రామకృష్ణ పరమహంస పంచసూత్ర ప్రభోదం!

మన భారతదేశంలో మనకు లభించిన గొప్ప ఆధ్యాత్మిక గురువులలో రామకృష్ణ పరమహంస ఒకరు. ఆయన ఎంతో గొప్పవారు. స్వామి వివేకానందకు గురువు ఈయనే.. జీవితంలో అందరూ అర్థం చేసుకుని పాటించడానికి రామకృష్ణులవారు అయిదు సూత్రాలు చెప్పారు. వీటిని పంచసూత్ర ప్రభోధమని పిలిచారు.

1. ఈశ్వర దర్శనం సాక్షాత్కారశ్చ జీవనస్య లక్ష్యం|

 'భగవంతుని దర్శనం, సాక్షాత్కారాలే జీవిత లక్ష్యం..

హైందవ శాస్త్రాలు మోక్షమే, పునర్జన్మ రాహిత్యమే జీవిత లక్ష్యాలని పేర్కొన్నాయి. మోక్షమున్నా. సాక్షాత్కారమన్నా ఒక్కటే. భగవల్లాభానంతరమే ధనార్జనకు ప్రయత్నించాలని శ్రీరామకృష్ణులు స్పష్టంగా చెప్పారు. సాక్షాత్కారం వల్ల లాభమేమిటని ఐహిక భోగలాలసులు ప్రశ్నిస్తారు. దానికి రెండవ సూత్రమే...

2. ఆదర్శనేన సాక్షాత్కారేణ చ సర్వం కృతం సర్వం ప్రాప్తం

'భగవంతుణ్ణి దర్శించడం వల్ల, సాక్షాత్కరించుకోవడం వల్ల సర్వం సిద్ధిస్తుంది! సర్వం ప్రాప్తిస్తుంది! 

భగవత్సాక్షాత్కారం పొందిన తరువాత అన్నీ ప్రాప్తిస్తాయి. శ్రీరామకృష్ణులు ఒక దృష్టాంతం చెప్పారు. ఇద్దరు మిత్రులు ఒక మామిడి తోటలో ప్రవేశించారు. ఒకడు మామిడి చెట్లను లెక్క పెడుతుండగా, రెండవవాడు తోట యజమానిని కలసి, ఆయనతో చెలిమి చేశాడు. యజమాని ముందుగా మధురమైన మామిడి పళ్ళు ఇచ్చి, ఆపైన తోట వివరాలు చెప్పారు. కనుక 'యజమానిని' దర్శించడం మేలు కదా! అలాగే.. సాధనా మార్గాల ద్వారా భగవంతుణ్ణి దర్శించడానికి   ఈ క్రింది సూత్రాలు తెలుసుకోవాలి..

3. కామకాంచనత్యాగః ప్రధానం సాధనమ్ ॥ 

కామ కాంచన త్యాగమే ప్రధాన సాధనం"

మన బంధాలన్నింటికీ కారణం దేహాత్మ బుద్ధియే అంటుంది వేదాంతం. సాధకులు ప్రతి ఒక్కరూ అరిషడ్వర్గాలైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను విడనాడాలి. కామక్రోధాలు మిగతా నాలుగింటికి కారణభూతాలు కనుక, శ్రీరామకృష్ణులు తమ బోధనలలో కామ కాంచన త్యాగాన్ని నొక్కి వక్కాణించారు. కలిని కనకంలో నివసించమని పరీక్షిత్తు మహారాజు వరం ఇచ్చినప్పుడే, శ్రీరామకృష్ణుల బోధనకు బాట వేసినట్లయింది.

4. సత్యం చ|| సత్యము కూడా '

శాస్త్రాలన్నీ సత్యం గురించి వక్కాణిస్తాయి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నది తైత్తిరీయ ఉపనిషత్తు, 

సత్యం రెండు విధాలు: 

1. సత్యవచనం - సత్యం పలుకుట 

2. వచన సత్యం - ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. 

సాధనల చరమాంకంలో శ్రీరామకృష్ణులు ధర్మం, అధర్మం మొదలైన అన్ని ద్వంద్వాలనూ జగన్మాత చరణారవిందాలకు సమర్పించారు. కానీ సత్యాసత్యాలను అర్పించలేదు. సత్యాన్ని అర్పిస్తే ఇక దేనిని అవలంబించి జీవించడం. కలియుగంలో సత్యమే తపస్సు' అన్నారు శ్రీరామకృష్ణులు, ఇటువంటి సాధనలు సాధారణ మనుష్యులకు కొంచెం కష్టతరం, మరి సులువైన మార్గం ఏదీ లేదా? ఉంది అన్నారు శ్రీరామకృష్ణులు.

5. వ్యాకుల అపి ఈశ్వరసాక్షాత్కార: సాధ్యః ॥ 

'వ్యాకులత మూలంగా కూడా భగవత్సాక్షాత్కారం సాధ్యం' 

శ్రీరామకృష్ణులు చెప్పిన దృష్టాంతం: పాప బొమ్మలతో ఆడుతుంటే తల్లి గృహకృత్యాలు చక్కబెడుతుంది. బొమ్మలతో విసుగెత్తి ఏడ్చినప్పుడు తల్లి పరుగు పరుగున వస్తుంది. ఆ విధంగానే అల్ప ప్రాపంచిక విషయాలలో మునిగిన మనం జగన్మాతను మరచిపోతాం. ఆమె మాత్రం మనల్ని ఒక కంట కనిపెడుతూ ఉంటుంది. మనకు వైరాగ్యం కలిగి, భగవంతుని కోసం విలపించినప్పుడు ఆయన దర్శనం కలుగుతుంది. ఈ విధంగా శ్రీరామకృష్ణులు సాధనల సారాన్ని చాలా సంక్షిప్తంగా చెప్పారు. ఇవి ప్రతి ఒక్కరికీ అర్థమవుతాయి. అందరికీ ఆచరణ సాధ్యం కూడా!

                                ◆నిశ్శబ్ద.


More Subhashitaalu