సకల జీవులకు ప్రాణశక్తిని ఇచ్చే అన్నపూర్ణాదేవి..!

 

అన్నపూర్ణ దేవి 
అన్నపూర్ణ దేవి  పార్వతి అమ్మవారి అవతారం. "అన్నం" అంటే ఆహారం, "పూర్ణ" అంటే సంపూర్ణత. అంటే జీవికి కావలసిన ఆహారాన్ని ప్రసాదించే తల్లి. ఆమె వల్లే భూలోకంలో జీవులు ఆకలితో అలమటించకుండా ఉంటారు. అందుకే ఆమెను భిక్షాటనరూపిణి, అన్నదాత అని కూడా పిలుస్తారు.


అన్నపూర్ణ స్వరూపం ఎలా వచ్చిందంటే..
పురాణ కథనం ప్రకారం..

ఒకసారి పరమేశ్వరుడు లోకంలో అన్నానికి ప్రాముఖ్యత లేదని అన్నాడు. ఆహారం లేకపోయినా భక్తి ఉంటే సరిపోతుందని చెప్పాడు. దీనికి పార్వతి అమ్మవారు కోపించి "అన్నం లేకపోతే ప్రాణం నిలబడదు" అని నిరూపించడానికి అన్నపూర్ణ రూపంలో వారణాసి లో ప్రత్యక్షమయ్యారు.  ఆ అమ్మ ఎవరికీ ఆహారం అనుగ్రహించక పోవడంతో ప్రపంచమంతా ఆకలితో బాధపడింది. దాంతో శివుడు భిక్షకుడిలా బిక్షం కోసం అమ్మవారి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. అప్పుడు ఆమె ఆయనకు అన్నాన్ని ఇచ్చి "అన్నం లేకుండా జీవులు ఉండలేరు, భక్తి కూడా ఉండదు" అని బోధించిందని పురాణ కథనం. అప్పటి నుండి అమ్మవారిని   అన్నపూర్ణేశ్వరి అని పిలుస్తూ ఆరాధిస్తారు.
అన్నపూర్ణ దేవి విశిష్టత
అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం ఉంటే ఇంట్లో ఎప్పుడూ అన్నదానం ఆగదు. ఆకలి బాధ, పేదరికం తొలగిపోతాయి. భక్తికి పునాది అయ్యే అన్నం ఎప్పటికీ కొరగదు. ఆమెను "లోకానికన్నదాత"గా సంబోధిస్తారు. కాశీ అన్నపూర్ణ ఆలయం దీనికి ప్రతీక. అక్కడ శివుడే భిక్షకుడిగా నిలబడి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాడు.

అన్నపూర్ణ దేవి మహత్యం తెలిపే ఒక పురాణ కథ ఉంది..


బృహద్రధుడి కథ..

బృహద్రదుడు అనే రాజు ఉండేవాడు. అయన చాలా ధర్మబద్ధంగా తన రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఆయనకు జన్మాంతర జ్ఞానం ఉండేది. ఇది చాలా విశేషమైనది. అయన ముందు ఎవరైనా వచ్చి నిలబడితే వారిని చూసి వారి గత జన్మ ఏమిటో చెప్పేయగలిగేవాడు. ఇది అందరికీ చాలా ఆశ్చర్యంగా అనిపించేది. 


మహారాజుకు ఉన్న జన్మాంతర జ్ఞానం గురించి ఆ నోట, ఈ నోట వ్యాపించి చివరకు ఆ విషయం ఋషులకు కూడా తెలిసింది. మహర్షులు ఆ విషయం విని అదెంత వరకు నిజమో.. ఆ జ్ఞానం పొందడానికి ఆ రాజు ఏమ్ చేశాడో తెలుసుకోవాలని రాజు దగ్గరకు వెళ్లారు.


మహారాజా.. నీకు జన్మాంతర జ్ఞానం ఉందని తెలిసింది. నీకు ఈ జ్ఞానం ఎలా వచ్చింది? దీని కోసం నువ్వు గత జన్మలో ఏ సాధన  చేసావు? చెప్పు అని అడిగారు. 


మహర్షుల మాటలకు రాజు నవ్వు.. నేను గత జన్మలో ఏ సాధనలు చేయలేదు, సాధన చేసేందుకు నేను అసలు మనిషిగా కూడా పుట్టలేదు. పూర్వజన్మలో నేను ఒక చక్రవాక పక్షిని. ఒకసారి ఆకలితో అలమటిస్తూ కాశీ అన్నపూర్ణమ్మ ఆలయం చుట్టూ తిరిగి ఆహారం కోసం అన్వేషించాను. ఒక చోట అన్నం మెతుకులు కనిపించాయి. అక్కడ వాలి ప్రసాదం మెతుకులు తిని మరణించాను. దీనికే నేను స్వర్గానికి చేరుకుని రెండు కల్పాల పాటు స్వర్గంలో సుఖంగా ఉన్నాను. ఆ తర్వాత ఇదిగో ఇలా రాజు జన్మను ఎత్తాను. తెలియకుండానే అన్నపూర్ణమ్మకు ప్రదక్షిణం చేసి,  ప్రసాదం  తిని మరణించినందువల్ల నాకు ఇంత జ్ఞానం, ఇలాంటి జన్మ లభించాయి అని చెబుతాడు రాజు. 


ఇది అన్నపూర్ణాదేవి అనుగ్రహం వల్ల కలిగే అదృష్టం. 


అన్నపూర్ణ దేవి అనుగ్రహం పొందడానికి చేయవలసినవి

అన్నదానం..


ఎవరికైనా భోజనం పెట్టడం అన్నపూర్ణ ఆరాధనలో ప్రథమ కర్తవ్యం. ఎవరైనా ఆకలితో ఉన్నవారికి తిండి పెట్టడం ఆమెకు నైవేద్యం పెట్టినట్టే.

ఆమె మంత్రం జపం ..

"ఓం అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే। జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి॥"
ఈ మంత్రాన్ని రోజూ పఠించడం శుభప్రదం.

శుభదినాల్లో వ్రతం..


ముఖ్యంగా మార్గశిర శుక్ల అష్టమి రోజున అన్నపూర్ణ వ్రతం చేస్తే అనుగ్రహం పొందుతారు.

ఇంట్లో వంట చేస్తే ..

వంట చేసే ముందు "అన్నపూర్ణేశ్వరి"ని గుర్తు చేసుకుంటే ఆ భోజనం ప్రసాదం అవుతుంది.

నిత్య ఆరాధన 
ఉదయం వంట చేసిన తరువాత చిన్న పళ్లెంలో అన్నం పెట్టి, అమ్మవారి ముందు దీపం వెలిగించి అమ్మవారిని పూజించాలి. నైవేద్యం అర్పించిన తర్వాత ఆ అన్నాన్ని కుటుంబ సభ్యులు భుజించాలి. "అన్నం పరబ్రహ్మ స్వరూపం" అని గుర్తుంచుకోవాలి.

                    *రూపశ్రీ


More Dasara - Navaratrulu