సంకటహర చతుర్థి.. పూజ ఎప్పుడు చేసుకోవాలి... ఉపవాసం కథ ఏంటి!

వినాయకుడు తొలి పూజలు అందుకునే దైవం. వినాయకుడిని పూజించడం వల్ల మొదలు పెట్టే పనిలో ఆటంకాలు ఎదురవవు అని చెబుతారు. జీవితంలో ఎంత కష్టాలు ఎదురవుతున్నా, తలపెట్టే పనులలో ఎంత సమస్యలు ఉన్నా వాటిని తొలగించి పనులు సంపూర్ణంగా జరిగేందుకు గణపతి అనుగ్రహిస్తాడని చెబుతారు. వినాయకుడిని ప్రతి పూజలో మొదటగా పూజించడమే కాకుండా.. వినాయక చవితి రోజు ప్రధానంగా పూజిస్తారు. అంతేకాకుండా ప్రతి నెలలో వచ్చే కృష్ణపక్ష చవితి రోజు వినాయకుడిని ప్రధానంగా పూజిస్తూ ఉంటారు. ఈ చవితినే సంకటహర చతుర్థి అని అంటారు. జనపరి 6వ తేదీన సంకట హర చతుర్థి వచ్చింది. ఈ రోజు వినాయకుడిని ఎప్పుడు పూజించాలి? ఎలా పూజించాలి ? సంకట హర చతుర్థి ఉపవాస కథ ఏంటి? తెలుసుకుంటే..
సంకట హర చతుర్థి.. చవితి.. సమయం..
సంకట హర చతుర్థి రోజు చవితి తిథినే ముఖ్యం. జనవరి 6వ తేదీ ఉదయం 8 గంటల 3 నిమిషాల వరకు తదియ తిథి ఉంటుంది. ఆ తరువాత చవితి తిథి ఉంటుంది. అంటే 6వ తేదీ మంగళవారు ఉదయం 8 గంటల తరువాత వినాయకుడి పూజ మొదలు పెట్టాలి.
ఉదయం పూజ..
వినాయకుడి ముందు ఎరుపు రంగు వస్త్రంలో బియ్యం, 21 రూపాయలు, ఖర్జూరాలు, ఆకులు, వక్కలు వేసి ముడుపు కట్టి, వినాయకుడి చుట్టూ తిప్పాలి. ఆ ముడుపును వినాయకుడి ముందు ఉంచి సంకట హర చతుర్థి ఉపవానం ఉంటున్నట్టు, సంకట హర చతుర్థి వ్రతం చేసుకుంటున్నానని అనుమతి ఇవ్వమని స్వామి ముందు సంకల్పం చెప్పుకుని, స్వామి అనుమతి తీసుకోవాలి.
ఉపవాసం..
సంకట హర చతుర్థి రోజు కూడా ఇతర ఉపవాసాల లాగా ఉల్లి, వెల్లుల్లి వేసిన ఆహారం నిషేధించాలి. సాత్వికమైన ఆహారాలు తీసుకోవాలి. భారీగా ఆహారం తినకూడదు. పండ్లు పాలు తీసుకుని ఉండగలిగితే మరీ మంచిది.
సాయంత్రం పూజ, నైవేద్యం..
ఉదయం ముడుపులో కట్టిన బియ్యాన్ని తీసి వాటితో పొంగలి కానీ, ఉండ్రాళ్లు కానీ వండి వినాయకుడికి నైవేద్యం సమర్పించాలి. షోడశోపచార పూజ లేదా పంచోపచార పూజ నిర్వహించాలి. గణపతి శతనామావళి, సంకట నాశన శ్లోకం చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా సంకటహర చతుర్థి పూజలో గరిక చాలా ముఖ్యం. గరిక తప్పకుండా వినాయకుడికి సమర్పించాలి.
ఉదయం నుండి ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నవారు అయితే సాయంత్రం చంద్రుడి దర్శనం చేసుకుని ఉపవాసం విరమించవచ్చు.
వ్రత కథలు..
సంకట నాశన గణపతి వ్రతం వ్రత కథలు చదవడంతోనే పూర్తీ అవుతుంది. సంకటహర చతుర్థి వ్రతానికి నాలుగు వ్రత కథలు ఉన్నాయి. వ్రత కథలు చదువుకున్న తర్వాత అర్ఘ్యం ఇవ్వాలి. వ్రత కథలు పుస్తకంలో ఇవన్నీ ఉంటాయి. ఆ తరువాత స్వామికి నివేదించిన ఉండ్రాళ్లను అందరికీ ప్రసాదం కింద పంచి పెట్టాలి. ఈ వ్రతానికి ఒక బ్రాహ్ణణుడిని పిలిచి భోజనం పెట్టడం చాలా ముఖ్యం.. ఒక వేళ ఎవరైనా ఇంటికి రాలేకపోతే ఏదైనా గుడికి అలా వెళ్లి బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వడం లేదా వారికి తగిన దక్షిణ ఇవ్వడం మంచిది.
పైన పేర్కొన్న విధంగా సంకటహర గణపతి పూజ చేసుకోవడం వల్ల జీవితంలో వచ్చే ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఒకవేళ ఇంట్లో ఈ పూజ చేసుకోలేక పోయినా ఎక్కడైనా ఆలయాలలో సంకటహర గణపతి వ్రతం జరుగుతూ ఉంటుంది. అక్కడికైనా వెళ్ళవచ్చు.
*రూపశ్రీ.


