కార్న్ మాంగో చట్ పట్

 

సాయంత్రం అయితే చాలు ఆడి ఆడి అలిసిపోయి ఇంటికి వచ్చి తినటానికి ఏదైనా పెట్టు అని మారాం చేస్తారు మన పిల్లలు. ఆ టైం లో వాళ్ళకి  ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే స్నాక్ ఏదైనా పెడితే ఎంత బాగుంటుంది.  అలాంటి ఒక మంచి స్నాక్ ఐటమ్ ఒకటి ఎలా యరారుచేయ్యాలో ఇప్పుడు చూద్దాం.  

 

కావాల్సిన  పదార్థాలు:


స్వీట్  కార్న్ - 2 కప్పులు
సెనగ పప్పు - 1/2 కప్పు
పచ్చి మామిడి తురుము - 1 చెంచా
కేరట్ తురుము - 1 చెంచా
పచ్చి కొబ్బరి తురుము - 2 చెంచాలు
పచ్చిమిర్చి చీలికలు - 4
ఆవాలు, జీలకర్ర  - 1/4 చెంచా
కరివేపాకు, కొత్తిమీర - తగినంత

తయారి విధానం:


ఇది తయారుచేసే ముందు సెనగ పప్పుని నానబెట్టి ఉడుకించి పక్కన పెట్టుకోవాలి. అలాగే స్వీట్ కార్న్ ని కూడా ఆవిరిపై ఉడికించి కాస్త ఉప్పు జల్లి పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు జీలకర్ర వేయాలి. అవి చిటపటలాడాకా పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. అందులో కేరట్ తురుము వేసి రెండు నిమిషాలు కదపాలి. తరువాత ఉడికించిన సెనగపప్పు, కార్న్స్, పచ్చి మామిడి తురుము వేసి మూత  పెట్టి ఉంచాలి. రెండు నిమిషాలు అయ్యాకా మూత తీసి అందులో  తగినంత ఉప్పు జోడించి ఒక ప్లేట్ లోకి తీసి దానిని కొత్తిమీరతో అలంకరించుకుంటే చాలు. వేడివేడిగా ఉండే కార్న్ మాంగో చట్ పట్ రెడీ.

-కళ్యాణి