జీవి వేటి కలయిక? 


ప్రతి జీవికి రెండు లక్షణాలు ఉన్నాయి. అవే మృతం, అమృతం. ఈ రెండు కలిస్తేనే అది జీవి అవుతుంది. దీనినే నేను నాది అనే భావన అని అంటారు. ఇందులో మృతస్వరూపము అంటే దేహము, మనసు, బుద్ధి. ఈ మూడు కలిసి అహంకారము అని పిలుస్తాము. ఈ మూడు ప్రకృతిలో ఉన్న గుణములతో కలిసి ప్రవర్తిస్తుంటాయి. ఈ అహంకారము పుట్టగానే వస్తుంది. మరణించగానే పోతుంది. అంటే మృతస్వభావము కలిగినది. తరువాతది అమృత స్వభావము కలది. అంటే చావులేనిది. అదే ఆత్మ స్వరూపము. అస్త్రశస్త్రములతోగాని, నీరు గాలి అగ్నితో గానీ అది మరణించదు. అదే అమృతస్వరూపము. ఈ రెండు కలిస్తేనే ఒక జీవి అవుతుంది. వీటినే క్లుప్తంగా ఆత్మ, అనాత్మ వివేచన అని కూడా అంటారు.


ఈ ఆత్మ అందరిలో ఉంటుంది. అందరిలో ఉన్న ఆత్మస్వరూపము ఒకటే. అన్నీ ఆ పరమాత్మ స్వరూపమే. ఎలాగంటే కుండలో ఉన్న ఆకాశము, రూములో ఉన్న ఆకాశము, పెద్ద హాలులో ఉన్న ఆకాశము, ఈ విశ్వంలో ఉన్న ఆకాశము అన్నీ ఒకటే. కాకపోతే ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశానికి పరిమితం అయినట్టు మనకు అనిపిస్తుంది. అలాగే అంతటా నిండి ఉన్న పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ప్రతిజీవిలోనూ ఉన్నాడు. ఈ ఆత్మ పరమాత్మగా అంతటా నిండి, అనంతంగా, తుది మొదలు లేకుండా ఉంది కాబట్టి అచలంగా ఉంటుంది. ఒక డబ్బానిండా బియ్యంపోస్తే ఆ డబ్బాను అటుఇటు ఆడించినా అ బియ్యం కదలవు. ఎందుకంటే బియ్యం డబ్బా నిండుగా ఉన్నాయి కాబట్టి. అలాగే ఈ పరమాత్మ తత్త్వము అంతటా నిండి ఉంది కాబట్టి కదలడానికి స్పేస్ లేదు కాబట్టి అచలము అని అన్నారు. అందువలన ఆత్మస్వరూపుడైన పరమాత్మ ఏకర్మ చేయలేడు, చేయడు. కర్మచేయాలంటే కదలిక ఉండాలి. కదలికలేని వాడు కర్మచేయలేడు.


ఇంక రెండవది. మృతము. అంటే శరీరము, మనస్సు బుద్ధి. ఈ మూడింటిని అహంకారము అని అన్నాము కదా. ఇవి నిరంతరము చలిస్తూనే ఉంటాయి. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయి. మనం నిద్రపోతున్నా శరీరంలో జీర్ణక్రియ, గుండె కొట్టుకోవడం, గాలి పీల్చడం, వదలడం, రక్తప్రసరణ జరుగుతూనే ఉంటుంది. పగలు సరే ఈ శరీరం ఎన్నోపనులు చేస్తుంటుంది. మనసు ఆలోచనలు, సంకల్పవికల్పాలు చేస్తూనే ఉంటుంది. భావోద్వేగాలు కలుగచేస్తుంటుంది. బుద్ధి తన విచక్షణను ఉపయోగించి మనసుకు మంచి చెడు చెబుతూనే ఉంటుంది. కాబట్టి ఈ శరీరము, మనసు, బుద్ధి కర్మలు చేయడంలో ఉంటాయి. కాబట్టి ఆత్మ --అకర్మ, శరీరము, మనసు, బుద్ధి --కర్మ. కాబట్టి శరీరము, మనసు, బుద్ధి కర్మలను చేయకుండా ఉండలేవు అంటే కర్మలను వదలలేవు. ఆత్మస్వరూపము ఎటువంటి కర్మచేయలేదు చేయదు. కేవలం మనో బుద్ధి శరీరాలతో చేసే కర్మలను సాక్షీభూతంగా చూస్తూ ఉంటుంది.


 దేహము, మనస్సు బుద్ధితో కలిసి అనేక కర్మలను చేస్తున్నా, ఆ కర్మల మీద ఆసక్తి లేకుండా, కర్మల మీద ఆధారపడకుండా, ఏ కర్మాచేయని ఆత్మస్వరూపాన్ని ఎవరు చూస్తున్నారో దర్శిస్తున్నారో, అంటే తాను చేసే కర్మలలో అకర్మను అంటే ఆత్మస్వరూపాన్ని ఎవరు చూస్తున్నారో వారిని బుద్ధిమంతుడు వివేకి అని అంటారు అని అర్థం చేసుకోవాలి. అలాగే దేహము, మనస్సు బుద్ధి పని చేయనపుడు కూడా అన్ని కర్మలు వాటంతట అవి జరుగుతుంటాయి అని ఎవరు తెలుసుకుంటారో, వారే వివేకవంతులు. అంటే గాఢ సుషుప్తావస్థలో ప్రాపంచిక విషయాల వలన అనుభవించిన దానికన్నా ఎక్కువ ఆత్మానందాన్ని పొందడం గురించిన జ్ఞానం ఎవరు పొందుతారో, వారే వివేకవంతుడు.

◆వెంకటేష్ పువ్వాడ.


More Aacharalu