ఆరోగ్యానికి మేలు చేసే పానకం

 

ఎండాకాలం ఎండలు ఒక పక్క మధ్యమధ్యలో ఉరుములు మెరుపులతో వర్షాలు ఒక పక్క. ఇలా  కాలం కాని కాలంలో వచ్చే వానలకి, మళ్లీ పేలిపోయే ఎండలకి ఆరోగ్యం అటు ఇటు అవుతూ ఉంటుంది. మనకి వేడి చేసినా, చలవ చేసినా రెండింటికి మిరియాలు ఒక మంచి మందు. ఈ మిరియాలతో చేసిన పానకం తాగితే ఈ వాతావరణ ప్రభావం వల్ల వచ్చే అనారోగ్యాలు తగ్గుతాయి. ఎండాకాలంలో వచ్చే ఉగాదికి, శ్రీరామనవమికి, నృసింహ జయంతికి దేముడికి పానంకం నైవేద్యంగా పెట్టి మనని తాగమనటంలో ఉన్న అంతరార్దం ఇదే. ఈ రోజు నృసింహ జయంతి కాబట్టి ఈ పానకం చేసి దేముడికి నైవేద్యం పెట్టి తాగితే మనకే మంచిది.


కావాల్సిన పదార్థాలు:

 

బెల్లం - 1 కప్పు
మిరియాల పొడి  - 1 చెంచా
యాలకుల పొడి - 1 చెంచా
నీళ్ళు - 8 గ్లాసులు

 

తయారి విధానం:

 

ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకుని అందులో బెల్లం వేసి అది కరిగే దాకా గరిటెతో తిప్పుతూ ఉండాలి. బెల్లం కరిగాకా అందులో మెత్తగా మిక్సి పట్టిన మిరియాల పొడి, యాలకుల పొడి వేసి కలపాలి. గొంతులో ఏది అడ్డుపడకుండా ఉండటానికి దీనిని జాలిలో వడకట్టుకోవచ్చు. ఇలా తయారయిన పానకం తాగితే వేడి చేసిన వాళ్ళకి చలవ చేస్తుంది. అలాగే చలవ చేసి కాళ్ళు చేతులు చల్లబడిన వాళ్ళకి ఒంట్లో వేడి కలుగుతుంది. పిల్లలకి కూడా ఇది ఎంతో మంచిది. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి.

- కళ్యాణి