స్వయంప్రభ వానరాలతో చెప్పిన విషయం!

"పూర్వం దానవ రాజు దగ్గర మయుడనే శిల్పి ఉండేవాడు. ఆ మయుడికి అనేక మాయా శక్తులు ఉన్నాయి. ఆయన బంగారంతో ఈ ప్రాంతాన్ని నిర్మించాడు. ఆ మయుడు బ్రహ్మని గూర్చి 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. మయుడి తపస్సుకి ప్రీతి చెందిన బ్రహ్మదేవుడు ఆయనకి విశేషమైన వరాలని ఇచ్చాడు. తదనంతరం శుక్రాచార్యుల యొక్క ధనమంతా తీసుకొని వచ్చి మయుడికి ఇచ్చారు. కాని ఆ మయుడు హేమ అనే అప్సరస మీద మనస్సు పెట్టుకున్నాడని తెలిసి, ఇంద్రుడు ఆయనని తన వజ్రాయుధంతో సంహరించాడు. 

మయుడు హేమ అనే అప్సరస మీద మనస్సు పెట్టుకున్నాడు కాబట్టి ఈ గుహలో ఉన్న సమస్త ఐశ్వర్యము కూడా హేమకి చెందుతుందని బ్రహ్మగారు తీర్పు ఇచ్చారు. అప్పుడా హేమ ఈ ఐశ్వర్యానికి కాపలాగ ఉండడానికి నన్ను నియమించింది. నేను మేరుసావర్ణి యొక్క కుమార్తెని, నా పేరు స్వయంప్రభ. నాకు స్నేహితురాలైన హేమ నాట్యం లోనూ, సంగీతము లోనూ మంచి ప్రావీణ్యము కలిగిన స్త్రీ. ఆమె నన్ను పిలిచి ఈ ఐశ్వర్యాన్ని, గుహని కాపాడమని అడిగింది. స్నేహము మీద ఉన్న అభిమానం వల్ల నేను ఈ గుహని కాపాడుతూ ఉంటాను. మిమ్మల్ని చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నారు కనుక మీకు కావలసిన కందమూలాలని, ఫలాలని ఆరగించండి. నీళ్ళు, తేనె కావలసినంత తాగి విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తీసుకున్న తరువాత మీరు ఎవరో, ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు చెప్పండి" అని అనింది. 

అప్పుడా వానరాలు కడుపునిండా కావలసిన పదార్ధాలని తిని విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు హనుమంతుడు స్వయంప్రభతో "దశరథ మహారాజు కొడుకైన రాముడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం తన భార్య అయిన సీతమ్మతో, తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు. కాని సీతమ్మని రావణాసురుడనే రాక్షసుడు అపహరించాడు. అపహరించబడిన సీతమ్మని వెతుకుతూ వారు కిష్కిందకి చేరుకున్నారు. అక్కడ వారు సుగ్రీవుడితో మైత్రి కుదుర్చుకున్నారు. సుగ్రీవుడు రాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నాలుగు దిక్కులకి వానరాలని పంపించాడు, సీతమ్మని వెతకడం కోసం, దక్షిణ దిక్కుకి యువరాజైన అంగదుడి నాయకత్వంలో వచ్చిన వానర సమూహములో నేను ఒకడిని, నన్ను హనుమ అంటారు. సీతమ్మ జాడ కనిపెట్టడం కోసం వెతుకుతున్న మాకు ఎక్కడా ఆహారం, నీరు దొరకలేదు. అటువంటి సమయంలో తడి రెక్కలతో పక్షులు ఈ గుహ నుండి బయటకి రావడం చూశాము. ఇక్కడ నీళ్ళు దొరుకుతాయనే ఆశతో మేము ఈ గుహలోకి ప్రవేశించాము. సీతమ్మ జాడ మాకు చెప్పగలవా" అని అడిగాడు.

అప్పుడా స్వయంప్రభ "ఈ గుహలోకి మృగములు తప్ప మిగిలినవి ఏవన్నా ప్రవేశిస్తే, ప్రాణాలతో బయటకి వెళ్ళడం కుదరదు. కాని మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది, అందుకని మీ అందరినీ నా తపఃశక్తి చేత బయటకి పంపిస్తాను. మీరు కళ్ళు మూసుకొని, కళ్ళ మీద చేతులు పెట్టుకోండి" అని పలికింది.

అప్పుడా వానరాలు మృదువైన కనురెప్పల్ని మూసి, తమ మృదువైన చేతులతో కన్నులని మూసుకున్నారు. మళ్లీ రెండు క్షణాలలో కనులు తెరిచేసరికి వాళ్ళందరూ వింధ్య పర్వతం మీద ఉన్నారు. ఆ ప్రాంతంలోని చెట్లు పువ్వులతో, పండ్లతో శోభిల్లుతుంది. అప్పుడా స్వయంప్రభ 'మీరు ఈ గుహలో 4 నెలలపాటు ఉండిపోయారు" అని చెప్పి గుహలోకి వెళ్ళిపోయింది. వానరాలు అన్నీ ఒకదానివైపు మరొకటి చూసుకుని ఆశ్చర్యపోయాయి.

                               ◆వెంకటేష్ పువ్వాడ.


More Purana Patralu - Mythological Stories