రహస్య దానాల గురించి ఈ నిజాలు తెలుసా!


దానం అంటే పేదలకు, అవసరమైన వారికి, నిర్ణీత వ్యక్తులకు ఏదైనా ఇవ్వడం. ఇందులో ఆహారం, డబ్బు, వస్తువులు,  ఏదైనా సహాయం.. ఇలా ఏవైనా ఉండవచ్చు. అయితే  దానాలను రహస్యంగా  పరిగణించేవారు.  దాదాపు అన్ని మత గ్రంథాలలో..  భాగవత పురాణం, అగ్ని పురాణం, మహాభారతం,  మనుస్మృతి.. ఇలా అన్ని గ్రంథాలలో దానాల గురించి వివరించారు. రహస్య దానాలంటే కుడి చేతితో ఇచ్చిన విషయం ఎడమ చెయ్యికి కూడా తెలియకూడదు అని అర్థం. నిజానికి ఇలా ఇచ్చే దాన్నే నిజమైన దానం అని కూడా అంటారు.  రహస్య దానాలు చాలా  పుణ్య ఫలితాలను ఇస్తాయట. రహస్య దానం చేసినవారు  జీవితాంతం ధర్మాన్ని అనుసరించినట్టే అని చెబుతారు. రహస్య దానాల గురించి కొన్ని నిజాలు తెలుసుకుంటే..

 

హిందూ మతంలో దానధర్మాన్ని సద్గుణం, కరుణ,  మనిషి శుద్దిగా ఉండటం మొదలైన మంచి గుణాలకు ప్రతిరూపంగా చెబుతారు. హిందూ మత గ్రంథాలలో  ఉన్నతమైనది, అత్యంత గొప్ప ఫలితాలను ఇచ్చేదిగా దానాన్ని పేర్కొన్నారు.  కానీ నేటికాలంలో రహస్య దానం అనేది ఎక్కడా కనిపించడం లేదు.


దానం అంటే..


దానం అంటే ఇకపై  దానం చేసే వస్తువుపై ఎటువంటి హక్కు ఉండదు. మత గ్రంథాలు,  పురాణాలలో చాలా  దాతల కథల ఉంటాయి.  కానీ  నేటికాలంలో ఈ దానం కు గల పూర్తీ అర్థాన్ని తెలుసుకోకుండానే దానాలు, విరాళాలు ఇస్తుంటారు.

భగవద్గీత ప్రకారం దానం అంటే..


 భగవద్గీత ప్రకారం ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా సరైన సమయంలో, సరైన స్థలంలో, సరైన వ్యక్తికి విధిగా ఇచ్చే దానం సాత్విక దానం. భగవద్గీతలో వివరించబడిన ఈ సాత్విక దానం, వివేకవంతమైన దానానికి అత్యంత స్వచ్ఛమైన రూపంగా పరిగణించబడుతుంది.  ఇక్కడ దాతకు అహం ఉండదు, కానీ కరుణ మాత్రమే ఉంటుంది. అంటే దాతకు కరుణ మాత్రమే ఉండాలి, అహంకారం ఉండకూడదు.

కానీ నేటికాలంలో మనిషికి అయినా, జంతువుకు అయినా.. ఎవరికి అయినా ఏదైనా ఇచ్చేముందు పోన్ కెమెరా ఆన్ చేయకుండా ఏదీ చేయరు. దీన్ని దానం అని అనడం చాలా తప్పని పండితులు, మత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఇలా చేయడం దానం తీసుకునే వారిని అవమానించినట్టేనట.

గరుడ పురాణం,  మను స్మృతి వంటి మత గ్రంథాలలో   ప్రదర్శన, ప్రచారం లేదా స్వార్థం కోసం చేసే దానాలు, విరాళాలు.. వాటి ద్వారా దక్కవలసిన పుణ్యాన్ని తగ్గించేస్తాయట. మనుషులకు అయినా, జంతువులకు అయినా, ఏదైనా ఒక ప్రయోజనం కోసం దానాలు, విరాళాలు ఇవ్వడం మంచిదే.. కానీ దాన్ని బయటకు తెలిసేలా చేయడం తప్పని అంటున్నారు.  ఇలా చేసిన దానం వల్ల కలిగే ఫలితం ఎంతో కొంత ఉంటుంది కానీ.. రహస్య దానం వల్ల కలిగే ఫలితం మాత్రం ఇలాంటి దానాల వల్ల లభించదు. దానం మనస్ఫూర్తిగా,  ఎవరికీ చెప్పకుండా చేయడమే ఉత్తమం.

                        *రూపశ్రీ.


More Subhashitaalu