నన్ను పాకనివ్వమ్మా.. ప్లీజ్...

 


పసి పిల్లల ఎదుగుదల క్రమంలో ప్రతీ దశ ముఖ్యమైనదే. ఏ వయసుకు ఆ వయసుకు తగ్గట్టుగా వుండే పిల్లల ఆటపాటలు వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి అంటున్నారు పిల్లల ఆరోగ్య నిపుణులు. అయితే పిల్లల మీద ప్రేమతో, అలాగే వారికి హాని కలుగుతుందేమోననే భయంతో తల్లిదండ్రులు వారిని ఆ ఆటపాటలకి దూరం చేస్తే ఆ ప్రభావం తప్పకుండా పిల్లల శారీరక ఆరోగ్యంపై వుంటుందని హెచ్చరిస్తున్నారు వీరు. ఉదాహరణకి పారాడే పాపాయి అప్పుడప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగిలించుకోవడం మామూలే. కానీ, అది చూసిన తల్లి కింద పాకుతుంటే దెబ్బలు తగిలించుకుంటోందంటూ ఎప్పుడూ ఎత్తుకు తిరగడం లేదా వాకర్‌లో వేయడం చేస్తుంది. అయితే ఇది ఎంతో తప్పు అంటున్నారు నిపుణులు.

పిల్లల్ని పాకనివ్వకపోవడం పాపం...


చంటి పిల్లల్ని అటూ ఇటూ తిరగకుండా వాకర్లలో కూర్చోబెట్టడం, ఉయ్యాల్లో పడుకోబెట్టడం, ఎప్పుడూ ఎత్తుకుని ఉండటం కన్నా వారు నేలంతా పారాడుతూ అటూ ఇటూ తిరుగుతుండటమే మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే, పిల్లలు తమ పొట్టపై తక్కువగా గడపటం వల్ల పాకే సామర్థ్యం తగ్గిపోతుందిట. 339 మంది చిన్నారులపై చేపట్టిన ఒక అధ్యయనంలో నేలమీద పారాడే అలవాటు అస్సలు లేని పిల్లల్లో 48 శాతం మందిలో శారీకర సమతౌల్యం లోపించడం, అవయవాల మధ్య సమన్వయం లేకపోవడం వంటి సమస్యలు కనిపించాయిట.  అలాగే పాకే వయసు పిల్లల్ని ఎప్పుడూ వాకర్లలో కూర్చోబెట్టడం వల్ల నష్టం ఉందని కూడా అంటున్నారు.

అవయవాల అభివృద్ధిని ఆపకండి...

పాకే వయసు పిల్లల్ని ఆపకుండా ఎప్పుడూ వాళ్ళు హాయిగా ఇల్లంతా పాకే అవకాశం కల్పించడం మంచిదిట. వాళ్ళని ఆపి ఒకేచోట కూర్చోబెట్టడం, అందులోనూ వాకర్లలో వేసి వుంచడం వల్ల ఎదిగే దశలో అవసరమైన అభివృద్ధినీ, నైపుణ్యాల్నీ పెంపొందించుకోలేరని గుర్తించారు నిపుణులు. ఇలాంటి పిల్లల్లో తలభాగాన్ని నియంత్రించుకోవడం, మెడ, శరీర పైభాగం బలిష్టమవటం వంటివన్నీ సమస్యగా మారే ప్రమాదముందిట. ఫలితంగా సమతౌల్యం లోపించడం, శరీరాకృతి సరిగా ఉండకపోవడం, కళ్ళ కదలికల్లో నియంత్రణ లేకపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం వుందిట.



ఎదుగుదల క్రమపద్ధతిలో వుండాలంటే...

పసిపిల్లలు ముందుగా పొట్టపై, ఆ తర్వాత చేతులపై, ఆ తర్వాత మోకాళ్ళ సాయంతో పాకడం చేస్తుంటారు. ఇలా ఒకదాని వెంట ఒకటిగా సాగే ప్రక్రియ ఎదుగుదలకి సహాయపడుతుంది. ఇలా అన్ని దశలను దాటిన పిల్లల ఆరోగ్యం చక్కగా వుంటుందిట. వారిలో ఎదుగుదల క్రమపద్ధతిలో జరిగి, సంపూర్ణంగా వుంటుందని చెబుతున్నారు పరిశోధకులు. కాబట్టి పిల్లలు నేలపై పాకితే గాయాలయిపోతాయని, అవీ  ఇవీ నోట్లో పెట్టుకుంటారని భయపడకుండా వారిని స్వేచ్ఛగా పారాడనిస్తే వారి శారీరక ఎదుగుదలకి సహాయపడినవారం అవుతామని కూడా వీరు స్పష్టం చేస్తున్నారు.

చిన్నచిన్న దెబ్బల్ని లైట్ తీసుకోండి...

పిల్లలపై మన ప్రేమ వారికి హాని చేసే విధంగా వుండకూడదు. అందుకని ఈసారి మీ పసిపాప నేలపై పాకుతూ పడి చిన్న చిన్న దెబ్బలు తగిలించుకున్న తనని ఓదార్చి మళ్ళీ నేలపై వదిలిపెట్టండి. ముఖ్యంగా పరిశోధకులు చెప్పిన విషయం గమనించారు కదా. అలా పొట్టతో, ఆ తర్వాత చేతులతో, మోకాళ్ళతో పాకడం వల్ల వారి కళ్ళ, మెడ ఎదుగుదలలో సమతౌల్యం వుంటుంది. పారాడే పిల్లలని ఆపడం కన్నా వారికి అనువుగా ఇంటి పరిసరాలని మార్చడం మంచిది. క్రిందన వారికి అందేవిధంగా ఏవీ వుంచకుండా చూడాలి. ఇకప్పుడు ఏ భయం లేకుండా పిల్లల్ని హాయిగా ఇల్లంతా తిరగనివ్వొచ్చు.

-రమ