
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'వారణాసి'. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ భారీ బడ్జెట్ విజువల్ వండర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'వారణాసి' గురించి రాజమౌళి చెప్పిన విశేషాలు.. సినిమాపై అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్తున్నాయి.
ఈ సినిమాతో మనల్ని రాజమౌళి ఒక అద్భుతమైన టైమ్ ట్రావెల్ అండ్ గ్లోబల్ అడ్వెంచర్‌కు తీసుకెళ్లబోతున్నారు. జక్కన్న మాటల్లోనే చెప్పాలంటే.. ఈ సినిమా వారణాసి పుణ్యక్షేత్రంలో ప్రారంభమై, మైనస్ డిగ్రీల గడ్డకట్టే అంటార్కిటికా మంచు ఖండానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి ఆఫ్రికా దట్టమైన అడవుల్లోకి పయనిస్తుంది. అంతటితో అయిపోలేదు.. అక్కడి నుంచి సమయాన్ని కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి తిప్పుతూ.. ప్రాచీన రోమన్ సామ్రాజ్యం కాలానికి తీసుకెళ్తుంది. చివరికి మళ్లీ కథ వారణాసిలోనే ముగుస్తుంది. ఇంతటి సుదూర ప్రయాణాన్ని, విభిన్నమైన ప్రపంచాలను ఒకే కథలో బంధించడం కేవలం రాజమౌళికి మాత్రమే సాధ్యమయ్యే అద్భుతం.
ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయింది. అంతేకాదు, సినిమాలోని భారీ యాక్షన్ సీక్వెన్సుల షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది. కేవలం మిగిలిన 20 శాతం చిన్న చిన్న సీన్లు, క్యారెక్టర్ డ్రామా సీన్స్ మాత్రమే ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు.
వారణాసి టీజర్ పై కూడా రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నేను టీజర్‌లో కథను ఎక్కువగా రివీల్ చేయకూడదు అనుకున్నాను. ఎందుకంటే కొన్ని సెకన్ల వీడియోతో ఈ సినిమా స్థాయికి న్యాయం చేయలేము. అందుకే కథను రివీల్ చేయకుండా, ప్రేక్షకులు థియేటర్లలో ఎలాంటి అద్భుతమైన అనుభూతిని పొందబోతున్నారో చూపించడానికే ఆ ప్రత్యేక వీడియోను రూపొందించాం" అని జక్కన్న స్పష్టం చేశారు.
ఇక ఈ సినిమా విజువల్ ఎక్స్‌పీరియన్స్ గురించి రాజమౌళి చెప్పిన విషయాలు మైండ్ బ్లోయింగ్. అంటార్కిటికాలో ఉండే 300 అడుగుల ఎత్తైన మంచు కొండలు, ప్రాచీన రోమ్‌లోని వేలాదిమంది సైనికులతో కూడిన మహా రణరంగం.. వీటి పరిమాణాన్ని, ఆ గంభీరతను సాధారణ స్కీన్ల మీద చూపిస్తే ఆ ఇంపాక్ట్ రాదు. అందుకే ఈ చిత్రం కోసం ప్రత్యేకమైన IMAX ఆస్పెక్ట్ రేషియో (IMAX Aspect Ratio) ని ఎంచుకున్నట్లు వెల్లడించారు.
మొత్తానికి రాజమౌళి మాటలను బట్టి చూస్తే.. 'వారణాసి' మూవీ మనం ఊహించిన దానికంటే బిగ్ స్కేల్ లో ఉండబోతుందని అర్థమవుతోంది.
Varanasi, SS Rajamouli, Mahesh Babu






