LATEST NEWS
మ‌ద్యం ప్రియుల‌కు జగన్ సర్కార్ శుభవార్త‌ చెప్పింది. మ‌ద్యం ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఐఎంఎఫ్ లిక్కర్ తో పాటు, విదేశీ మద్యంలోని మీడియం, ప్రీమియం ధరలను తగ్గిస్తున్నట్టు ఉత్తర్వులను జారీ చేసింది. వివిధ కేటగిరీల బ్రాండ్ల‌పై 25శాతం వరకు ధరలను త‌గ్గించింది. పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యాన్ని అరికట్టేందుకే ధరలను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే, క్వార్టర్ ధర రూ.200ల పైన ఉన్న మద్యం రేటు మాత్రమే తగ్గనుంది. బాటిళ్ల పరిమాణాలు, బ్రాండ్లను బట్టి తగ్గింపు రూ.50 నుంచి రూ.1350 వరకు ఉండనుంది. తగ్గిన ధరలు రేపటి నుంచి అమలు కానున్నాయి. అయితే బీర్లు, రెడీ టూ డ్రింక్స్ రేట్లు మాత్రం య‌థాత‌థంగా కొన‌సాగ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.   ఈ ఏడాది మద్యం అమ్మకాలు భారీగా పడిపోవడంతో ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మాకు ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యమన్న వైసీపీ.. మద్యనిషేదం చేస్తామని చెప్పింది. అందులో భాగంగానే మద్యం ధరలు పెంచి ప్రజలకు మద్యం అందుబాటు ధరలో లేకుండా చేస్తున్నామని ప్రచారం చేసుకుంది. కానీ ఇప్పుడు ఆదాయం పడిపోవడంతో.. అమ్మకాలు పెంచుకునేందుకు ధరలను తగ్గించిందని విమర్శలు వినిపిస్తున్నాయి.  
పోలవరం ప్రాజెక్టుపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరాన్ని కేంద్రం కట్టాల్సిన అవసరం లేదని.. తామే నిర్మిస్తామని టీడీపీ నేతలు చెప్పి, కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టును తీసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు దోపిడీ వల్లే పోలవరం నిధులు తగ్గాయని, ప్రస్తుత దుస్థితికి ఆయనే కారణమని విమర్శించారు. అయితే ప్రధాని మోదీని ఒప్పించి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అవసరమైతే పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని బొత్స ప్రకటించారు.   కాసుల కక్కుర్తితో ప్రత్యేక హోదాను టీడీపీ నేతలు తాకట్టు పెట్టారని బొత్స విమర్శించారు. చంద్రబాబు హయాంలో 3 లక్షల ఇళ్లకు పునాది వేశారని.. 81,048 ఇళ్ల నిర్మాణం 95 శాతం పూర్తయిందని చెప్పారు. ఇళ్లను ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ధర్నా అంటూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని బొత్స విమర్శించారు.
కొద్ది రోజుల క్రితం విశాఖలోని గీతం విద్యాసంస్థ ప్రభుత్వ భూమిని కబ్జా చేసిందని చెబుతూ అక్కడి పలు నిర్మాణాలను విశాఖ అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా గీతం ను మరోసారి టార్గెట్ చేస్తూ.. గీతం యూనివర్సిటీ యాజమాన్యం యూజీసీ నిబంధనలను కూడా అతిక్రమించిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ కు లేఖ రాశారు. దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో అయన కోరారు. దీనితోపాటు గీతం యూనివర్సిటీకి ఉన్న డీమ్డ్ యూనివర్సిటీ హోదాను యూజీసీ రద్దు చేయాలనీ, అయితే విద్యార్థులు మాత్రం నష్టపోకుండా గీతంను ఆంధ్రా యూనివర్సిటీకి అనుబంధంగా చేయొచ్చని అయన పేర్కొన్నారు.   గీతం సంస్థ విశాఖ క్యాంపస్‌ కోసం ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు తన దృష్టికొచ్చిందని సాయిరెడ్డి తెలిపారు. క్యాంపస్‌ కోసం నిబంధనలు ఉల్లంఘించి భూములు సేకరించారని సాయిరెడ్డి ఆ లేఖలో ఆరోపించారు. గీతం సంస్థ నిబంధనల ఉల్లంఘన, డాక్యుమెంట్లు బహిర్గతం చేయకపోవడంపై అభ్యంతరం తెలిపారు. యూజీసీ చట్టంలోని పలు నిబంధనలను గీతం ఉల్లంఘించినట్లు సాయిరెడ్డి ఆరోపించారు. గీతం విద్యా సంస్థకు.. సినీ నటుడు బాలకృష్ణ చిన్నఅల్లుడు, టీడీపీ నేత అయిన శ్రీ భరత్ చైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసందే.
కొన్ని నెలల క్రితం మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ గా ఆనంద గజపతిరాజు మొదటి భార్య సంతానం ఐన సంచయిత గజపతిరాజు పదవి చేపట్టిన నాటి నుండి గజపతి రాజు కుటుంబీకుల మధ్య వివాదాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా, విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన తమను సంచయిత అవమానించిందని ఆనంద గజపతిరాజు రెండో భార్య కుమార్తె ఊర్మిళ గజపతిరాజు ఆరోపించారు. ఈరోజు తమ బంగ్లాలో ఊర్మిళ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచయితపై తీవ్ర విమర్శలు చేశారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనడం రాజ కుటుంబికులుగా తమకు ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోందని, ఈ ఏడాది కూడా తన తల్లి సుధా గజపతిరాజుతో కలిసి సిరిమాను ఉత్సవానికి వచ్చానని ఆమె తెలిపారు. అమ్మవారి వేడుకలు చూసేందుకు కోటలోకి వచ్చిన తమ పట్ల సంచయిత అవమానకర రీతిలో ప్రవర్తించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను తన తల్లితో కలిసి కోటలోకి ప్రవేశించగానే... తమ రాకను గమనించిన సంచయిత తన సిబ్బందిపై మండిపడి, వీళ్లను కోటలోకి ఎవరు రానిచ్చారు అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసిందని ఊర్మిళ వెల్లడించారు. దీంతో కోటపై ముందు వరుసలో ఉన్న తమను వెనక్కి వెళ్లాలని తమ దగ్గరకు వచ్చి ఈవో చెప్పారని ఆమె వివరించారు. అయితే, ఆ ఈవోను పర్మిషన్ అడిగి కొంతసేపు అక్కడే కూర్చుని దర్శనం చేసుకుని వచ్చేశామని ఆమె తెలిపారు.   అయితే ఈ తరహా అనుభవం ఎదురవుతుందని తమకు ముందే తెలుసని, సంచయిత ఎంతో అహంకారంతో ప్రవర్తిస్తోందని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా మాన్సాస్ ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా తన తల్లిని ఇంతవరకు ప్రమాణస్వీకారం కూడా చేయనివ్వలేదని ఊర్మిళ వెల్లడించారు. మాన్సాస్ ట్రస్టును సంచయిత తన సొంత సంస్థలా భావించి అధికారం చెలాయిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. సంచయిత చేస్తున్న చేష్టలు దివంగత ఆనంద గజపతిరాజుకు అవమానకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. కోట బురుజుపై నుంచి సిరిమాను ఉత్సవం తిలకించే హక్కు ఆనంద గజపతి వారసులుగా తమకు కూడా ఉందని ఊర్మిళ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.   కాగా, నిన్న ఊర్మిళ, సుధా గజపతిరాజులను అక్కడ్నించి పంపించేందుకు పోలీసులు నిస్సహాయత వ్యక్తం చేయడంతో... సంచయిత కోట బురుజుపై మరో వైపున కుర్చీ వేసుకుని కూర్చుని సిరిమానోత్సవ వేడుకలు తిలకించారు. దీంతో పైడితల్లి సిరిమానోత్సవం ఈసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. అమ్మవారి సాక్షిగా రాజ కుటుంబంలో ఇప్పటికే ఉన్న విభేదాలు తాజా ఘటనతో మరింత చెలరేగాయి.   దీంతో సింహాచలం దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా నియమించబడ్డ సంచయిత వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఎంతో గౌరవంగా జరగాల్సిన ఈ పవిత్ర కార్యక్రమం రసాభాసగా మారింది. దీంతో అందరి దృష్టి రాజకుంటుంబంపై పడింది. తాజా ఘటనపై సంచయిత గొప్పగా ఫీలవుతుంటే.. మరో పక్క ఊర్మిళ గజపతి మాత్రం ఇది రాజ కుటుంబానికి అవమానకరమని, బాధాకరమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులందరూ హాజరు కావాల్సిన కార్యక్రమంలో మమ్మల్ని పాల్గొనకూడదని ఆంక్షలు విధించడానికి అసలు సంచయిత ఎవరని ఊర్మిళ ప్రశ్నించారు.  
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో జగన్ సర్కార్ కి చుక్కెదురైంది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) స్పష్టం చేసింది. అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టవద్దని ఆదేశించింది.    డీపీఆర్‌ కు సంబంధించి పూర్తిస్థాయి అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టకూడదని కేంద్ర జలశక్తి శాఖ ఎన్జీటికి తెలిపింది. కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎన్జీటి కీలక తీర్పు ఇచ్చింది. 
ALSO ON TELUGUONE N E W S
  బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ (ఎల్‌జేపీ) అభ్య‌ర్థి ప్ర‌కాశ్ చంద్ర‌ త‌ర‌పున ప్ర‌చారం చేసిన సంద‌ర్భంలో తాను భ‌యోత్పాతానికీ, బెదిరింపుల‌కూ గుర‌య్యాన‌ని బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి, 'బ‌ద్రి', 'నాని' సినిమాల హీరోయిన్ అమీషా ప‌టేల్ ఆరోపించారు. స్వ‌యంగా ప్ర‌కాశ్ చంద్ర త‌న‌ను బెదిరించాడ‌ని ఆమె చెప్పారు. అయితే ఆమె ఆరోప‌ణ‌ల‌ను ఆ రాజ‌కీయ నాయ‌కుడు ఖండించారు. ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంలో ఒక ఆడియో క్లిప్‌కు స్పంద‌న‌గా అమీషా ప‌టేల్ ఈ ఆరోప‌ణ‌లు చేశారు. వైర‌ల్ అయిన ఆ ఆడియోలో ఇటీవ‌ల త‌ను వెళ్లిన బిహార్‌లోని దౌడ్‌న‌గ‌ర్‌లో ఎదురైన అనుభ‌వాన్ని అమీషా వివ‌రించ‌డం వినిపించింది. అయితే ఆ ఆడియో ప్రామాణిక‌తను ధ్రువీక‌రించాల్సి ఉంది. "నా ప్రాణాలు, నా టీమ్ ప్రాణాల గురించి ఆ ప‌ర్య‌ట‌న‌లో చాలా భ‌య‌ప‌డ్డాను. సుర‌క్షితంగా ముంబైకు చేరుకొనే దాకా వాళ్లు చెప్పిన‌ట్లు న‌డ‌చుకోవ‌డం త‌ప్ప నాకు వేరే గత్యంత‌రం లేక‌పోయింది. ముంబైకి తిరిగి వ‌చ్చేట‌ప్పుడు కూడా, ఆయ‌న‌తో అప్ప‌టికే భ‌యంక‌ర‌మైన అనుభ‌వాన్ని ఎదుర్కొని ఉన్న‌ప్ప‌టికీ, త‌న గురించి గొప్ప‌గా చెప్ప‌మంటూ ప్ర‌కాశ్ చంద్ర నాకు బెదిరింపు మెసేజ్‌లు పంపాడు" అని చెప్పింది అమీషా. ప్ర‌చారం సంద‌ర్భంగా చంద్ర ఆదేశాలు పాటించ‌క‌పోతే తన‌ను రేప్ చేసి చంపుతామంటూ బెదిరించార‌ని ఆమె తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. "ముంబైలో దిగ‌గానే నేను నిజం చెప్పాల్సింది. నేను రేప్‌కు, హ‌త్య‌కు గురికావ‌చ్చు. ప్ర‌చారం జ‌రుగుతున్నంత కాలం, నా కారును ప్ర‌కాశ్ చంద్ర మ‌నుషులు చుట్టుముట్టే ఉన్నారు. త‌మ ఆదేశాలు పాటించే దాకా వాళ్లు న‌న్ను క‌ద‌ల‌నివ్వ‌లేదు. ఆయ‌న న‌న్ను ట్రాప్ చేసి, నా ప్రాణాల‌ను ప్ర‌మాదంలో పెట్టాడు" అని ఆరోపించింది అమీషా. ఈ ఆరోప‌ణ‌ల‌న్నింటినీ ప్ర‌కాశ్ చంద్ర ఖండించారు. జ‌న్ అధికార్ పార్టీ నాయ‌కుడు ప‌ప్పూ యాద‌వ్ డ‌బ్బులిచ్చి ఆమెచేత అబ‌ద్ధాలు మాట్లాడిస్తున్నాడ‌ని ఆయ‌న చెప్పారు. "నేను జ‌నం ఓట్ల ఆధారంగా ఎన్నిక‌ల్లో గెల‌వాల‌నే న‌మ్మ‌కం ఉన్న‌వాడిని. కానీ ఓబ్రాలో నా బంధువుల్లో ఒక‌రు అమీషా ప‌టేల్ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఆమెకు అన్ని రకాల భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. ఆమె చేసిన ఆరోప‌ణ‌ల్లో ఏ ఒక్క‌టీ జ‌ర‌గ‌లేదు. సోనాక్షి సిన్హా కూడా బిహార్‌కు చెందిన న‌టే. ప‌ప్పూ యాద‌వ్‌ను అమీషా క‌లిశారు. వారి మ‌ధ్య రూ. 15 ల‌క్ష‌ల‌కు బేరం కుదిరింది" అని చంద్ర చెప్పారు.
  పాన్ ఇండియా స్టార్‌గా పేరు పొందిన ప్ర‌భాస్ 'బాహుబ‌లి 2' త‌ర్వాత న‌టించిన 'సాహో' సినిమా హిందీ వెర్ష‌న్ హిట్ట‌వ‌గా, తెలుగు వెర్ష‌న్ న‌ష్టాలు చ‌విచూసింది. ఎంత ఫ్లాప‌యిన‌ప్ప‌టికీ దాని వ‌సూళ్లు మిగ‌తా స్టార్ల హిట్ సినిమాల రేంజికి త‌గ్గ‌కుండా వ‌చ్చాయి. కానీ టీవీ తెర‌పై మాత్రం 'సాహో' వీక్ష‌కుల‌ను ఆక‌ర్షించ‌లేక పోయింది. జీ తెలుగు చాన‌ల్‌లో తొలిసారిగా అక్టోబ‌ర్ 18న ఆదివారం ప్ర‌సార‌మైన ఆ చిత్రం అతి త‌క్కువ టీఆర్పీ న‌మోదు చేయ‌డం ఫ్యాన్స్‌తో పాటు విశ్లేష‌కుల‌నూ షాక్‌కు గురిచేసింది. దానికి కేవ‌లం 5.81 టీఆర్పీ రావ‌డం గ‌మ‌నార్హం. 'సాహో' కంటే కొత్త హీరో కార్తికేయ న‌టించిన 'గుణ 369' మెరుగైన టీఆర్పీ సాధించ‌డం ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు మింగుడు ప‌డ‌ని విష‌యం. ఈటీవీలో అదే రోజు అంటే అక్టోబ‌ర్ 18నే తొలిసారి ప్ర‌సార‌మైన 'గుణ 369'కు 5.92 రేటింగ్ రావ‌డం విశేషం. దీంతో ఆ సినిమా టీమ్ త‌మ సినిమా హ‌య్యెస్ట్ టీఆర్పీ సాధించిందంటూ సోష‌ల్ మీడియాలో భారీగా ప్ర‌చారం చేసుకుంటోంది. దీనికి సంబంధించిన పోస్ట‌ర్ల‌ను రిలీజ్ చేసింది. ఏదేమైనా 'సాహో' ప్రీమియ‌ర్‌ కంటే త‌మ హీరో సినిమా ఎక్కువ టీఆర్పీ సాధించ‌డంతో కార్తికేయ ఫ్యాన్స్ ఆన్‌లైన్‌లో సంద‌డి చేస్తున్నారు. పెద్ద స్టార్ల సినిమాల విషయానికొస్తే, ఇదివ‌ర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ మూవీ 'అజ్ఞాత‌వాసి' సాధించిన 6.1 టీఆర్పీయే అతి త‌క్కువ టీఆర్పీగా రికార్డుల‌కెక్క‌గా, ఇప్పుడు 'సాహో' దాన్ని బీట్ చేసి, చెత్త రికార్డును సొంతం చేసుకుంది.
  అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'వైల్డ్ డాగ్‌'. ఇది మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిర్మాణ‌మ‌వుతోన్న 6వ చిత్రం. అహిషోర్ సాల్మ‌న్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని మ‌నాలీలో ఉన్న సుంద‌ర ప్ర‌దేశాల్లో ఇటీవ‌లే మొద‌లైంది. బిగ్ బాస్ 4 షోకు విరామ‌మిచ్చి మ‌రీ నాగార్జున మూడు వారాల పాటు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు అక్క‌డ‌కు వెళ్లారు. నాగార్జున‌తో పాటు బాలీవుడ్ తార స‌యామీ ఖేర్‌, బిగ్ బాస్ 3 కంటెస్టెంట్‌, టీవీ స్టార్ అలీ ర‌జా, స్టాండ‌ప్ క‌మెడియ‌న్ మ‌యాంక్ ప‌ర‌ఖ్ త‌దిత‌రుల‌పై హిమాల‌యాల్లో స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. దీనికి సంబంధించిన రెండు పిక్చ‌ర్లను గురువారం నాగార్జున త‌న సోష‌ల్ మీడియా హ్యాడిల్స్ ద్వారా విడుద‌ల చేశారు. 'వైల్డ్ డాగ్‌'లో ఆయ‌న ఏసీపీ విజ‌య్ వ‌ర్మ రోల్‌లో క‌నిపించ‌నున్నారు. త‌న టీమ్‌తో క‌లిసి ఆయ‌న ఒక ఆపరేష‌న్‌లో పాల్గొంటున్న స‌న్నివేశాల‌ను తీస్తున్న‌ట్లు నాగార్జున షేర్ చేసిన ఫొటోల‌ను బ‌ట్టి తెలుస్తోంది. క్రిమిన‌ల్స్‌ను విజ‌య్ వ‌ర్మ నిర్దాక్షిణ్యంగా డీల్ చేసే విధానంతో ఆయ‌న‌ను అంద‌రూ వైల్డ్ డాగ్ అని పిలుస్తుంటారు. అందుకే "హిమాల‌యాల్లో త‌న టీమ్‌తో వైల్డ్ డాగ్‌. స్వేచ్చ‌ను, ప్ర‌కృతిని ఇష్ట‌ప‌డుతున్నా" అని ట్వీట్ చేశారు నాగార్జున‌. ఇదివ‌ర‌కు అక్టోబ‌ర్ 23న మ‌నాలీకి వెళ్లిన ఆయ‌న అక్క‌డి ప్ర‌కృతి సౌంద‌ర్యానికి ఆయ‌న ప‌ర‌వ‌శించిపోయారు. ప్రేక్ష‌కుల‌తో ఆ ఆనందాన్ని ఓ వీడియో ద్వారా పంచుకున్నారు. "హాయ్‌.. ఇది రోహ్‌తంగ్ పాస్ (రోహ్‌తంగ్ క‌నుమ‌)లోని అంద‌మైన ఉద‌యం. స‌ముద్ర మ‌ట్టానికి మూడు వేల తొమ్మిది వంద‌ల ఎన‌భై మీట‌ర్ల ఎత్తులో ఉన్న ప్రాంతం. అంటే ప‌ద‌మూడు వేల అడుగుల ఎత్తు. ఇది చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన క‌నుమ‌. న‌వంబ‌ర్ నుంచి మే నెల వ‌ర‌కు దీన్ని మూసేస్తారు. 'వైల్డ్ డాగ్' షూటింగ్ కోసం ఇక్క‌డ‌కు వ‌చ్చాం. ఈ సినిమా షూటింగ్ చాలా బాగా జ‌రుగుతోంది. అంద‌మైన ప‌ర్వ‌తాలు, నీలాకాశం, జ‌ల‌పాతాలు.. ఇక్క‌డ ఉండ‌టం ఎంతో బాగుంది. ఏడు నెలల‌ త‌ర్వాత ఇటువంటి ప్లేస్‌కు రావ‌డం చాలా ఆనందంగా ఉంది. 21 రోజుల్లో షూటింగ్ పూర్త‌యిపోతుంది. ఆ త‌ర్వాత (హైద‌రాబాద్‌) వ‌చ్చేస్తాను. ల‌వ్ యు ఆల్‌. సీ యు." అంటూ ఉత్సాహంగా చెప్పారు నాగార్జున‌.
  క‌మెడియ‌న్‌, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సుహాస్‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ డెబ్యూ డైరెక్ట‌ర్ సందీప్ రాజ్ రూపొందించిన 'క‌ల‌ర్ ఫొటో' మూవీ ఇటీవ‌ల ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుద‌లై వీక్ష‌కాద‌ర‌ణ‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్నీ అమితంగా పొందుతోంది. 'హృద‌య కాలేయం', 'కొబ్బ‌రిమ‌ట్ట' చిత్రాల‌ను తీసిన సాయిరాజేశ్ నిర్మించిన ఈ సినిమాని ఇష్ట‌ప‌డుతున్న వారి జాబితాలో ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు కూడా చేరుతున్నారు. తాజాగా ఆ లిస్ట్‌లో సీనియ‌ర్ యాక్ట‌ర్ జ‌గ‌ప‌తిబాబు చేరారు. గురువారం త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా 'క‌ల‌ర్ ఫొటో'పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తూనే, ఇలాంటి చ‌క్క‌ని సినిమాల్లో త‌న‌ను ఎందుకు తీసుకోవ‌ట్లేద‌ని ఆవేద‌న కూడా వ్య‌క్తం చేశారు. "క‌ల‌ర్ ఫొటో న‌న్ను పూర్తిగా ఇంప్రెస్ చేసింది. సూప‌ర్ కిడ్ త‌న వ‌య‌సుతో పోలిస్తే గొప్ప‌గా ఈ సినిమాని తీశాడు. గుడ్ యాక్ట‌ర్ అయిన సుహాస్ హీరోగానూ ప్రూవ్ చేసుకున్నాడు. ఒక వ్య‌క్తిగా నేనెంతో ఇష్ట‌ప‌డే కాల‌భైర‌వ మ్యూజిక్‌లోని సెన్సిబిలిటీస్ న‌న్నెప్పుడూ ఇంప్రెస్ చేస్తుంటాయి. సినిమాని హిట్ చేసేవి డ‌బ్బులు (బ‌డ్జెట్‌), స్టార‌డ‌మ్ మాత్ర‌మే కాద‌ని.. సినిమా హిట్ట‌వ‌డానికి కావాల్సిన‌వి హృద‌యం, ఆత్మ అని మ‌రోసారి ప్రూవ్ అయినందుకు నాకు ఆనందంగా ఉంది." అని ఆయ‌న రాసుకొచ్చారు. క్రియేటివిటీ, నాచురాలిటీ విష‌యంలో కుర్రాళ్లు చాలా ముందుంటుండం చూస్తుంటే ఇక్క‌డ తానేం చేస్తున్నానో చూసుకొని ఎక్కువ‌సార్లు ఆశ్చ‌ర్య‌పోతుంటాన‌ని జ‌గ‌ప‌తిబాబు అన్నారు. "ఇలాంటి సినిమాల్లో భాగ‌మ‌వ‌డాన్ని నేను గ‌ర్వంగా ఫీల‌వుతాన‌ని చెప్తాను. బాధాక‌ర‌మైన విష‌య‌మేమంటే ఇలాంటి సినిమాల‌కు న‌న్ను తీసుకోరు.. నేను ఇలాంటివి చేయ‌న‌నుకుంటారో లేక నా రేటును భ‌రించ‌లేమ‌నుకుంటారో.. న‌న్ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు. ఆ రెండూ నిజం కావు కుర్రాళ్లూ.." అని త‌న బాధ‌ను వ్య‌క్తం చేశారు జ‌గ‌ప‌తిబాబు. ఆయ‌న మాట‌ల‌ను బ‌ట్టి 'క‌ల‌ర్ ఫొటో' మూవీ ఆయ‌న‌ను ఎంత‌గా ఇంప్రెస్ చేసిందో ఊహించుకోవ‌చ్చు. ఇప్పుడు ఆయ‌న వ్య‌క్తం చేసిన ఆవేద‌న‌ను, అభిప్రాయాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని మంచి మంచి కాన్సెప్టుల‌తో సినిమాలు తీసే యంగ్ డైరెక్ట‌ర్స్ ఆయ‌న‌ను త‌మ ప్రాజెక్టుల్లో భాగం చేస్తారో, లేదో చూడాలి.
  త‌మిళ న‌టుడు సిద్ధార్థ్ తెలుగు సినిమాల‌తో మ‌న ప్రేక్ష‌కుల‌కూ స‌న్నిహితుడ‌య్యాడు. ముఖ్యంగా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మ‌రిల్లు' సినిమాలు అత‌డికి ఎంత‌టి పేరు తెచ్చాయో మ‌న‌కు తెలుసు. జ‌బ‌ర్ద‌స్త్ సినిమా త‌ర్వాత అత‌ను మళ్లీ ఏ డైరెక్ట్ తెలుగు సినిమాలోనూ క‌నిపించ‌లేదు. ఇప్పుడు అజ‌య్ భూప‌తి డైరెక్ట్ చేస్తోన్న 'మ‌హాస‌ముద్రం' చిత్రంతో ఏడేళ్ల‌కు పైగా విరామంతో టాలీవుడ్‌కు వ‌స్తున్నాడు. ఇందులో శ‌ర్వానంద్‌తో అత‌ను స్క్రీన్‌ను పంచుకుంటున్నాడు. ఆ సినిమా షూటింగ్‌లోకి అడుగు పెట్ట‌డానికి ముందు ఓ వెబ్ సిరీస్ షూటింగ్‌ను ప్రారంభించాడు సిద్ధార్థ్‌. ఆ సిరీస్ పేరు 'ఎస్కేప్ లివ్‌'. హిందీలో రూపొందుతోన్న ఈ సిరీస్‌ను ఒన్ లైఫ్ స్టూడియోస్ బేన‌ర్‌పై సిద్ధార్థ్ కుమార్ తివారీ నిర్మిస్తున్నాడు. ముంబైలో అత‌నికి చెందిన స్టూడియోలోనూ దీని చిత్రీక‌ర‌ణ మొద‌లైంది. అభిషేక్ సేన్‌గుప్తాతో క‌లిసి సిద్ధార్థ్ కుమార్ దీనిని డైరెక్ట్ చేస్తున్నాడు. ఒక పాపుల‌ర్ లైవ్ స్ట్రీమింగ్ యాప్‌ను ఉప‌యోగించుకొని ఓవ‌ర్‌నైట్ స్టార్లు కావాల‌ని క‌ల‌లుకొనే ఐదుగురు వ్య‌క్తుల చుట్టూ ఈ సిరీస్ క‌థ న‌డుస్తుంది. 'మిర్జాపూర్' ఫేమ్ శ్వేతా త్రిపాఠి కూడా ఇందులో కీల‌క పాత్ర చేస్తోంది.
పగలు రాత్రి కూడా 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం పని చేస్తోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో హీరోలు ఇద్దరూ ఎన్టీఆర్, రామ్ చరణ్ షూటింగ్ చేస్తున్నారని... వాళ్ళు పాల్గొనగా సినిమాకి కీలకమైన యాక్షన్ సన్నివేశాలను దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఫైట్ సీన్స్ తీస్తున్నారన్నమాట. ఫైట్ అన్నాక కొట్టుకోవాలి. కొట్టుకున్నాక రక్తం వస్తుంది. అందుకోసం ఆర్టిఫీషియల్ రక్తాన్ని లీటర్లు లీటర్లు సిద్ధం చేస్తున్నారు. పగలు సెట్ వర్క్, చిన్న చిన్న ఆర్టిస్టుల మీద కొన్ని సీన్లు తీస్తున్నారట. మరికొన్ని రోజులు డే అండ్ నైట్ షూట్ జరుగుతుందని టాక్.  ఇటీవల సినిమా నుండి 'కొమురం భీమ్' పాత్రలో నటించిన ఎన్టీఆర్ టీజర్ విడుదల చేశారు. అందులో భీమ్ ను ముస్లింగా చూపించడంపై విమర్శలు వచ్చాయి. ఆదివాసీలు, చరిత్రకారుల నుండి పలువురు రాజకీయ నాయకులు రాజమౌళి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే... ముస్లిం గెటప్ కి, భీమ్ పాత్రకి సంబంధం లేదని 'ఆర్ఆర్ఆర్' యూనిట్ చెబుతోంది.
కాజల్ అగర్వాల్ ఇంట పెళ్లి భాజాలు మోగాయి. కాజల్ పెళ్లి సందడి షురూ అయ్యింది. ఈ రోజు మెహందీ ఫంక్షన్ జరిగింది. చేతికి గోరింటాకు పెట్టుకున్న ఫొటోను కాజల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. #kajgautkitched అని ఓ హ్యాష్ ట్యాగ్ యాడ్ చేశారు. సాధారణంగా పెళ్లి సందర్భంలో 'hitched' అని హ్యాష్ ట్యాగ్ పోస్ట్ చేశారు. గౌతమ్ ఇంటి పేరు కిచ్లు కావడంతో 'kitched' అని కాజల్ ట్విస్ట్ ఇచ్చినట్టు ఉన్నారు.    కాజల్ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశారో లేదో... వెంటనే శుభాకాంక్షల వెల్లువ మొదలైంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది 'లవ్' ఎమోజి కామెంట్ చేశారు. ఐదు గంటల్లో ఫొటోని సుమారు ఆరున్నర లక్షలమంది లైక్ చేశారు. రేపు కాజల్, గౌతమ్ వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. 
  మాజీ మిస్ ఇండియా దియా మీర్జా ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి రెండు ద‌శాబ్దాలు గ‌డిచాయి. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ రేంజి దాకా వ‌చ్చి, అంగుళం దూరంలో ఆగిపోయింది. అయిన‌ప్ప‌టికీ మంచి మంచి పాత్ర‌ల‌తో అభిమానుల‌ను అల‌రిస్తూనే వ‌స్తోంది. ఇప్పుడామె వ‌య‌సు 38 సంవ‌త్స‌రాలు. 20 ఏళ్లుగా తెలుగు చిత్ర‌సీమ‌కు రాని ఆమె, ఇప్పుడు తొలిసారి నాగ్ స‌ర‌స‌న 'వైల్డ్ డాగ్‌'లో న‌టిస్తుండ‌టం ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు త్వ‌ర‌లో రానున్న‌ది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని మ‌నాలీ ప్రాంతంలో జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. కాగా గురువారం దియా త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన పిక్చ‌ర్ ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకుంటోంది. అది ఆమె ప్రైమ‌రీ స్కూల్ రోజుల నాటి ఫొటో. చుడీదార్ డ్ర‌స్‌, భుజాన షోల్డ‌ర్ బ్యాగ్‌, కాళ్ల‌కు సాధార‌ణ స్లిప్ప‌ర్స్ వేసుకొని అతి మామూలు అమ్మాయిలా ఆ ఫొటో క‌నిపిస్తోంది దియా. ఆ ఫొటోతో పాటు త‌న ఫీలింగ్స్‌ను కూడా ఆమె పంచుకుంది. "నా బాల్యానికి సంబంధించి నేనేం చెబుతాను? ఆ స‌మ‌యంలో మ‌న‌కు తెలీదు కానీ, యూనివ‌ర్స్ టైమింగ్ ఎప్పుడూ క‌చ్చితంగానే ఉంటుంది. మీ బాల్యానికి సంబంధించి మీరేం చెబుతారు?" అని ప్ర‌శ్నించింది దియా. వ్యాపార‌వేత్త సాహిల్ సంఘాతో ఐదేళ్ల కాపురం త‌ర్వాత 2019 ఆగ‌స్ట్‌లో అత‌ని నుంచి విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిది దియా.
విజయవంతమైన చిత్రాలకు చిరునామాగా ‘దిల్‌’ రాజును పేర్కొంటారంతా! అయితే... ఆయన సంస్థ నుండి విడుదలైన కొన్ని చిత్రాలు పరాజయం పాలయ్యాయి. అందులో రెండేళ్ల క్రితం వచ్చిన ‘లవర్‌’ ఒకటి. ఆ చిత్రానికి అనీష్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. అంతకు ముందు అతడు ‘అలా ఎలా?’ అనే సినిమా తీశాడు. రాహుల్‌ రవీంద్రన్‌, ‘వెన్నెల’ కిషోర్‌, షానీ సాల్మన్‌ హీరోలుగా నటించారు. లో బడ్జెట్‌తో తీసిన ఆ సినిమా ఎటువంటి అంచనాలు లేనప్పటికీ మంచి విజయం సాధించింది. అయితే, అనీష్‌ కృష్ణ రెండో సినిమా డిజప్పాయింట్‌ చేసింది. ఫ్లాప్‌గా నిలిచింది. ఈ విషయాన్ని దర్శకుడు ఒప్పుకున్నాడు. నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో బుధవారం కొత్త సినిమా ఒకటి పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయింది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన అనీష్‌ కృష్ణ... ‘‘నా ఫస్ట్‌ ఫిల్మ్‌ ‘అలా ఎలా?’తో ఆడియన్స్‌ని ఎంటర్టైన్‌ చేశా. సెకండ్‌ ఫిల్మ్‌తో డిజప్పాయింట్‌ చేశా. ఈసారి తప్పకుండా ఎంటర్టైన్‌ చేస్తా. నా స్టైల్‌ ఆఫ్‌ జానర్‌ ఫిల్మ్‌ ఇది’’ అని అన్నారు. సాధారణంగా ఫ్లాప్‌ సినిమాల గురించి ప్రస్తావన  ఎవరూ తీసుకురారు. అందుకని, అతడి నిజాయతీకి హ్యాట్సాఫ్‌ చెప్పాలి. నాగశౌర్యతో తనకు కమాండ్‌ ఉన్న కామెడీ జానర్‌లో అనీష్‌ కృష్ణ సినిమా తీస్తున్నారట. డిసెంబర్‌ నుండి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది.
  స్వ‌యంకృషితో మెగాస్టార్‌గా ఎదిగారు చిరంజీవి. 1980ల తొలినాళ్ల వ‌ర‌కు ఆయ‌న ఒక చిన్న న‌టుడు మాత్ర‌మే. 1983లో 'ఖైదీ' వ‌చ్చిన త‌ర్వాత స్టార్ స్టేట‌స్ తెచ్చుకున్న ఆయ‌న అచిర కాలంలోనే టాలీవుడ్‌లో నంబ‌ర్‌వ‌న్ స్టార్‌గా మారారు. అశేష అభిమాన గ‌ణాన్ని సంపాదించుకున్నారు. ఇవాళ మెగా కాంపౌండ్ అని ఫిల్మ్‌న‌గ‌ర్ జ‌నాలు కానీ, మీడియా కానీ, ప్రేక్ష‌కులు కానీ పిలుచుకొనే స్థాయికి ఆయ‌న కుటుంబం ఎదిగింది. ఆయ‌న త‌మ్ముళ్లు నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఆయ‌న వార‌స‌త్వాన్ని అందుకొని న‌టుల‌య్యారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ అయితే అన్న‌కు త‌గ్గ త‌మ్ముడిగా అమేయ‌మైన ఇమేజ్‌ను అభిమానుల్లో సంపాదించుకున్నారు. మొత్తానికి ఆ ముగ్గురు మెగా బ్ర‌ద‌ర్స్‌గా పేరు తెచ్చుకున్నారు. నాగ‌బాబు న‌టునిగా స్టార్ కాలేక‌పోయినా, ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు వ‌రుణ్‌తేజ్ ఆ లోటును పూడ్చే దిశ‌గా దూసుకుపోతున్నాడు. 'ఎఫ్ 2', 'గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్' సినిమాల‌తో త‌న‌లోని విల‌క్ష‌ణత్వాన్ని ప్ర‌ద‌ర్శించి అంద‌రి ప్ర‌శంస‌లూ పొందాడు. నాగ‌బాబు నిర్మాత‌గా ఎదురుదెబ్బ‌లు తిన్నారు. 'ఆరెంజ్' సినిమాతో ఆయ‌న అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అప్పుడు అన్న‌ద‌మ్ములే ఆయ‌న‌కు అండ‌గా నిలిచారు. చిరంజీవికి త‌మ్ముళ్లంటే ఎక్క‌డ‌లేని ఆపేక్ష‌. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ది మొద‌ట్నుంచీ స్వతంత్ర మ‌న‌స్త‌త్వం కావ‌డం వ‌ల్ల‌, సైద్ధాంతికంగా చిరంజీవితో ఆయ‌న‌కు విభేదిస్తుంటాడ‌ని ఇండ‌స్ట్రీలో చెప్పుకుంటూ ఉంటారు. కానీ నాగ‌బాబు అలా కాదు.. అన్న‌య్య మాట‌ల‌కు అత్యంత విలువ‌నిస్తుంటారు. చిరంజీవి అనే వ్య‌క్తి లేక‌పోతే తామ‌స‌లు ఈ స్థాయిలో ఉండేవాళ్ల‌మే కాద‌నీ, ఇవాళ ఇండ‌స్ట్రీలో పేరుపొందిన కుటుంబంగా ఉన్నామంటే అది అన్న‌య్య చ‌ల‌వేన‌ని విన‌మ్రంగా చెబుతుంటారు నాగ‌బాబు. పెద్ద త‌మ్ముడంటే చిరుకూ అమిత‌మైన ప్రేమ‌. త‌మ్ముని కుమార్తె నిహారిక‌కు పెళ్లి సంబంధం కుదిర్చింది కూడా ఆయ‌నే. గురువారం నాగ‌బాబు పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా త‌న ప్రేమ‌ను సోష‌ల్ మీడియా హ్యాండిల్ ద్వారా వ్య‌క్తం చేశారు చిరంజీవి. ఇద్ద‌రు త‌మ్ముళ్ల‌తో త‌ను ఉన్న పిక్చ‌ర్‌ను షేర్ చేసిన ఆయ‌న‌, "Happy Birthday to my passionately loyal, emotional, kind hearted and fun loving brother @NagaBabuOffl. Have a great year ahead! మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని, నీ ప్రతి పుట్టినరోజుకి అది మరింత బలపడాలని ఆశిస్తున్నాను!" అంటూ రాసుకొచ్చారు. నిజ‌మే.. వారి బంధం రోజులు గ‌డిచేకొద్దీ పెరుగుతూ వ‌స్తోందే కానీ ర‌వ్వంత కూడా త‌ర‌గ‌డం లేదు.
తెలంగాణ రాజకీయలను షేక్ చేస్తున్న దుబ్బాక ఉప ఎన్నిక ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఉప ఎన్నిక సందర్భంగా దుబ్బాక, సిద్దిపేటలో జరిగిన, జరుగుతున్న పరిణామాలపై కేంద్రం  సీరియస్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. లోకల్ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఫిర్యాదుల మీద ఫిర్యాదులు రావడం, బీజేపీ హైకమాండ్ కూడా ఫోకస్ చేయడంతో  దుబ్బాక ఉప ఎన్నిక విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దుబ్బాక నియోజకవర్గానికి కేంద్ర బలగాలను పంపించింది. ఉప ఎన్నిక కోసం వచ్చిన కేంద్ర బలగాలు దుబ్బాక నియోజకవర్గ వీధుల్లో  ఇప్పుడు కవాతు చేస్తున్నాయి. ఉప ఎన్నికను పర్యవేక్షించేందుకు  ప్రత్యేక పరిశీలకుడిని కూడా నియమించింది సీఈసీ.  ఒక రాష్ట్రంలో జరుగుతున్న ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం కేంద్ర బలగాలను మోహరించాల్సి వచ్చిందంటే దుబ్బాకలో పరిస్థితి ఏ రెేంజ్ లో ఉందో ఊహించవచ్చు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో , తెలంగాణలో కూడా చాలా ఉప ఎన్నికలు జరిగాయి. కాని ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదు. దుబ్బాక ఉప ఎన్నిక మాత్రం పొలిటికల్ హీట్ పెంచుతోంది. అన్ని పార్టీలు ఎన్నికలను సవాల్ గా తీసుకోవడం, ఎలాగైనా గెలిచేందుకు వ్యూహాలు రచిస్తుండటంతో రోజు రోజుకు నియోజకవర్గంలో సమీకరణలు మారిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న ప్రచారం అధికార పార్టీని కలవరపెడుతున్నట్లు కనిపిస్తోంది. ఉప ఎన్నికలో ఓడితే పరువు పోతుందన్న భయంతో టీఆర్ఎస్ పార్టీ దుబ్బాకలో అక్రమాలకు పాల్పడుతుందని విపక్షాలు చేస్తున్న ఆందోళనలు నియోజకవర్గంలో కాక రేపుతున్నాయి.  దుబ్బాక ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచేందుకు టీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతుందని బీజేపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. తమ పార్టీ నేతలపై పోలీసులతో నిఘా పెట్టించిందని, భయబ్రాంతులకు గురి చేస్తోందని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే రఘునందన్ రావు బంధువుల ఇండ్లలో పోలీసులు సోదాలు చేయడం తీవ్ర దుమారం రేపింది. మంత్రి హరీష్ రావు డైరెక్షన్ లో పోలీసులే  రఘునందన్ రావు ఇంట్లో డబ్బులు పెట్టారని బీజేపీ ఆరోపించగా.. ఆ ఇంట్లోనే డబ్బులు దొరికాయంటూ సిద్ధిపేట సీపీ వీడియో ఫూటేజీని విడుదల చేశారు. ఇక సిద్ధిపేట సోదాల ఘటనపై బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమించింది. సిద్ధిపేటకు వస్తున్న పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేయడం ఉద్రిక్తతను మరింత పెంచింది. తనపై సిద్ధిపేట పోలీసులు దాడి చేశారని ఆరోపించిన సంజయ్.. ఆయన్ను సస్పెండ్ చేయాలంటూ ఏకంగా దీక్షకే దిగారు.  బీజేపీ అభ్యర్ది రఘునందన్ రావు మామ, బంధువుల ఇంటిపై పోలీసుల సోదాలు, బంజి సంజయ్ పై పోలీసుల దురుసు ప్రవర్తనను బీజేపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుందని తెలుస్తోంది. దుబ్బాక లో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ పెద్దలు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని సమాచారం.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, దుబ్బాక పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు కు ఫోన్ చేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది సిద్ధిపేట, దుబ్బాక ఘటనలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని చెప్పారు. స్థానిక పోలీస్ అధికారులపై తమకు నమ్మకం లేదన్నారు.  సిద్ధిపేట్ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని, కేంద్ర బలగాలతో మాత్రమే దుబ్బాక ఉప ఎన్నికలు జరపాలని కోరారు. బీజేపీ నాయకులను పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తోన్న విషయాన్ని ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకెళ్ళారు కమలం నేతలు.  దుబ్బాకకు  ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని బీజేపీ ఈసీకి విన్నవించింది. రాష్ట్ర ప్రభుత్వంపై వస్తున్న ఫిర్యాదుల మీద  ఫిర్యాదులు, బీజేపీ పెద్దల జోక్యంతోనే  సరోజ్‌ కుమార్‌ ఠాకూర్‌ను ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం నియమించినట్లు తెలుస్తోంది.  తమిళనాడు కేడర్‌కు చెందిన సరోజ్‌ కుమార్‌.. ప్రస్తుతం చెన్నై సైబర్‌క్రైం విభాగ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది పశ్చిమబెంగాల్‌ ఉప ఎన్నికల పరిశీలకుడిగా పనిచేసిన సరోజ్‌కుమార్‌.. సమర్థంగా ఎన్నికలను నిర్వహించినందుకుగాను అవార్డు కూడా తీసుకున్నారు. ఉప ఎన్నికకు శాంతి భద్రతల పరిశీలకుడిగా సరోజ్‌ కుమార్‌ ఠాగూర్‌ను నియమించడాన్ని  బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ  బండి సంజయ్‌ కుమార్‌ స్వాగతించారు. ఉప ఎన్నికలో గెలుపు కోసం లోకల్ పోలీసులను అడ్డు పెట్టుకుని అడ్డదారులు తొక్కుతున్న కారు పార్టీ ఆగడాలు ఇకపై సాగవన్నారు సంజయ్. ఎన్నికల నిర్వహణలో సమర్థుడిగా పేరున్న సరోజ్ కుమార్ నియామకంలో దుబ్బాకలో అధికార పార్టీ అక్రమాలకు చెక్ పడుతుందని కమలం నేతలు చెబుతున్నారు.  దుబ్బాక ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో  గొడవలు జరిగే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. పోలింగ్ రోజున ఉద్రిక్తతలు తలెత్తవచ్చని భావిస్తున్నారు. అందుకే నియోజకవర్గంలో సమస్యాత్మక గ్రామాల్లో మరిన్ని బలగాలను మోహరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. మొత్తంగా  ఉపఎన్నిక పర్యవేక్షణకు ప్రత్యేక పరిశీలకుడిని నియమించడం,  కేంద్ర బలగాలను దించడంతో  దుబ్బాక నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది. గతంలో ఎప్పుడు లేనంతగా హీటెక్కిస్తున్న దుబ్బాకలో ఏం జరగబోతుందన్న దానిపై రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామాలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. గుర్తింపు పొందిన అన్ని పార్టీలకు ఎన్నికల సంఘం ఆహ్వానం పంపింది. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీల అభిప్రాయాలు, సూచనలను ఎన్నికల సంఘం తీసుకోనుంది. అయితే ఈ సమావేశానికి హాజరు కావడం లేదని అధికార వైసీపీ ప్రకటించింది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేసినప్పుడు ఎస్ఈసీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన వైసీపీ.. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నా సహకరించకపోవడం విమర్శలకు తావిస్తోంది.    కరోనా ప్రభావం ఉన్నా గతంలో స్థానిక ఎన్నికలు జరపాలని పట్టుబట్టిన జగన్ సర్కార్.. ఇప్పుడు మాట మార్చడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ ప్రభుత్వ స్పందన రాజకీయ, న్యాయవర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కరోనాతో దేశం మొత్తం లాక్ డౌన్ విధించేసినా స్థానిక ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని పట్టుబట్టింది వైసీపీ సర్కార్. ఎన్నికలను వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై ఫైరయ్యారు సీఎం జగన్. మంత్రులు, వైసీపీ నేతలైతే ఆయన్ను దారణంగా టార్గెట్ చేశారు. ఎన్నికల కమిషనర్ గా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నిమ్మగడ్డను వ్యక్తిగతంగా దూషించారు. ఎస్‌ఈసీని కూడా తొలగించి రచ్చ రచ్చ చేసింది ప్రభుత్వం. కొత్త ఎన్నికల కమిషనర్ ను కూడా హడావుడిగా నియమించింది. అయితే ప్రభుత్వ చర్యలపై హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్. నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయంపై నానా రభస చేసిన జగన్ సర్కార్.. ఇప్పుడు ఎన్నికలు నిర్వహణకు వ్యతిరేకిస్తుండటంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది.   ప్రస్తుతం దేశం కరోనా భయం నుంచి బయటపడుతోంది. ఏపీలో కూడా లాక్ డౌన్ ఎత్తేశారు. బీహార్ సహా అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అయినా స్థానిక ఎన్నికలకు అధికార పార్టీ ఆసక్తి చూపడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత కాలం నిర్వహించకూడదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తోంది. వచ్చే మార్చి వరకూ.. ఎస్‌ఈసీ పదవీ కాలం ఉంది. ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించి.. అ దిశగానే జగన్ సర్కార్ కార్యాకరణ రూపొందించిందని తెలుస్తోంది.   మరోవైపు విపక్షాలు మాత్రం స్థానిక ఎన్నికలకు వైసీపీ భయపడుతుందని ఆరోపిస్తున్నాయి. మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వం చేస్తున్న తతంగంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని టీడీపీ ఆరోపిస్తోంది. జగన్ సర్కార్ నిర్ణయాలతో రాష్ట్రానికి పెట్టుబడులు ఆగిపోయాయని, గతంలో వచ్చిన కంపెనీలు వెనక్కి వెళ్లాయని, అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని చెబుతోంది. ఇటీవల వచ్చిన వరదల్లో నష్టపోయిన బాధితులకు సాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. సర్కార్ నిర్లక్ష్యం వల్లే కరోనా కేసుల్లో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో నిలిచిందనే విమర్శలు కొన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడం వల్లే స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార పార్టీ భయపడుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.    ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను మార్చిలో నిర్వహించాలని గతంలో నిర్ణయించారు. నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. అయితే దేశంలో కరోనా కేసులు నమోదు కావడంతో అంతటా భయాందోళన నెలకొంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. అయితే ఒక్కసారి ఎన్నికల ప్రక్రియ ఆగిపోతే.. తిరిగి ఈ ప్రక్రియను ప్రారంభించాలంటే రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలను తీసుకుని ఆ ప్రకారం ముందుకు వెళ్లాలని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని వైసీపీ చెబుతోంది. ఎస్‌ఈసీ మాత్రం ఎన్నికల నిర్వహణపై చీఫ్‌ సెక్రటరీ గాని, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సెక్రటరీ గాని సంప్రదించలేదని ఆరోపిస్తోంది. ప్రభుత్వ అభిప్రాయంతో సంబంధం లేకుండా  రాజకీయపార్టీలను పిలవటంలోనే... ఎస్‌ఈసీకి వేరే ఉద్దేశాలు ఉన్నాయని స్పష్టమవుతుందని చెబుతోంది వైసీపీ. ఎన్నికల నిర్వహణను ఒక పవిత్ర మైన రాజ్యాంగ కర్తవ్యంగా కాకుండా ఒక డ్రామాగా నిమ్మగడ్డ భావిస్తున్నారని ఆరోపిస్తోంది వైసీపీ   మరోవైపు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కీలక  వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. ఎన్నికలు నిర్వహించేలా ఈసీకి సహకరించాలని ప్రభుత్వానికి సూచించింది. ఎన్నికల నిర్వహణపై తమను ఎన్నికల కమిషన్ సంప్రదించాలన్న ప్రభుత్వ వాదనలను హైకోర్టు తప్పుపట్టింది. ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఓ రాజ్యాంగ సంస్థ అడగాలా? అని ప్రశ్నించింది.ఏయే చోట్ల ప్రభుత్వం సరిగ్గా సహకరించడం లేదో.. అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది హైకోర్టు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న దానిపై ప్రజ్లలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఎల్వీ-ఏబీవీకే దిక్కులేదు   ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ను.. తన సముఖానికి రమ్మని సీఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్  హుకుం జారీచేశారట. దానిపై నిమ్మగడ్డ వారు ఆగ్రహోదగ్రుడయి.. నా అంత ప్రముఖుడినే భేటీకి రమ్మంటారా? మీ సంగతి కోర్టులో తేలుస్తానని అగ్గిరాముడయ్యారట. ఇది ఇప్పుడు మీడియాకు పెద్ద వార్త. దానిపై బోలెడన్ని విశ్లేషణలు!   ఐఏఎస్ చదివిన నిమ్మగడ్డ వారు కూడా, మామూలు పామరుల మాదిరిగా ఆలోచించడమే హాశ్చర్యం. నిమ్మగడ్డ రమేషుల వారు రాష్ట్ర ఎన్నికల కమిషనరే  కావచ్చు. పూర్వాశ్రమంలో పెద్ద పెద్ద హోదాల్లో పనిచేసి ఉండవచ్చు. గవర్నర్‌కే సలహా ఇచ్చేంత మేధావి కావచ్చు. కానీ అవన్నీ మా ప్రవీణ్ ప్రకాష్ ముందు జాన్తానై! సారు చిన్నప్పటి నుంచీ అంతే! ఆయన దగ్గర ఉత్తరాది పప్పులు తప్ప, మరెవరి పప్పులూ ఉడకవు. అందుకే ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు పోస్టింగు పోయిన సతీష్ చంద్ర మాత్రమే మళ్లీ పోస్టింగు తెచ్చుకోగలిగారు మరి. అందుకే ఆయన దగ్గర తెలుగువాళ్ల పప్పులుడకవు. జగన్ ఉండగనే, జగన్ అంశలో పుట్టిన మరో జగన్ ఆయన! కాబట్టి.. నిమ్మగడ్డే కాదు.. ఏ గడ్డయినా ప్రవీణుల వారి కచేరీకి,  కాకితో కబురంపితే, రెక్కలు కట్టుకుని వాలిపోవాల్సిందే. దట్సాల్!   నిమ్మగడ్డదేముంది? బూతుల మంత్రి కొడాలి నాని చెప్పినట్లు, వచ్చే ఏడాది రిటైరయి, హైదరాబాద్ వెళ్లిపోతారు. కానీ ప్రవీణ్ ప్రకాష్ మాత్రం లోకల్. ఐదేళ్లూ ‘జగన్నా’ధుడి ఆలయంలోనే కొలువయి ఉంటారు. అయినా పెద్ద పెద్ద ఐఏఎస్, ఐపిఎస్సులే ప్రకాష్ ప్రావీణ్యానికి సలాములు కొట్టి గులాములవుతుంటే, వచ్చే ఏడాది రిటైరయ్యే నిమ్మగడ్డ గోడు వినిపించుకునేదెవరు? ప్రవీణేదో ముచ్చటపడి, ఆ ఎలక్షన్ వ్యవహారాలపై మాట్లాడాలి రమ్మని పిలిచారనుకోండి. వెళ్లి కాసేపు సారు చెప్పింది విని, ఇస్తే.. టీ తాగి రెండు బిస్కట్లు తిని, జీ హుజూరని వచ్చేస్తే పోయేది.   అలాకాకుండా..  అంత పెద్ద మనిషిని, అంతలావు అధికారాలున్న అధికారిని, సీఎంనే ఖాతరు చేయనవసరం లేని రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నన్నే రమ్మంటారా? హమ్మా? మీకెన్ని గుండెలు.. అసలు మీది గుండెనా? పోలవరం ప్రాజెక్టా అని,  సత్తెకాలపు చాదస్తాలకు వెళ్లి, ఆ విషయాన్ని ‘మిత్రమీడియా’కు లీకు చేయడం పిచ్చితనం కాక మరేమిటి? ఈ 17 నెలల కాలంలో,  జగనన్న తత్వం అర్ధం చేసుకోకపోవడమే నిమ్మగడ్డ తప్పు. బహుశా చాలా పథకాలకు జగనన్న పేరు పెట్టిన సర్కారు.. కేవలం ప్రభుత్వ ఉద్యోగుల కోసమే ‘జగనన్న తత్వం’ అనే పథకం పెట్టి ఉంటే, అధికారులకు ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో?!   నిమ్మగడ్డ వారి ఆవేదన అర్ధం చేసుకోదగ్గదే. ఆఫ్టరాల్ సీఎం ముఖ్య కార్యదర్శి నన్ను పిలవటమేమిటన్నది, ఆయన అంతరంగం పడుతున్న ఆవేద న కావచ్చు. కానీ, నిమ్మగడ్డ వారు కొలువు చేస్తోంది ఏపీలో అని  గుర్తుంచుకోవాలి. క్రికెట్ గ్రౌండ్‌లో కబడ్డీ ఆడకూడదు. కాదని కబడ్డీ ఆడితే ఫలితాలు ఇలాగే ఉంటాయి. అయినా.. ‘నన్నే పిలుస్తారా’ అని తెగ ఇదయిపోతున్న నిమ్మగడ్డను చూస్తే జాలి వేస్తుంది. తాను చెప్పింది చేయకుండా తల అడ్డంగా ఆడించిన, అంత పెద్ద చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యాన్నే శంకరిగిమాన్యాలు పట్టించారు. కోర్టుకెక్కి, తన ఉద్యోగం తనకివ్వాలని ఆదేశాలు తెచ్చుకున్న, డిజిపి స్థాయి సీనియర్ ఐపిఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకే ఇప్పటిదాకా, పోస్టింగు ఇవ్వకుండా చుక్కలు చూపిస్తున్నారు. కోర్టుకెళ్లిన తర్వాత ఇస్తున్న సగం జీతానికీ కత్తెర వేశారు.  మొన్నామధ్య ఓ సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటే, అంతకంటే ముందే అదే వేధింపులకు గురయి..  మరో మహిళా అధికారి చనిపోతేనే,  ఇదేమిటని అడిగే దిక్కు-దమ్ము లేదు. నిజాయితీ గల అధికారిగా పేరుండి, పెద్దాయన వైఎస్ దగ్గర కార్యదర్శిగా పనిచేసిన మాదిరెడ్డి ప్రతాప్‌ను వెళ్లగొట్టినా ఇదేం అన్యాయమని అడిగే నాధుడు లేడు.  పేరుకు ఐఏఎస్-ఐపిఎస్ అసోసియేషన్లు ఉన్నా, అవి లెటర్‌హెడ్ సంఘాలే.   మరి అంతలావు సీనియర్లే..   ప్రకాష్  ప్రావీణ్యంతో విలవిల్లాడుతుంటే, మరికొద్ది నెలల్లో రిటైరయ్యే ఈ నిమ్మగడ్డేమిటి? తన ముందు తోకాడిస్తున్నారని పెద్ద సారుకు కోపం రాదూ? మిగిలిన అధికారుల మాదిరిగా..  ఏదో వచ్చామా?.. విన్నామా?.. చెప్పిన చోట చెప్పినట్లు సంతకం చేశామా?.. వెళ్లామా?.. నెల జీతం తీసుకుంటున్నామా? అని వచ్చిన పని చూసుకుని వెళ్లకుండా,  ఇలా ఎదురు ప్రశ్నలు వేస్తే.. ‘జగన్నా’ధ ఆలయంలోని ప్రధానార్చాకులు, అర్చకులకు ఒళ్లు మండిపోదూ?.. హేమిటో ఈ అధికారులు ఎప్పుడు నేర్చుకుంటారో? ఏమో?! -మార్తి సుబ్రహ్మణ్యం 
‘అమరావతి అవమానం’ మోదీదా? బీజేపీదా?   బీజేపీ-టీడీపీ భాగస్వాములే   బాబు జాగే కొంప ముంచింది   కులం కోణంలో జగన్ నిర్ణయాలు   అనాధగా మారిన అమరావతి   కడకు దిక్కయిన కోర్టులు   విభజన నుంచి ఇప్పటివరకూ.. దేశంలో  రాజధాని నగరం లేని, ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధిలో పురోగమిస్తుంటే, ఏపీ మాత్రం అనాధగా దిక్కులు చూస్తున్న విషాదం. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ,  అక్కడి రైతులు చేస్తున్న ఉద్యమానికి మూడొందల రోజులు దాటిపోయాయి. నాటి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు, సుప్రీంకోర్టు-హైకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో.. అమరావతిలో భూమి పూజ చేసిన ప్రాంతం ఇప్పుడు శ్మశానాన్ని తలపిస్తోంది.  సీఎం జగన్మోహన్‌రెడ్డి అమరావతిని కులం కోణంలో చూసి, ‘మూడు ముక్కలాట’కు తెరలేపడమే.. ఈ విషాదానికి అసలు కారణమన్నది బహిరంగ రహస్యం. ఒక్క జగన్మోహన్‌రెడ్డి మాత్రమే కాదు.. అటు బీజేపీ, ఇటు టీడీపీ.. అంతా కలసి, అమరావతిని అనాధను చేశారన్నది ఇప్పుడు వినిపిస్తున్న ఆరోపణ.   విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. శివరామకృష్ణన్ కమిటీ, దాని పర్యటనలు, ప్రజాభిప్రాయసేకరణ, దొనకొండలో రాజధానిని పెట్టాలని కొందరు, నూజివీడు అయితే బాగుంటుందని మరికొందరి సూచనల తర్వాత.. నాటి సీఎం చంద్రబాబు నాయుడు ‘నారాయణ కమిటీ’ని తెరపైకి తీసుకువచ్చారు. కసరత్తులన్నీ పూర్తయ్యాక, అమరావతిని రాజధానిగా తేల్చారు. దానికోసం 32 వేల ఎకరాలు ఇచ్చేందుకు రైతులు ముందుకొచ్చారు. వారిచ్చిన భూమునే పెట్టుబడిగా పెట్టి, మరికొంత కేంద్రసాయంతో రాజధాని నగరాన్ని నిర్మిస్తామని బాబు ప్రకటించారు. ఆ మేరకు రైతులకు కౌలుతోపాటు, కమర్షియల్ ప్లాట్లను కూడా ఇచ్చారు. కేంద్రం కూడా 7 వేల కోట్ల నిధులిచ్చిందని, ఆ డబ్బెక్కడికి పోయిందని సోము వీర్రాజు కొంతకాలం నుంచీ ప్రశ్నిస్తున్నారు. కానీ, అప్పటి సర్కారులో బీజేపీ కూడా భాగస్వామి అన్న వాస్తవాన్ని వీర్రాజు విస్మరించడం ఆశ్చర్యం.   జగన్మోహన్‌రెడ్డి సీఎం అయిన తర్వాత, మూడు రాజధానులకు తెరలేపడంతో,  అమరావతి కథ అర్ధంతరంగా ఆగిపోయింది. అక్కడ కమ్మ వర్గానికి చెందిన వారి భూములే.. ఎక్కువగా ఉన్నాయన్న అనుమానంతోనే, జగన్మోహన్‌రెడ్డి చూపు.. అమరావతి నుంచి విశాఖకు మళ్లింది. నాడు అక్కడ శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ, ఇప్పుడు మౌనమునిగా మారారు. అమరావతిపై మీడియాలో మాట్లాడవద్దని బీజేపీ నాయకత్వం, నేతలకు లక్ష్మణరేఖ గీసింది. అధికారంలో ఉన్నప్పుడు మీనమేషాలు, తాత్కాలిక కట్టడాలతో పేరుతో పబ్లిసీటీ చేసుకున్న చంద్రబాబు..  చేతులుకాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు.. ఇప్పుడు అమరావతి జపం చేస్తున్నారు. ఆ రకంగా అంతా కలసి, అమరావతిని అనాధను చేశారు. అందుకే ఈ పాపం అందరిన్నది ఆంధ్రుల ఆరోపణ.   పాపం అమరావతి! నిలువెత్తు బుద్దవిగ్రహం సాక్షిగా, ఇప్పుడు అమరావతికి భూములిచ్చిన రైతులు.. మంత్రులతో అమ్మనాబూతులు తిట్టించుకుంటున్నారు. ధర్మాన కృష్ణదాస్‌అనే మంత్రి, రైతులను లం.. కొడుకులంటారు. మరికొందరు మంత్రులు పెయిడ్ ఆర్టిస్టులంటారు. ఇంకొందరు మంత్రులు, టీ షర్టులేసుకుని ఉద్యమాలు చేస్తున్నారంటారు.  మరికొందరు అది ‘కమ్మ’రావతి అని వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తారు. స్పీకర్ లాంటి వ్యక్తి దానిని ఎడారి, శ్మశానంతో పోలుస్తారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు, వాటిని భరిస్తూ, సహిస్తూ, జైళ్లకు వెళ్లినా.. తమ ఉద్యమాన్ని 300 రోజులు దాటించారు. ప్రస్తుతం రాజకీయ పార్టీల పాపం పుణ్యాన, అనాధగా మారిన అమరావతి.. న్యాయం కోసం న్యాయస్థానం వైపు రోడ్డుకు మోకాళ్లు ఆనించి, దీనంగా చూస్తోంది.   మోదీ ప్రధాని హోదాలో వచ్చి శంకుస్థాపన చేశారు. ఢిల్లీని మించిన రాజధానిగా మారాలన్నారు. ఢిల్లీ కూడా చిన్నబోయేలా కొత్త నగరం ఉండాలన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ రాజధాని నగరాలను, సందర్శించమని సలహా కూడా ఇచ్చారు. మేం మీ వెంట ఉన్నామని భరోసా ఇచ్చారు.  కాబట్టి బీజేపీ అమరావతి నగరాన్ని,  వాయువేగంతో నిర్మిస్తుందని భావించారు. ఆ తర్వాత అక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు భూములు కూడా కేటాయించారు. దానితో ఇంకేముంది? అమరావతి నగర నిర్మాణం, పంచకల్యాణి గుర్రంలా పరుగులు పెడుతుందనుకున్నారు.  కానీ చంద్రబాబుతో దొస్తీ చెడటంతో, బీజేపీ తీరు కూడా మారింది. దానికితోడు నిర్మాణాల తాలూకు డీపీఆర్ కూడా కేంద్రానికి ఇవ్వలేదు. అప్పటికీ కన్నా లక్ష్మీనారాయణ హయాంలో అమరావతికి అనుకూలంగానే తీర్మానించారు. ఆయన కూడా రైతులతో కలసి ధర్నా నిర్వహించారు. మౌనదీక్ష నిర్వహించారు. ఇప్పుడు పరిస్థితి అందుకు రివర్సు. బీజేపీలో అమరావతి గురించి ఎవరు మాట్లాడితే, వారిపై వేటు వేస్తున్నారు.   ఈలోగా.. ఒక జీవీఎల్, ఇంకో సోము, ఇప్పుడు విష్ణువర్దన్‌రెడ్డి రూపంలో వెలువడిన అపశకునాల బట్టి, అమరావతికి కమలం పార్టీ కూడా శల్యసారథ్యం వహిస్తోందని స్పష్టమయింది. పైగా రాజధాని వ్యవహారంలో కేంద్ర ప్రమేయం ఏమీ లేదని, అఫిడవిట్ ఇచ్చింది. దీన్నిబట్టి.. మెడ మీద తల ఉన్న ఎవరైనా, అమరావతి అంశంలో జగన్ దారిలోనే.. బీజేపీ వెళుతోందన్న విషయం అర్ధమయి తీరాలి. అందుకే అమరావతి రైతులు ఢిల్లీలో కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగినా, అక్కడే ఉన్న మోదీ నుంచి ఒక్కమాట కూడా రాలేదంటే.. ఈ వ్యవహారంలో బీజేపీ పాత్ర ఏమిటన్నది సుస్పష్టం.   ఇక అమరావతి పాపంలో, చంద్రబాబుదే సింహభాగమన్నది.. ఈ పరిస్థితి-దుస్థితి అనుభవిస్తున్న వారి మాట. అధికారంలో ఉన్నప్పుడు గెజిట్‌లో అమరావతిని చేర్చకుండా.. డిజైన్లు, అత్యుత్తమ రాజధానుల సందర్శనల పేరిట చేసిన,  ప్రచారంతో కూడిన కాలయాపనే ఈ పరిస్థితికి మూలం అన్నది,  మెజారిటీ వర్గాల అభిప్రాయం. తాత్కాలిక నిర్మాణాలతో కాంట్రాక్టర్లకు దోచిపెట్టే యోచన, పూర్తి స్థాయి నిర్మాణాలకు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అసలు జగన్ దానిపై దృష్టి సారించే అవకాశం కూడా ఉండేది కాదన్నది వారి వాదన. నిజమే కదా మరి? తాత్కాలిక సచివాలయం పేరుతో బాబు, బడా కాంట్రాక్టరుకు సర్కారు భూమి ఇచ్చి మరీ, వందల కోట్లు సమర్పించుకున్నారు. సదరు కంపెనీ నిర్మించిన సచివాలయం ఖరీదు, హైదరాబాద్‌లో నిర్మించే భవనాలతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ ఖర్చు.   నెల్లూరు నారాయణ సారథ్యంలో జరిగిన ఈ వ్యవహారంలో.. కాంట్రాక్టర్లు, వారిచ్చే కమిషన్లతో  టీడీపీ లాభపడితే, పూర్తిగా నష్టపోయింది మాత్రం రైతులేనంటున్నారు. విభజన జరిగిన వెంటనే చంద్రబాబు మేల్కొని, బెజవాడకు వచ్చి పూర్తి స్థాయి నిర్మాణాలు చేయని పాపమే.. ఇప్పుడు రైతులకు శాపమైంది. అదే  జగన్ మూడురాజధానుల ఆలోచనకు, ఊపిరిపోసిందనేది మెజారిటీ వర్గాల నిశ్చితాభిప్రాయం. అటు.. అమరావతిని ‘కమ్మ’రావతిగా ప్రచారం చేసిన వైసీపీ నేతలు, ఇప్పటివరకూ దానిని నిరూపించలేకపోయారు. అటు టీడీపీ కూడా, దానిని అబద్ధమని నిరూపించే ప్రయత్నం చేయకుండా.. నారాయణ, పుల్లారావు వంటి భూములు కొన్న  నేతలను కాపాడేందుకే ప్రాధాన్యమిచ్చింది. అమరావతి నిర్మాణ సమయంలో, నానా హడావిడి చేసిన ‘నారాయణ మాస్టారు’ ఇప్పుడు,  ఏ కలుగులో దాగున్నారో ఎవరికీ తెలియదు.   నగర నిర్మాణం అవుతుందో లేదో తెలియని అయోమయం.. మూడు పంటలు పండే భూములిచ్చి.. ఇప్పుడు నెత్తిన చేయి పట్టుకున్న రైతులే, అమరావతిని కాపాడుకునే పనిలో ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సర్కారుకు.. ఎదురొడ్డి పోరాడుతున్న వేలాది మంది రైతులు, వారి పక్షాన పోరాడుతున్న ఒక సుంకర పద్మశ్రీ, మరో వెగలపూడి గోపాలకృష్ణ ప్రసాద్, పువ్వాడ సుధాకర్, ఇంకో మార్టిన్, కంభంపాటి శిరీష, దుర్గాభవానీ, అక్కినేని వనజ వంటి జేఏసీ నేతలే, ఇప్పుడు అమరావతి కథలో హీరోలు. మరి వారంతా హీరోలయితే.. మోదీ-చంద్రబాబు-జగన్‌తోపాటు, అమరావతి గ్రామాలలో వీరవిహారం చేసి.. ఆడబిడ్డ తెచ్చుకున్న టిఫిన్ బాక్సులో ఉప్మా తిని, చివరాఖరకు కమలంతో చేతులు కలిపి.. ఇప్పుడు ఉద్యమాన్ని కాడికిందపడేసిన,  జనసేన వీరుడు పవన్ సంగతేమిటన్న సందేహం రావచ్చు.  ప్లీజ్.. ఆ ఒక్కటీ అడక్కు! అది మీ ఇష్టం!! -మార్తి సుబ్రహ్మణ్యం
శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం.. సాంకేతిక టెక్నాలజీ వినియోగిస్తూ కేసులు చేధించడంలో తెలంగాణ పోలీసులే టాప్.. రాష్ట్రంలో ఎక్కడ చీమ చిట్టుకుమన్నా గుర్తించే పరిజ్ఞానం మన పోలీసుల సొంతం.. ఇవి గత ఐదేండ్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న మాటలు.  గొప్పగా చేసుకుంటున్న ప్రచారాలు. గత ఆరేండ్లలో పోలీస్ శాఖకు భారీగా నిధులిచ్చామని, హైటెక్ సౌకర్యాలు కల్పించామని, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఆయన చెబుతుంటారు. కాని ఒక్క ఘటన తెలంగాణ పోలీసుల సత్తాకు సవాల్ గా నిలిచింది. మహబూబా బాద్ కిడ్నాప్ కేసు తెలంగాణ పోలీసుల పనితీరును ప్రశ్నించేలా మారింది. తెలంగాణ కాప్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిహసించేలా చేస్తోంది.    మహబూబా బాద్ లో జరిగిన బాలుడి కిడ్నాప్ కేసులో పోలీసుల తీరుపై చాలా ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. హైటెక్ టెక్నాలజీ ఉన్న రోజుల్లోనూ కిడ్నాపర్లను గుర్తించడానికి ఐదు రోజులు తీసుకోవడం ఏంటనే ఆరోపణలు వస్తున్నాయి. అది కూడా కిడ్నాపర్లు డబ్బుల కోసం బాలుడి పేరెంట్స్ తో మాట్లాడుతూనే ఉన్నారు. బాలుడి పేరెంట్స్ చుట్టే  పోలీసులు తిరిగారు. కిడ్నాపర్ల ఫోన్లను పోలీసులు కూడా విన్నారు. అయినా వారెవరో, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారో , కిడ్నాపర్లు ఫోన్ మాట్లాడుతున్న లొకేషన్ ఏంటో వెంటనే కనిపెట్టలేకపోయారు. ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తి లొకేషన్ ను మినిట్ టు మినిట్ ట్రేస్ చేసే టెక్నాలజీ ఉన్న ప్రస్తుత సమయంలో ... మహబూబా బాద్  పోలీసులకు కిడ్నాపర్లను గుర్తించడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రజల్లో కూడా ఇవే అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వం చెబుతున్న గొప్ప టెక్నాలజీ ఎక్కడ పోయిందని వారు ప్రశ్నిస్తున్నారు.    ఆదివారం సాయంత్రం దీక్షిత్ రెడ్డి కనిపించకుండా పోయారు. అదే రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. డబ్బుల కోసం కిడ్నాపర్ సోమవారం బాలుడి పేరెంట్స్ కు 11 సార్లు ఫోన్ చేశారని చెబుతున్నారు. మంగళవారం సైలెంట్ గా ఉన్న అగంతకులు బుధవారం మళ్లీ బాలుడి పేరెంట్స్ తో టచ్ లోకి వచ్చారు. డబ్బులు ఇవ్వాలని, ఇక్కడికి రావాలని, డబ్బును అక్కడ పెట్టి వెళ్లండని ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నారు. అయినా ఐదు రోజులుగా బాలుడి కోసం వెతుకుతున్న పోలీసులు మాత్రం కిడ్నాపర్ల జాడ కనిపెట్టలేకపోయారు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ కాలంలో కూడా కిడ్నాపర్లు ఫోన్ లో మాట్లాడుతున్నా గుర్తించకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీక్షిత్ రెడ్డి కేసులో మహబూబా బాద్ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి.   అయితే మహబూబా బాద్ ఎస్పీ కోటిరెడ్డి మాత్రం కేసులో తామెక్కడ నిర్లక్ష్యం వహించలేదని చెప్పారు. కిడ్నాపర్ చాలా తెలివిగా వ్యవహరించాడని, తనను ట్రేస్ చేయకుండా ఉండటానికి ఫోన్ వాడలేదని తెలిపారు. బాలుడి పేరెంట్స్ కు ఇంటర్ నెట్ కాల్స్ చేశారని ఎస్పీ వెల్లడించారు. యాప్ ద్వారా ఇంటర్ నెట్ కాల్స్ చేయడం వల్లే కిడ్నాపర్ ను గుర్తించడం వెంటనే సాధ్యం కాలేదన్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ సాయంతో కిడ్నాపర్ వాడిన యాప్ ను గుర్తించి.. అతని మార్గంలోనే యాప్ సాయంతోనే గుర్తించామని చెప్పుకొచ్చారు. కిడ్నాపర్ యాప్ వాడటం వల్లే గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టిందని ఎస్పీ తెలిపారు. అయితే ఎస్పీ ప్రకటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం సాధారణ జనాలే హైటెక్ టెక్నాలజీని  ఉపయోగిస్తూ డిజిటల్ వండర్స్ చేస్తున్నారు. పోలీసుల దగ్గర మరింత అత్యాధునిక పరిజ్ఞానం అందుబాటులో ఉంటుంది. అయినా యాప్ ద్వారా మాట్లాడుతున్న కిడ్నాపర్ ను వెంటనే గుర్తించే టెక్నాలజీ లేకపోవడం ఏంటనే విమర్శలు జనాల నుంచి వస్తున్నాయి. టెక్నాలజీ వినియోగంలో  పూర్ గా ఉన్న ఈ పోలీసులనే .. దేశానికే ఆదర్శమని సీఎం కేసీఆర్ చెబుతున్నారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.    మహబూబా బాద్ జిల్లా కేంద్రంలోనే దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ జరిగింది. బాలుడిని బైక్ పై తీసుకుని దర్జాగా వెళ్లాడు కిడ్నాపర్. కాని ఎక్కడా సీసీ టీవీలో అవి రికార్డు కాలేదు. అంటే మహబూబా బాద్ జిల్లా కేంద్రంలో సీసీ కెెమెరాలు కొన్ని ప్రాంతాల్లోనే ఉన్నాయని దీన్ని బట్టి అర్ధమవుతోంది. అందుకే కిడ్నాపర్ విజువల్స్ ఎక్కడా చిక్కలేదని, పట్టణ శివారులోని ఒక ప్రాంతంలోనే అతడి విజువల్ రికార్డైందని తెలుస్తోంది. జిల్లా ఎస్పీ కూడా ఇదే విషయం చెప్పాడు. అయితే జిల్లా కేంద్రంలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు సరిగ్గా లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కెమెరాలు ఎక్కడ అమర్చారనే ప్రశ్నలు వస్తున్నాయి. జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే గ్రాామాలు, పల్లెల్లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.    ఐదేండ్ల క్రితం ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో మిస్సైన బాలుడిని ఇటీవలే అసోంలోని గోలపారాలో గుర్తించి త‌ల్లిదండ్రుల చెంత‌కు చేర్చారు. తెలంగాణ స్టేట్ పోలీసులు అభివృద్ధి చేసిన ఫేస్ రికగ్నిషన్ యాప్ ద‌ర్ప‌న్ ద్వారా ఇది సాకార‌మైందని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. ద‌ర్ప‌న్ ద్వారా తెలంగాణ పోలీసులు బాలుడిని గుర్తించి ఆచూకీని క‌నుగొన్నారని ఆయన తెలిపారు. ఇంతటి టెక్నాలజీ ఉన్న తెలంగాణ పోలీసులు.. ఫోన్ లో మాట్లాడుతున్న కిడ్నాపర్లను గుర్తించడానికి ఐదు రోజులు తీసుకోవడం చర్చనీయాశంగా మారింది. మొత్తంగా మహబూబా బాద్ ఘటన తెలంగాణ పోలీసుల ప్రతిష్టకు మచ్చగా, సీఎం కేసీఆర్ గొప్పగా చేసుకుంటున్న ప్రచారానికి గండి కొట్టేదిగా మారిందనే చర్చే జనాల్లో ఎక్కువగా జరుగుతోంది.
అచ్చెన్నాయుడికే దక్కిన అధ్యక్ష పదవి   నారా-నందమూరి ఫ్యామిలీకి చెరో రెండు   బాబాయ్-అబ్బాయ్, తల్లీ కొడుకులకు చోటు   కళాకు ఒక న్యాయం, రమణకు మరో న్యాయం   కొత్త వారికి పదవులతో పార్టీ పరుగులు   టీడీపీ జాతీయ-రాష్ట్ర కమిటీల తీరిది   ఎట్టకేలకు చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ-రాష్ట్ర కమిటీలు ప్రకటించారు. ఇందులో నారా-నందమూరి కుటుంబాలకు చెరో రెండు పదవులు దక్కగా, బాబాయ్-అబ్ణాయ్, తల్లీ-కొడుకులకు రెండేసి పదవులు లభించాయి. అయితే ఏపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావును తొలగించిన నాయకత్వం, తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా మాత్రం ఎల్.రమణను కొనసాగించటం ఆశ్చర్యం. పైగా ఇతర కమిటీల్లో ఉన్న వారికి మరో కమిటీలో కూడా స్థానం కల్పించటం పార్టీ శ్రేణులకు విస్మయం కలిగించింది.   చంద్రబాబు ప్రకటించిన పార్టీ జాతీయ-రాష్ట్రాల కమిటీలలో కొత్త వారికి స్థానం కల్పించడం, ముఖ్యంగా యువతకు, బడుగు వర్గాలకు చోటివ్వడం ద్వారా, పార్టీని పరుగులు పెట్టించే వ్యూహం కనిపిస్తోంది. అయితే ఈ కమిటీలో అగ్ర కులానికి సంబంధించి వైశ్య కులానికి ఒకరికి చోటివ్వగా, బ్రాహ్మణ వర్గానికి ప్రాతినిధ్యం కనిపించలేదు. తెలంగాణ నుంచి ఒక మహిళా నేతకు బ్రాహ్మణ కోటా నుంచి ఇచ్చారని చెబుతున్నప్పటికీ, ఆమె ఆ సామాజికవర్గానికి చెందిన వారు కాదని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. గతంలో శిద్దా రాఘవరావుకు కోశాధికారి ఇవ్వగా, ఇప్పుడు అదే వైశ్య వర్గానికి చెందిన శ్రీరాం తాతయ్యకు ఆ పదవి ఇచ్చారు. రాష్ట్రంలో వైశ్య జనాభా ఎక్కువగానే ఉన్నా, ఒక్కటే ఇచ్చారు. నిజానికి అధ్యక్ష పదవి దక్కించుకున్న అచ్చెన్నాయుడు పోలినాటి వెలమ కంటే, వైశ్య వర్గం నాలుగింతల సంఖ్య ఎక్కువగా ఉండటం ప్రస్తావనార్హం. అయితే, రాష్ట్రంలో ప్రాబల్యం ఉన్న రెడ్డి వర్గానికి కేవలం మూడు పదవులే దక్కడం ప్రస్తావనార్హం. సోమిరెడ్డి, కోట్ల, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డికి మాత్రమే స్థానం లభించింది. కడప-కర్నూలు-నెల్లూరు-అనంతపురం-చిత్తూరులో రెడ్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆ వర్గం నుంచి ఈసారి పెద్దగా చోటు లభించలేదు. బహుశా రెడ్లు వైసీపీ వైపు ఉంటారన్న భావనతో, సంఖ్య తగ్గించి ఉండవచ్చంటున్నారు. జెసి కుటుంబానికి పదవి ఇస్తామని చెప్పినప్పటికీ, దివాకర్‌రెడ్డి వద్దని తిరస్కరించినట్లు చెబుతున్నారు. మొత్తంగా కమిటీలో, కమ్మ వర్గానికి 9 పదవులు లభించాయి. కేంద్ర కమిటీలోని 27 మందిలో ఓసీలకు 51, మిగిలిన వర్గాలకు 49 శాతం పదవులు దక్కాయి.   ఇక అంతా అనుకున్నట్లే, అచ్చెన్నాయుడుకు ఏపీ అధ్యక్ష పదవి దక్కింది. ఈఎస్‌ఐ అక్రమాల కేసులో ఆయన ఇటీవలే జైలుకు వెళ్లి వచ్చారు. బహుశా ఆ అర్హతతోనే ఆయనకు ఆ పదవి లభించి ఉండవచ్చు. అంటే పార్టీ కోసం జైలుకెళ్లిన వారికి, పార్టీ అండగా ఉంటుందన్న సంకేతాలిచ్చేందుకే, ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చి ఉండవచ్చు. జైలుకు వెళ్లి వచ్చిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రకూ పొలిట్‌బ్యూరో దక్కినందున, ఆవిధంగానే భావించాల్సి ఉంది. ఇక చంద్రబాబు ఎలాగూ జాతీయ అధ్యక్షుడు. లోకేష్‌కు మళ్లీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి లభించింది. అయితే, బాబు వియ్యంకుడయిన నందమూరి బాలకృష్ణకు పొలిట్‌బ్యూరో, నందమూరి హరికృష్ణ కమార్తె సుహాసినీకి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవులు దక్కడం ద్వారా, నారా-నందమూరి కోటాలు భర్తీ చేసినట్టయింది.   అయితే, జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో నరా లోకేష్, వర్ల రామయ్య, రామ్మోహన్‌నాయుడు, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర, కొత్తకోట దయాకర్‌రెడ్డిలలో.. ఒక్క నారా లోకేష్‌కు మాత్రమే, సెంట్రల్ కమిటీ నుంచి పొలిట్‌బ్యూరో ఎక్స్‌అఫిషియో సభ్యుడి అయ్యే అవకాశం లభించింది. జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరైన రామయ్యకు పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పించి, మళ్లీ అదే పోలిట్‌బ్యూరోలో లోకేష్‌కు ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా అవకాశం లభించడం ప్రస్తావనార్హం. గల్లా అరుణకు జాతీయ ఉపాధ్యక్ష పదవి, ఆమె కుమారుడు గల్లా జయదేవ్‌కు పొలిట్‌బ్యూరో పదవి లభించింది.   ఇక ఈసారి కొత్తగా రాజకీయ కార్యదర్శి పదవి సృష్టించి, దానిని టిడి జనార్దన్‌కు ఇవ్వగా, కార్యాలయ కార్యదర్శి పదవి అశోక్‌బాబుకు లభించింది. దానిని గతంలో ఏవి రమణ నిర్వహించేవారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డికి జాతీయ ఉపాధ్యక్షుడు, సీనియర్ నేత బుచ్చయ్యచౌదరికి పొలిట్‌బ్యూరో, ఇటీవలి కాలంలో దూకుడుగా వెళతూ సర్కారుకు చెమటలు పట్టిస్తున్న పట్టాభికి జాతీయ అధికార ప్రతినిధి పదవులు దక్కడం విశేషం. కొత్త కమిటీలో ప్రధానంగా పట్టాభికి కీలక స్థానం ఇవ్వడంపై హర్షం వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటికే తెలంగాణ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న జోత్స్నకు మళ్లీ జాతీయ అధికార ప్రతినిధి, ఏపీ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న అనితకు పొలిట్‌బ్యూరోలో, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వర్ల రామయ్యకు మళ్లీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా అవకాశం లభించడం ప్రస్తావనార్హం. ఇది జాబితా కూర్పులో పొరపాటు జరిగిందా లేక, జాబితానే ఆవిధంగా రూపొందించారో తెలియదని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.     ఇక తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఎల్.రమణను మళ్లీ  కొనసాగించడం చర్చనీయాంశమయింది. విఫల నాయకుడిగా పార్టీలో ఇబ్బంది పడుతున్న ఆయనను కొనసాగించడంపై పార్టీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. రమణ స్థాయిలో చెప్పింది వినే నాయకుడు లేకపోవడమే బహుశా ఆయన కొనసాగింపునకు కారణం కావచ్చంటున్నారు. మరి ఏపీలో కళా వెంకట్రావును ఏ ప్రాతిపదిక తొలగించి, తెలంగాణలో ఏ ప్రాతిపదికన రమణను కొనసాగించారో అర్ధం కావడం లేదంటున్నారు. ఇంకా కనీసం వెంకట్రావు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. టీడీపీకి 23 స్థానాలయినా వచ్చాయని, కానీ రమణ సారథ్యంలో పార్టీ మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని గుర్తు చేస్తున్నారు. పైగా రమణపై తెలంగాణ పార్టీ  నేతలంతా తిరుగుబాటు చేసినా, బాబు ఆయననే కొనసాగించడంపై విస్మయం వ్యక్తమవుతోంది.   అయితే, తెలంగాణ నుంచి సీనియర్ నేత అరవిందకుమార్ గౌడ్‌కు పొలిట్‌బ్యూరో, జాతీయ అధికార ప్రతినిధిగా నర్శిరెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డి- బక్కని నర్శింహులుకు జాతీయ ప్రధాన కార్యదర్శి, మెచ్చా నాగేశ్వరరావుకు జాతీయ ఉపాధ్యక్ష పదవులివ్వడం ద్వారా, తెలంగాణకు పెద్దపీట వేసినట్టయింది. ఎలాగూ రావుల పోలిట్‌బ్యూరోలోనే కొనసాగుతున్నారు. కానీ, రమణను అధ్యక్ష పదవి తొలగించకుండా, కొసాగించడం ద్వారా.. తెలంగాణలో పార్టీకి ఆయన తప్ప మరో దిక్కు, సమర్ధులు లేరన్న సంకేతం పంపినట్టయింది.   అయితే ఏపీలో అచ్చెన్నాయుడు, తెలంగాణలో రమణ అధ్యక్షులుగా ఉన్నప్పటికీ.. వారికెవరికీ సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదన్నది బహిరంగ రహస్యమే. కాబట్టి అధ్యక్షులుగా ఎవరున్నా పెద్దగా ఒరిగేదేమీ లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు-లోకేష్ దిశానిర్దేశంలోనే పనిచేయాలి కాబట్టి.. ఎవరికి ఏ పదవి ఇచ్చినా ఒకటేనని స్పష్టం చేస్తున్నారు. ఈసారి పితాని, కొల్లు రవీంద్ర, బీద రవిచంద్ర, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, బచ్చుల అర్జునుడు, శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, నక్కా ఆనందబాబు వంటి వారికి స్ధానం కల్పించడం అభినందనీయమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కానీ, దూకుడుగా వెళ్లే ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్‌కు ఎక్కడా చోటు లభించకపోవడం చర్చనీయాంశమయింది. ఒకవేళ పయ్యావుల కేశవ్‌కు పీఏసీ చైర్మన్ ఇచ్చినందున ఆయనకు పదవి ఇవ్వలేదనుకున్నా.. మరి టీడీఎల్పీ ఉపనేతగా ఉన్న అచ్చెన్నాయుడికి, అధ్యక్ష పదవి ఎలా ఇచ్చారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.  -మార్తి సుబ్రహ్మణ్యం
హైద‌రాబాద్ వరద ముంపు బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సాయం ప్రకటించారు. నగరంలో వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ.10 వేల సాయం చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచే ఆర్థిక సాయం అందజేయనున్నట్లు చెప్పారు. పేద‌ల‌కు సాయం అందించ‌డం కోసం మున్సిప‌ల్ శాఖ‌కు ప్ర‌భుత్వం రూ. 550 కోట్లు త‌క్ష‌ణం విడుద‌ల చేస్తుంద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ. ల‌క్ష చొప్పున, పాక్షికంగా దెబ్బ‌తిన్న ఇండ్ల‌కు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించ‌నున్న‌ట్లు కేసీఆర్ తెలిపారు.    భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల హైద‌రాబాద్ న‌గ‌రంలోని లోత‌ట్టు ప్రాంతాల్లోని ప్ర‌జలు ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌కు గుర‌య్యార‌ని, వారిని ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. వ‌ర‌ద నీటిలో మునిగిన ప్రాంతాల్లోని ఇళ్ల‌ల్లో నివ‌సిస్తున్న వారు ఎంతో న‌ష్ట‌పోయార‌ని, ఇళ్ల‌లోకి నీళ్లు రావ‌డం వ‌ల్ల బియ్యం స‌హా ఇత‌ర ఆహార ప‌దార్థాలు త‌డిసిపోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దెబ్బ‌తిన్న ర‌హ‌దారులు, ఇత‌ర మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టి, మ‌ళ్లీ మ‌మూలు జీవ‌న ప‌రిస్థితులు నెల‌కొనేలా చూడాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు.    గ‌డిచిన వందేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షం హైదరాబాద్ నగరంలో కురిసిందన్నారు కేసీఆర్. ప్రజలు అనేక కష్ట, నష్టాలకు గురయ్యారు.. ముఖ్యంగా నిరుపేదలు, బస్తీలలో ఉండే వారు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు ఎక్కువ కష్టాల పాలయ్యారు.వారిని ఆదుకోవడం ప్రభుత్వ ప్రాథమిక విధి అని చెప్పారు. కష్టాల్లో ఉన్న పేదలకు సాయం అందించడం కన్నా ముఖ్యమైన భాద్యత ప్రభుత్వానికి మరొకటి లేదన్నారు. అందుకే ప్రభావిత ప్రాంతాల్లోని పేదలకు ఇంటికి 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించామ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు.    నగరంలో 200-250 బృందాలను ఏర్పాటు చేసి, అన్ని చోట్లా ఆర్థిక సాయం అందించే కార్యక్రమం పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. హైదరాబాద్ నగర పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల కలెక్టర్లు, వారి బృందాలు వెంటనే రంగంలోకి దిగి మంగళవారం ఉదయం నుంచే ఆర్థిక సాయం అందించే కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశించారు. పేదలకు సాయం అందించడం అతి ముఖ్యమైన బాధ్యతగా స్వీకరించి హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ అంతా భాగస్వాములు కావాలని సూచించారు. నష్టపోయిన ప్రజలు ఎంతమంది ఉన్నా సరే, లక్షల మందికైనా సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.    హైదరాబాద్ లో మళ్లీ మామూలు జీవన పరిస్థితులు నెలకొనేలా చూడాలని అధికారులకు కేసీఆర్ ఆదేశించారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. సీఎంఆర్‌ఎఫ్‌కు విరివిగా విరాళాలు అందించాలని కోరారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.
అంతన్నారు.. ఇంతన్నారు.. రాష్ట్ర సర్కార్ అంతు తేలుస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యమన్నారు. కాని ఇప్పుడు మాత్రం తుస్సుమంటున్నారు. 2024లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న బీజేపీ ఉనికే..  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. పార్టీ కొత్త బాస్ సోము వీర్రాజు పూర్తిగా సైలెంట్ అయిపోయినట్లు కనిపిస్తోంది. ఆయన ఎక్కడున్నారో పార్టీ నేతలకే తెలియడం లేదట. సోము తీరుపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ కేడర్ లో ఆందోళన నెలకొంది. పార్టీ భవిష్యత్ పై కమలం నేతల్లో కలకరం కనిపిస్తోంది.     ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం చాలా సమస్యలున్నాయి. భారీ వర్షాలు, వరదలతో జనాలు అల్లాడిపోతున్నారు. లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునగడంతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తడంతో వేలాది మంది రోడ్డున పడ్డారు. జగన్ సర్కార్ తమను పట్టించుకోవడం లేదని, కనీసా సాయం కూడా చేయడం లేదని వరద బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే  ప్రతిపక్ష పార్టీగా ప్రజలు సమస్యలపై పోరాడాల్సిన బీజేపీ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. బీజేపీ ముఖ్య నేతలెవరు మాట్లాడటం లేదు. వరద బాధితులకు బాసటగా సర్కార్ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడం లేదు. కొన్ని రోజులుగా సోము వీర్రాజు ముఖమే కనిపించడం లేదు. బీజేపీ ముఖ్య నేతల తీరుపై జనాలు ఫైరవుతున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అందుబాటులో లేకుండా పోవడమేంటనీ ప్రశ్నిస్తున్నారు.    సోము వీర్రాజు మొదటి నుంచి వైసీపీకి ఫేవర్ గానే ఉన్నారు. వరదల విషయంలో జగన్ సర్కార్ విఫలమైందని జనాలు ఆరోపిస్తున్నారు. దీంతో వరదలపై మాట్లాడితే జగన్ ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వస్తుందనే ఆయన సైలెంట్ గా ఉంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వీర్రాజుపై సొంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్రమంతా సమస్యల్లో ఉంటే మాట్లాడకపోవడం ఏంటనీ కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారట. కన్నా లక్ష్మినారాయణ పార్టీ చీఫ్ గా ఉండగా... ఆయన అన్ని అంశాలపై వెంటనే స్పందించేవారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేవారు. ప్రజలకు అండగా ప్రభుత్వంపై ఘాటు ప్రకటనలు చేసేవారు. కాని కొన్ని రోజులుగా బీజేపీలో అలాంటి సీన్ కనిపించడం లేదు. దీనిపైనే ఏపీ బీజేపీలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కన్నాతో పోలుస్తూ వీర్రాజు తీరుపై చాలా మంది నేతలు గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు.    తిరుమల విషయంలోనూ జగన్ సర్కార్ వరుసగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోంది. టీటీడీ నిర్ణయాలపై భక్తులు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాని హిందూ పార్టీగా చెప్పుకునే బీజేపీ మాత్రం టీటీడీ నిర్ణయాలపై మాట్లాడటం లేదు. టీటీడీ డిక్లరేషన్ విషయంలోనూ సోము వీర్రాజు స్పందించలేదు. రాష్ట్రమంతా బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేసిన పార్టీ చీఫ్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. టీటీడీ వివాదాస్పద నిర్ణయాలపై బీజేపీ అధ్యక్షుడు మాట్లాడకపోవడంపై  హిందూ సంఘాలు విస్మయ వ్యక్తం చేస్తున్నాయి. సోము వీర్రాజు సహా కొత్త కార్యవర్గం తీరు బీజేపీలోనూ చర్చనీయాంశంగా మారిందని తెలుస్తోంది.   ఇక బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్దన్ రెడ్డి బహిరంగంగానే వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. కొన్ని రోజులుగా విష్ణువర్దన్ రెడ్డి చేస్తున్న ప్రసంగాలతో ఆయన బీజేపీ లీడరా.. వైసీపీ నాయకుడో అర్ధం కావడం లేదని కొందరు కమలం నేతలు అసహనం చేస్తున్నారు. అయినా తీరు మార్చుకోని విష్ణువర్దన్ రెడ్డి.. ప్రధాని మోడీని తీవ్రంగా వ్యతిరేకించే సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్ ను సమర్ధించడం కమలనాధుల్లోనే కలకలం రేపుతోంది. అది కూడా దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఆరోపణలు చేస్తూ జగన్ రాసిన లేఖకు మద్దతుగా ఆయన మాట్లాడటం బీజేపీకి ఇబ్బందిగా మారుతోంది. ప్రధాని మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా నిత్యం వాదించే, కోర్టుల్లో పిటిషన్లు వేసే న్యాయవాదిని.. వైసీపీ కోసం సమర్ధించడంపై కొందరు బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.      సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిల వైఖరితో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఉందా లేక అధికార పార్టీలో కలిసిపోయిందా అన్న అనుమానాలు కొందరిలో వ్యక్తమవుతున్నాయి. బీజేపీ విపక్ష పార్టీగా పని చేస్తోందో లేక వైసీపీకి బీ టీమ్ గా మారిందో తెలియడం లేదని కొందరు కమలం నేతలు ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి నేతలతో పార్టీ బలోపేతం కావడం కలేనని.. రోజు రోజుకు బలహీన పడి ఉనికి కోల్పోయే పరిస్థితి వస్తుందని మరికొందరు తేల్చి చెబుతున్నారు. కేంద్రంలో అధికారం ఉండటంతో.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం ఈజీ. కాని ఏపీ బీజేపీ ముఖ్యనేతలు మాత్రం అధికార పార్టీ మోజుతో పార్టీని నాశనం చేస్తున్నారనే ఆరోపణలు కార్యకర్తల నుంచి వస్తున్నాయి. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిల తీరుతో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ హోం క్వారంటైన్ లో ఉందనే చర్చ ఏపీ జనాల్లోనూ జోరుగా సాగుతోంది. మరీ హోం క్వారంటైన్ నుంచి త్వరగా బయటికి వస్తారో లేక వైసీపీ సేవలో తరిస్తూ బీజేపీని బొంద పెడతారో చూడాలని కొందకు బీజేపీ నేతలు కామంట్ చేస్తున్నారు.
స్కూలు పిల్లలకు మతం-కులం లేదు   పాఠశాలలో కుల-మత నమోదుకు పాతర   139 కులాలకు 56 కార్పొరేషన్ల ఏర్పాటు   వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మొండితనానికి, గుండెధైర్యానికి నిలువెత్తు చిరునామా. ఆయనొక సంచలనం. విజయమయినా, వివాదమయినా ఆయన దారే వేరు. ఏదయినా అనుకున్నారంటే చేసేయడమే. జగన్ తీసుకున్న అనేక నిర్ణయాలు.. జనరంజకమన్న ప్రశంసలు, మెజారిటీ వర్గాల నుంచి వినిపిస్తుంటే.. ప్రజావ్యతిరేకమని ఇంకొన్ని వర్గాల్లో ఇప్పటికీ వినిపిస్తుంటాయి. న్యాయవ్యవస్థతో పోరాటానికి తెరలేపిన జగన్.. ఆయనను అభిమానించే వారి దృష్టిలో మాత్రమే కాకుండా, న్యాయవ్యవస్థ లోపాలపై అసంతృప్తితో ఉన్న అనేకమంది దృష్టిలో.. ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అనిపించుకుంటున్నారు. మరికొన్ని వర్గాలు మాత్రం సహజంగానే జగన్ నిర్ణయాన్ని విమర్శిస్తున్నాయి. ఇన్ని వైరుధ్యాలు ఉన్నందుకే, దేశం ఇప్పుడు  జగన్మోహన్‌రెడ్డిని ఆసక్తిగా చూస్తోంది. అది సానుకూల కోణమా? వ్యతిరేక కోణమా అన్నది వేరే విషయం!   ఇన్ని సంచలనాలకు కేంద్ర బిందువయిన జగన్మోహన్‌రెడ్డి.. తాజాగా తీసుకున్న రెండు విప్లవాత్మక నిర్ణయాలు, జనం దృష్టిలో ఆయనను హీరోను చేశాయి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులకు, రిజిస్టర్‌లో కులం-మతం ప్రస్తావన ఉండకూడదన్న నిర్ణయం... మెజారిటీ ప్రజలనే కాదు, విద్యావంతులు, సమాజహితం కోరుకునే వారిని సైతం మెప్పిస్తోంది. ఇప్పటివరకూ స్కూలు దశ నుంచే కుల-మత భావనలు మొదలయ్యేవి. విద్యార్ధి కులం-మతాన్ని విధిగా ప్రస్తావించాల్సి వచ్చేది. జగన్ సర్కారు తాజాగా ఈ నిబంధనకు పాతరేసింది. రిజిస్టరులో విద్యార్ధి కులం-మతాన్ని పేర్కొనకూడదని ఆదేశించింది.     ఈ నిర్ణయం వల్ల.. పాఠశాల స్థాయి నుంచే మొదలవుతున్న, కుల-మత భావనకు పాతర వేయవచ్చన్న అభిప్రాయం మేధావి వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆంధ్రాలో ఇప్పటికే కులభావన తీవ్రస్థాయి నుంచి, ఉన్మాద దశకు చేరుకుంది. విజయవాడ న గరం పరిసర ప్రాంతాల్లో, ఏడాది పాటు ఉండి వచ్చిన ఎవరికయినా.. కుల వ్యవస్థపైనే అసహ్యం పుట్టడం ఖాయం. ఇప్పటికీ అక్కడ కులాల వారీగా ఫంక్షన్లు, స్నేహాలతోపాటు.. కుల ఘర్షణలూ జరుగుతున్న అరాచక సంప్రదాయం కనిపిస్తోంది. వాహనాలపై తమ కులాలను సగర్వంగా ప్రకటించుకునే సంస్కృతి దేశంలో ఒక్క బెజవాడలోనే కనిపిస్తుంటుంది. ఫలానా కులం వారికే ఇల్లు అద్దెకు ఇస్తామన్న దిక్కుమాలిన కులతత్వం దర్శనమిస్తుంటుంది.   నిజానికి ఇలాంటి కుల భావన ప్రారంభం కావడానికి.. పాఠ శాల స్థాయి నుంచి ప్రభుత్వమే, కుల ప్రస్తావన తీసురావడమే కారణం. అందుకే ఆ విధానాన్ని తొలగించాలని గతంలో వామపక్ష ప్రముఖులు, సంఘాలు డిమాండ్ చేసేవి. అయినా ఏ ప్రభుత్వమూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు జగన్ ఆ మార్పు తీసుకురావడాన్ని సాహసోపేత నిర్ణయంగానే భావిస్తున్నారు.   ఇక 139 కులాలకు 56 కార్పొరేషన్లు  ఏర్పాటు చేయడం కూడా, సాహసోపేత నిర్ణయంగానే భావిస్తున్నారు. గత ఎన్నికల ముందు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కూడా, 28 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అయితే, వాటిని ఎన్నికల నోటిఫికేషన్ నెల-రెండు నెలల ముందు ఏర్పాటు చేయడంతో, అవి కార్యాచరణకు నోచుకోలేకపోయాయి. ఎన్నికల కోడ్ కారణంగా,  చివరకు చాలామంది పదవీ బాధ్యతలు కూడా తీసుకోలేకపోయారు. మరికొందరు మాకొద్దని రాజీనామా చేశారు. ఇప్పుడు జగన్ ఏకంగా... 139 కులాలకు 56 కార్పోరేషన్లు ఏర్పాటుచేసి, బడుగుల పెదవులపై చిరునవ్వులు పూయించారు. చంద్రబాబులా ఎన్నికల ముందు కాకుండా.. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల ముందు ఏర్పాటుచేయడంతో, అది జగన్ చిత్తశుద్ధిని చాటినట్టయింది.   సహజంగా అరడజను కార్పోరేషన్లు.. అవి కూడా విడతల వారీగా ఏర్పాటుచేసే సంప్రదాయం ఉంది. ఆ సందర్భంగా ఆయా కులాల వారీతో సన్మానాలు చేయించుకోవడం, మళ్లీ కొంత గడువు తర్వాత మరికొన్ని కార్పొరేషన్లు ఏర్పాటుచేసేవారు. కానీ ఇప్పుడు ఏకంగా.. 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేయడమంటే, అది అసాధారణ అంశమే కాదు. సాహసోపేతం కూడా! ఎందుకంటే వీటి పాలకవర్గాల్లో సగం మంది మహిళలకు కేటాయించడం అభినందనీయమే. ఇందులో ఉప కులాలకూ స్థానం కల్పిస్తామని జగన్ సర్కారు ప్రకటించింది. ఇప్పటివరకూ దాదాపు అన్ని ప్రభుత్వాలూ యాదవ, శెట్టిబలిజ, తూర్పు కాపు వంటి ప్రధాన బీసీ కులాలకే అన్నింటా ప్రాధాన్యం ఇచ్చేవి. అసలు ఉప కులాల గురించి పట్టించుకున్న పాలకులెవరూ ఇప్పటిదాకా కనిపించలేదు. ఇప్పుడు ఆ లోటును కూడా జగన్మోహన్‌రెడ్డి సర్కారు భర్తీ చేసినట్టయింది. గత 16 నెలల కాలంలో.. 2,71,37,253 మంది బీసీలకు, 33,500 కోట్ల లబ్థి చేకూర్చినట్లు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది.   కాగా జగన్మోహన్‌రెడ్డి...  బడుగులకు సంబంధించి తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం, టీడీపీ బీసీ ఓటు బ్యాంకుపై ‘పిడుగుపాటు’గానే కనిపిస్తోంది. బీసీల పార్టీగా పేరున్న టీడీపీ.. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న కాలంలో,  తన బీసీ మూల సిద్ధాంతాన్ని విస్మరించింది. కాపుల ఓట్ల కోసం, పార్టీకి సంప్రదాయ మద్దతుదారైన బడుగులను పక్కకుపెట్టింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు-బీసీలకు శత్రుత్వం ఉందని తెలిసినా.. కాపులు ముద్రగడ వైపే ఉన్నారని తెలిసినా, పార్టీలోని కొందరు కాపు నేతల ఒత్తిళ్లకు లొంగి, కాపులను బీసీ రిజర్వేషన్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. దానితో ఆగ్రహించిన బీసీలు టీడీపీకి వ్యతిరేకంగా మారారు. పోనీ అలాగని రిజర్వేషన్ ప్రకటన సాధించిన కాపులేమైనా, టీడీపీకి ఓటు వేశారా అంటే అదీలేదు. కాపులు కూడా వైసీపీకే జైకొట్టడంతో టీడీపీ పరాజయం పాలవ్వాల్సి వచ్చింది.   దీనితో దిద్దుబాటుకు దిగిన బాబు.. ఈసారి బలమైన బీసీ వర్గానికి పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చేపనిలో ఉన్నారు. పోయిన బీసీ ఓటు బ్యాంకును, తిరిగి సాధించే ప్రణాళిక రూపొందిస్తున్న దశలో... జగన్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం, టీడీపీ బీసీ ఓటు బ్యాంకును, వైసీపీ కొల్లగొట్టేదిగానే కనిపిస్తోంది. ఎందుకంటే, 10 లక్షల జనాభా ఉన్న కులాలకు ఏ కేటగిరి, లక్ష నుంచి పది లక్షల వరకూ బి, లక్షలోపు జనాభా ఉన్న కులాలను సి కేటగిరిలో చేర్చారు. అంటే ప్రస్తుతం ప్రతీ బీసీకి ఒక కార్పోరేషన్ ఏర్పాటుచేసినట్టయింది.   ఇప్పటివరకూ ఇవన్నీ బీసీ కార్పొరేషన్ కిందనే ఉండేవి. జగన్ తాజా నిర్ణయంతో, అన్ని బీసీ కులాలకు సొంత కార్పొరేషన్ సమకూరినందున, సహజంగా ఆయా కులాలలో ఇది, జగన్‌పై సానుకూలత పెంచే అంశంగానే భావించక తప్పదు. అయితే... వీటికి బడ్జెట్, లబ్ధిదారులకు ఇచ్చే రుణాలు, పాలకమండలికి కార్యాలయాలు, వాహనాల ఏర్పాటు వంటి అంశాలపై కూడా ఇంతే దూకుడు ప్రదర్శించకపోతే, కొత్త కార్పోరేషన్ల ఏర్పాటు కంటితుడుపుగానే మిగిలిపోక తప్పదు.  -మార్తి సుబ్రహ్మణ్యం
అన్ని రంగాల్లో దూసుకుపోతున్నట్టే మహిళలు వ్యవసాయరంగంలోనూ ముందంజలో ఉంటున్నారు. రైతు కూలీలుగానే కాదు రైతులుగా మారి లాభసాటి వ్యసాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా వ్యసాయరంగం పై ఆధారపడిన మనదేశంల్లో మహిళలు కొత్తపంథాలను అనుసరిస్తూ అధిక దిగుబడిని సాధించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించేలా సేంద్రీయ వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. నేల చదును చేసి విత్తనాలు నాటి, పంటనుంచి ధాన్యాన్ని సేకరించి, ఇంటికి చేర్చి ఆహారంగా మార్చి ఇంటిల్లిపాదికి అందించడం వరకు మహిళల పాత్ర ఉంటుంది. మహిళా రైతుల సంఖ్య  భారతీయ వ్యవసాయ రంగంలో నానాటికీ పెరుగుతూనే ఉంది. జాతీయస్థాయిలో నిర్వహించిన సర్వే నివేదికలు పరిశీలిస్తే 75శాతం మహిళా శ్రామికులు వ్యవసాయక్షేత్రంలోనే ఉంటున్నారు. రెండున్నర ఎకరాల పొలంలో  సగటున మహిళలు 3,845గంటలు పనిచేస్తున్నారు. నాట్లు వేయడంలో 557 గంటలు, కలుపు తీయడంలో 640గంటలు, పంటకు నీరు పెట్టడంలో 384 గంటల సమయాన్ని గడుపుతున్నారు. వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్ని కొందరు తిరిగి ప్రారంభిస్తుంటే.. సాఫ్ట్ వేర్ రంగాలను వదిలి సాగుదిశగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి వారిలో కొందరి గురించి జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం..   సురేఖ... పుట్టిపెరిగింది నగరం వాతావరణంలో.. కానీ మొక్కలంటే మక్కువ. ఉన్నతవిద్య పూర్తి చేసిన తర్వాత రెండు దశాబ్దాలపాటు ఆమె  మీడియా, అడ్వటైజింగ్, కార్పోరేట్ ట్రైనింగ్ ఫీడ్ లో ఉన్నారు. విదేశాల్లో ఉన్నతవిద్యకోసం వెళ్లేవారికి సంబంధిత యూనివర్సటీలా ప్రవేశపరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా కోచింగ్ ఇస్తూ మూడు కోర్సులు, ఆరు క్లాసులు గా బిజీబిజీగా ఉన్న లైఫ్ లో వ్యవసాయం పై మక్కువ మాత్రం తగ్గలేదు. కరోనా కారణంగా అన్నింటికీ బ్రేక్ పడగా.. ఇదే సరైన సమయం అనుకుంటూ గ్రామం వైపు పరుగుదీశారు. నగరానికి చేరువగా ఉన్న గ్రామంలో ఆరు ఎకరాల పొలం లీజుకు తీసుకున్నారు. వ్యసాయంపై తనకు ఉన్న ప్రేమను చాటుకుంటూ మట్టివాసనను ఆస్వాదిస్తున్నారు. వ్యసాయం లాభసాటిగా ఉండాలంటే అందుబాటులోకి వచ్చిన ఆధునిక పద్ధతుల గురించి అవగాహన ఉండాలి. రైతులకు ప్రభుత్వం సమాచారాన్ని అందించాలి అంటూ అగ్రికల్చర్ సిబ్బంది సహాయం తీసుకుంటున్నారు. నేల రకాన్ని పరీక్షించడంతో పాటు పంట పెరుగుదలలో తీసుకోవల్సిన సస్యరక్షణ చర్యలపై అవగాహన పెంచుకుంటున్నారు. ఎసీ గదుల్లో కోచింగ్ ఇచ్చిన తాను ప్రకృతి మధ్య కు వచ్చిన వ్యసాయపాఠాలు నేర్చుకుని మరికొందరికీ ఆధునిక, లాభసాటి వ్యవసాయం గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పేముందు నేను తెలుసుకోవాలి కదా అంటూ తానే స్వయంగా పొలం పనుల్లో దగారు. భూసారాన్ని పరీక్షించడం నుంచి నాట్లు వేసే వరకు తానే ముందున్నారు.   కృష్ణవేణి... వ్యవసాయ కుటుంబంలో పుట్టిపెరిగారు. మట్టి పరిమళం బాగా తెలుసు. పల్లె నుంచి పట్టణానికి పోయినా ఆ మట్టి పరిమళాన్ని మరిచిపోలేదు.  పెండ్లి, పిల్లలు, ఇంటి బాధ్యతలతో ఏ కాస్త సమయం దొరికిన సామాజిక సేవ చేస్తూ బిజీబిజీగా మారారు. పిల్లలు పెద్దవారై కాస్త తీరిక దొరకగానే ఆమె ఆలోచనలు తిరిగి వ్యవసాయం వైపు మళ్లాయి. ఊరిలో తమకు ఉన్న వ్యవసాయ భూములను కౌలుకు ఇవ్వకుండా తానే దగ్గర ఉండి సాగు చేయిస్తున్నారు. తాను చిన్నప్పుడు చూసిన సంప్రదాయ వ్యవసాయ పద్దతులను అనుసరిస్తూ సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. వ్యవసాయం అంటే ఇతరుల సాయంతో ఇతరులకు సాయంచే జీవనవిధానం అంటారు కృష్ణవేణి. పంట కోసిన తర్వాత తమ పశువులకు ఆహారం కోసం వెతికే గొర్రెకాపరులకు తమ పొలంలోకి అనుమతి ఇస్తారు. ఎండాకాలంలో దాదాపు రెండు నెలల పాటు గొర్రెలు,మేకలు, పశువులు  పొలంలో దొరికే చెట్టుచేమ తింటూ అక్కడ పేడ వేస్తాయి. ఈ పేడ పొలానికి మంచి ఎరువు అవుతుంది. పంటలేని కాలంలో పశువుల మేతకు అనుమతించడం వల్ల అవి వేసే పేడ ఎంతో మేలు చేస్తుందని ఇది తన చిన్నతనంలో చూసేదాన్ని అని ఆమ చెప్పారు. ఇప్పుడు పురుగు మందులతో వ్యసాయం చేస్తున్నారు. అప్పుడు పశుపక్ష్యాదులతో కలిసి వ్యవసాయం చేసేవారు అంటారు కృష్ణవేణి.   విశాల.. నగరాలను మార్కెటింగ్ చేసే కార్పొరేట్ వ్యక్తి విశాల. హైదరాాబాద్ ఐటీ క్యారిడార్ లో వీకెండ్స్  మార్నింగ్ టైమ్ లో స్టాఫ్ వేర్ పీపుల్  అంతా బయటకు వచ్చి మాస్  ప్రోగ్రామ్స్ చేసేలా రహ్ గిరి రూపకల్పన చేసిన వారిలో ఆమె ఒకరు. అంతర్జాతీయ స్థాయిలో ప్రోగ్రామ్స్ చేసినా తమ మూలాలు పల్లెలోనే అన్న విషయం ఆమెకు బాగా తెలుసు. అందుకే పల్లెవైపు అడుగువేశారు. రాయలసీమలోని తమ గ్రామంలో ఉన్న పొలంలో చిరుధాన్యాలు పండించడంతో పాటు డాటర్స్ ఆఫ్ సాయిల్ పేరుతో ఎప్ బీ పేజీని క్రియేట్ చేశారు. వ్యసాయరంగంలో మహిళ పాత్రను అంతర్జాతీయ వేదికపై తెలియజేసేందుకు కృషి చేస్తున్నారు. మిల్లెట్స్ బ్యాంక్ ను ఏర్పాటుచేసి చిరుధాన్యాలకు మార్కెంటింగ్ కల్పించే ప్రయత్నం చేస్తుననారు. దీనితో పాటు సనాతన వ్యవసాయ పద్ధతులను ఆధునిక తరానికి అందించేందుకు మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తున్నారు.   నిర్మల... విదేశాల్లో ఉద్యోగం. ఐదంకేల జీతం. కానీ, తాను పుట్టిపెరిగిన సమాజానికి ఎదో చేయాలన్న ఆరాటం. అంతే ఆమె అమెరికా నుంచి మారుమూల గ్రామానికి పయనం. మొదట సామాజిక అంశాలపై స్టడీ చేయాలనుకున్నారు. కానీ, వ్యవసాయం రంగంలో చిన్నసన్నకారు రైతులు, మహిళలు ఎదుర్కోంటున్న సమస్యలను చూసి తాను పనిచేయాల్సింది ఈ రంగంలోనే అనే నిర్ణయానికి వచ్చారు. వలసలకు మారుపేరు అయిన పాలమూరు జిల్లాకు అమెరికా నుంచి ఆమె వలస వచ్చారు. నారాయణపేట్, దామరగిద్ద ప్రాంతంలోని రైతులను కలుసుకుంటూ గత ఐదేండ్లుగా ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్లుతూ పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వం పేదవారికి పంచిన గుట్టలు, బండరాళ్లతో ఉన్న భూమిని రైతుల శ్రమదానంతో సాగులోకి తీసుకువచ్చారు. సాగునీటి సౌకర్యం అంతగా లేని ప్రాంతంలో వర్షాధార పంటలైన చిరుధాన్యాలను పండించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతు పండించిన పంట దళారీల ప్రమేయంలేకుండా నేరుగా వినియోగదారులకు చేరేలా కృషి చేస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మహిళా రైతులకు శిక్షణ ఇచ్చేప్రయత్నాలు చేస్తూ వ్యవసాయరంగాన్ని నమ్ముకున్నవారిని కష్టాల నుంచి గట్టెక్కించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.   రేణుక మనం తీసుకునే ఆహారం కడుపు నింపడమే కాదు అనారోగ్యాల నుంచి రక్షణ ఇచ్చేలా ఉండాలి అంటున్నారు మహిళా రైతు రేణుక. కాలగర్భంలో కలిసిపోయిన వరివంగడాలను సేకరించి తిరిగి వాటిని సాగులోకి తీసుకువస్తున్నారు. సేంద్రీయవ్యవసాయం తాను చేయడమే కాకుండా తమ ఇరుగుపొరుగు వారిని కూడా ప్రోత్సహిస్తున్నారు. రేణుక సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం క్యాన్సర్ కారణంగా ఆమె మామగారు చనిపోవడం. ఆహారం, జీవనశైలీ కారణంగానే దీర్ఘకాలిక సమస్యలైన క్యాన్సర్, మధుమేహం, కీళ్లనొప్పులు, గుండెజబ్బులు వస్తాయని డాక్టర్లు చెప్పడం ఆమెను ఆలోచింప చేసింది. మరి మన తాతముత్తాలు ఏం తినేవారు అన్నదిశగా సాగిన ఆలోచనలు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయిన పురాతన వరి వంగడాలను సేకరించేలా చేశాయి. ఆమె భర్త తిరుపతి సహాకారంతో దాదాపు 51రకాల పాత వరి వంగడాలను సేకరించి వాటిని పండిస్తూ విత్తనాలను ఆసక్తి ఉన్న రైతులకు ఉచితంగా పంపిణి చేస్తున్నారు.   వ్యవసాయరంగంలో కూలీలుగానే కాదు ఆరోగ్యకరమైన సమాజం కోసం పాటుపడే మహిళలు ఎందరో ఉన్నారు అని నిరూపిస్తున్నారు ఈ ఐదుగురు మహిళలు. ఆరోగ్యానిచ్చే ఆహారాన్ని పండిస్తూ సమాజాన్ని ఆరోగ్యదాయకంగా చేసే ప్రయత్నం చేస్తూ వ్యవసాయరంగంలో ఉన్న ప్రతి మహిళకు జాతీయ మహిళా రైతు దినోత్సవం సందర్భంగా హాట్సాఫ్...
గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ కు గ్రేటర్ షాక్ తగలబోతుందా? బల్దియా ఎన్నికల్లో అధికార పార్టీ ఆగమాగం కానుందా? రెండోసారి జెండా ఎగరేయాలనున్న కారు పార్టీ స్పీడుకు జీహెచ్ఎంసీలో బ్రేక్ పడనుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది ప్రీపోల్ సర్వేల్లో. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై తీన్మార్ మలన్నకు చెందిన క్యూ న్యూస్ యూట్యూబ్ చానెల్ నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో గులాబీ పార్టీకి గుబులు రేపే ఫలితాలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో  రికార్డ్ స్థాయిలో 99 డివిజన్లు గెలిచిన టీఆర్ఎస్ కు ఈసారి అందులో పదో వంతు సీట్లు మాత్రమే వచ్చే అవకాశాలుఉన్నాయని సర్వే ఫలిచాలను బట్టి అర్ధమవుతోంది. ఇప్పటికిప్పుడు గ్రేటర్ లో ఎన్నికల్లో జరిగితే టీఆర్ఎస్ పార్టీకి మూడో స్థానం వస్తుందని ప్రీపోల్ సర్వే స్పష్టం చేస్తోంది. అది కూడా నాలుగో స్థానంలో ఉన్న టీడీపీ కంటే కొంచెం మెరుగ్గానే ఉంది గులాబీ పార్టీ పరిస్థితి   గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండు డివిజన్లు మాత్రమే గెలుచుకున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈసారి భారీగా పుంజుకున్నట్లు క్యూ న్సూస్ సర్వేలో తేలింది. గ్రేటర్ లో మెజార్టీ సీట్లు హస్తం కైవసం చేసుకోబోతుందని తెలుస్తోంది. బీజేపీ కూడా కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు గ్రేటర్ పరిధిలోని 40 డివిజన్లలో క్యూ న్యూస్ ప్రీపోల్ సర్వే పూర్తైంది. ఇందులో కాంగ్రెస్ 18 డివిజన్లలో ఆధిక్య సాధించి టాప్ లో నిలిచింది. బీజేపీ 13 డివిజన్లలో ముందంజలో ఉంది. ఇక అధికార టీఆర్ఎస్ మాత్రం కేవలం ఐదు డివిజన్లలోనే లీడ్ పొందింది. టీడీపీ నాలుగు డివిజన్లలో సత్తా చాటుతూ టీఆర్ఎస్ కు దరిదాపుల్లోనే నిలిచింది. గ్రేటర్ పరిధిలో 150 డివిజన్లు ఉండగా... అందులో పాతబస్తిలోనే 50 డివిజన్లున్నాయి. ఓల్డ్ సిటీలో ఎంఐఎందే పూర్తి ఆదిపత్యం కాబట్టి.. ఆ సీట్లపై మిగితా పార్టీలు ఆశలు పెట్టుకోవు. మిగితా 100 డివిజన్లలోనే పోటీ పడతాయి. ఈ వందలోనే 40 డివిజన్లలో సర్వే జరిపింది క్యూ న్యూస్ సంస్థ. సో... దాదాపుగా ఇవే ఫలితాలు మిగితా డివిజన్లలో ఉంటాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.   ప్రీపోల్ సర్వేను పక్కాగా నిర్వహించింది క్యూ న్యూస్ సంస్థ. ఎన్నికల్లో మాదిరే బ్యాలెట్ పేపర్లతోనే సర్వే చేస్తోంది. సర్వే నిర్వహించిన డివిజన్ లోనే బాక్సులు పెట్టగా.. ఆసక్తి గల ఓటర్లు బ్యాలెట్ పేపరులో పార్టీ సింబల్ పై టిక్ చేస్తూ పెట్టేలో వేశారు. తర్వాత అందరి సమక్షంలోనే వాటిని లెక్కిస్తున్నారు. అచ్చం పోలింగ్ జరుగుతున్నట్లుగా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతి డివిజన్ లోని  2 వందల మంది నుంచి ఓటు తీసుకుంటున్నారు. ఇందులో అన్ని వర్గాల వారు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు క్యూ న్యూస్ సర్వే నిర్వాహకులు. పారదదర్శకంగా సర్వే ఉండటంతో ఫలితాలపై ప్రజలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.    క్యూ న్యూస్ ఇప్పటివరకు నిర్వహించిన 40 డివిజన్లలో గ్రేటర్ లోని అన్ని ప్రాంతాలు దాదాపుగా కవరయ్యాయి. అయితే ప్రీ పోల్ సర్వేల్లో అధికార పార్టీకి నగరంలోని ఏ ప్రాంతంలోనూ సానుకూలత లభించడం లేదు. టీఆర్ఎస్ కు లీడ్ వచ్చిన ఐదు డివిజన్లలోనూ.. ఆ పార్టీకి ఇతర అభ్యర్థుల నుంచి   పోటీ  తీవ్రంగానే ఉంది. చాలా డివిజన్లలో అధికార పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. కాంగ్రెస్ ముందున్న స్థానాల్లో ఆ పార్టీకి భారీగా ఓట్లు వచ్చాయి. బీజేపీ కూడా మంచిగానే ఓట్లు సాధించింది. సరూర్ నగర్ లో అధికార పార్టీ ఏకంగా నాలుగో స్థానానికి దిగజారింది. సిటీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో ఆ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గ్రేటర్ శివారు ప్రాంతాల్లో అధికార పార్టీకి తీవ్ర వ్యతిరేకత వస్తుండగా.. ఆ ఏరియాల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి జనాల నుంచి ఊహించని సపోర్ట్ లభిస్తోంది.    ఎంపీ రేవంత్ రెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న మేడ్చల్ మాల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో గ్రేటర్ లోని 50 డివిజన్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఎంపీ పరిధిలోని డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ హవా కనిపిస్తోంది. మల్కాజ్ గిరి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ , ఉప్పల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ స్వీప్ చేసేలా కనిపిస్తోంది. ఈ నాలుగు  నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా.. అధికార పార్టీ ప్రీపోల్ సర్వేల్లో బాగా వెనకబడి పోయింది. నాగోల్, కాప్రాలో  మాత్రమే కారుకు లీడ్ వచ్చింది. కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి షాకిచ్చేలా సర్వే ఫలితాలు వచ్చాయి. ఎల్బీనగర్ పరిధిలో 8 డివిజన్లు ఉండగా.. ఒక్క బీఎన్ రెడ్డి నగర్ లో మాత్రమే టీఆర్ఎస్ ముందుంది. మంత్రి సబితారెడ్డి నియోజకవర్గం మహేశ్వరం పరిధిలోని సరూర్ నగర్ డివిజన్ లో గులాబీ పార్టీ ఏకంగా నాలుగో స్థానానికి పడిపోవడం ఆశ్చర్యం కల్గిస్తోంది.                           గ్రేటర్ శివారు ప్రాంత డివిజన్లలో కాంగ్రెస్ ముందుండగా.. న్యూసిటీలో మాత్రం బీజేపీ జోరు కనిపించింది ప్రీపోల్ సర్వేలో. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ పూర్తి సత్తా చాటింది. ఈ నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో  క్యూ న్యూస్ ఇప్పటివరకు నిర్వహించిన ప్రీపోల్ సర్వే లో బీజేపీనే మెజార్టీ సీట్లలో ముందంజలో ఉంది. గత ఎన్నికల్లో ఘోరంగా చతికిలపడిన కాంగ్రెస్ కూడా అనూహ్యంగా  కొన్ని డివిజన్లలో లీడ్ సాధించింది.  హైదరాబాద్ లోక్ సభ పరిధిలోని గోషామహాల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజాసింగ్ పట్టు కనిపించింది. గోషామహాల్ పరిధిలోని అన్ని డివిజన్లలో బీజేపీ లీడ్ సాధించగా.. కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది.    ఇక గ్రేటర్ హైదరాబాద్ లో టీడీపీ కనుమరుగయ్యందని ప్రచారం చేసే వారి దిమ్మ తిరిగేలా క్యూ న్యూస్ సర్వే ఫలితాలు కనిపిస్తున్నాయి. కూకట్ పల్లి , కుత్బుల్లాపూర్ పరిధిలోని గ్రేటర్ డివిజన్లలో టీడీపీ బలంగానే ఉన్నట్లు తేలింది. కొన్ని డివిజన్లలో ముందుండగా.. మరికొన్ని డివిజన్లలో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇప్పటివరకు జరిగిన సర్వేలో ఓవరాల్ గా అధికార టీఆర్ఎస్  కంటే టీడీపీకే ఎక్కువ ఓట్లు రావడం ఆసక్తి కలిగిస్తోంది. ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని డివిజన్లలోనూ టీడీపీకి మంచిగానే ఓట్లు పడ్డాయి. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపితే టీడీపీకి గ్రేటర్ ఎన్నికల్లో మంచి ఫలితాలే వస్తాయని ప్రీ పోల్ సర్వేను విశ్లేషించిన పొలిటికల్ అలిస్టులు చెబుతున్నారు.
తెలంగాణలో వరుస ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 3న జరగనున్న సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికకు ఇప్పటికే హోరాహోరీగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ లోపే బల్దియా కొత్త పాలకమండలి ఏర్పాటయ్యేలా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. వచ్చే మార్చి-ఏప్రిల్ లో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు మంత్రి కేటీఆర్. అయితే ఆయన ఫోకసంతా గ్రేటర్ , మండలి ఎన్నికలపైనే పెడుతున్నట్లు కనిపిస్తోంది. డిసెంబర్ లో జరుగుతాయని భావిస్తున్న జీహెచ్ఎంసీ, మరో ఆరు నెలల తర్వాత జరగనున్న మండలి ఎన్నికలపై వరుస సమీక్షలు చేస్తున్న కేటీఆర్.. దుబ్బాక ఉప ఎన్నికను మాత్రం పట్టించుకోలేదు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  నిజానికి మరికొన్ని రోజుల్లోనే జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఎక్కువ దృష్టి సారించాలి. కాని కేటీఆర్ మాత్ర దుబ్బాక ఎన్నిక గురించి అసలు మాట్లాడటమే లేదు. దుబ్బాక నేతలతో ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. కనీసం వారితో వీడియో కాన్ఫరెన్స్ లోనూ మాట్లాడలేదు కేటీఆర్.  సమయం సందర్భం వచ్చినప్పుడల్లా గ్రేటర్ ,మండలి ఎన్నికల్లో తామే గెలుస్తామని చెబుతున్న కేటీఆర్.. దుబ్బాకపై మాత్రం ఎక్కడా మాట్లాడటం లేదు. కేటీఆర్ వైఖరిపై టీఆర్ఎస్ లోనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. దుబ్బాకలో పార్టీ పరిస్థితి బాగాలేదని  గ్రహించడం వల్లే కేటీఆర్ దానిపై ఫోకస్ చేయడం లేదని చెబుతున్నారు. పార్టీ సర్వేలోనూ అదే  తేలిందంటున్నారు. అందుకే దుబ్బాకలో పార్టీ ఓడిపోయినా  తన ఇమేజ్  డ్యామేజీ కాకుండా ఉండేలా కేటీఆర్ జాగ్రత పడుతున్నారనే ప్రచారం కూడా ఉంది.                  గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠం మళ్లీ కైవసం చేసుకుంటామనే భావనలో కేటీఆర్ ఉన్నారట. అందుకు కారణం కూడా ఉందంటున్నారు. గ్రేటర్ లో ఇప్పటికే 30కి పైగా ఎక్స్ అఫిషియో సభ్యులు టీఆర్ఎస్ కు ఉన్నారు. ఓల్డ్ సిటీలో ఎలాగూ ఎంఐఎం దాదాపు 50 వరకు డివిజన్లు గెలుచుకుంటుంది. దీంతో గతం కంటే చాలా సీట్లు తగ్గినా.. మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న పతంగి పార్టీతో కలిసి గ్రేటర్ లో మళ్లీ పవర్ దక్కించుకునే అవకాశం అధికార పార్టీకి ఉంది. అందుకే గ్రేటర్ పై కేటీఆర్ ధీమాగా ఉన్నారని చెబుతున్నారు. మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేక ఫలితాలు వచ్చినా కేటీఆర్ కు పెద్ద  ఇబ్బంది ఉండదు. ఎందుకంటే గతంలోనూ మండలి ఎన్నికల్లో గులాబీ పార్టీకి చేదు ఫలితాలే వచ్చాయి. కాబట్టి ఈసారి అలాంటి ఫలితాలే వచ్చినా అది కేటీఆర్ కు అంత ఇబ్బందిగా ఉండదని చెబుతున్నారు. అందుకే తనకు మైనస్ కాకుండా ఉన్న గ్రేటర్ హైదరాబాద్, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలపైనే ఫోకస్ చేస్తూ.. ఇబ్బందిగా  ఉందని భావిస్తున్న దుబ్బాకను కేటీఆర్ పట్టించుకోవడం లేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.  దుబ్బాక ఉపఎన్నికతో మంత్రి హరీష్ రావుపై మెడపై కత్తి పెట్టారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం దుబ్బాక బాధ్యతలన్ని హరీష్ రావే చూస్తున్నారు. అక్కడ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో  అక్కడ వ్యతిరేక ఫలితం వస్తే.. ఆ నెపమంతా హరీష్ రావుకు  అంటగట్టే కుట్ర జరుగుతుందనే వాదనలు కూడా కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ లో మొదటి నుంచి హరీష్ రావుకు ట్రబుల్ షూటర్ గా పేరుంది. ఆయనకు బాధ్యతలు అప్పగించిన ప్రతి ఎన్నికల్లోనూ  సక్సెస్ చేసి చూపించారని చెబుతారు. అలాంటి ట్రబుల్ షూటర్ కు ట్రబుల్స్ కలిగేలా టీఆర్ఎస్ లోని ఓ వర్గం ప్లాన్ చేసిందనే ప్రచారం జరుగుతోంది. అందుకే పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలుస్తున్నా.. దుబ్బాకకు కేటీఆర్ ఎందుకు వెళ్లడం లేదని కొందరుచెబుతున్నారు. హరీష్ రావును ఇరికించే ప్రయత్న దుబ్బాక ఉప ఎన్నిక సాక్షిగా జరుగుతుందని బలంగా వాదిస్తున్నారు. అయితే తమ నేతపై కుట్రలు జరుగుతున్నాయని అనుమానిస్తూనే... దుబ్బాక  పరీక్షలో హరీష్ రావే గెలుస్తారని ఆయన అభిమానులు నమ్మకంగా చెబుతున్నారట.
ఒకప్పుడు రైళ్లు గంటకి పది మైళ్ల వేగంతో పరుగులు పెట్టేవి. ఇప్పుడో! గంటకి వంద మైళ్ల వేగం కూడా తక్కువగానే అనిపిస్తోంది. జీవితమూ అంతే... ఒకప్పుడు నిదానంగా సాగిన మన జీవితాలు ఇప్పుడు కుబుసాలు కదిలిపోయేంత వేగంగా పరుగులు పెడుతున్నాయి. ఇంత వేగంలో ఒత్తిడి కూడా సహజమే. మరి ఆ ఒత్తిడిని చిటికెలో తప్పించేందుకు కొన్ని చిట్కాలు ఇవిగో...   - ఒత్తిడితో కూడిన మనసు మీద శబ్దం చూపే ప్రభావం అపారం. మీకు ఇష్టమైన పాటని హమ్ చేయడమో, ప్రకృతిని తలపించే శబ్దాలను వినడమో (ఉదా॥ కెరటాలు) చేస్తే ఒత్తిడి తేలిపోతుంది. గది మధ్యలో చైనీస్ చిరుగంటలని తగిలించి, వాటి మీద మనసుని లగ్నం చేయడం కూడా కొందరికి ఉపశమనంగా ఉంటుంది.   - కాసేపు అలా వాహ్యాళికి వెళ్లడం వల్ల కూడా మనసులోని ఒత్తిడి నిదానంగా కరిగిపోతుంది. ఒత్తిడిని కలిగించే ఆలోచనలను పక్కన పెట్టి, శ్వాస మీద దృష్టిపెడుతూ నడకని సాగిస్తుంటే ఒత్తిడి ఇట్టే మాయమవుతుంది. సమస్య గురించి కాకుండా దానికి పరిష్కారాల గురించీ, జీవితంలో అంతకంటే విలువైన విషయాల గురించీ ఆలోచించే అవకాశం దక్కుతుంది.   - ఒత్తిడిగా అనిపించినప్పుడు లేచి నిల్చోవాలి. తల, వెన్ను, భుజాలని నిటారుగా ఉంచుకొని నిదానంగా, దీర్ఘంగా ఊపిరి పీల్చుకోవాలి. బయటకి వదిలే ప్రతి ఊపిరితోనూ మీలోని ఉద్వేగం తగ్గిపోతున్నట్లుగానూ, లోపలకి తీసుకునే ప్రతి శ్వాసతోనూ మనసు తేలికపడుతున్నట్లు భావించాలి.   - ఓ అందమైన దృశ్యం లేదా సాంత్వన కలిగించే చిత్రాన్ని కాసేపు గమనించండి. కిటికీలోంచి బయట ప్రకృతిలోకి చూడటమో, మీకు ఇష్టమైన రంగులో ఉన్న వస్తువుని పరిశీలించడమో చేయవచ్చు. ఏదీ కుదరకపోతే కళ్లు మూసుకుని ఓ అందమైన ప్రకృతి దృశ్యాన్ని (ఉదా॥ జలపాతం) ఊహించుకోండి.   - ఉద్వేగం ఓ విషవలయం. ఉద్వేగంతో మన కండరాలన్నీ బిగుసుకుంటాయి. బిగుసుకుపోయిన కండరాలు మరింత ఉద్వేగానికి దారితీస్తాయి. కాబట్టి మనసు ఉద్వేగంగా ఉన్నప్పుడు ఆ ప్రభావం మన మొహంలో కనిపించకుండా జాగ్రత్త పడాలి. అందుకోసం ఒక్కసారి మన శరీరం మీద ధ్యాస ఉంచాలి. నుదురు, పిడికిళ్లు బిగదీసి లేకుండా చూసుకోవాలి.   - ఉద్వేగాన్ని ఎదుర్కొనేందుకు నవ్వుని మించిన దివ్యౌషధం లేదు. నవ్వడం వల్ల మన శరీరంలో ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ అనే రసాయనాల ఉత్పత్తి తగ్గి, వాటి బదులుగా ఆనందాన్ని రేకెత్తించే ఎండోమార్ఫిన్స్ అనే రసాయనాలు వెలువడతాయి. కాబట్టి మనస్ఫూర్తిగా నవ్వడమో, అలా నవ్వేందుకు ఇష్టమైన కామెడీ సన్నివేశాన్ని చూడటమో చేయవచ్చు.   - శబ్దమే కాదు, స్పర్శ కూడా ఉద్వేగాన్ని దూరం చేస్తుంది. మనకి ఇష్టమైన వస్తువుని పట్టుకుని ఉండటమో (ఉదా॥ టెడ్డీ బేర్), రబ్బర్ బాల్ని చేతితో నొక్కడమో, వేడి నీటితో స్నానం చేయడమో, వెచ్చటి దుప్పటిని కప్పుకోవడమో... ఉద్వేగం నుంచి తప్పకుండా దూరం చేస్తాయి.                     - నిర్జర.
  అది ఒక కొండ మీద ఉన్న గ్రామం. ఆ గ్రామంలో నీరు కరువుగా ఉండేది. గ్రామంలో ఉన్న పేదలు కాస్తోకూస్తో ఉన్న నీటితో సరిపెట్టుకుంటుంటే, ధనికులు మాత్రం కొండ దిగువన ఉన్న చెరువు నుంచి నీటిని కావడితో తెప్పించుకునేవారు. అలా ఓ పెద్దాయన తన యజమాని కోసం రోజూ కావడితో నీటిని మోసుకు వెళ్లేవాడు. కాలం ఇలా గడుస్తూ ఉండగా...  ఒకరోజు కావడిలో ఉన్న రెండు కుండలలో ఒకదానికి పగులు వచ్చింది. కానీ దాన్ని పెద్దాయన అవతలికి పడేయకుండా, ఎప్పటిలాగా దానిలో నీటిని నింపి కొండమీదకు తీసుకువెళ్లసాగాడు. రోజూ ఆ కుండ నిండా నీటిని నింపడం, కొండ మీద ఉన్న యజమాని ఇంటికి చేరుకునేసరికి దానిలో ఉన్న సగం నీరు వృథాగా నేలపాలవడం జరుగుతూనే ఉండేది.   ‘నీ వల్ల ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ!’ అని ఒక రోజు పగులు ఉన్న కుండని ఆడిపోసుకుంది మంచి కుండ. దానికి ఏం సమాధానం చెప్పాలో పగిలిన కుండకి అర్థం కాలేదు. ‘నిజంగానే తనకి ఉన్న పగులు వల్ల ఆ పెద్దాయన శ్రమంతా వృధా అయిపోతోంది కదా’ అనుకుంది. ఆ రోజు మొదలు- మంచి కుండ, పగులు ఉన్న కుండని రోజూ దెప్పిపొడవడం.. పగులు ఉన్న కుండ మారుమాట్లాడలేక దిగాలుగా ఉండిపోవడం జరుగుతూనే వస్తోంది.   ‘నన్ను అవతల పడేయండి. నా వల్ల మీ శ్రమంతా వృథా అయిపోతోంది. యజమానికి తగినంత నీరుని కూడా ఇవ్వలేకపోతున్నారు,’ అంటూ తనని మోస్తున్న పెద్దాయనతో ఒక రోజు మొరపెట్టుకొంది పగులు ఉన్న కుండ. కుండ నేరుగా తనతో మాట్లాడటం చూసి పెద్దాయన ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. అటు మీదట చిరునవ్వుతో... ‘నిన్ను అవతల పడేయటం మాట అటుంచు. ముందు నీ దిగులుని పోగొట్టే ఉపాయం ఒకటి చెబుతా విను. ఇవాళ కొండ మీదకి ఎక్కే దారిలో అటూఇటూ విరగబూసిన పూలను కాస్త గమనించు. వాటి అందం చూసి నీ మనసులో ఉన్న ఆందోళన అంతా మాయమైపోవడం ఖాయం!’ అన్నాడు.   పగులు ఉన్న కుండ ఆ రోజు నిజంగానే దారికి ఇరువైపులా ఉన్నా పూలబాటను గమనించింది. నిజంగానే ఆ అందమైన రంగురంగుల పూలని చూసి దాని మనసులో దిగులు మాయమైంది. సాయంత్రం కాగానే పెద్దాయన పగిలిన కుండతో- ‘నేను చెప్పినట్లుగా దారిలో ఉన్న పూల చెట్లను గమనించావా?’ అని అడిగాడు. దానికి పగిలిన కుండ - ‘ఓ! గమనించాను. కానీ నా సంగతేంటి? మీరు నన్ను ఎప్పుడు అవతల పడేస్తున్నారు?’ అని అడిగింది.   ‘నిన్ను అవతల పడేసే ప్రశ్నే లేదు! ఎందుకంటే ఆ దారిలో ఉన్న పూలచెట్లన్నీ నీ చలవే. కాస్త కాస్తగా నీ నుంచి జారే నీటితో ఆ దారంతా అందమైన పూల మొక్కలు పెరిగాయి. అవి ఇప్పుడు ఆ బాటన పోయే ప్రతివారికీ సంతోషాన్ని కలిగిస్తున్నాయి. మరి ముందు ముందు కూడా ఆ మొక్కలకి నీళ్లు అవసరం కదా! నిన్నెలా వదులుకోగలను. పొద్దుగూకులా కష్టపడే నా మనసుకి తృప్తిని అందించేంది ఆ పూల మొక్కలే సుమా!’ అంటూ చెప్పుకొచ్చాడు పెద్దాయన. ఆ మాటలకి పగిలిన కుండ మనసులో ఉన్న కాస్తో కూస్తో దిగులు కాస్తా ఆవిరైపోయింది. ప్రపంచంలో ఎవరి జీవితమూ నిరుపయోగం కాదనీ, తమ లోటుపాట్లను గుర్తించినట్లే సామర్థ్యాలను కూడా గుర్తుంచుకోవాలనీ తెలిసివచ్చింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) ..Nirjara
మనిషిని ఇతర జీవుల నుంచి వేరు చేసే ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. సామాజిక జీవితం వాటిలో ముఖ్యమైనది. సమాజంలో మెలిగేందుకు, సంఘజీవిగా నిలదొక్కుకునేందుకు భాష, భావం... ఈ రెండూ చాలా అవసరం. భావాన్ని వ్యక్తీకరించడంలో మన కళ్లు చూపే ప్రతిభ అసాధారణం. మనిషి కళ్లలో ఉండే స్క్లెరా అనే తెల్లటి పదార్థం వల్ల మనిషి కనుగుడ్లు చిత్రవిచిత్రమైన భావాలను పలికించగలవు. అతని కనుగుడ్లలో మార్పులు, కదలికలను బట్టి.... అతను ఎటు చూస్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు అన్నది పసిగట్టేయవచ్చు. దీని గురించి ప్రత్యేకమైన శిక్షణ ఏమీ అవసరం లేదు. అలా తెలిసిపోతుందంతే! కాకపోతే మనకి తెలియకుండానే మన కళ్లు చేసే మాయ గురించి కాస్త అవగాహనను ఏర్పరచుకుంటే, కాస్త జాగ్రత్తగా మసులుకునే అవకాశం ఉంటుంది. - మనలో ఎంత విశ్వాసం ఉన్నాగానీ, అవతలి మనిషి కళ్లలోకి అదేపనిగా గుచ్చిగుచ్చి చూస్తూ ఉంటే... ఎదుటివారికి వ్యతిరేక భావం కలుగుతుంది. ఎంతటి దగ్గరవారైనా కానీ మాట్లాడే సమయంలో 70 శాతం మించి సమయాన్ని కళ్లలో కళ్లు పెట్టి చూడకూడదంటున్నారు బాడీలాంగ్వేజ్‌ నిపుణులు.   - అదేపనిగా చూస్తే బాగోదు అంటూ ఒక పక్క సంభాషణ జరుగుతూ ఉన్నా కూడా దిక్కులు చూస్తూ ఉంటే అసలుకే మోసం వస్తుంది. మీలో ఏదో అపరాధ భావం ఉందనో, అవతలి మనిషంటే లెక్కలేదనో... చూపులతోనే చెప్పినట్లవుతుంది. - కొంతమంది ఒకరితో మాట్లాడుతూ ఉంటారు. పక్కచూపులతో వేరొకరిని చూస్తూ ఉంటారు. ఇది కూడా అవతలి మనిషిలో చిరాకు కలిగించే అంశమే! మాట్లాడే వ్యక్తికి సదరు పక్క వ్యక్తి అంటే అనుమానమో, ఆసక్తో ఉంటే ఇలా జరుగుతూ ఉంటుంది.     - సంభాషణ మధ్యలో అవతలివాడు కను రెప్పలను చాలా నిదానంగా మూసి, ఒక్క క్షణం అలా మూసే ఉంచుతున్నాడంటే... అతను నిరాసక్తిగా ఉన్నట్లే! ఒక రకంగా చెప్పాలంటే అవతలి మనిషిని కాసేపు మర్చిపోవడానికి కళ్లు మూసుకున్నాడని అనుకోవచ్చు. ఇక దానికి తోడు సుదీర్ఘమైన నిట్టూర్పు కూడా వచ్చిందంటే అతని మీద జాలి పడక తప్పదు. అలా కాకుండా అవతలి వ్యక్తి మాట్లాడుతూ మాట్లాడుతూ తెగ కళ్లని ఆర్పుతున్నాడంటే... అతను ఏదో ఉద్వేగంలో ఉన్నట్లు లెక్క. - సంభాషణలో మనం ఎదుటివారి వంక చూస్తున్నప్పుడు ముఖ్యంగా రెండు రకాలుగా మన చూపుని వారి మీద కేంద్రీకృతం చేస్తాము. ఒకటి ఎదుటివారి కళ్లలోకి, ఆ తరువాత అతని నుదుటి మధ్యలోకి... అంటే ఒక త్రిభుజాకారంలో వారిని గమనిస్తాము. లేదా ఎదుటివారి కళ్లలోకి, ఆ తరువాత వారి నోటి వైపుకీ... అంటే తలకిందులుగా ఉన్న త్రిభుజాకారంలో చూస్తాము. మొదటి పద్ధతిలో ఎదుటి వారి మీద మనం ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నామన్న హెచ్చరికను అందచేస్తుంది. పై అధికారులు, ఇంటర్వూ చేసేవారు ఇలాంటి చూపులు చూస్తుంటారు. ఇక రెండో పద్ధతిలో అవతలివారితో స్నేహపర్వకంగా మెలుగుతున్న సూచనను తెలియచేస్తుంది.       - కేవలం సంభాషణలోనే కాదు. ఒక మనిషి ఒంటరిగా ఉన్నా కూడా అతని కళ్లు ఏం చేస్తున్నాయదన్నదాటి బట్టి అతని మనస్థితిని గ్రహించవచ్చు. ఎదో గుర్తుకు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడా, వైరాగ్యంలో ఉన్నాడా, తనలో తాను మాట్లాడుకుంటున్నాడా అన్నది అతని కళ్లని బట్టి తేలిపోతుంది. అదెలాగంటారా! మీరే ఆ భావాలను అనుకరించడానికి ప్రయత్నించండి! ఆ సమయంలో మీ కళ్లు అసంకల్పితంగానే మీ స్థితికి అనుగుణంగా కదలడాన్ని గమనిస్తారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. కళ్లు ఈ లోకాన్ని చూడటానికే కాదు, మీ భావాలను అవతలివారితో పంచుకోవడంలో కూడా ముఖ్యపాత్రని వహిస్తాయి. అందుకే శరీరభాష (బాడీలాంగ్వేజ్‌)లో కళ్లకి ఉన్న ప్రాధాన్యత అసాధారణం. మీ ఆసక్తి, ఓపికలని బట్టి కంటి భాష గురించి ఎన్ని వివరాలనైనా సేకరించుకోవచ్చు. - నిర్జర.  
ఇప్పుడు శరీరానికి కూడా కావల్సినన్ని మరమ్మతులు చేయవచ్చునని ఓ పరిశోధన రుజువు చేస్తోంది.   డీఎన్‌ఏ ఎడిటింగ్‌ మన శరీరంలో ప్రతి కణాన్నీ కూడా అందులో ఉండే డీఎన్ఏ శాసిస్తుందనే విషయం తెలిసిందే! కాబట్టి ఏదన్నా అవయవం దెబ్బతిన్నదంటే ఆ అవయవ నిర్మాణంలో ముఖ్యమైన డీఎన్‌ఏ కూడా దెబ్బతిన్నట్లు లెక్క. అందుకనే ఒక వ్యక్తి డీఎన్ఏలో తగిన మార్పులు చేయడం ద్వారా అతనికి మళ్లీ ఆరోగ్యాన్ని కలిగించే ప్రయత్నాలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. అందులో ఓ ముఖ్యమైన ప్రయత్నమే డీఎన్‌ఏ ఎడిటింగ్. ఇందులో ఇప్పటికే Crispr-Cas9 అనే తరహా చికిత్స దాదాపు అందుబాటులోకి వచ్చేసింది. చైనా శాస్త్రవేత్తలు ఈ విధానాన్ని ఉపయోగించి క్యాన్సర్‌ను సైతం నయం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. Crispr-Cas9 చికిత్సలో భాగంగా కొన్ని మార్పులు చేసిన కణాలను శరీరంలోకి ప్రవేశపెడతారు. అవి డీఎన్ఏలోని హానికారకమైన భాగాలను తొలగించే కత్తెరలా ఉపయోగపడతాయట. మొండి క్యాన్సర్లను సైతం నిర్మూలించడంలో ఈ ప్రక్రియ అమోఘంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.   మరో అడుగు చైనా శాస్త్రవేత్తలు కృషి ఇలా ఉండగా, మరో పక్క అమెరికాకు చెందిన కొందరు పరిశోధకులు అసలు ఏకంగా డీఎన్‌ఏలో తెగిపోయిన భాగాలను అతికించే పనిలో పడ్డారు. ఇప్పటి వరకు ఈ విధానం కేవలం చర్మం, జీర్ణవ్యవస్థ వంటి చిన్ని చిన్న అవయవాలకే పరిమితం అయ్యేది. ఎందుకంటే అక్కడి కణాలు ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉంటాయి. కానీ మెదడు, కళ్లు, కాలేయం, గుండె వంటి అవయవాలు దెబ్బతింటే వాటిలోని డీఎన్ఏ మళ్లీ సాధారణ స్థితికి రావడం కష్టం. అందుకోసం ఇప్పుడు  అమెరికాకు చెందిన పరిశోధకులు మరో తరహా డీఎన్‌ఏ ఎడిటింగ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగా ఏదన్నా ముఖ్యమైన అవయవం దెబ్బతింటే, అందులోని డీఎన్ఏను మళ్లీ సరిదిద్దేందుకు, డీఎన్‌ఏల మధ్య తెగిపోయిన బంధాన్ని తిరిగి సరిచేసేందుకు రోగి శరీరంలోకి సరికొత్త కణాలను ప్రవేశపెడతారు. ఈ తరహా చికిత్సను HITI టెక్నాలజీ అంటున్నారు.   ఫలితాలు మొదలయ్యాయి HITI టెక్నాలజీ ద్వారా ఇప్పటికే అంధత్వం వచ్చిన ఎలుకలలో మళ్లీ చూపుని తీసుకువచ్చారు. మున్ముందు ఈ సాంకేతికను మరింత అభివృద్ధి చేయగలిగితే ఎలాంటి రోగాన్నైనా నివారించవచ్చని చెబుతున్నారు. అంతేకాదు, మనలో వృద్ధాప్యం వచ్చేందుకు డీఎన్ఏలో వచ్చే మార్పులే కారణం కదా! కాబట్టి, డీఎన్‌ఏలో తగిన మార్పుని తీసుకురావడం ద్వారా వృద్ధాప్యాన్ని కూడా వాయిదా వేయవచ్చునంటున్నారు.   - నిర్జర.
vamana avatar story,vamana jayanti,Vamana Jayanti 2019,Vaman Jayanti Festival, Vaman Dwadashi ,vamana avatar,vamana avatar story in telugu So what can we do to stay healthy? Walking! It may sound like a simple activity but it will take care of your body like you never dis before. To start with a walk for a good amount of time can keep your heart away from the bad cholesterol [LDL] and increases the good one [HDL]. Spend 30 minutes in this activity and stay away from high blood pressure by 27%Walking also keeps diabetes at bay. This is the claim of the British Medical Journal. If you are a habitual walker you reduce your risk of colon, breast or womb cancer by 20%. This is definitely an easy way to live longer. An obvious advantage walking everyday is that you can stay in shape, with the least effort. A person who weighs 60 kilos burns 75 calories simply by walking. What can be a better motivation to get you to walk? But if you still think you need a motivating factor to walk, find a walking partner or take your pet out. This way you will have a change from your routine while getting some ‘’me time’’. Dementia and osteoporosis are a few among many problems you can avoid just by walking. Walking benefits your arms too! You may not realize it, but each time you swing your arms rhythmically you tone your arms, shoulders and upper back. Your walking time can also help you get some vitamin D. Walking in the sun will give your body this essential vitamin. Many people in UK are deficient of this nutrient because of lack of exposure to sunlight. You don’t let this happen to yourself, okay?
టమాటాతో చేసే వంటకాన్ని ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఎలాంటి వంటకమైన టమాట వేస్తే చాలు దానికి రుచి వచ్చేసినట్లే. కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందిట ఈ టమాట.టమాటా లలో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సిలు ఎక్కువ మోతాదులో ఉంటాయట.ఎసిడిటీతో బాధపడేవారు టమాటాలతో తయారు చేసిన వంటకాన్ని రుచి చూస్తే ఎంతో ఉపశమనం కలుగుతుంది. టమాటాల్లో సిట్రిక్ యాసిడ్ ఉండటంతో ఎసిడిటీ దూరమౌతుంది. ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉండటంవలన యాంటాసిడ్‌లా ఉపయోగపడుతుందంటున్నారు వైద్యులు. టమాటాల్లో విటమిన్ ఏ అధికంగా ఉండటంతో కంటి జబ్బులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది.టమాటాని చక్రాలుగా తరికి కళ్ళ మీద పెట్టుకున్నా కళ్ళకి చల్లదనం లభిస్తుంది. వీటిల్లోని విటమిన్‌ ఏ, విటమిన్‌ సి  రోగ నిరోధకశక్తినీ పెంపొందించి వ్యాధుల నుంచి రక్షణ కల్పించటంలో తోడ్పడతాయి.వీటికి ఎర్రటి రంగును తెచ్చిపెట్టే లైకొపేన్‌ మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్ల వృద్ధిని అడ్డుకోవటంలో సాయం చేస్తుంది.     ఆడవారికి నచ్చే మరో విషయం ఏమిటో తెలుసా? ప్రతిరోజూ తినే ఆహారంలో టమాటా  తింటే బరువు తగ్గుతారని పరిశోధకులు చెప్తున్నారు. టమాటాలు తినే వారు ఇతర ఆహార పదార్ధాలను ఎక్కువగా తినలేరు. ఇవి తింటే కడుపు నిండినట్లు ఉండి ఎక్కువ అన్నం గాని , ఇతర పదార్దములు గాని తిననీయదు.  కాబట్టి ఆకలి మీద నియంత్రణ ఉండి, తక్కువగా తింటారు.   మెనోపాజ్‌ దశలో ఉన్న వారు రోజు రెండు గ్లాసుల టమాటా రసాన్ని తాగడం వల్ల ఎముకలు అరిగి,విరిగిపోయే సమస్యకి స్వస్తి చెప్పవచ్చు. టమాటాల్లోని లైకోపీన్‌ వల్ల ఎముకలు బలంగా మారతాయని అధ్యయనంలో తేలింది. టమాటాల్లో గుండెకు మేలు చేసే పొటాషియం, రక్తంలో గ్లూకోజు స్థాయులను నియంత్రించే మాంగనీసులాంటివి కూడా పుష్కలంగా ఉన్నాయట. టమాటాల్లో ఇన్ని అద్భుతాలు ఉన్నాయా అని ఆశ్చర్యం వేస్తోంది కదూ. అసలే టమాటాల సీజన్. ఇంకెందుకు ఆలస్యం ఆరోగ్యాన్ని పెంపొందించుకునే పని మొదలుపెట్టేద్దాం. ......కళ్యాణి