నేటి వేగవంతమైన జీవనశైలిలో సరిగ్గా సమయానికి తినకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, సరిపడా నిద్రపోకపోవడం వంటి అలవాట్ల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి అలవాట్ల వల్ల శరీరంలోని జీవక్రియలు దెబ్బతిని దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం ఉందని ఆయుర్వేదం చెప్తోంది. ముఖ్యంగా మన శరీరంలో ఉండే వాత, పిత్త, కఫ అనే మూడు దోషాల సమతుల్యత దెబ్బతిన్నప్పుడే వ్యాధులు మొదలవుతాయి. ఈ మూడు దోషాలు సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలి, ఆయుర్వేదం సూచించే ముఖ్యమైన నియమాలు ఏమిటో వివరంగా తెలుసుకుంటే..
జీవనశైలి లోపాల వల్ల వచ్చే ముప్పు..
రోజువారీ జీవితంలో వ్యాయామం లేకపోవడం, వేళపాళ లేని ఆహారం తీసుకోవడం, మద్యం లేదా ఇతర అలవాట్లు ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోక్, అధిక బరువు, టైప్ 2 మధుమేహం , ఊపిరితిత్తుల సమస్యల వంటి అనేక తీవ్రమైన రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది. చిన్న వయస్సు నుంచే ఆహారపు అలవాట్లను, జీవనశైలిని సరిదిద్దుకోవడం ద్వారా ఈ ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
సమతుల ఆహారంతో దోషాల నివారణ..
ఆయుర్వేద ప్రకారం సరైన ఆహారం అంటే కేవలం కొన్ని పదార్థాలు తినడం మాత్రమే కాదు. ఆహారంలో ఉండే రుచులు, గుణాలు , వాటి కలయికను కూడా అర్థం చేసుకోవాలి.
ఆయుర్వేదంలో తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే ఆరు రుచులు ఉన్నాయి. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ఈ ఆరు రుచులు తగిన పాళ్లలో ఉండేలా చూసుకుంటే వాత, పిత్త, కఫ దోషాలు సమతుల్యంగా ఉంటాయి. ఆహారంలో తాజా కూరగాయలు, ఆయా కాలాల్లో దొరికే పండ్లు తప్పనిసరిగా భాగం చేసుకోవాలి.
సరియైన దినచర్య చాలా ముఖ్యం..
మంచి ఆరోగ్యం కోసం సరైన రోజువారీ అలవాట్లు కలిగి ఉండటం చాలా అవసరం. ఉదయాన్నే త్వరగా లేవడం, శరీరానికి నూనె మర్దన చేసుకోవడం, అభ్యంగన స్నానం , యోగా వంటి ప్రక్రియలు శరీరానికి విశ్రాంతినిస్తాయి.
ఉదయాన్నే ఆరోగ్యకరమైన టిఫిన్ చేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన మనస్సు, ఆరోగ్యకరమైన శరీరం కోసం ప్రతిరోజూ రాత్రి 7 నుండి 8 గంటల నిద్ర అవసరం.
యోగా , ధ్యానంతో ప్రయోజనాలు..
యోగా , ప్రాణాయామం చేయడం వల్ల శరీరం, మనస్సు , ఆత్మ సమన్వయంతో పనిచేస్తాయి. ఇవి శరీరంలో ప్రాణశక్తి ప్రవాహాన్ని మెరుగుపరచడమే కాకుండా పట్టుత్వాన్ని, శారీరక బలాన్ని పెంచుతాయి. రోజూ సూర్య నమస్కారాలు, ఊపిరితిత్తుల వ్యాయామాలు , ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఇది మూడు దోషాలను సమతుల్యంగా ఉంచి శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది.
*రూపశ్రీ.