సంతానాన్ని ప్రసాదించే ఉచ్ఛిష్ట గణపతి

 



భక్తుల అభీష్టానికీ, ఊహలకూ అనుగుణంగా తమ ఇష్టదేవతను వివిధ రూపాలలో పూజించుకోవడం అంతటా ఉండేదే! అలాగే గణపతిని కూడా 32 రూపాలుగా కొలుచుకునేవారని శ్రీతత్వనిధి వంటి గ్రంథాల ద్వారా తెలుస్తోంది. వారిలో ఒక భిన్నమైన రూపమే ఉఛ్చిష్ట గణపతి..

 

తాంత్రిక రూపం!

ఉచ్ఛిష్ట గణపతి రూపం తంత్రోపాసనకు ప్రసిద్ధం. వామాచారానికి అనుగుణంగానే ఈ గణపతి నగ్నంగా కనిపిస్తాడు. ఆ గణపతి తొడ మీద శక్తి స్వరూపిని అయిన దేవత కూడా నగ్నంగానే కనిపిస్తుంది. చాలా గ్రంథాలలో ఈ గణపతిని నీలరం రంగులో ఉన్నవాడిగా వర్ణిస్తారు. సాధారణంగా ఆరు చేతులతో కనిపించే ఈ గణపతి దానిమ్మపండు, వీణ, అక్షమాల, నీలపు పద్మాలను ధరించి దర్శనమిస్తాడు.

 

చిత్రమైన ఆరాధన

ఈయన ఉచ్ఛిష్ట గణపతి కాబట్టి, తాంత్రికులు ఏదో ఒకటి (తాంబూలము, మోదకము..) నములుతూ ఈయనను ఆరాధిస్తారు. సాధారణ జనాలని దూరంగా ఉంచేందుకు తాంత్రికులు ఈ ఎంగిలి, నగ్నత్వం వంటి అసభ్యంగా తోచే లక్షణాలను ప్రదర్శిస్తూ ఉంటారని కొందరి నమ్మకం. తమ ఆచారానికి అనుగుణంగానే వారు ఉచ్ఛిష్ట గణపతిని రూపొందించుకొని ఉండవచ్చు.

 

మంత్రం

పరీక్షలకు వెళ్లే విద్యార్థులు మొదలుకొని కోర్టుకేసులని పరిష్కరించుకోవాలనుకునే వారి వరకూ ఈ ఉచ్ఛిష్ట గణపతిని పూజిస్తూ ఉంటారు. నిరంతరం ఏవో ఆపదలు, అవాంతరాలతో కోరుకున్న లక్ష్యాన్ని చేరలేకపోయేవారు, ఈ గణపతిని ఆరాధిస్తే సత్ఫలితాలు ఉంటాయని నమ్మకం. ఉచ్ఛిష్ట గణపతి మంత్రం ఆయన ప్రతిరూపాన్ని గుర్తుచేస్తూ ఉంటుంది. అది...

నీలాబ్జ దాడిమీ వీణా శాలినీ గుంజాక్ష సూత్రకమ్ 

దధదుచ్ఛిష్ట నామాయం గణేశః పాతు మేచకః

 

 

తిరువన్వేలి

ఉచ్ఛిష్ట గణపతి రూపాలు ఉన్న ఆలయాలు చాలా తక్కవే. వాటన్నింటిలోకీ పెద్దది, ప్రముఖమైనదీ తమిళనాడులోని తిరువన్వేలిలో ఉంది. ఇక్కడి ఆలయంలో ఉన్న గణపతి తన తొడ మీద కూర్చుని ఉన్న శక్తి ఉదరభాగాన్ని, తొండంతో తాకుతూ ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ భంగిమ సంతానప్రాప్తిని సూచిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకనే సంతానాన్ని కోరుకునేవారు, ఈ ఆలయంలోని గణపతిని పూజిస్తే వారి కడుపు పండుతుందని తమిళురు నమ్ముతారు.

 

- నిర్జర.


More Vinayakudu