Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఉదయం లేవగానే తలనొప్పిగా ఉంటోందా.. కారణాలు ఇవే..!
posted on: Aug 1, 2026 11:35AM

రాత్రంతా పడుకుని ఉదయం నిద్ర లేవగానే చాలా తాజాగా, రిఫ్రెషింగ్ గా అనిపించాలి. కానీ చాలామందికి ఉదయం నిద్ర లేవగానే రిఫ్రెషింగ్ గా అనిపించదు. అంతేకాదు.. ఉదయం లేవగానే బాగా చిరాకుగా, తలనొప్పిగా కూడా అనిపిస్తుంది. ఉదయం లేవగానే ఇలా ఎందుకు తలనొప్పి వస్తుందని కొందరికి సందేహం కలిగినా దాని గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఇది నిర్లక్ష్యం చేయాల్సిన విషయం కాదని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే తలలో బరువుగా, నొప్పిగా లేదా ఒత్తిడిగా అనిపించడం అనేది లైట్ గా తీసుకోవాల్సిన విషయం కాదని అంటున్నారు.ఇది కొన్ని సందర్బాలలో తీవ్రమైన అనారోగ్యాలకు ప్రారంభ లక్షణం కావచ్చని అంటున్నారు. ఉదయం లేవగానే తలనొప్పి ఎందుకు వస్తుంది? దీని వెనుక ఉండే ఆరోగ్య సమస్యలు ఏమిటి? దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
డీహైడ్రేషన్..
రాత్రిపూట శరీరం చాలా గంటల పాటు విశ్రాంతిలో ఉంటుంది. దీనివల్ల ఉదయానికి లైట్ గా డీహైడ్రేషన్ ఏర్పడవచ్చు. డీహైడ్రేషన్ మెదడు చుట్టూ ఉన్న ద్రవ సమతుల్యతను ప్రభావితం చేస్తుంది, ఇది తలనొప్పికి దారితీస్తుంది. రోజంతా తక్కువ నీరు త్రాగినా లేదా వేసవిలో అధికంగా చెమట పట్టినా ఈ ప్రమాదం పెరుగుతుంది. నిద్రలేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు త్రాగడం , రోజంతా 2.5 నుండి 3 లీటర్ల నీటిని తీసుకోవడం ఈ సమస్యను నివారించడంలో సహాయపడుతుంది.
నిద్రలేమి..
ఆరోగ్యకరమైన శరీరం , మనస్సు కోసం ప్రతిరోజూ 7 నుండి 8 గంటల గాఢ నిద్ర చాలా అవసరం. ఆలస్యంగా నిద్రపోవడం, తరచుగా మేల్కొనడం లేదా తగినంత నిద్ర లేకపోవడం దినచర్యలో భాగమైతే, ఉదయం తలనొప్పులు రావడం చాలా కామన్ అంటున్నారు వైద్యులు. నిద్రలేమి మెదడుకు తగినంత విశ్రాంతిని ఇవ్వదు, దీనివల్ల ఒత్తిడి పెరిగి, నొప్పిని కలిగించే హార్మోన్లు ఉత్తేజితమవుతాయి. అందువల్ల, టైమ్ కు తగ్గట్టు నిద్రపోవడం , తగినంత నిద్ర పొందడం ముఖ్యం.
స్లీప్ అప్నియా..
స్లీప్ అప్నియా అనేది నిద్రలో కొన్ని సెకన్ల పాటు శ్వాస ఆగిపోయే ఒక పరిస్థితి. దీనివల్ల శరీరానికి, మెదడుకు తగినంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా నిద్రలేచినప్పుడు తలనొప్పి, అలసట , మగతగా ఉండటం వంటివి సంభవించవచ్చు. బిగ్గరగా గురక పెట్టడం, తరచుగా నిద్రలేవడం , పగటిపూట నిద్రమత్తుగా ఉండటం వంటివి సాధారణ లక్షణాలు. ఈ సమస్యలు కొనసాగితే, వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.
మైగ్రేన్..
మైగ్రేన్లు సాధారణ తలనొప్పుల కన్నా భిన్నంగా ఉంటాయి. ఇవి తలలోని ఒక భాగంలో తీవంగా, కొట్టుకుంటున్నట్లు ఉండే నొప్పిని కలిగిస్తాయి. ఇది గంటల తరబడి లేదా రోజుల తరబడి కూడా ఉంటుంది. చాలా మందికి ఉదయం నిద్రలేవగానే మైగ్రేన్లు మొదలవుతాయి. హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, నిద్రలేమి, చాలా బ్రైట్ గా ఉండే కాంతికి గురికావడం లేదా కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది. మైగ్రేన్లతో పాటు వికారం, వాంతులు, ఎక్కువ కాంతి లేదా శబ్దం వల్ల అసౌకర్యం కూడా కలగవచ్చు. మైగ్రేన్లు తరచుగా వస్తుంటే, నరాల వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
అధిక రక్తపోటు..
రక్తపోటు ఎక్కువ కాలం పాటు అధికంగా ఉంటే, ఉదయం పూట తలనొప్పి ఒక సంకేతం కావచ్చు. అధిక రక్తపోటు ఉన్న ప్రతి రోగికి తలనొప్పి రాకపోయినప్పటికీ, అదుపులో లేని రక్తపోటు మెదడులోని రక్తనాళాలపై ఒత్తిడిని పెంచుతుంది. తలనొప్పితో పాటు తల తిరగడం, దృష్టి మసకబారడం లేదా ఛాతీ నొప్పి వంటివి ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. రక్తపోటును క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం , వైద్యుడు సూచించిన విధంగా మందులు తీసుకోవడం చాలా ముఖ్యం.
రాత్రిపూట కెఫీన్ లేదా మద్యం తీసుకోవడం..
రాత్రి సమయంలో ఎక్కువగా కెఫీన్ లేదా మద్యం తీసుకోవడం వల్ల శరీరం నిర్జలీకరణానికి గురై, మరుసటి రోజు ఉదయం తలనొప్పి రావడం సర్వసాధారణంగా జరుగుతుంది. అధికంగా కెఫీన్ తీసుకోవడం లేదా అకస్మాత్తుగా కెఫీన్‌ను మానేయడం కూడా తలనొప్పికి కారణం కావచ్చు. రాత్రి ఆలస్యంగా కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ లేదా మద్యం సేవించడం వల్ల ఉదయం తలనొప్పి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ సమస్యను నివారించడానికి, కెఫీన్ తీసుకోవడాన్ని పరిమితం చేయాలి, మద్యానికి దూరంగా ఉండాలి, పుష్కలంగా నీరు త్రాగాలి.
*రూపశ్రీ.






