జపనీయుల వినాయకుడు- కంగిటెన్

 



 

భారతీయుల సంప్రదాయం మీద వినాయకుని ప్రభావం అంతాఇంతా కాదు. వందల సంవత్సరాలుగా మన తొలిపూజలందుకుంటూ, వేడుకున్నవారి విఘ్నాలను తొలగిస్తూ వస్తున్న మన గణపతి ఇతర మతాలవారిని ఆకర్షించడంలో ఆశ్చర్యం ఏముంది? అలా జపాన్‌వారి ఆచారాలలోకి ప్రవేశించిన వినాయకుడే- కంగిటెన్‌.

 

బౌద్ధంతో పాటుగా

బౌద్ధమత మూలాలు మన దేశంలోనే ఉన్న అది చైనా, జపాన్‌, థాయ్‌లాండ్ వంటి దేశాలలోనే ఎక్కువగా వ్యాప్తిచెందింది. అలా వ్యాప్తి చెందే క్రమంలో హిందువుల విశ్వాసాలనూ తనలో చేర్చుకుంది. ముఖ్యంగా మంత్రతంత్రాలకూ, క్రతువులకూ ప్రాధాన్యత ఉన్న వజ్రయానం అనే బౌద్ధశాఖలో ఇలాంటి చేర్పులు అధికంగా కనిపిస్తాయి. అలా వజ్రయాన ప్రభావంతో, భారతీయులు గణపతి కంగిటెన్ అనే దేవతగా మారాడు. ఇక్కడ గణపతిలాగానే ఆయన కూడా పాశము, మోదకము ధరించి ఏకదంతముతో కనిపిస్తాడు.

 

 

అవే వరాలు

అక్కడా వినాయకుడు విఘ్నాలను తొలగించేవాడుగా, విజయాలను ప్రసాదించేవాడుగా పూజలందుకుంటున్నాడు. అంతేకాదు! ఆయనను సదా పూజిస్తే నాలుగు సిద్ధులు కలుగుతాయని ప్రాచీన జపనీస్‌ గ్రంథాలు పేర్కొంటున్నాయి. రక్షణ, లాభము, ప్రేమ, జయము అన్నవే ఈ నాలుగు సిద్ధులట. ఇక పదవి, సంపద, తగినంత అన్నవస్త్రాలు అనే మూడు వరాలూ లభిస్తాయట. అసలు కంగిటెన్ అంటేనే ఆనందాన్ని కలిగించేవాడు అని అర్థం!

 

 

చిత్రమైన రూపం

జపనీస్‌ కంగిటన్‌ ఎక్కువగా తన ధర్మపత్నితోనే కనిపిస్తాడు. ఈ ధర్మపత్ని కూడా వినాయకునిలాగానే ఏనుగుమొహంతో ఉండటం ఆశ్చర్యం. వీరిరువురూ ఒకరినొకరు కౌగిలించుకుని ఉండే విగ్రహాలే జపాన్‌లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ ధర్మపత్ని పేరు అవలోకితస్వర అని కొన్ని గ్రంథాలలో, కుండలి అని మరికొన్ని చోట్ల ప్రస్తావించబడింది. ఇలా కౌగిలిలో ఉండే జంట వినాయకుల ఆచారం ఎప్పటి నుంచి మొదలైందో ఇదిమిద్ధంగా తెలియకపోయినా, దాని వెనుక నిగూఢమైన కారణాలు లేకపోలేదంటున్నారు తత్వవేత్తలు. ప్రకృతి, పురుషుల సమ్మేళనానికీ, జీవాత్మ పరమాత్మల ఐక్యతనూ ఈ ప్రతిమ సూచిస్తుందంటున్నారు. మరి కొన్ని గ్రంథాల ప్రకారం కంగిటన్‌ చాలా ఉగ్రస్వరూపుడు. ఆయనను కౌగలించుకున్న స్త్రీమూర్తి, ఆయనలోని ఉగ్రత్వాన్ని శాంతింపచేస్తుంది.

 

ఆరాధన:

జపాన్‌లో దాదాపు 250 కంగిటన్ ఆలయాలు ఉన్నాయని అంచనా. వాటిలో కామాకురా, హొజాన్‌-జీ ప్రదేశాలలో ఉన్న కంగిటన్ విగ్రహాలు చాలా ప్రముఖమైనవి. జంటగా ఉండే కంగిటన్‌ను సాధారణ పౌరులకంటే తాంత్రికవిద్యను ఉపాసించేవారే ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. అందుకనే ఈ ప్రతిమలు సామాన్యులకు అందుబాటులో కాకుండా, నాలుగుగోడల మధ్యా రహస్యంగా ఉంచే సందర్భాలే ఎక్కువ. కంగిటన్‌ వినాయకుడిన ప్రసన్నం చేసుకోవడానికి అనేక మంత్రాలూ, క్రతువులూ నిర్దేశింపబడ్డాయి. సామాన్యులు మాత్రం ఆయనకు తైలాభిషేకం చేసి ముల్లంగి, పండ్లు వంటి ప్రసాదాలను అర్పిస్తారు. ముఖ్యంగా సంతానం లేనివారు జంటగా ఉన్న వినాయకుని పూజిస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని జపనీయుల నమ్మకం. 

 

- నిర్జర.

 


More Vinayakudu