ఒకప్పుడు వందలాది సినిమాల్లో కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి, కోట్లాది రూపాయల ఆస్తులతో విలాసవంతమైన జీవితం గడిపిన ఓ సీనియర్ నటుడు నేడు వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేక వృద్ధాశ్రమంలో గడుపుతున్నారంటే సినీ ప్రపంచంలో కాంతి వెనుక ఉన్న చీకటి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆయనే దక్షిణాది సినీ రంగంలో ఎంతో గుర్తింపు పొందిన సీనియర్ నటుడు, నిర్మాత మోహన్ శర్మ. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'వేట'లో విలన్‌గా మెప్పించిన మోహన్ శర్మ, సీనియర్ నటి లక్ష్మి తొలి భర్తగా కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచితులు.
ఆయన సినీ ప్రస్థానం ఎంతో ఘనమైనది. దాదాపు 100కు పైగా చిత్రాల్లో హీరోగా నటించడమే కాకుండా, మరొక 50కి పైగా చిత్రాల్లో కీలక పాత్రలను పోషించారు. తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో 'చట్టకారి' (1974), 'నెల్లు', 'ప్రయాణం', 'సుయంవరం', 'ఫ్రెండ్స్', 'సచిన్', 'మామాంగం', 'ఫోరెన్సిక్' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఆయన భాగమయ్యారు. అంతేకాదు, కమల్ హాసన్ నటించిన 'సాగర సంగమం'లోనూ మోహన్ శర్మ పోషించిన పాత్ర తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంటుంది. కేవలం నటుడిగానే కాకుండా, నిర్మాతగా కూడా ఆయన నాలుగు దక్షిణాది భాషల్లో సుమారు 20 చిత్రాలను నిర్మించి, దక్షిణాది భాషల్లోనూ సినిమాలు నిర్మించిన తొలి నిర్మాతగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగానూ సేవలు అందించారు.
ఒకప్పుడు చెన్నైలోని అత్యంత ఖరీదైన పోయెస్ గార్డెన్ ప్రాంతంలో, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇంటికి పక్కనే మోహన్ శర్మ ఓ విలాసవంతమైన భవనంలో నివసించేవారు. ఏవీఎం స్టూడియోలో కలిసినప్పుడు జయలలితే స్వయంగా ఆ హౌసింగ్ ప్రాజెక్టును సిఫార్సు చేయడంతో ఆమె సలహా మేరకే ఆయన ఆ భవనాన్ని కొనుగోలు చేశారు. జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడానికి రెండు రోజుల ముందు ఆమెను కలిసిన చివరి సినీ ప్రముఖుడు కూడా మోహన్ శర్మనే కావడం విశేషం.
అయితే, ఆయన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పిన సంఘటన 'గ్రామం నమ్మ గ్రామం' అనే ద్విభాషా చిత్రం. ఆ రోజుల్లో రూ.1.25 కోట్ల బడ్జెట్‌తో ప్రారంభించిన ఈ సినిమాకు థియేటర్లు, పబ్లిసిటీ, పోస్టర్ల ఖర్చులన్నీ తనే భరించాల్సి రావడంతో బడ్జెట్ ఏకంగా రూ.2 కోట్లకు చేరుకుంది. సినిమా అవార్డులు సాధించినప్పటికీ, ఆర్థికంగా మోహన్ శర్మను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ అప్పులు తీర్చడానికి తన కలల నిలయమైన పోయెస్ గార్డెన్ ఇంటిని కూడా అమ్మేయాల్సి వచ్చింది.
అక్కడితో ఆయన కష్టాలు ఆగలేదు. వయసు పెరిగేకొద్దీ తీవ్ర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. కాలికి సర్జరీ, లిగ్మెంట్ సమస్య, వెర్టిగో, తీవ్రమైన బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడుతున్న ఆయనకు సర్జరీల కోసం రూ.4-5 లక్షల వరకు ఖర్చయింది. ప్రతి నెలా ఇన్సులిన్‌తో కలిపి కేవలం మందుల కోసమే రూ.35,000 వరకు అవుతోంది. ఒక దశలో మందులు కూడా కొనుక్కోలేని దయనీయ స్థితికి చేరుకోవడంతో, రోటరీ క్లబ్ ట్రస్టీలైన స్నేహితుల సూచనతో ఆయన వృద్ధాశ్రమంలో చేరారు. భార్యతో విడాకుల నోటీసులు అందుకోవడం, కుమారుడు జర్మనీలో ఇంటి ఈఎంఐల భారం వల్ల వెంటనే సహాయం చేయలేకపోవడంతో ఆయన ఒంటరిగా మిగిలారు. ఈ కష్టకాలంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఆయన బ్యాంక్ వివరాలు తెలుసుకుని వెంటనే రూ.1 లక్ష సహాయం అందించి దేవుడిలా ఆదుకున్నారు. ప్రస్తుతం 25 ఏళ్లుగా తనకు స్నేహితుడైన నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ బృందాన్ని కలిసి సహాయం కోసం మోహన్ శర్మ ఎదురుచూస్తున్నారు.
Mohan Sharma, Veta Movie Rajinikanth. Sagara Sangamam






