సంకష్టి చతుర్థి.. ఈ రోజును అస్సలు మిస్ కాగండి..!

వారాలలో ఒక్కో దేవుడికి ఒక్కో రోజు ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. వీటిలో వినాయకుడికి బుధవారం కేటాయించారు. బుధవారం బుద్ధి వికసిస్తుందని, ఈ రోజు తలపెట్టే పనులు వినాయకుడి కృపతో విజయవంతం అవుతాయని అంటారు. అయితే.. సాధారణంగా ప్రతి మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్ట చతుర్థిగా జరుపుకుంటారు. ఈ చవితి బుధవారం రోజు కలిసి వస్తే అది మరింత శ్రేష్టం. ప్రస్తుతం.. సెప్టెంబర్ 10 బుధవారం కూడా అదే జరిగింది. సెప్టెంబర్ 10 బుధవారం, సంకష్ట చతుర్థి వచ్చింది. ఈ రోజు ఇలా చేస్తే వినాయకుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని పండితుల మాట. ఇంతకీ ఈ రోజు ఏం చేయాలంటే..
ఉపవాసం..
సాధారణంగా సంకష్ట చతుర్థికి వినాయకుడిని పూజించే ప్రతి ఒక్కరు ఉపవాసం ఉంటారు. ఉదయాన్నే నిద్రలేచి స్నానం అనంతరం ఉపవాసం ఉంటున్నట్టు వినాయకుడి ముందు సంకల్పం చెప్పుకోవాలి. రాత్రి చంద్ర దర్శనం తర్వాత ఉపవాసం విరమణ చేయాలి.
గణపతి పూజ..
సంకష్ట చతుర్థి పూజ సాధారణంగా సాయంత్రం సమయంలో చేస్తారు. దేవాలయాలలో లేదా ఇంట్లో వినాయక విగ్రహం లేదా చిత్రపటం ముందు వినాయకుడిని శాస్త్రోక్తంగా ఆరాధించాలి. వినాయకుడికి ఉండ్రాళ్లు నైవేద్యంగా సమర్పించాలి. గరికను తప్పకుండా అర్పించాలి. శక్తికొద్ది ఇతర నైవేద్యాలు కూడా అర్పించవచ్చు. గణేశ అష్టోత్తర శతనామావాలి, గణపతి అధర్వ శీర్షం మొదలైనవి పఠించాలి. పూజ అనంతరం అర్ఘ్యాలు కూడా ఇవ్వాలి.
బుధవారం కలిసి వచ్చే సంకష్ట చతుర్థి..
సెప్టెంబర్ నెల 10వతేదీ బుధవారం రోజున సంకష్ట చతుర్థి వచ్చింది. ఈ రోజున విఘ్నరాజ రూపంలో గణపతిని ఆరాధించడం జరుగుతోంది. విఘ్నరాజ గణపతి విఘ్నాలపై అధిక ప్రభావం చూపిస్తాడు. జీవితంలో బాధలు, కష్టాలకు మంచి మార్గదర్శనం చేస్తాడు.
సంకష్ట చతుర్థి వ్రతం చేయలేకపోతే..
సంకష్ట చతుర్థి వ్రతం చేయకపోతే ఈ రోజు ఉపవాసం ఉండటం, గణపతి స్తోత్రాలు, మంత్రాలు, గణపతి జపం చేయడం మంచిది.
సాయంత్రం సమయంలో దేవాలయాలలో సంకష్ట చతుర్థి పూజ జరుగుతూ ఉంటుంది. అలాంటి చోటికి వెళ్లి వ్రతం వీక్షించినా చాలా మంచి ఫలితం ఉంటుంది.
పొరపాటున ఎవరైనా ఉపవాసం లేకపోయినా.. సాయంత్రం స్నానం చేసి.. వినాయకుడికి గరిక సమర్పించి, పండ్లు నైవేద్యంగా పెట్టినా తగిన ఫలితం ఉంటుంది.
*రూపశ్రీ.



