నవరాత్రుల నాలుగవ రోజు.. కాత్యాయని దేవి ఆవిర్భావం వెనుక ఆసక్తి కథ..!

దుర్గా నవరాత్రుల సమయంలో అమ్మవారి నవరూపాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ తొమ్మిది రోజులు అమ్మవారి తొమ్మిది రూపాలను ఆరాధిస్తానే విషయం అందరికీ తెలిసిందే.. దుర్గా నవరాత్రులలో నాలుగవ రోజు అమ్మవారిని కాత్యాయని దేవిగా పూజిస్తారు. కాత్యాయని అమ్మవారు చేతిలో చంద్రహాస ఖడ్గాన్ని, సింహం మీద ఎక్కి దర్శనం ఇస్తుంది. కాత్యాయని అమ్మవారి స్వరూపం వెనుక చాలా విచిత్రమైన కథ ఉంది. ఈ కథ అమ్మవారి ఆవిర్భావం గురించి చెబుతుంది. దీని గురించి తెలుసుకుని, కాత్యాయని అమ్మవారి అనుగ్రహం కోసం ఏం చేయాలో తెలుసుకుంటే..
కాత్యాయని దేవికి తన తండ్రి కాత్యాయనుడు అనే మహర్షి పేరు మీద కాత్యాయని అనే పేరు వచ్చిందని చాలా మందికి తెలిసిందే. అయితే వత్స అనే మహర్షి కుమారుడే కాత్యాయన మహర్షి. వత్స మహర్షినే వాత్స్యాయనుడు అని కూడా అంటారు. వత్స మహర్షి కుమారుడు కాత్యాయనుడు. ఈ కాత్యాయన మహర్షికి రెండే రెండు కోరికలు ఉండేవి. అవేంటంటే.. అమ్మవారు తన కూతురుగా పుట్టాలి అనేది ఒక కోరిక. ఇక రెండవ కోరిక ఏంటంటే.. మోక్షం పొందాలి అని.
అమ్మవారు తనకు కూతురుగా పుట్టాలనే కోరికతో కాత్యాయన మహర్షి ఎన్నో సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశారు. ఒకవైపు కాత్యాయన మహర్షి తపస్సు చేస్తూ ఉంటే.. మరొకవైపు శివపార్వతుల నివాసమైన కైలాసంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. శివపార్వతులు సరదాగా ఉన్న సమయంలో అమ్మవారు పరమేశ్వరుడి కనులను తన చేతులతో మూసిందట. అంతే అలా చేయగానే లోకాలన్నీ చీకటిలోకి జారిపోయాయి. సాధారణంగా పరమేశ్వరుడిని స్తుతించేటప్పుడు "వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం" అని. అంటే సూర్యుడు చంద్రుడు, అగ్ని ఇవన్నీ శివుని నేత్రాలు అని. అలాంటి కళ్లు మూసేస్తే లోకాలన్నీ చీకటి అయిపోయాయి. ఇదంతా అయ్యాక ఇలా అమ్మవారు సరదా కోసం చేసిన పని వల్ల లోకాలు చీకటి అయ్యాయని తెలుసుకుని అమ్మవారు చాలా బాధపడి పోయారట.
నేను తప్పు చేశాను. ఈ తప్పుకు ప్రాయశ్తిత్తం చేసుకోవడానికి భూమి మీదకు తపస్సు చేసుకోవడానికి వెళతాను అని చెప్పి భూమి మీదకు వెళ్లడానికి బయల్దేరారట. అప్పుడు పరమేశ్వరుడు పార్వతి దేవిని ఆపి.. దేవి నువ్వు భూమి మీదకు ఎలాగో వెళుతున్నావు కదా.. భూమి మీద అక్కడ కాత్య మహర్షి నువ్వే తన కూతురిగా పుట్టాలనే కోరికతో ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. అతడిని అనుగ్రహించి, ఎనిమిదేళ్ల పాటు ఆ ఇంట్లో పెరిగి అతన్ని అనుగ్రహించు అని చెప్పాడట.
అలా భూమి మీద తపస్సు కోసం బయల్దేరిన అమ్మవారు పరమేశ్వరుడి మాట మీద కాత్య మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన ముందు ఒక శిశువు రూపంలో ప్రత్యక్షమైంది. ఆయన తపస్సు శక్తితో తన ముందు శిశువు రూపంలో ఉన్నది అమ్మవారే అని గ్రహించి చాలా పొంగిపోయారు. అమ్మవారిని ఎంతో ప్రేమగా ఎనిమిది సంవత్సరాల పాటు పెంచుకున్నారు. ఆయన కాత్య మహర్షి కాబట్టి ఆ అమ్మవారు కాత్యాయని అయ్యింది. ఎనిమిదేళ్లు కాత్య మహర్షి దగ్గర పెరిగిన అమ్మవారు ఆ తరువాత కాత్య మహర్షికి మోక్షం ప్రసాదించి, ఆ తరువాత తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయింది.
కాత్యాయని అమ్మవారినే లలితా సహస్రనామాలలో "కాత్యాయని కాలహంత్రి కమలాక్ష నిషేవిత" అని కీర్తిస్తారు.
కాత్యాయని అమ్మవారి విశిష్టత ఏమిటంటే.. ఈ అమ్మ భార్యాభర్తల మధ్య బంధాన్ని, ప్రేమ భావాన్ని, అన్యోన్యతను పెంచుతుంది. గోపికలు కాత్యాయని వ్రతం చేయడం, కాత్యాయని అమ్మవారిని ఆరాధించడం ద్వారా శ్రీకృష్ణుడి సాంగత్యాన్ని పొందారట. కాత్యాయని అమ్మవారిని ఆరాధిస్తే.. వివాహం కాని వాళ్లకు వివాహం అవుతుంది. అలాగే.. అమ్మవారిని ఆరాధిస్తే భార్యాభర్తల బంధం పదిలంగా ఉంటుంది. అంతేకాదు.. కాత్యాయని వ్రతం చేస్తే దూరమైన భార్యాభర్తలు తిరిగి కలుస్తారని కూడా అంటారు.
కాత్యాయని దేవికి తేనే నైవేద్యంగా పెడితే అమ్మవారు చాలా తృప్తి పడతారు. అలాగే.. అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టమట. ఎరుపు రంగు పువ్వులను సమర్పించి తేనె నైవేద్యంగా పెట్టినా లేదా.. పాలతో చేసిన పాయసం నైవేద్యంగా పెట్టినా అమ్మవారు ఇష్టపడతారు.
*రూపశ్రీ.



