దగ్డూ సేఠ్ హల్వాయీ గణపతి

పేరేమిటి కొత్తగా వుంది అనుకుంటున్నారా? గణపతి అంటే ఉండ్రాళ్ళ ప్రియుడంటారుగానీ హల్వా అభిమాని ఎప్పటినుంచీ అని విస్తుపోతున్నారా!? ఇలాంటి కొత్త విషయాలు తెలుసుకోవటం మీకు సరదా అని నాకు తెలుసుగా! అలాగే చాలామందికి తెలియని కొత్త విషయాలు తెలియజేయటం నాకు సంతోషం. అందుకే ఈ వినాయక చవితి సందర్భంగా దగ్డూ సేఠ్ హల్వాయీ గణపతి గురించి తెలియజేస్తాను.

ఇక్కడివాళ్ళు ఈ పేరేమిటా అనుకుంటారుగానీ, మహారాష్ట్రలోని పూనె తో పరిచయం వున్నవాళ్ళందరికీ ఈయన గురించి తెలుసు. పూనె వెళ్ళినవాళ్ళు ఈయన దర్శనం చేసుకోకుండా వుండరు. ఒక విధంగా పూనాకే వన్నె తెచ్చిన వారిలో ఒకరండీ ఈయన.

గణపతి ఆలయాలూ, ఉపాలయాలూ అనేకం చూశాం, ఈయన విశేషమేమిటంటారా? ఎంతో వైభవోపేతంగా వుంటాడు ఆయన. ఆయన దర్శనానికి రెండు కళ్ళూ చాలవు. అంత దేదీప్యమానమైన సౌందర్యం ఆయనది. ఆయనని వర్ణించటానికి మన నోళ్ళు సరిపోవు. అంతటి గొప్పవాడు ఆయన. ఇంతకీ ఇవాళ మనమందరం ఆయన దర్శనం చేసుకోవటానికి కారణం ఎవరో తెలుసా? శ్రీ దగ్డూ సేఠ్ హల్వాయి అనే మిఠాయి వర్తకుడు. ఈయన వ్యాపారంలో దిట్ట. ధనికుడు. కర్ణాటకానుంచి వచ్చి పూనెలో స్ధిరపడ్డారు. ఆయన చేసే వ్యాపారం వల్ల ఆయన అసలు ఇంటిపేరు మరచిపోయి అంతా దగ్డూసేఠ్ హల్వాయీ అని పిలువసాగారు. అనేక విధాల అగ్రస్ధానంలో వున్న ఆయన స్ధాపించిన గణపతి కూడా ఆయన పేరుతోనే దగ్డూ సేఠ్ గణపతిగా పేరొందాడు.

 

ఆలయ స్ధాపన, అభివృధ్ధి

శ్రీ దగ్డూ సేఠ్ హల్వాయీకీ, ఆయన భార్య లక్ష్మీబాయికీ ఒకే ఒక్క మగ సంతానం. పాపం. క్రీ.శ. 1893లో అతను ప్లేగు వల్ల మరణించాడు. అప్పుడే దగ్డూ సేఠ్ తనగురువైన మాధవనాధ్ మహారాజ్ సలహామీద, మనశ్శాంతికోసం ఈ గణపతిని ఆలయం నిర్మించి పూజలు చేయసాగాడు. ఆయన కుటుంబ సభ్యులేకాక తోటి వ్యాపారస్తులంతా కూడా ఈ పూజలలో పాల్గొనేవారు. వారిలో తాత్యాసాహెబ్ గాడ్సే అనే యువకుడు ఉత్సవాల ఏర్పాట్లల్లో చురుకుగా పాల్గొనేవాడు. స్వాతంత్ర్య సమర వీరుడు లోకమాన్య బాల గంగాధర తిలక్, దగ్డూసేఠ్ హల్వాయీ మిత్రులు. దగ్డూ సేఠ్ నిర్మించిన గణేష్ ఆలయం, ఆయన చిత్తశుధ్ధి చూసిన బాలగంగాధర తిలక్కి స్వాతంత్రోద్యమ సమయంలో స్వాతంత్ర్య సమర వీరులని ఏకత్రితం చెయ్యటానికి గణపతి నవరాత్రులను ఒక సాధనంగా భావించి, ఆ ఉత్సవాలు బహిరంగంగా పెద్ద ఎత్తున చెయ్యాలనే ఆలోచన వచ్చింది. అప్పటినుంచీ దగ్డూ సేఠ్ గణపతి ఇంకా ప్రసిధ్ధిచెందాడు. 1893లోనే ఆలయానికి ట్రస్టు ఏర్పడింది.

ఆలయ నిర్మాణం అత్యంత సాధారణంగా వుంటుంది. ఈ ఆలయంలో జరిగే కార్యక్రమాలనూ, గణపతి విగ్రహాన్నీ రోడ్డుమీదనుంచీ కూడా చూడవచ్చు. ఇందులో గణపతి విగ్రహం 7.5 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పు వుంటుంది. ఈ విగ్రహం ఆభరణాలకి వెండి, బంగారాలేగాక అనేక జాతి రత్నాలుకూడా వాడబడ్డాయి. గర్భగుడిలో వెండి, బంగారాలు వాడబడ్డాయి. ఈ వినాయక విగ్రహం 10 మిలియన్ రూపాయలకు ఇన్స్యూర్ చెయ్యబడ్డది. 1952నుంచీ ఈ ఆలయంలో ఉత్సవ ఏర్పాట్ల బాధ్యత పూర్తిగా తాత్యాసాహెబ్ గాడ్సే మీద, అతని మిత్ర బృందం మీద పడ్డది. అప్పటినుంచీ వారు అకుంఠిత దీక్షతో మందిరాన్ని అభివృధ్ధి చెయ్యటమేకాక, భగవంతుని సేవించటానికి, మానవ సేవకన్నా మార్గంలేదని తమ ట్రస్టు ద్వారా అనేక సమాజాభివృధ్ధి కార్యక్రమాలు నిర్వహించటం కూడా మొదలు పెట్టారు.

దగ్డూసేఠ్ హల్వాయీ సార్వజనిక్ గణపతి ట్రస్టు కింద నిరుపేద బాలలకు ఉచిత విద్య, బడుగు వ్యాపారస్తులకు ఆర్ధిక దన్ను, వృధ్ధులకు ఆవాసాలు, నిరాశ్రయులకు సహకారం, వగైరా అనేక సమాజాభివృధ్ధి సేవలు చేస్తూ భగవంతుని అనుగ్రహం పొందుతున్నారు. వీరి దీక్ష చూసి విరాళాలుకూడా భారీగా రావటం మొదలయ్యాయి.

ఉత్సవాలు

వినాయక చవితి, గుడి పడవ మొదలైన పండగలేకాక అక్షయతృతీయ రోజు అంబా మహోత్సవ్ అనే పండగ ఇక్కడి విశేషం. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజున ఇక్కడ గణపతికి మామిడి పళ్ళు సమర్పిస్తారు. మన దేశంలో మామిడి పండు చాలా ప్రఖ్యాతిగాంచింది. దాదాపు అందరికీ ఇష్టమయినది. పైగా మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాంతంలో పంట రుచిలో గొప్పదనీ, వాటికి చాలా డిమాండ్ వుంటుందంటారు. అలాగే ఆల్ఫన్జో మామిడి పండ్లుకూడా. పూనాలో ప్రసిధ్ధ ఆల్ఫన్జో మామిడిపళ్ళ వ్యాపారి దేశాయ్ బంధు ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజున ఈ స్వామికి 11,000 మామిడి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామి గర్భగుడిలోనేకాక, ఆలయమంతా కూడా చక్కగా పండిన మామిడి పండ్లతో అలంకరిస్తారు. వాటి సువాసనతో ఆ ప్రాంతమంతా నిండిపోతుంది. ఆ రోజు సందర్శకుల తాకిడి చాలా ఎక్కువగా వుంటుంది. ఆ సుందర దృశ్యాలని తమ కెమేరాలలో బంధించాలనే తాపత్రయ పడేవారు ఎక్కువవుంటారు. ఈ మామిడి పళ్ళన్నీ మరునాడు ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులకు పంచిపెడతారు.

ఆదర్శం

ఆలయ నిర్వాహకులు తలుచుకుంటే అనేక విషయాలలో ప్రజలకు మార్గదర్శకులుగా వుండవచ్చని ఈ ఆలయ ట్రస్టు నిరూపించింది. ఎలాగంటే ... పూనె పట్టణానికి తాగునీరు, సాగు నీరు ఖడక్వాసలా రిజర్వాయిర్ నుంచి సరఫరా అవుతాయి. చాలా సంవత్సరాలుగా దానిలో పూడిక తియ్యకపోవటంతో ఆ రిజర్వాయిర్ లో నీటి నిల్వ సామర్ధ్యం తగ్గిపోయి, పట్టణానికి నీటి ఇబ్బంది ప్రారంభమయింది. మంచినీటి సరఫరాలో కోతలు, పొలాలకి నీరందకపోవటంతో రైతులు ఒకే పంట వెయ్యవలసి రావటంతో ఇబ్బందులు పడ్డారు. కల్నల్ సురేష్ పాటిల్ అనే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసరు రిటైరయిన తర్వాత సమాజ సేవలో గడుపుతున్నారు. ఆయన ఈ రిజర్వాయిర్ లో పూడిక తీయించటానికి ప్రభుత్వంద్వారా, ప్రైవేటు సంస్ధలద్వారా చాలా ప్రయత్నించారు కానీ సఫలం కాలేదు. ఈ సంగతి తెలిసిన దగ్డూ సేఠ్ హల్వాయీ గణపతి ట్రస్టువారు కార్యరంగంలో దిగి 2015లో .. జల సంవర్ధన్ అభియాన్ .. అనే కార్యక్రమం ప్రారంభించారు.

ఈ మహత్తర కార్యక్రమం ఒకరి వల్ల కాదని చుట్టుపక్కల వున్న 400 గణేష్ మండళ్ళ వాళ్ళని, ఇంకా ప్రజా సంస్ధలని కలుపుకుని, రిజర్వాయిర్ లో పూడిక తీయడానికి అవసరమైన భారీ యంత్ర సామగ్రి సమకూర్చుకుని పూడిక తీత మొదలుపెట్టారు. ప్రతి గణేష్ మండలినుంచి కొంతమంది రోజూ ఈ కార్యక్రమ పర్యవేక్షణకి వచ్చేవారు. వీరి కృషి తెలిసిన ఆర్మీవారు వారి దగ్గర వుండే యక్స్కవేటర్లు వగైరాలిచ్చి వారి వంతు సహాయం చేశారు. ఆర్మీకీ, ప్రజలకీ మధ్య సహకారంతో జరిగిన ప్రజోపయోగ కార్యక్రమానికి ఇది చక్కని ఉదాహరణ. ఈ పని పూర్తికాగానే ఆ పరిసర ప్రాంతాలని అందంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని రూపొందించుకుని, ఆ ప్రణాళిక చేబట్టటానికి అవసరమైన ప్రభుత్వ అనుమతి కూడా పొందారు. ప్రభుత్వం చెయ్యవలసిన పనిని ఒక ఆలయ ట్రస్టు, మిగతావారి సహకారంతో చెయ్యటం ఎందరికో ఆదర్శం. కదా! ఇంత అద్భుతమైన ఆలయాన్ని అవకాశం వున్నవారు తప్పక దర్శించండి.

దర్శనసమయాలు

ఉదయం 6గం. లనుంచీ రాత్రి 11 గం. లదాకా.

 

 

 

పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)

 


More Vinayakudu