శివరాత్రి వస్తోందంటేనే అందరిలో భక్తి పరవస్యాలు ఉవ్వెత్తున ఎగసి పడుతుంటాయి. ఆ రోజంతా నిరాహారంగా ఉంటూ, శివనామ సంకీర్తన చేస్తూ, రాత్రి అయ్యేసరికి జాగరణ వ్రతం చేసే భక్తుల సంఖ్య చెప్పటం కొంచం కష్టమే. ఈ  ఉత్సవాలు ఒక్కొక్క చోట ఒక్కో రకంగా జరుపుతూ ఉంటారు. మన దేశంలోని ఎన్నో ఆలయాలు ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుతాయి. అయితే ఒకేసారి ఊరిలో ఉన్న ఆలయాలలోని దాదాపు 200 ఉత్సవమూర్తులను ఒకే దగ్గరకి తీసుకొచ్చి ఊరేగిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అబ్బా!ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదూ.

 

అలా ఎందరినో అబ్బురపరిచే ఇలాంటి  ఉత్సవం మండిలో  జరుగుతుంది. ప్రతి ఏడాది మండిలో జరిగే శివరాత్రి జాతర అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న మండి అనే జిల్లాలో జరిగే ఈ జాతర వారం రోజులపాటు ఎంతో వైభవంగా జరుగుతుంది. ఆ జాతరకి మండిలో ప్రజలే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున్న భక్తులు వచ్చి పాల్గొంటారు. విదేశీయులు కూడా ఎక్కువగా రావటం ఈ జాతరకున్న మరో విశేషం.

 

 

వారణాశి ఆఫ్ హిల్స్ గా పేరుపొందిన ఈ మండి  జిల్లాలో సుమారు 81 దేవాలయాలు ఉన్నాయి. శివరాత్రి నాడు మండి  ఉత్సవం మొదలయిన నాటి నుంచి ప్రతి ఆలయం లోని ఉత్సవ మూర్తిని ఇక్కడకి తీసుకువస్తారు. అలా  మొత్తం రెండువందలకు పైగా మూర్తులు ఇక్కడ కొలువుతీరుతాయి. ఆ మూర్తులన్నిటికి పూజలు చేసి ఊరేగింపు నిర్వహిస్తారు. బీస్ నది ఒడ్డున జరిగే ఈ ఉత్సవాలు కనులపండుగగా జరుగుతాయి. 

 

 

ఈ ఉత్సవాలకి సంబంధించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. 1792లో మండి రాజయిన ఈశ్వరీ సేన్ ను సంసార్ చంద్  అనే పంజాబీ రాజు ఓడించి 12 ఏళ్ళు బందీగా ఉంచాడట. అలా  బందీగా ఉన్న ఈశ్వరి సేన్ ను గూర్ఖా వీరులు విడిపిం చారట. తనకు స్వేఛ్చ లబించింది అన్న సంతోషంతో గూర్ఖా వీరులతో కలిసి ఆ రాజ్యంలో ఉన్న దేవతామూర్తులన్నిటిని ఒకే దగ్గరకు చేర్చి శివరాత్రి నాడు ఉత్సవం చేసి ఆ ఆనందాన్ని వారం రోజులపాటు కొనసాగించాడట ఆ రాజు. అప్పటి నుండి ప్రతి ఏటా ఇలా మండి  ఉత్సవం జరపటం ఆచారంగా మారిందిట.

...కళ్యాణి


More Shiva