బగళాముఖి అమ్మవారి గురించి ఈ విషయాలు తెలుసా...


ఎన్నికలకు ముందు లేదా ఒక ప్రధాన రాజకీయ సంఘటనకు ముందు  ఎక్కువగా వినిపించే దేవత పేరు బగళాముఖి. హిందూ మతంలోని దశ మహావిద్యలలో బగళాముఖి అమ్మవారు ఎనిమిదవ దేవత. ఈ అమ్మ పేరుకు అక్షరాలా 'అణచిపెట్టేది' అని అర్థం.  శత్రువులను, ముఖ్యంగా మాటలు, అబద్ధాలు లేదా చట్టపరమైన చిక్కుల ద్వారా మీకు హాని కలిగించడానికి ప్రయత్నించే వారిని నియంత్రించే లేదా నిశ్శబ్దం చేసే శక్తి,  సామర్థ్యం కలిగిన దేవత బగళాముఖి అమ్మవారు. బగళాముఖి అమ్మవారు 'స్తంభన' దేవతగా కూడా ప్రసిద్ధి చెందారు. శత్రువును నిశ్చలంగా,  కదలకుండా చేయగలదట. బగళాముఖి అమ్మవారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుంటే..

దశ మహావిద్యలు..

తంత్ర సాధనలో ప్రసిద్ధి చెందిన 10 దేవతలు దశ మహావిద్యలలో బగళాముఖి అమ్మవారు ఒక భాగం. శివుడు కోపంతో వెళ్ళిపోకుండా ఆపడానికి సతీదేవి పది విభిన్నమైన శక్తివంతమైన రూపాలను తీసుకున్నప్పుడు ఈ పది రూపాలు ఉద్భవించాయని నమ్ముతారు.

దశ మహావిద్యలు - కాళి, తార, త్రిపుర సుందరి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగళాముఖి, మాతంగి,  కమల.

బగళాముఖి ఆరాధన, ఆ అమ్మ పట్ల కలిగి ఉండే  భక్తి ప్రజలు అడ్డంకులను అధిగమించడానికి, చర్చలలో  గెలవడానికి, దీర్ఘకాల చట్టపరమైన సమస్యలను పరిష్కరించడానికి, శత్రువును ఓడించడానికి,  ఇలా ఎన్నో విధాలుగా  సహాయపడుతుంది.

బగళాముఖి అమ్మను పూజిస్తే..

తంత్ర సాధన, మంత్ర జపం,  ఆచారాల ద్వారా శత్రువులను స్థంబింప చేయడానికి, ఓడించడానికి గల  శక్తులకు బగళాముఖి అమ్మవారు ప్రసిద్ధి చెందింది. రాజకీయ ప్రపంచంలో చాలామంది విజయం, అపరాజిత శక్తి కోసం దైవ కృప కోసం బగళాముఖి అమ్మను  ఆశ్రయిస్తారట.

బగళాముఖి అమ్మవారి సాధనలు తీవ్రమైనవి, పవిత్రమైనవి, అన్నింటి కంటే ఈ అమ్మవారి సాధనకు  క్రమశిక్షణ అవసరం.

శక్తివంతమైన బగళాముఖి ఆలయం..

భారతదేశంలో బగళాముఖి  ఆలయాలు పరిమితంగా ఉన్నాయి.  కానీ అత్యంత ప్రసిద్ధమైనది మధ్యప్రదేశ్‌లోని దాటియాలో ఉంది. ఈ ఆలయం  శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రకంపనలకు ప్రసిద్ధి.  ఇక్కడ ప్రార్థనలు చేసిన తర్వాత ప్రధాన సమస్యల నుండి ఉపశమనం పొందిన భక్తుల జీవితాలలో అద్బుతం జరుగుతుందని చెబుతారు. ఇక్కడ చాలా వరకు ప్రభావవంతమైన వ్యక్తులు, రాజకీయ నాయకులు   ఎక్కువగా కనిపిస్తూ ఉంటారట.

బగళాముఖి అమ్మవారు ఎలా ఉంటారంటే..

బగళాముఖి సాధారణంగా ప్రకాశవంతమైన పసుపు-బంగారు రంగు దుస్తులలో దర్మనం ఇస్తుంది.  ఇది అమ్మవారికి  ఉత్సాహంగా ఉంచుతుందట.  అలాగే అమ్మవారు  అన్ని రకాల బంగారు ఆభరణాలతో అలంకరించబడి ఉంటుందట. ఆమె సింహాసనంపై కూర్చుని, చేతిలో 'గద' పట్టుకుని, మరో చేత్తో రాక్షసుడి నాలుకను పట్టుకుని, ఆమెకు వాక్కు, ఇంద్రియాలు,  మరిన్నింటిపై నియంత్రణ తన చేతుల్లో ఎలా  ఉంటుందో  చూపిస్తుంది.

బగళాముఖి అమ్మవారికి ఇష్టమైన రంగు,  పూజా ఉపచారాలు..

పసుపు రంగుతో బగళాముఖి  అమ్మవారు ఎక్కువగా సంతోషిస్తుందని, ఆమె పసుపు రంగు దుస్తులు ధరించడమే కాకుండా, ఆమెను సందర్శించే భక్తులు కూడా ప్రకాశవంతమైన పసుపు లేదా బంగారు రంగులను ధరించాలని సలహా ఇస్తారు. ఆమెకు సమర్పించే పువ్వులు, తీపి పదార్థాలు,  ఇతర వస్తువులు కూడా పసుపు రంగులో ఉంటాయి.
ప్రజలు బగళాముఖి అమ్మవారి అనుష్ఠానం చేస్తారు. ఇది ఒక రోజు నుండి 21 రోజుల వరకు జరిగే ఆచారం. ఈ అనుష్టానంలో అమ్మవారి  మంత్రాలను జపిస్తారు. అమ్మవారి అనుగ్రహం కోసం అమ్మవారిని శాంతపరిచే చర్యలు కూడా చేపడతారు.

                                 *రూపశ్రీ.


More Aacharalu