ద్రౌపది ప్రశ్నకు భీష్ముడి సమాధానం!

మనం తినే ఆహారం మన ఆలోచనను ఎలా ప్రభావితం చేస్తుందో తెలిపేలా 'మహాభారతం'లోని ఓ కథ విస్తృత ప్రచారంలో ఉంది. మహాభారత యుద్ధంలో భీష్మ పితా మహుడు అంపశయ్య మీద ఉన్నప్పుడు  ఆయనను దర్శించడానికి పాండవులు, ద్రౌపదితో కలసి వెళ్ళారు. అప్పుడు భీష్ముడు, పాండవులకు ఎన్నో ఉపదేశాలు చేశాడు. ఆ సమయంలో ద్రౌపది అకస్మాత్తుగా నవ్వింది. పైగా, ఆ నవ్వును ఆపుకోలేక పోయింది. దాంతో భీష్మ పితామహుడు ఆశ్చర్యపోయాడు. ఆపుకోలేనంత ఆ నవ్వుకు కారణం ఏమిటని ఆమెను అడిగాడు.


దానికి ద్రౌపది ఎంతో వినయంగా, "పితామహా! మీరు ఇప్పుడు చేస్తున్న ఉపదేశాల్లో మన ధర్మసారం నిబిడీకృతమైంది. మీ మాటలు మాకెంతో మార్గదర్శకంగా ఉన్నాయి. అయితే, మీ ఉపదేశాలను వింటూ ఉండగా, నాకు ఒక చిన్న సందేహం కలిగింది” అన్నది.


“ఏమిటది?” అని భీష్ముడు అడిగాడు.


"పితామహా! ఆ రోజు నిండు సభలో కౌరవులు నన్ను పరాభవిస్తూ, వస్త్రాపహరణం చేయబోయినప్పుడు న్యాయం, ధర్మం కోసం నేను అభ్యర్థించాను. కానీ, సభలోనే ఉన్న మీరు కూడా మౌనముద్ర దాల్చారు. కారణం ఏమిటి? ఆ అన్యాయాన్ని మీరు ఎందుకు అడ్డుకోలేదు? దుర్యోధన, దుశ్శాసనాదులను ఎందుకు ఆపలేదు? అప్పుడు మౌనంగా ఉన్న మీరు ఇవాళ ఇలాంటి ఉపదేశాలు చేస్తున్నారు. మీ మాటలు వింటూ ఉంటే, ఆ సంగతి గుర్తొచ్చి, నాకు నవ్వు ఆగలేదు” అని ద్రౌపది వినమ్రంగానే ఉన్న మాట చెప్పింది.


ఆ మాట వినగానే భీష్మ పితామహుడు గంభీరంగా మారిపోయాడు, తను అప్పుడు ఎందుకు అంత మౌనంగా ఉన్నాడో.. దాని వెనుక కారణం ఏమిటో వివరంగా విశ్లేషించి చెప్పాడు.  “అమ్మా! ద్రౌపదీ! ఆ సమయంలో నేను దుర్యోధనుడు పెట్టిన తిండి తింటున్నాను. నా శరీరంలోని రక్తంలో ఆ ఆహారం, దాని తాలూకు లక్షణాలే ప్రవహిస్తూ వచ్చాయి. అతను పెట్టిన తిండి వల్ల నా ఆలోచన, ప్రవర్తన, బుద్ధి - అన్నిటి మీదా దుష్ప్రభావం పడింది. అయితే, ఆ పాపపు కూడు వల్ల తయారైన రక్తమంతా, ఈ యుద్ధంలో అర్జునుడి బాణాల దెబ్బకు శరీరంలో నుంచి బయటకు స్రవించింది. దాంతో, ఇప్పుడు నేను మళ్ళీ నా పవిత్ర భావాలనూ, పూర్వపుణ్య స్మృతినీ పొందగలిగాను. అందుకే, ప్రస్తుతం నా నోటి వెంట నైతికంగా ధర్మం, న్యాయమైన మాటలే వెలువడుతున్నాయి” అని భీష్ముడు వివరించాడు.


ఈ మహాభారత కథను బట్టి, శారీరకంగానే కాక, మానసికంగానూ పుష్టినిచ్చే సరైన ఆహారం తీసుకోవడం ముఖ్యమని అర్థమవుతోంది. పాపపు కూటిని తినడం వల్ల సరైన సమయంలో, సరైన ఆలోచన చేయలేకపోతామని రూఢి అవుతోంది. కాబట్టి, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండే వారి ఇంటనే భుజించాలి. ఏది తిన్నా, దాన్ని భగవంతునికి అర్పించి, ఆయన ప్రసాదంగా భావించి తీసుకోవడం మరీ ముఖ్యం.


                               ◆నిశ్శబ్ద.  


More Purana Patralu - Mythological Stories