LATEST NEWS
  దీదీ కోటలో కమలం గుబాళిస్తుందా.. హంగ్ దిశగా అడుగులు.. ఉత్కంఠ రేపుతున్న ఎగ్జిట్ పోల్స్!.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి. మొత్తం 294 సీట్లలో బీజేపీ, టీఎంసీలకు తలో 100 నుంచి 140 సీట్లు రావొచ్చని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. దీంతో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే హంగ్ పరిస్థితి ఏర్పడే అవకాశంపై చర్చ జరుగుతోంది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ (148)కు దగ్గరగా చేరితే చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతు కోరే అవకాశం ఉంది. అదే టీఎంసీ ముందంజలో ఉంటే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల సహకారం తీసుకునే అవకాశముంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మళ్లింది. తాజా అంచనాల ప్రకారం, రాష్ట్రంలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చని, హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మరియు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ సాగుతోంది. గత రెండు దశాబ్దాలుగా బెంగాల్ రాజకీయాలను శాసిస్తున్న మమతా బెనర్జీకి ఈసారి గట్టి సవాల్ ఎదురవుతోంది. ఎగ్జిట్ పోల్స్ గణాంకాలను పరిశీలిస్తే, గతంతో పోలిస్తే బీజేపీ తన బలాన్ని గణనీయంగా పెంచుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు టీఎంసీకి అండగా నిలుస్తుండగా, పట్టణ ప్రాంతాల్లో మార్పు కోరుకునే ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్ల తీర్పు అత్యంత కీలకం కానుంది. మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలు మహిళలను ఆకట్టుకోగా, మరోవైపు అవినీతి ఆరోపణలు మరియు శాంతిభద్రతల సమస్యలను బీజేపీ ప్రధాన అస్త్రాలుగా మలచుకుంది. దీంతో ఓటర్ల తీర్పు ఎటువైపు ఉంటుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈసారి లెఫ్ట్ మరియు కాంగ్రెస్ కూటమి కూడా కొన్ని స్థానాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకవేళ టీఎంసీ, బీజేపీలలో ఏ ఒక్కరికీ మ్యాజిక్ ఫిగర్ దక్కకపోతే, ఈ కూటమి కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు. కొన్ని సర్వేలు బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని చెబుతుండగా, మరికొన్ని సర్వేలు దీదీనే మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని అంచనా వేస్తున్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ ఎన్నికలు కేవలం బెంగాల్ భవిష్యత్తునే కాకుండా, జాతీయ రాజకీయాల్లో కూడా కీలక మార్పులకు సంకేతం కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు అమిత్ షా నేతృత్వంలో బీజేపీ ఈసారి గెలుపుపై అత్యంత ధీమాతో ఉంది. అదే సమయంలో, బెంగాల్ గడ్డపై తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి మమతా బెనర్జీ తన సర్వశక్తులూ ఒడ్డారు. ఎన్నికల ఫలితాల ప్రకటనకు సమయం దగ్గర పడుతుండటంతో అటు టీఎంసీ క్యాడర్, ఇటు బీజేపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఓట్ల లెక్కింపు తర్వాత గానీ బెంగాల్ సింహాసనంపై కూర్చునేది ఎవరో స్పష్టత రాదు. అప్పటి వరకు ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రాజకీయ వేడిని పెంచుతూనే ఉంటాయి. చివరికి ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారా లేక సంక్షేమానికా అనేది మే 4న వెలువడే ఫలితాలతో తేలిపోనుంది. అప్పటివరకు ఈ రాజకీయ చదరంగంలో ఎవరు విజేతగా నిలుస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది.
 రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి పెరిగిపోయిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. నందినగర్ లోని తన నివాసంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా  పార్టీ నేతలతో సమావేశమైన కేటీఆర్.. ఈ రెండున్నరేళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిన అవినీతి, కుంభకోణాలను చూసిన ప్రజలు ఆ పార్టీకి మరో రెండు దశాబ్దాల పాటు ఓటు వేయరన్నారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో   బీఆర్ఎస్ బ‌లోపేతం,  స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం, క‌మిటీల నిర్మాణం లాంటి అంశాల‌పై నేతలతో చర్చించిన కేటీఆర్ .  స్థానిక సంస్థల ఎన్నికల్లో  మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను  ఈ సందర్భంగా అభినందించారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందన్న కేటీఆర్.. కమర్షియల్ గ్యాస్ సిలెండర్ పై ఒకే సారి దాదాపు వెయ్యి రూపాలయలు పెంచడం అందులో ఒకటన్నారు. గ్యాస్ ధర పెంపునకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.  
బీఆర్ఎస్ నుంచి కవిత నిష్క్రమించడంతో, కేటీఆర్, కవితల మధ్య మాటల యుద్ధం    అధికారికంగా మొదలైంది. తెలంగాణలో ఎన్నో రాజకీయ పార్టీలు వస్తూ పోతూ ఉంటాయని, వాటి గురించి మాట్లాడటంలో గానీ, వాటిపై మానసిక వనరులను వృధా చేయడంలో గానీ అర్థం లేదని తన సోదరి కల్వకుంట్ల కవిత కొత్తగా ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అన్నా చెళ్లెళ్ల మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి.   కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు.  బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత..  ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుం టున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే..  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.  మమ్మల్ని సీరియస్‌గా తీసుకోకూడదని  అంటున్నారు. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా తొలుత చిన్నగానే మొదలవుతుంది,  పాత టీఆర్ఎస్ కూడా చాలా నెమ్మదిగానే ప్రారంభమైందని కవిత గుర్తు చేశారు. నా పార్టీ కూడా అలాంటి ధోరణినే చూడబోతోందన్నారు. తనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఇసుమంతైనా పట్టిచుకోనన్న కవిత..  తెలంగాణ రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి కష్టపడి పనిచేస్తానన్నారు. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత, ఆమె సొంత పార్టీ ప్రకటించిన తరువాత ఆమెపై పరోక్షంగానే అయినా తొలిసారి కేటీఆర్ విమర్శించారు. అంటే అన్నాచెళ్లెళ్ల మధ్య మాటల యుద్ధం దిశగా తొలి అడుగు పడిందన్నమాటేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ముందు ముందు ఈ మాటల యుద్ధం మరింత   ముదురుతుందని అంచనా వేస్తున్నారు.   ఒకప్పుడు ఐక్యంగా ఉండి ప్రత్యర్థులను ఎదుర్కొన్న కల్వకుంట్ల కుటుంబంలో ఇప్పుడు చీలిపోయింది.  బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె పార్టీతో విభేదించి బయటకు వచ్చేశారు. ఆ సందర్భంగా కేటీఆర్.. యధాలాపంగానే అయినా  గత ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమికి   ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక ప్రధాన కారణమని అన్నారు. అయితే దానికి కవిత అప్పట్లో తీవ్రంగా ఖండించారు.  దాంతో అప్పటి నుంచీ కవిత విషయంలో కేటీఆర్ మౌనం వహిస్తూ వచ్చారు. అయితే తాజాగా కవిత టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తరువాత..  రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతుంటాయి, పోతుంటాయి.. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కవిత పార్టీని తక్కువ చేసే విధంగా మాట్లాడారు.  పార్టీ   ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.  కవిత పార్టీ లాంటి  చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వొద్దని కార్యకర్తలకు సూచించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత కూడా ఘాటుగా స్పందించారు.  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం నారా లోకేష్ హవా నడుస్తోంది. గతంలో ఆయనను లక్ష్యంగా చేసుకుని వైసీపీ సోషల్ మీడియా విభాగం చేసిన ప్రచారాలు ఇప్పుడు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పేరును తెరపైకి తెచ్చి, టీడీపీలో వారసత్వ చిచ్చు పెట్టాలనే  వైసీపీ ఎత్తుగడలు ఇప్పుడు నవ్వులపాలౌతున్నాయి.   2024 ఎన్నికల్లో కూటమి చారిత్రాత్మక విజయం సాధించడం..  అందులోనూ లోకేష్ మంగళగిరిలో రికార్డు మెజారిటీతో గెలవడం.. అంతకు ముందు తన యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ ప్రజా నాయకుడిగా ఎదగడంతో ఇప్పుడు వైసీపీ ఆయనపై ఎక్కుపెడుతున్న పాత విమర్శలు, వ్యాఖ్యలు ఇసుమంతైనా ప్రభావం చూపడం లేదు.   ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన  యువగళం పాదయాత్ర లోకేష్‌ను   ప్రజలకు చేరువ చేయడమే కాకుండా..  ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న  సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి. పాత ఇమేజ్‌ను పూర్తిగా చెరిపివేసి, ఒక మాస్ లీడర్‌గా ఆయన ఎదిగిన తీరు వైసీపీ వ్యూహకర్తలకు మింగుడుపడటం లేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి వంటి కీలక శాఖల మంత్రిగా లోకేష్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో వైసీపీ ప్రచారాల్లో వినిపించిన  పప్పు  అనే ముద్రను ఆయన తన తీరుతో  తుడిచిపెట్టేశారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతూ..  రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. మరోవైపు వైసీపీ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ మాత్రం ఇంకా పాత వ్యూహాలతోనే లోకేష్ పై దాడి చేస్తున్నది. జూనియర్ ఎన్టీఆర్ అంశాన్ని వాడుకుంటూ లోకేష్‌ను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే వాటిని జనాలు ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు.   సినిమా రంగంలో ఎన్టీఆర్ ప్రస్థానం వేరు, రాజకీయాల్లో లోకేష్ ప్రయాణం వేరు. ఒకరితో ఒకరిని పోల్చి విద్వేషాలు సృష్టించాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నం వల్ల ఇసుమంతైనా ప్రయోజనం ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  లోకేష్ పై వైసీపీయులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న విమర్శలు, ట్రోలింగ్స్ నవ్వుల పాలౌతున్నాయి. ఇటువటి చౌకబారు ప్రయత్నాలు వైసీపీ ప్రతిష్టను మరింత మసకబారుస్తున్నాయంటున్నారు.  నారా లోకేష్ ప్రస్తుతం కేవలం ఒక వారసుడిగా మాత్రమే కాకుండా, టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.  యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ పరిస్థితుల్లో 2019 నాటి పాత స్క్రిప్టులతో లోకేష్‌ను దెబ్బతీయాలనుకోవడం వైసీపీకి రాజకీయంగా ఆత్మహత్యాసదృశ్యమేనని పరిశీలకులు అంటున్నారు. సోషల్ మీడియాలో కృత్రిమంగా సృష్టించే వివాదాల కంటే క్షేత్రస్థాయిలో లోకేష్ సంపాదించుకున్న ప్రజాభిమానం ఎంతో బలంగా ఉందని చెబుతున్నారు.  వైసీపీ ఇంకా పాతకుట్రలు, వ్యూహాలతో చేస్తున్న ప్రయత్నాలు.. ఆ పార్టీ 2014 ఘోర పరాజయం నుంచి పాఠాలు, గుణపాఠాలూ నేర్చుకోలేదనడానికి నిదర్శనమని అంటున్నారు.   
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కీలక అంకం మొదలైంది. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ ) నుంచి బయటకు వచ్చి సొంత రాజకీయ వేదికను టీఆర్ఎస్ ను ఏర్పాటు చేసుకున్న   కల్వకుంట్ల కవిత..  ఇప్పుడు తన తదుపరి లక్ష్యాన్నిప్రకటించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె..  రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే   ప్రధాన ధ్యేయమన్నారు.  ఈ పోరాటంలో జెన్-జీగా పిలువబడే నేటి యువతను భాగస్వామ్యం చేస్తామన్నారు. యువత  ఆకాంక్షలకు అనుగుణంగా తన రాజకీయ పంథాను మార్చుకోబోతున్నట్లు వెల్లడించారు. కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో యువతరం ఆలోచనలు, వారి అవసరాలు గతానికి భిన్నంగా ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని  విమర్శించారు. స్క్రీన్లపై సమయం గడుపుతున్నారని యువతను విమర్శించే బదులు.. అదే డిజిటల్ వేదికలను వారి గొంతుకగా మార్చుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని..  అందుకే ఆ పార్టీని ఓడించేందుకు యువశక్తిని ఏకం చేయాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. రాజకీయాల్లో యువత  కేవలం ఓటర్లుగానే కాకుండా, నాయకులుగా కూడా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు కవిత చెప్పారు. తన పార్టీలో జెన్-జీ ప్రతినిధులకు పెద్దపీట వేస్తానని..  సమాజంలో వెనుకబడిన వర్గాలకు, అట్టడుగున ఉన్న వారికి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. కేవలం రాజకీయ ప్రసంగాలకు పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయిలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగిత, విద్యా సంబంధిత సమస్యలపై పోరాటమే తన అజెండా  అన్న కవిత.. రాష్ట్రంలో  రేవంత్ సర్కార్   వైఫల్యాలను ఎండగట్టడంలో యువతే ముందువరుసలో ఉంటారని  విశ్వాసం వ్యక్తం చేశారు.  ఇటీవల తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్  జారీ చేసిన నోటిఫికేషన్లలో వయోపరిమితి సడలింపు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును కవిత తీవ్రంగా తప్పుబట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన 10 ఏళ్ల వయోపరిమితి సడలింపును అమలు చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆమె ఆరోపించారు. జీవో 30ని యథాతథంగా అమలు చేయాలని, లేనిపక్షంలో నిరుద్యోగుల పక్షాన భారీ ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.  రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి యువతతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించాలని కవిత ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా 2029 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే పునాదులు వేయాలని ఆమె భావిస్తున్నారు. తన తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటికీ, తెలంగాణ సెంటిమెంట్‌ను, యువత ఆకాంక్షలను కలగలిపి కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాన్ని చూపిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
విక్టరీ వెంకటేష్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శకుటుంబం: హౌస్ నెం. 47’ (AK 47) చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన హై-వోల్టేజ్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. (Aadarsha Kutumbam House No 47) యాక్షన్ మోడ్‌లో వెంకీ మామ: వెంకటేష్, త్రివిక్రమ్ కాంబో కోసం అభిమానులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి కలయికలో వస్తున్న మొదటి పూర్తిస్థాయి చిత్రం ‘ఆదర్శకుటుంబం’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన భారీ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్‌ను మేకర్స్ తాజాగా పూర్తి చేశారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ కెవిన్ కుమార్ నేతృత్వంలో కొన్ని రోజుల పాటు జరిగిన ఈ షూట్‌లో వెంకటేష్ పాల్గొని పవర్‌ఫుల్ యాక్షన్ సీన్లలో మెరిశారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయినప్పటికీ, క్లైమాక్స్‌లో వచ్చే ఈ ఫైట్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. ఇక కొన్ని టాకీ పార్ట్ సీన్లు మాత్రమే మిగిలి ఉండగా, త్వరలోనే సినిమా మొత్తం పూర్తవుతుందని చిత్ర యూనిట్ తెలుపుతోంది. థమన్ ఎంట్రీతో మారిన మ్యూజిక్: ఈ ప్రాజెక్టు మ్యూజిక్ విషయంలో ఒక ఆసక్తికర మార్పు చోటుచేసుకుంది. మొదట హర్షవర్ధన్ రామేశ్వర్‌ను సంగీత దర్శకుడిగా అనుకున్నప్పటికీ, ఇప్పుడు ఆ బాధ్యతలను ఎస్.ఎస్. థమన్ స్వీకరించారు. త్రివిక్రమ్-థమన్ కాంబో అంటే మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ కావడంతో, ఈ అప్‌డేట్ ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపింది. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.  
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రాకా’ (Raaka). అనౌన్స్ అయినప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘రాకా’ ఫస్ట్ లుక్ పోస్టర్, అందులో ఆయన కనిపించిన 'వేర్ వోల్ఫ్' (Werewolf) షేడ్స్ సినిమాపై హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయి. ఇప్పుడు ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులోకి మరో స్టార్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అక్షయ్ కుమార్ స్పెషల్ రోల్? తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ క్యామియో కోసం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ను అట్లీ సంప్రదించినట్లు తెలుస్తోంది. కథను కీలక మలుపు తిప్పే పాత్ర కావడంతో, దానికి అక్షయ్ అయితేనే పర్ఫెక్ట్ అని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే 'జవాన్' సినిమాతో హిందీ బెల్ట్‌లో అట్లీకి మంచి క్రేజ్ ఉంది, దానికి తోడు అల్లు అర్జున్ పాన్ ఇండియా ఇమేజ్ తోడవ్వడంతో అక్షయ్ కూడా ఈ ప్రాజెక్టు పట్ల ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. షాకింగ్ కాంబినేషన్స్: కేవలం అక్షయ్ కుమారే కాకుండా, ఈ సినిమాలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూడా అతిథి పాత్రలో మెరుస్తారని గతంలో వార్తలు వచ్చాయి. ఒకవేళ ఇవన్నీ నిజమైతే, ఇండియన్ స్క్రీన్‌పై ఇది అతిపెద్ద మల్టీస్టారర్ అవుతుందనడంలో సందేహం లేదు.  ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ అని, మైథాలజీ అంశాలు కూడా మిక్స్ అయి ఉంటాయని టాక్. దీపికా పదుకొణె ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.   
హైదరాబాద్‌లో శనివారం రాత్రి జరిగిన ఒక వివాహ రిసెప్షన్ వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రన్ నారంగ్ వివాహ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు భారీగా తరలివచ్చారు. అయితే ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం మాజీ దంపతులు నాగచైతన్య, సమంతలే. చైతన్య, సమంత విడిపోయిన తర్వాత సాధారణంగా ఒకే వేదికపై కనిపించడానికి ఇష్టపడరు. కానీ ఈ వేడుకకు ఇద్దరూ హాజరుకావడం గమనార్హం. నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళతో కలిసి, కుటుంబ సభ్యులు నాగార్జున, అమలలతో ఈ వేడుకకు విచ్చేశారు. మరోవైపు సమంత కూడా తన భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి ఈ రిసెప్షన్‌లో సందడి చేశారు. విడాకుల తర్వాత తమ వ్యక్తిగత జీవితాల్లో స్థిరపడిన ఈ జంట, చాలా కాలం తర్వాత ఒకే ఈవెంట్‌లో తారసపడటం సినీ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు దారితీసింది. అయితే వీరిద్దరూ నేరుగా మాట్లాడుకున్నారా లేదా అనేది తెలియనప్పటికీ, ఒకే చోట తమ కొత్త భాగస్వాములతో కలిసి కనిపించడం మాత్రం కెమెరా కళ్లకు చిక్కింది. గతంలో 'ఏమాయ చేశావే' సినిమాతో వెండితెరపై మాయ చేసిన ఈ జోడీ, వాస్తవ జీవితంలో కూడా ఒకటిగా మారి అందరినీ మురిపించారు. కొన్ని కారణాల వల్ల విడిపోయిన వీరు, ప్రస్తుతం ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు. సమంత తన మెడపై ఉన్న 'YMC' టాటూను ఇప్పటికీ అలాగే ఉంచుకోవడం అభిమానుల దృష్టిని మరోసారి ఆకర్షించింది. తమ ప్రేమకు గుర్తుగా కాకుండా, కెరీర్ ప్రారంభించిన సినిమాపై గౌరవంతో ఆమె దానిని ఉంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, రవితేజ వంటి స్టార్ హీరోలు కూడా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇంతమంది దిగ్గజాలు ఉన్నప్పటికీ, మీడియా ఫోకస్ అంతా చై-సామ్ వైపే ఉండటం విశేషం. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ పరిణామంపై భిన్నంగా స్పందిస్తున్నారు. ఇద్దరూ తమ జీవితాల్లో ముందుకు సాగుతూ సంతోషంగా ఉండటం చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శోభిత, రాజ్ నిడిమోరులతో కలిసి వారు దిగిన ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి.
టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) సినిమాలంటే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. వైవిధ్యమైన కథాంశాలతో థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆయన, ఇటీవల 'డెకాయిట్' (Dacoit) అనే రొమాంటిక్ యాక్షన్ డ్రామాతో అలరించారు. ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన మంచి స్పందననే సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేందుకు సిద్ధమైంది. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ? అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'డెకాయిట్' సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా మే 8 నుంచి ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మంచి స్పందన లభించిన ఈ చిత్రం, నాలుగు వారాలకే ఓటీటీలో అలరించనుంది. కథా నేపథ్యం: ఈ సినిమా కథ హరిదాస్ (అడివి శేష్) చుట్టూ తిరుగుతుంది. ఒక హత్య కేసులో 13 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన హరిదాస్, కడప జైలు నుంచి మరో చోటికి మారుస్తున్న సమయంలో తప్పించుకుంటాడు. తనను జైలు పాలు చేసిన మాజీ ప్రేయసి సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాల్ ఠాకూర్)పై పగ తీర్చుకోవాలని హరి నిర్ణయించుకుంటాడు. అయితే ఆమెను కలిశాక హరిదాస్‌కు ఊహించని విషయాలు తెలుస్తాయి. అసలు వారిద్దరూ ఎందుకు విడిపోయారు? హరిదాస్ తన పగను తీర్చుకున్నాడా? లేదా అనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం సాగుతుంది. యాక్షన్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ 'డెకాయిట్' సినిమాకు షానియల్ డియో దర్శకుడు. షానియల్ డియోతో కలిసి అడివి శేష్ స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందించారు. అతుల్ కులకర్ణి, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, వైభవ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. థియేటర్లలో మిస్ అయిన వారు మే 8 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించవచ్చు.  
ప్రస్తుతం టాలీవుడ్‌లో 'నందమూరి బాలకృష్ణ' (Nandamuri Balakrishna) పేరు ఒక సెన్సేషన్. వయసు పెరుగుతున్న కొద్దీ బాక్సాఫీస్ వద్ద ఆయన సృష్టిస్తున్న విధ్వంసం మామూలుగా లేదు. వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య కోసం.. ప్రస్తుతం టాలీవుడ్ మాత్రమే కాదు, ఇతర చిత్ర పరిశ్రమల దర్శకులు, నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు. ఎనిమిది మంది దర్శకులు.. పది మంది నిర్మాతలు! ప్రస్తుతం బాలయ్య క్రేజ్ మామూలుగా లేదు. ఆయన కాల్షీట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. దాదాపు ఎనిమిది మంది ప్రముఖ దర్శకులు బాలయ్య కోసం కథలను సిద్ధం చేసుకుని వేచి చూస్తున్నారు. వీరిలో టాలీవుడ్ దర్శకులతో పాటు ఇతర భాషల దర్శకులు ఉండటం విశేషం. కన్నడ, మలయాళం, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన ముగ్గురు క్రేజీ దర్శకులు బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే పక్కా యాక్షన్ స్క్రిప్టులతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం దర్శకులే కాదు, బాలయ్య సినిమా అంటే మినిమం గ్యారెంటీ వసూళ్లు వస్తాయని నమ్ముతున్న పది మందికి పైగా నిర్మాతలు ఆయన డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారట. ఇతర ఇండస్ట్రీలకు చెందిన ఇద్దరు టాప్ ప్రొడ్యూసర్స్ బాలయ్యతో భారీ సినిమాలను ప్లాన్ చేస్తున్నారట. లైన్ లో క్రేజీ ప్రాజెక్టులు ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ సినిమా చేస్తున్న బాలకృష్ణ.. తన తదుపరి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో అనౌన్స్ చేశారు. పలు ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నాయి. వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల వంటి టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్ బాలయ్యతో సినిమా చేయడానికి స్క్రిప్ట్ లు రెడీ చేసే పనిలో ఉన్నారు. ఒకప్పుడు సీనియర్ హీరోల మార్కెట్ పడిపోతుందని భావించిన వారందరికీ తన సక్సెస్‌తో బాలయ్య గట్టి సమాధానం ఇచ్చారు. మాస్ పల్స్ తెలిసిన హీరో కావడంతో పాటు, అటు బుల్లితెరపై 'అన్‌స్టాపబుల్' షోతో యువతకు కూడా దగ్గరవ్వడం ఆయనకు ప్లస్ అయ్యింది. మరి గోపీచంద్ మలినేని, కొరటాల శివ ప్రాజెక్ట్ ల తర్వాత  బాలయ్య ముందుగా ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి.  
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కుమార్తె జనని బండ్ల వివాహం సూర్యతేజ చిలుకూరితో నిశ్చయమైంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నిశ్చితార్థ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజతో జనని నిశ్చితార్థం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.  అలాగే మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, శ్రీకాంత్, బోయపాటి శ్రీను, శ్రీను వైట్ల, కోన వెంకట్ తదితరులు విచ్చేసి కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. గత నెలలోనే తన కుమార్తె వివాహం నిశ్చయమైనట్లు బండ్ల గణేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇప్పుడు నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు, అభిమానులు కొత్త జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.   https://x.com/Theteluguone/status/2050810560363794636
తాంత్రిక థ్రిల్లర్ 'అగధ' అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలుస్తోంది. ఎందుకంటే, ఈ చిత్ర దర్శక నిర్మాతలు విడుదల చేసిన తొలి పోస్టర్‌తోనే భారీ ఉత్సుకతను రేకెత్తించగలిగారు. ఒక భారీ విగ్రహం ముందు ఒక మహిళ నిలబడి ఉన్న చిత్రం యొక్క మొట్టమొదటి పోస్టర్, ట్రేడ్, ప్రేక్షకులు మరియు వ్యాపార వర్గాలలో సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇప్పుడు దర్శక నిర్మాతలు ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో, ఒక చీకటి గుహ లాంటి ప్రదేశంలో ఒక వ్యక్తి నిర్భయంగా నిలబడి, అనేక చేతులు కలిగిన ఒక భారీ తాంత్రిక విగ్రహాన్ని ఎదుర్కొంటున్నట్లుగా ఉంది. అతని చుట్టూ క్రతువుల అగ్నుల నుండి జ్వాలలు పైకి లేస్తున్నాయి. అతను ఒక చేతిలో కత్తిని, మరొక చేతిలో తెగిపోయిన తలను పట్టుకుని ఉన్నాడు. ఇది తాంత్రికత మరియు ప్రమాదంతో కూడిన ఒక శక్తివంతమైన ఘర్షణను సూచిస్తుంది. కేవలం పోస్టర్ల ద్వారానే 'అగధ' ఈ స్థాయిలో ఎలా సందడిని సృష్టించగలిగిందనేది ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రతి డిజైన్ ఈ రహస్యానికి ఒక కొత్త కోణాన్ని జోడిస్తూ, ప్రేక్షకులను దాని తాంత్రిక ప్రపంచంలోకి మరింత లోతుగా ఆకర్షిస్తోంది. కేవలం దృశ్యాల ద్వారానే ఇలాంటి స్పందన రావడం చాలా అరుదు. ఇది సినిమా వెనుక ఉన్న బలమైన సృజనాత్మక దృక్పథాన్ని సూచిస్తుంది. ఈ ఉత్సాహానికి మరింత జోడిస్తూ, 'అగధ' టీజర్ మే 7 ఉదయం 10.20 గంటలకు విడుదల కానుందని పోస్టర్ అధికారికంగా ప్రకటించడంతో, అంచనాలు మరో స్థాయికి చేరుకున్నాయి. విలక్షణమైన కాన్సెప్ట్‌లను అందించడంలో పేరుగాంచిన ఎం. ఎస్. రాజు ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్న 'అగధ' చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో ఏకకాలంలో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'అగధ', ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ దశలో ఉంది.  ఈ చిత్రాన్ని భారీ సెట్‌లు మరియు వాస్తవ ప్రదేశాలలో 85 రోజుల పాటు చిత్రీకరించారు. ఇందులో దాదాపు 45 నిమిషాల విఎఫ్ఎక్స్ ఉపయోగించారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.  
ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులను తన స్టెప్పులతో ఉర్రూతలూగించిన ‘కింగ్ ఆఫ్ పాప్’ మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మైఖేల్’ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో అద్భుతమైన విజయాన్ని సాధిస్తోంది. కేవలం కొద్ది రోజుల్లోనే ఈ సినిమా వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.   ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా సినీ విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించినప్పటికీ, అభిమానులు మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు. బాక్సాఫీస్ లెక్కల ప్రకారం, ఈ చిత్రం ఇప్పటికే అనేక ప్రముఖ బయోపిక్‌ల రికార్డులను అధిగమించింది. ముఖ్యంగా అమెరికాతో పాటు భారత్‌లో కూడా మైఖేల్ జాక్సన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ వసూళ్లు నిరూపిస్తున్నాయి. దాదాపు రూ. 2000 కోట్లకు పైగా గ్లోబల్ వసూళ్లతో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీలో మైఖేల్ జాక్సన్ పాత్రను పోషించిన ఆయన మేనల్లుడు ‘జాఫర్ జాక్సన్’ గురించి ఎంత చెప్పినా తక్కువే. తొలి సినిమాతోనే జాఫర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎం.జె. అభిమానుల మనసు గెలుచుకున్నారు. తెరపై జాఫర్ నటన చూస్తుంటే సాక్షాత్తు మైఖేల్ జాక్సనే మళ్లీ పుట్టివచ్చారా? అనేలా ఉందని ప్రేక్షకులు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఆయన డాన్స్ మూమెంట్స్ మరియు బాడీ లాంగ్వేజ్ అచ్చు గుద్దినట్లు మైఖేల్‌ను తలపిస్తున్నాయి.   డైరెక్టర్ ఆంటోనీ ఫుక్వా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఎంజే చిన్నప్పటి నుంచి గ్లోబల్ సూపర్ స్టార్‌గా ఎదిగిన తీరును ఎంతో హృద్యంగా చూపించారు. షూటింగ్ సమయంలో జాఫర్ పడిన కష్టం, ఆయన డ్యాన్స్ కోసం చేసిన ప్రాక్టీస్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో మైఖేల్ జాక్సన్ సృష్టించిన ప్రభావాన్ని ఈ సినిమా మరోసారి కళ్లముందు ఉంచిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘మైఖేల్’ సినిమాపై భారీ చర్చ నడుస్తోంది. కొంతమంది విమర్శకులు కథలో లోపాలు ఉన్నాయని చెప్తున్నా, సాధారణ ప్రేక్షకులు మాత్రం ఎంజే మేజిక్‌ను బిగ్ స్క్రీన్‌పై ఎంజాయ్ చేస్తున్నారు. మరిన్ని రికార్డులను తిరగరాసే దిశగా దూసుకుపోతున్న ఈ సినిమా, లాంగ్ రన్‌లో మరిన్ని బెంచ్ మార్క్ వసూళ్లను సాధించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఇప్పుడే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ వైడ్‌గా తన సత్తా చాటుతున్నారు. 'దేవర' ఘనవిజయం తర్వాత తారక్ తన తదుపరి చిత్రాలను మరింత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 'కేజీఎఫ్', 'సలార్' చిత్రాలతో సంచలనం సృష్టించిన మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ జతకట్టడం భారతీయ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భారీ యాక్షన్ డ్రామాకు సంబంధించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న డ్రాగన్ చిత్రంపై అంచనాలు  ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతోంది. ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్‌లో చాలా మార్పులు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇంత‌కుముందు కంటే ప‌వ‌ర్‌ఫుల్ గా స్క్రిప్ట్ రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది.  ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్న రూపాల్లో కనిపించబోతున్నారు. ఒకే సినిమాలో రెండు షేడ్స్ చూపించడం ప్రశాంత్ నీల్ స్పెషాలిటీ కాగా, ఎన్టీఆర్ మేకోవర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పార్ట్-1లో ఎన్టీఆర్ చాలా షార్ప్‌గా, లీన్ లుక్‌లో కనిపించనున్నారు. పార్ట్-2 కోసం తారక్ ‘బీస్ట్ మోడ్’లోకి మారనున్నారు. భారీ కండలు పెంచి బల్క్ ట్రాన్స్‌ఫార్మేషన్ చూపించబోతున్నారు. ప్రశాంత్ నీల్ రెండు భాగాల షూటింగ్‌ను ఒకే సమయంలో సమాంతరంగా ప్లాన్ చేయడంతో నిరంతరం ఫిజిక్ మార్చుకోవడం తారక్ డెడికేషన్‌కు ఒక సవాలుగా మారింది. ఈ భారీ యాక్షన్ డ్రామా యొక్క తదుపరి షెడ్యూల్ మే 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ కొత్త షెడ్యూల్‌లో కథానాయికతో పాటు చిత్రంలోని ఇతర కీలక నటులు కూడా జాయిన్ కాబోతున్నారు. సినిమాలోని మేజర్ యాక్షన్ బ్లాక్స్ మరియు ఎమోషనల్ సీన్లను ఈ షెడ్యూల్‌లోనే చిత్రీకరించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. 
ఇటీవల సోషల్ మీడియాలో గెటప్ శ్రీను (Getup Srinu) ఇంటర్వ్యూ ప్రోమో ఒకటి వైరల్ అవుతూ టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. నాగబాబు గారితో కలిసి ఒక కొత్త సిరీస్ చేస్తున్నానని, దాని టైటిల్ 'మేము కాపులం' అని గెటప్ శ్రీను చెప్పి షాకిచ్చాడు. దాంతో యాంకర్ "సినిమాలకు కులం పేరు పెట్టడం ఏంటి?" అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తొక్కలో ఇంటర్వ్యూ అంటూ గెటప్ శ్రీను వెళ్ళిపోయాడు. గెటప్ శ్రీను ఇంటర్వ్యూ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రకరకాల కామెంట్స్ వినిపించాయి. కొందరు ఆ టైటిల్ పెట్టడాన్ని తప్పుబడితే, మరికొందరు మాత్రం ఇది ప్రాంక్ అని తేలికగా తీసుకున్నారు. తాజాగా ఈ విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.  నిజానికి ఆ సిరీస్ పేరు 'మేము కాపులం' కాదు, 'మేము COPలం'. ఇక్కడ 'COP' అంటే ఇంగ్లీష్ లో పోలీస్ అని అర్థం. గెటప్ శ్రీను ఈ సిరీస్‌లో ఒక పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. తాజాగా ఈ విషయాన్ని తెలుపుతూ కొత్త వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో శ్రీను తన పోలీస్ యూనిఫామ్ చూపిస్తూ.. "మేము పోలీసులం (COPS), అందుకే మేము COPలం అని పేరు పెట్టాం" అని క్లారిటీ ఇచ్చారు. ఈ సిరీస్ జీ5 (ZEE5) ఓటీటీ వేదికగా త్వరలో విడుదల కానుంది. 'మేము COPలం' అనే విభిన్నమైన టైటిల్‌తో వస్తున్న ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. త్వరలోనే దీని విడుదల తేదీని జీ5 అధికారికంగా ప్రకటించనుంది.   https://x.com/Theteluguone/status/2050560252102533340
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే.. కూలర్ ఉపయోగించేటప్పుడు కూలర్ లో నీరు చేపల వాసన వస్తూ ఉంటుంది. కొందరు కూలర్ నుండి వాసన వస్తూ ఉందనే కారణంతో దాన్ని ఆఫ్ చేస్తారు. అయితే కూలర్ ను వాడకుండా ఉండటం పరిష్కారం కాదు.  కూలర్ ట్యాంక్ లోని పాత నీరు,  నాచు, తేమ కారణంగా కూలర్ లో చేపల వాసన లాగా వస్తూ ఉంటుంది. ఈ సమస్యకు చాలా సులువుగా చెక్ పెట్టవచ్చు.  అందుకోసం అనుసరించాల్సిన చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. కూలర్ నుండి చేపల వాసన ఎందుకు వస్తుంది? కూలర్‌లో చేపల వాసన రావడానికి అత్యంత సాధారణ కారణం ట్యాంక్‌లో పేరుకుపోయిన బయోఫిల్మ్ , బ్యాక్టీరియా. ట్యాంక్‌లో నీరు ఎక్కువ సేపు నిలిచి ఉన్నప్పుడు, సూక్ష్మజీవులు వృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. నిలిచిపోయిన నీరు బయోఫిల్మ్‌ను ఏర్పరుస్తుంది, ఇది వాసనకు కారణమవుతుంది.  అది మాత్రమే కాకుండా కూలర్‌లోని మురికి, దుమ్ము , తేమ కూడా ఈ వాసనకు కారణం అవుతాయి. వాసన ఎలా తొలగించాలంటే.. కూలర్ నుండి దుర్వాసనను తొలగించడానికి  వైట్  వెనిగర్‌ను ఉపయోగించవచ్చు. వైట్  వెనిగర్‌ను ఉపయోగించడం వల్ల కూలర్ నీటి నుండి వచ్చే చేపల వాసనను తొలగిపోతుంది. ఒకవేళ వైట్ వెనిగర్ లేకపోతే దానికి  ప్రత్యామ్నాయంగా బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. వెనిగర్ అనేది దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపే ఒక సహజ క్రిమిసంహారకం. మొదటగా  కూలర్ ట్యాంక్‌ను ఖాళీ చేయాలి. ఆ తర్వాత, ట్యాంక్‌లో వెనిగర్ పోసి కాసేపు అలానే ఉంచాలి. తర్వాత, ట్యాంక్‌ను శుభ్రంగా రుద్దాలి. ఆ తర్వాత 2 నుండి 3 టీస్పూన్ల బేకింగ్ సోడా కలపాలి. ట్యాంక్ శుభ్రం చేయాలి. దీని తర్వాత ట్యాంక్‌ను నీటితో నింపాలి. దీనివల్ల కూలర్‌లోని దుర్వాసన పోతుంది. ఎసెంటియల్ ఆయిల్స్.. ట్యాంక్‌ను శుభ్రం చేసిన తర్వాత నీటిని నింపి ఆ  నీటిలో ఎసెంటియల్ ఆయిల్స్  ఉపయోగించవచ్చు. కూలర్ నీటిలో 2 నుండి 3 చుక్కల టీ ట్రీ ఆయిల్ లేదా లెమన్‌గ్రాస్ ఆయిల్ కలపాలి. ఇది కూలర్ నుండి స్వచ్ఛమైన గాలి ప్రవహించడానికి సహాయపడుతుంది. కూలర్‌లోని నీటిని ప్రతి 2 నుండి 3 రోజులకు మార్చితే కూలర్ నుండి దుర్వాసన రాదు. చాలా మంది కూలర్ లో  నీటి మట్టం తగ్గగానే ప్రతిరోజూ నీటిని అయితే నింపుతూ ఉంటారు. కానీ.. పూర్తీగా కూలర్ ట్యాంక్ ను క్లీన్ చేసి కొత్త నీటిని నింపుతూ ఉంటే కూలర్ నుండి వాసన అనేది రాదు.                                 *రూపశ్రీ.
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది. అదే బెల్లం జిగటగా మారడం.  గాలిలోని వేడి, తేమ కారణంగా బెల్లం తరచుగా కరిగి జిగటగా మారుతుంది. అంతేకాకుండా, కొన్నిసార్లు దానికి బూజు కూడా పడుతుంది. వేసవిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం వల్ల వేసవి కాలంలో కూడా బెల్లం తాజాగా, పొడిగా ఉండేలా చేయవచ్చు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. ఎయిర్ టైట్ కంటైనర్.. బెల్లానికి గాలి, తేమ అనేవి అతిపెద్ద శత్రువులు. అందువల్ల బెల్లాన్ని నిల్వ చేయడానికి ఎల్లప్పుడూ మంచి నాణ్యత గల ఎయిర్ టైట్ కంటైనర్ ను  ఉపయోగించాలి. వీలైతే గాజు లేదా స్టీల్‌తో చేసిన పాత్రను ఎంచుకోవాలి. ప్లాస్టిక్ పాత్రలలోకి తరచుగా తేమ చేరి, బెల్లం కరిగిపోతుంది. చిన్న ముక్కలు.. మార్కెట్  నుండి తెచ్చిన బెల్లం ముద్ద మొత్తాన్ని ఒకేసారి డబ్బాలో వేస్తుంటారు. అయితే ఈ పద్ధతిని మానుకోవాలి. బెల్లాన్ని నిల్వ చేసే ముందు చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. దీనివల్ల  అవసరమైనంత మాత్రమే బయటకు తీయడం వీలవుతుంది. బెల్లం మొత్తం పదేపదే బయటి గాలికి గురికాకుండా సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు.. అవసరైమనప్పుడల్లా  బెల్లాన్ని బయటకు తీసి దాన్ని ఏదైనా రాయి లేదా రాడ్ లాంటి దానితో కొట్టి చిన్న ముక్క తీసుకుని,  తిరిగి దాన్ని మళ్లీ కంటైనర్ లో పెట్టడం లాంటివి చేస్తుంటే బెల్లం తొందరగా మెత్తబడి జిగటగా మారుతుంది. నీరు, తడి చేతులకు దూరం.. ఇది చాలా చిన్న విషయమే అయినా చాలా ముఖ్యమైనది. హడావిడిలో బెల్లం తీయడానికి తడి చేతులను గానీ, తడి చెంచాను గానీ ఎప్పుడూ ఉపయోగించకూడదు. చిన్న నీటి చుక్క కూడా  బెల్లం డబ్బా మొత్తాన్ని జిగటగా మార్చి, దానిని పాడుచేస్తుంది. బెల్లం తీసేటప్పుడు ఎల్లప్పుడూ పూర్తిగా పొడి చెంచాను  లేదా పొడి చేతులను మాత్రమే వాడాలి. బియ్యం చిట్కా.. బియ్యం చిట్కా మన అమ్మమ్మల కాలం నుండి వస్తున్న ఒక పాత చిట్కా.. కానీ ఇది చాలా ప్రభావవంతమైన చిట్కా. కొద్దిగా  బియ్యాన్ని ఒక శుభ్రమైన పత్తి లేదా మస్లిన్ గుడ్డలో కట్టి,  బెల్లం నిల్వ చేసే పాత్ర అడుగున ఉంచాలి. ఆ బియ్యం పాత్రలోని అదనపు తేమను పీల్చుకుంటుంది, దీనివల్ల  బెల్లం పూర్తిగా పొడిగా ఉంటుంది. ఫ్రిజ్ లో నిల్వ.. వేసవిలో  విపరీతమైన వేడి, తేమ ఉంటే , బెల్లాన్ని బయట కాకుండా ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. అయితే, దానిని నేరుగా డబ్బాలో ఉంచి నిల్వ చేయకూడదు. బెల్లం ముక్కలను జిప్-లాక్ బ్యాగ్‌లో లేదా శుభ్రమైన కాగితంలో గట్టిగా చుట్టి, ఆ తర్వాత వాటిని ఫ్రిజ్‌లోని ఎయిర్ టైట్ కంటైనర్ లో నిల్వ చేయాలి. ఇలా చేస్తే బెల్లం జిగటగా మారడం, కరగడం వంటివి జరగవు.                      *రూపశ్రీ.
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు పక్కనే ఉన్నా ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉంటున్నాం. నేటి కాలంలో మొబైల్ ఫోన్ మన అందరికీ "మొదటి లైఫ్ పార్ట్నర్" (First Life Partner) గా మారిపోయింది. ఈ డిజిటల్ వ్యసనం వల్ల మన మధ్య ఉండాల్సిన క్వాలిటీ టైమ్ మాయమైపోతోంది. ఈ పరిస్థితిని మార్చుకుని, మళ్ళీ మన బంధాలను ఎలా చిగురింపజేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొబైల్ వాడకాన్ని ఎందుకు తగ్గించాలి? (Why Should We?) మొబైల్ పక్కన పెట్టి మనుషులతో గడపడం ఎందుకు ముఖ్యం అంటే: సరైన నిర్ణయాలు తీసుకోవడానికి: ముఖాముఖి మాట్లాడుకున్నప్పుడే ఒక విషయంపై చర్చించి సరైన నిర్ణయం (Decision making) తీసుకోగలం. గౌరవం ఇవ్వడం: ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చూసుకోకుండా ఉండటం కనీస గౌరవం. బంధం బలపడటానికి: వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లేదా ఫ్యామిలీ మధ్య క్వాలిటీ టైమ్ గడపడం వల్ల అనుబంధం పెరుగుతుంది. ఏమి చేయకూడదు? (What Not To Do?) మనకు తెలియకుండానే చేసే ఈ తప్పులు బంధాలను దూరం చేస్తున్నాయి: మొదటి ప్రాధాన్యత ఇవ్వకండి: ఫోన్ కంటే ముందు మనిషికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫోన్ ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ కాకూడదు. మధ్యలో మాట్లాడకండి: ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో అకస్మాత్తుగా ఫోన్ కాల్ వస్తే అక్కడి నుండి వెళ్ళిపోవడం లేదా గట్టిగా మాట్లాడటం చేయకూడదు. దీనివల్ల అవతలి వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. ముఖ్యమైన సందర్భాల్లో వాడొద్దు: పెళ్లి చూపులు వంటి ముఖ్యమైన చర్చల్లో పాల్గొన్నప్పుడు మొబైల్స్ చూస్తూ కూర్చోవడం వల్ల వచ్చిన అసలు ఉద్దేశమే మర్చిపోయే ప్రమాదం ఉంది. ముందుకు వెళ్ళే మార్గం - చిట్కాలు (How-To Points): మొబైల్ వ్యసనం నుండి బయటపడటానికి ఈ చిన్న మార్పులు చేయండి: సెల్ఫ్ డిసిప్లిన్ (Self-discipline): మొబైల్ వాడకం విషయంలో మనకు మనమే ఒక క్రమశిక్షణ విధించుకోవాలి. సైలెంట్ మోడ్‌లో పెట్టండి: ఎవరితోనైనా క్వాలిటీ టైమ్ గడుపుతున్నప్పుడు లేదా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టి దూరంగా ఉంచండి. ముందే చెప్పండి: ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటే, వారికి "నేను ఒక గంట పాటు బిజీగా ఉంటాను, తర్వాత కాల్ చేస్తాను" అని మెసేజ్ పెట్టి మీ క్వాలిటీ టైమ్‌ను ఆస్వాదించండి. పరస్పర అంగీకారం: భార్యాభర్తలు ఇద్దరూ కలిసి "మనం బయటికి వెళ్ళినప్పుడు మొబైల్స్ వాడొద్దు" అని ఒక రూల్ పెట్టుకోవాలి. ఎవరైనా వాడితే రెండో వ్యక్తి నిర్మొహమాటంగా గుర్తు చేయాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A): ప్రశ్న: బోర్ కొట్టినప్పుడు మొబైల్ చూడటం తప్పా? సమాధానం: బోర్ కొట్టినప్పుడు ఫోన్ చూడటం సహజమే, కానీ ఎదురుగా ఒక మనిషి ఉన్నప్పుడు వారిని వదిలేసి ఫోన్ చూస్తూ కూర్చోవడం సరైన పద్ధతి కాదు. ఇది గౌరవం మరియు కామన్ సెన్స్ (Common sense) కి సంబంధించిన విషయం. ప్రశ్న: ఫోన్ వాడొద్దు అని చెబితే అవతలి వారు కోప్పడితే ఏం చేయాలి? సమాధానం: ఇది కోప్పడాల్సిన విషయం కాదు. "మనం ఈ సమయాన్ని సరదాగా గడపడానికి వచ్చాం, కాసేపు ఫోన్ పక్కన పెడదాం" అని సున్నితంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. మొబైల్ ఫోన్ అనేది మన అవసరానికి మాత్రమే, మన జీవితం అవ్వకూడదు. మన కళ్ళ ముందు ఉన్న మనుషుల కంటే, ఆ స్క్రీన్ లో కనిపించే ప్రపంచం ముఖ్యం కాదు. కాబట్టి, నేటి నుండే మీ మొబైల్‌ను కాసేపు పక్కన పెట్టి మీ ప్రియమైన వారితో ఆనందంగా గడపండి. అది మీ సెల్ఫ్ డిసిప్లిన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా Naveena Column యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి! సబ్స్క్రైబ్ చేసుకోండి.
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని మీకు తెలుసా? హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ 'ఆయుర్వేద పాన్' అద్భుతంగా పనిచేస్తుంది. గుండె రక్తనాళాల్లో అడ్డంకులను (Blockages) తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడే ప్రత్యేక ఆయుర్వేద పాన్/తాంబూలం తయారీ విధానం మరియు దాని ప్రయోజనాలు ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హార్ట్ స్పెషల్ తాంబూలం తయారీని వివరించారు: ఈ ఆయుర్వేద తాంబూలానికి కావలసినవి: తమలపాకు: ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఔషధ గుణాలను రక్తంలోకి త్వరగా చేరుస్తుంది. అర్జున చెట్టు బెరడు చూర్ణం: గుండె పనితీరును మెరుగుపరచడంలో ఇది అగ్రగామి. వెల్లుల్లి: రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును (Cholesterol) కరిగించి, అడ్డంకులను తొలగిస్తుంది. అల్లం లేదా సొంఠి: రక్త ప్రసరణను సాఫీగా చేస్తుంది. దాల్చిన చెక్క: రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎలా తీసుకోవాలి? వీడియోలో చూపిన విధంగా, తమలపాకులో ఈ మూలికలను సరైన మోతాదులో ఉంచి, తాంబూలంలా చప్పరిస్తూ తీసుకోవాలి. ఇది రక్తాన్ని పల్చగా ఉంచి, గడ్డకట్టకుండా (Blood Clots) చేయడంలో సహాయపడుతుంది. ప్రయోజనాలు: గుండె రక్తనాళాల్లో బ్లాకేజీలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె కండరాలను దృఢంగా మారుస్తుంది. అధిక రక్తపోటు (BP) సమస్యను అదుపులో ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.   మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి! సూచన: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. తీవ్రమైన గుండె సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని ప్రయత్నించాలి.
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే వేసవిలో పిత్త తత్వం మరింత చురుకుగా ఉంటుంది, ఇది కడుపులో మంట, జీర్ణ సమస్యలు , అలసటకు దారితీస్తుంది. అందువల్ల, ఆయుర్వేదం కొన్ని రకాల ఆహారాలను తినమని , మరికొన్నింటిని తినకుండా ఉండమని సిఫార్సు చేస్తుంది. ఆయుర్వేదం చెప్పిన తినాల్సిన, తినకూడని ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. వేసవిలో ఏం తినాలి? వేసవిలో శరీరం బాగా వేడెక్కి, పిత్త దోషం పెరుగుతుంది. అందువల్ల, తేలికైన, చల్లని ఆహారాలు తినడం చాలా అవసరం. కర్బూజా, పుచ్చకాయ, మామిడి వంటి తాజా పండ్లు శరీరాన్ని చల్లబరిచి, కోల్పోయిన నీటిని తిరిగి అందిస్తాయి. చల్లని పాలు , పెరుగు శరీరాన్ని చల్లబరుస్తాయి. జీర్ణ వ్యవస్థను సమతుల్యం చేస్తాయి. పీచుపదార్థాలు అధికంగా ఉండే సలాడ్‌లు , తేలికపాటి కూరగాయలు జీర్ణక్రియను సులభతరం చేసి, కడుపులో వేడి అసమతుల్యతను నివారిస్తాయి. చల్లని జ్యూస్‌లు , కొబ్బరి నీరు సహజ ఎలక్ట్రోలైట్‌లను అందించి, శరీరాన్ని తేమగా ఉంచుతాయి. వేసవిలో ఏం తినకూడదు? వేసవిలో వేయించిన , బరువైన ఆహారాలకు దూరంగా ఉండాలి,  అవి జీర్ణక్రియను నెమ్మదింపజేసి, కడుపులో వేడిని పెంచుతాయి. అందుకే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి. అధిక మసాలాలు గల వంటకాలతో పాటు, కాఫీ , టీ వంటి కెఫిన్ పానీయాలు,  అధిక నూనె లేదా తీపి పదార్థాలు పిత్త దోషాన్ని పెంచి, శరీరాన్ని అసమతుల్యం చేస్తాయి. వేసవిలో కెఫిన్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. ఇవి గుర్తుంచుకోవాలి.. రోజులో ఎక్కువసార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవడం జీర్ణక్రియకు సహాయపడి, శక్తిని నిలుపుతుంది.   శరీరం చల్లగా, ఆరోగ్యంగా ఉండాలంటే, తేలికైన, నీరు అధికంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.   చల్లని పదార్థాలను తీసుకోవడం వల్ల పైత్యరసం అదుపులో ఉండి, వేసవిలో అలసట , చికాకును నివారిస్తుంది.                                *రూపశ్రీ.  
మలబద్ధకం (Constipation) సమస్యకు ప్రధాన కారణాలు, లక్షణాలు మరియు సులభమైన ఆయుర్వేద గృహ చిట్కాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం (Constipation). దీనినే తెలుగులో 'మలబద్ధకం' అని కూడా అంటారు. ఇది కేవలం ఒక సమస్య మాత్రమే కాదు, సకాలంలో దీనిని నివారించకపోతే ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఈ వీడియోలో మలబద్ధకం గురించి పూర్తి సమాచారాన్ని నిపుణులు వివరించారు: మలబద్ధకం రావడానికి ప్రధాన కారణాలు: ఆహారంలో పీచు పదార్థం (Fiber) తక్కువగా ఉండటం. శరీరానికి సరిపడా నీరు తాగకపోవడం. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం.  శారీరక శ్రమ లేకపోవడం లేదా రోజంతా కూర్చుని పనిచేయడం. మానసిక ఒత్తిడి మరియు నిద్రలేమి. లక్షణాలు: వారానికి మూడు సార్లు కంటే తక్కువ మలవిసర్జన జరగడం. కడుపు ఉబ్బరంగా ఉండటం మరియు గ్యాస్ సమస్యలు. మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి లేదా ఇబ్బంది కలగడం. ఆకలి మందగించడం. ఆయుర్వేద గృహ చిట్కాలు (Home Remedies): మలబద్ధకాన్ని వదిలించుకోవడానికి ఆయుర్వేదంలో అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. ఈ వీడియోలో సూచించిన కొన్ని ముఖ్యమైన చిట్కాలు: త్రిఫల చూర్ణం: ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో త్రిఫల చూర్ణం కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆముదం (Castor Oil): తక్కువ మోతాదులో ఆముదాన్ని పాలలో కలిపి తీసుకోవడం వల్ల విరేచనం సాఫీగా అవుతుంది.  పండ్లు మరియు కూరగాయలు: పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, బొప్పాయి మరియు అరటిపండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.  నీరు: రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది.  మలబద్ధకం సమస్య నుండి శాశ్వత ఉపశమనం పొందడానికి మరియు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను పెంపొందించుకోవడానికి ఈ వీడియోలో చెప్పిన సూచనలను తప్పక పాటించండి. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!