సినిమా పేరు: మోగ్లీ 2025
తారాగణం: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్, బండి సరోజ్ కుమార్
వైవా హర్ష తదితరులు
ఎడిటర్: పీకె
మ్యూజిక్: కాలభైరవ
రచన, దర్శకత్వం: సందీప్ రాజ్
సినిమాటోగ్రాఫర్: రామ్ మారుతీ ఎం
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాతలు:విశ్వప్రసాద్, కృతి ప్రసాద్
విడుదల తేదీ: డిసెంబర్ 13
బబుల్ గమ్ మూవీ తర్వాత'రోషన్ కనకాల'(roshan Kanakala)రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకొని కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్(Sandeep Raj)తో కలిసి ఈ రోజు మోగ్లీ 2025(Mowgli 2025)తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.రాజా సాబ్ నిర్మాత విశ్వప్రసాద్ మోగ్లీ ని నిర్మించడం స్పెషల్ ఎట్రాక్షన్. సినిమాపై నమ్మకంతో మేకర్స్ ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
మురళి అలియాస్ మోగ్లీ( రోషన్ కనకాల). చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోవడంతో తన ఊరు పక్కనే ఉన్న అడవిలో నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటుంటాడు. అందుకే అందరు మోగ్లీ అని పిలుస్తారు. పోలీస్ ఉద్యోగం సంపాదించాలనేది మోగ్లీ లక్ష్యం. కానీ బతుకు తెరువు కోసం తన ప్రాణస్నేహితుడు బంటి(వైవా హర్ష) తో కలిసి చిన్న చిన్న పనులు కూడా చేస్తుంటాడు. ఈ క్రమంలోనే తన ఏరియా వచ్చిన ఒక సినిమా బృందానికి కాంట్రాక్టర్ గా ఉండటంతో పాటు సదరు చిత్రంలో డూప్ గా యాక్ట్ చేస్తాడు. షూటింగ్ లో జూనియర్ ఆర్టిస్ట్ జాస్మిన్( సాక్షి మడోల్కర్) ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. జాస్మిన్ చెవుడు, మూగ అమ్మాయి. ఆమె కూడా మోగ్లీని ప్రేమిస్తుంది. క్రిస్టో ఫర్ నోలన్( బండి సరోజ్ కుమార్) పేరుకి సమాజాన్ని కాపాడే పోలీస్ ఆఫీసర్. కానీ ఒక అసాంఘిక వ్యక్తి. శాడిస్ట్ లా బిహేవ్ చేస్తూ ఎంతో మంది జీవితాలని నాశనం చేసిన వ్యక్తి. అలాంటి నోలన్ మోగ్లీ, జాస్మిన్ లైఫ్ లోకి వస్తాడు. ఆ ఇద్దరి లైఫ్ లోకి నోలన్ ఎందుకు వచ్చాడు? నోలన్ రావడం వలన మోగ్లీ, జాస్మిన్ ఎదుర్కున్న ఇబ్బందులు ఏంటి? వాటిని ఎలా ఫేస్ చేసారు? నోలన్ క్యారక్టర్ యొక్క లక్ష్యంతో పాటు చేసే దుర్మార్గాలు ఏంటి? చివరకి ఆ క్యారక్టర్ ఎలా ముగిసింది? మోగ్లీ, జాస్మిన్ ల ప్రేమ గెలిచిందా లేదా అనేదే చిత్ర కథ.
ఎనాలసిస్
ఈ కథలో ఏముందని మేకర్స్ భావించారో తెలియదు గాని, అందరికి తెలిసిన కథ ని సినిమా ఫస్ట్ నుంచి చివరకి దాకా చుట్టిపడేసారు. మొదటి సీన్ నుంచి చివరకి సీన్ దాకా ఎన్నో సినిమాల్లో చూసినవే. అసలు కథ ఎలా ఉండబోతుందో అని ముందుగానే చెప్పేసి సీన్స్ రన్ చేస్తుంటే పెద్ద హీరోల సినిమాలే ఎవరు చూడటం లేదు. మరి రోషన్ లాంటి అప్ కమింగ్ హీరోతో కథ చెప్పేసి దర్శకుడు, రచయిత సందీప్ రాజ్ ఏ ధైర్యంతో తెరకెక్కించాడో అర్ధం కాదు. పోనీ సన్నివేశాలు బాగున్నాయా అంటే మూవీ మొత్తంపై ఒక్క సన్నివేశం బాగోలేదు.
మోగ్లీ క్యారక్టర్ కి కూడా ఒక విధి విధానం అంటూ ఉండదు. కోపం ఎక్కువ వస్తుందని చూపిస్తారు. మళ్ళీ తన జీవితాన్ని నాశనం చేసే వాళ్ళతో ఫైట్ చేసి కూడా నా జోలికి రాకండని బతిమాలతాడు. అసలు పోలీస్ ఆఫీసర్ అవుదామని అనుకున్న ఒక వ్యక్తి ఎంత దైర్యంగా ఉంటాడు. అతని బ్రెయిన్ ఎంత షార్ప్ గా ఉంటుంది. మరి అలాంటి మోగ్లీ ని అమాయకంగా చూపించడం ఏంటో అర్ధం కాదు. క్యారక్టర్ కూడా ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్టుగా డల్ గా ఉంటుంది కొద్దిలో గొప్ప జాస్మిన్ చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో తండ్రి తో వచ్చిన సీన్స్ తో పాటు, జాస్మిన్ పెర్ ఫార్మెన్సు మాత్రమే సినిమా మొత్తంపై బాగున్నాయి. క్రిస్టోఫర్ నోలన్ క్యారక్టర్ కోసం సినిమాని తెరకెక్కించినట్టుగా అనిపించడం కూడా మైనస్. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే క్రిస్టోఫర్ నోలన్ చేసే ఒక దుర్మార్గంతో సినిమా ప్రారంభమైంది.
ఈ సీన్ తోనే సినిమా ఎలా ఉండబోతుందో అంచనాకి వస్తాం. మోగ్లీ ఇంట్రడక్షన్ తో పాటు, మోగ్లీ, జాస్మిన్ ల పరిచయం సన్నివేశం బాగున్నాయి. ఆ తర్వాత వచ్చే సీన్స్ కథ కోసం రన్ అయ్యాయి కానీ కథలో భాగం కాలేదు. తాను ప్రేమించిన అమ్మాయి క్యారక్టర్ బాడ్ అని శారీరకంగా తప్పు చేస్తుందని ఎవరో చెప్తే మోగ్లీ నమ్మడాన్ని జీర్ణించుకోలేం. సినిమా షూటింగ్ సందర్భంగా వచ్చే సన్నివేశాల్లో ఎంటర్ టైన్ మెంట్ ని సృషించవచ్చు. ఆ దిశగా చేసి ఉంటే ఫస్ట్ హాఫ్ కి న్యాయం జరిగేదేమో. బంటి, మోగ్లీ మధ్య వచ్చే ఫ్రెండ్ షిప్ సీన్స్ బాగున్నా, చాలా సినిమాల్లో అలాంటివి చూసేసాం. అల్లు అర్జున్ ఫ్యాన్ గా పుష్ప గెటప్ లో సుహాస్ కనపడిన సీన్, చెప్పిన డైలాగ్స్ మాత్రం బాగున్నాయి.
ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం క్రిస్టోఫర్ నోలన్ చుట్టూనే తిరుగుతుంది. ఈ సందర్భంగా వచ్చే సీన్స్ అన్ని చాలా ఇబ్బంది అనిపిస్తాయి. మోగ్లీ ని అక్రమంగా ఒక హత్య కేసులో ఇరికించి చిత్రహింసలకి గురి చేసే సన్నివేశం తర్వాత, మోగ్లీ ని యాక్టివ్ చెయ్యాల్సింది. ఆ దిశగా చెయ్యలేదు. ఇక్కడే సినిమా మరింత గాడి తప్పింది.ప్రీ క్లైమాక్స్ లో యాక్టీవ్ చేసినా మళ్ళీ సింపతీ కోసం శత్రువు ని కూడా ఏమి అనని అమాయకుడు అన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేశారు. బంటి చనిపోవడం, క్లైమాక్స్ కూడా మెప్పించలేదు.
నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు
మోగ్లీ క్యారక్టర్ లో రోషన్ సత్తా చాటగలడని స్క్రీన్ ప్రెజెన్స్ ద్వారా అర్థమవుతూనే ఉంటుంది. కానీ దర్శకుడు సందీప్ రాజ్ మోగ్లీ క్యారక్టర్ కి అన్యాయం చేసాడు.దీంతో రోషన్ నటన గురించి ఎక్కువగా చెప్పుకోలేం. ఇక మరాఠీ భామ సాక్షి మడోల్ కర్(Sakkshi Mhadolkar)తన అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ తో మెప్పించడంతో పాటు కళ్లతోనే భావాన్ని చెప్పగలిగే నటిగా నిరూపించుకుంది.క్రిస్టో ఫర్ నోలన్ గా బండి సరోజ్ కుమార్ యాక్టింగ్ కొంత వరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఓవర్ యాక్టింగ్ కోటాలోకి మారింది. డైలాగ్ మాడ్యులేషన్ లోను, పేస్ ఎక్స్ ప్రెషన్ లోను ప్రముఖ హీరో గోపీచంద్ కెరీర్ స్టార్టింగ్ లో విలన్ గా చేసిన క్యారెక్టర్స్ ని అనుకరించాడు. బంటి గా వైవా హర్ష మెప్పించాడు. ఇక మిగతా నటీనటుల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. సందీప్ రాజ్ దర్శకుడిగా రచయితగా రెండు విభాగాల్లోను ఫెయిల్ అయ్యాడు.నాసిరకం కథ, కథనాలతో సినిమా ని చుట్టేసి మోగ్లీ కి అన్యాయం చేయడంలో ప్రధమ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు బాగున్నాయి. కాలభైరవ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు. ఫోటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది.
ఫైనల్ గా ప్రేక్షకులని ఒక సినిమా మెప్పించాలంటే కథ, కథనాలు ఎలా ఉండకూడదో, ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్స్ ఎలా ఉండకూడదో మోగ్లీ అలా ఉంది. తలా ఒక చెయ్యి వేసి మోగ్లీ , ప్రేక్షకులకి మధ్య దూరాన్ని పెంచడంలో టీం సక్సెస్ సాధించింది.
రేటింగ్ 2 /5
అరుణాచలం