నిజమైన ఆధ్యాత్మికత సాధించడం ఎలా సాధ్యం?

ఆధ్యాత్మికతతో నిండిన మహామనీషిగా మారబోయే ముందు మానవతా విలువలున్న మంచి మనిషిగా మారాలి. ఒక భక్తునిగా మారబోయే ముందు లేదా ఆధ్యాత్మిక సాధన ప్రారంభించబోయే ముందు మానవత్వం ఉన్న మనిషిగా ఎదగాలి. ఆధ్యాత్మిక సాధనకు కావలసిన ప్రాథమిక ఆవశ్య కతలలో కొన్నింటినైనా పాటించనిదే మంచి మనుష్యులుగా నిలదొక్కుకోలేరు. ఒక్కొక్కసారి కొంతమంది చాలా సంస్కార హీనంగా, అసభ్యంగా ప్రవర్తించడం చూస్తుంటాం. అలాగే ఒక్కోసారి పెద్దలే పిల్లచేష్టలను చేయడం చూస్తుంటాం. ఇలా ఎన్నడూ చేయకూడదు. అటువంటి ప్రవర్తనకు స్వస్తి చెప్పాలి.

నిజానికి ఆధ్యాత్మికత వలన మన జీవితాలలో ఉత్పన్నమయ్యే సమస్యలు చాలా తక్కువ మన స్వభావంలోనూ, దృక్పథంలో ఉన్న లోపాల వలనే చాలా సమస్యలు కొరకరాని కొయ్యలుగా మారుతున్నాయి. బయటివారికి మనం చాలా మంచివారిగా కనిపించవచ్చు. కానీ ఆ అభిప్రాయం మనతో పాటు ఉంటున్నవారికి కూడా కలగాలి. కొత్తవారికి నవ్వుముఖాన్ని చూపించడం చాలా సులువు! మనల్ని అప్పుడప్పుడు కలిసేవారు. మన పట్ల వెలిబుచ్చే అభిప్రాయాల కంటే, మన తోటివారు చెప్పే మాటలకు మనం ఎక్కువ విలువ ఇవ్వాలి. మనకు ఎంత స్వయం నియంత్రణ ఉంది, ఎంత ఉన్నతిని సాధించాము అన్న విషయాలు మనతో ఉన్నవారికి బాగా తెలుస్తాయి.

అసహనం, దురభిమానం ఉన్న వ్యక్తికి ఆధ్యాత్మికానుభూతులు కలగలేదనీ, కనీసం అతడికి సరైన విశ్వాసం కూడా లేదనీ నిశ్చయంగా చెప్పవచ్చు. నిజమైన విశ్వాసం కలవారు. అందరి పట్ల మంచిగా ఉండగలుగుతారు. ఎవరిపట్లా ఈర్ష్య, అసూయ మొదలైనవాటిని కలిగివుండరు. ఆధ్యాత్మికంగా డంబాచార పరాయణులైన వారు కపట ప్రవర్తన కలిగి ఉంటారని ఖచ్చితంగా చెప్పవచ్చును.

నిజమైన సాధకుడు అన్నివేళలా ఓర్పు, క్షమ మొదలైన గుణాలతో ప్రవర్తించడం నేర్చుకోవాలి. మనం అనుకున్నట్లుగా అన్నీ జరగవు కదా! ఇబ్బందికరమైన పరిస్థితులు, అప్రియమైన సంఘటనలు ఎదురైనప్పుడు ఓరిమితో భరించాలి. ఈ రోజులలో, ధ్యానానికి అనువైన పరిస్థితులు చాలా అరుదని చెప్పక తప్పదు. మీరు ఉన్న పరిస్థితులను, వాతావరణాన్ని వీలైనంత చక్కగా ఉపయోగించుకోండి. వాటితో సామరస్యాన్ని సాధించండి.

ఆ సామరస్యం లోపిస్తే మనలో కోపం చోటుచేసుకుంటుంది. ఏ మనిషైనా తన మీద తను కోపం తెచ్చుకున్నాకే, ఇతరులపై కోపం తెచ్చుకుంటాడు. కోపం, ద్వేషం ఒకే కోవకు చెందినవి కాబట్టి, మనల్ని మనం ద్వేషించుకోవడం, ఇతరులను ద్వేషించడం.. ఈ రెండూ తప్పే. మానసిక నిపుణులు కూడా కోపం వలన చాలా దుష్పరిణామాలు కలుగుతాయని నిర్ధారించారు. ఎన్నో ఏళ్ళు ఆధ్యాత్మిక సాధన చేసినా ఏమీ సాధించలేదని చాలామంది ఫిర్యాదు చేస్తుంటారు. వారి దృక్పథాన్ని పరిశీలిస్తే ఒక విషయం తేటతెల్లం అవుతుంది. “నేను ప్రార్థన, జపం, ధ్యానం చేస్తూనే ఉన్నాను. కానీ ఫలితం రావట్లేదు”. ఈ విధంగా ఆలోచిస్తూ - సమయాన్నీ, శక్తినీ వృథా చేయకుండా, వాటిని భగవంతుని పైన వెచ్చిస్తే, వారికి ఎంతో మేలు జరిగేది. 

ఎల్లప్పుడూ 'నాకు ఫలితం రావట్లేదు'. 'నాకు ఫలితం రావట్లేదు' అన్న ఆలోచన వల్ల వారు అహంకారంతో నిండిపోయారని చెప్పవచ్చు. సర్వసాధారణంగా మనం ఒక్కళ్ళమే భక్తులం అని అనుకుంటూ ఉంటాము! ఈ విషయంలో జాగ్రత్త వహిస్తూ, అటువంటి అహంకారాన్ని మొగ్గలోనే తుంచివేయాలి. లేకపోతే తర్వాత తర్వాత కష్టమవుతుంది. మన సాధనా ఫలాలను భగవంతునికే వదలివేయాలి. మనం చేసే ప్రతి కార్యాన్నీ భగవదర్పితం చేయాలి.

మీరు చేసే ప్రతి పనిని ఏదోవొక మార్గంలో భగవంతునితో అనుసంధానించాలి. ఆయన కోసమే పని చేయండి. మీ బాధ్యతలను చక్కగా నెరవేర్చండి. కానీ ఈ విషయాలన్నింటికీ భగవంతుడే కేంద్రబిందువు కావాలి. ఈ విధంగా మీరు సాధన చేస్తూవున్నట్లయితే, అమోఘమైన ఫలితాలను పొందుతారు.

                                ◆నిశ్శబ్ద.


More Subhashitaalu