైపోయింది. అక్కడి ప్రభుత్వం కూడా ఈ విధ్వంసకాండని చూస్తూ ఊరుకుంది. ప్రస్తుతం ఇక్కడ అమ్మవారి ఆలయమైతే ఉంది కానీ... అది కూడా అతి త్వరలో అది కూడా కూలిపోయే ప్రమాదం లేకపోలేదు.

 

నంగర్‌పార్‌కర్‌లో దుర్గామాత ఆలయమే కాదు. వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన జైన ఆలయాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఈ ఊళ్లో జైనులు చాలా ఎక్కువగా ఉండేవారట. పార్కర్‌ జైనులంటే గొప్ప పేరు ఉండేదట. దేశవిభజన తర్వాత జైనులు కాస్తా వలస వెళ్లిపోయారు. వారు నిర్మించిన దేవాలయాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఇలా ఒకటీ రెండూ కాదు... 14 అరుదైన జైన ఆలయాలు ఇక్కడ కనిపిస్తాయి. యునెస్కో సైతం వీటిని సాంస్కృతిక సంపదగా గుర్తిస్తోంది. కానీ ఇవి కూడా శిథిలమైపోతున్నాయని వేరే చెప్పాలా!

- నిర్జర.

 


More Dasara - Navaratrulu