శ్రీ పట్టాభి రామాలయం
Pattabhairama Swamy Temple (Vayalapadu)
.png)
పూర్వం నూరు కొప్పుల కొండ దగ్గర్లో బహుదా నది ఒడ్డునున్న ప్రాంతంలో శ్రీమద్రామాయణ గ్రంథకర్త వాల్మీకి మహర్షి ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేశాడట. అలా వాల్మీకి ఆశ్రమానికి సమీపంలో వెలసిన ఈ పట్టణానికి ''వాల్మీకిపురం'' అని పేరొచ్చింది. తిరుపతి - మదనపల్లి మార్గంలో తిరుపతి నుండి 94 కిలోమీటర్ల దూరంలో వాయల్పాడు ఉంది. పూర్వం వావిలిపాడు, వాయల్పాడుగా పిలవబడిన ఈ పట్టణం ప్రస్తుతం వాల్మీకిపురంగా ప్రసిద్ధి చెందింది.
ఆలయ వైభవం
త్రేతాయుగంలో శ్రీరామభక్తుడైన జాంబవంతుడు ఈ ఆలయంలోని మూలవరులను ప్రతిష్ఠించినట్లు స్థలపురాణాలు పేర్కొన్నాయి. ప్రధాన ఆలయమైన శ్రీ పట్టాభి రామాలయంలో ముందు మహా మండపం, ముఖమండపం, అంతరాళం, గర్భాలయం క్రమంగా ఉన్నాయి. మహామండప స్తంభాలపై రమణీయమైన దేవతా విగ్రహాలు చెక్కి ఉన్నాయి. ఈ స్తంభాల్లో కొన్ని చోళ శిల్పశైలిలో మరికొన్ని విజయనగర శిల్ప శైలిలో మలిచి ఉన్నాయి.
మహామండపానికి ముందు నాలుగు స్తంభాలతో ముఖమండపం నిర్మించబడింది. మండపం పైకప్పులో రాతి దూరాలతో ఏర్పరచిన స్తస్తిక్ చిహ్నం, మధ్యలో అధః పద్మం ఉన్నాయి. ముఖ మండపానికి తూర్పువైపున ఉన్న మండపంలో వీరాంజనేయస్వామి శిలావిగ్రహం పశ్చిమాభిముఖంగా ప్రతిష్ఠించబడి ఉంది.

దేవతా వైభవం
ఈ దేవాలయంలో శ్రీరాముడు ప్రధాన దైవం. స్వామికి కుడివైపున సీత, వింజామరతో భరతుడు ఉన్నారు. స్వామికి ఎడమవైపున ధనుర్బాణాలతో లక్ష్మణుడు, వింజామరతో శత్రుఘ్నుడు ఉన్నారు. ఇక్కడ మూల విరాట్ శ్రీరాముని చెంత హనుమంతుదు లేడు. అందుకు కారణం శ్రీరామపట్టాభిషేక సమయంలో జాంబవంతుడు దర్శించిన విధంగా ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించడం. ఈ ఆలయంలో శ్రీరాముడు ''ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని.. ఇది నా వ్రతం'' అని చాటుతున్నట్లు తన కుడిచేతి చూపుడు వేలు పైకెత్తి సూచీముఖ హస్తముద్రతో శాసక ముద్రతో, సంహార ముద్రతో చక్ర ప్రయోగానికి సిద్ధంగా కనిపిస్తున్నాడు. సాధారణంగా శ్రీరామునికి ఎడమవైపున సీతమ్మ ఉంది. ఇక్కడ స్వామివారికి కుడివైపున సీతమ్మవారు ఉండటం విశేషం.
ఈ పట్టాభి రామాలయానికి పశ్చిమదిశలో దక్షిణ ముఖంగా శ్రీరంగనాథుని ఆలయం ఉంది. ఇందులో శ్రీదేవి, భూదేవి సమేతుడైన రంగనాథుని శయన మూర్తి కొలువై ఉంది. ఆలయం వెలుపల పశ్చిమ ముఖంగా శ్రీ పాండురంగ విఠలేశ్వరాలయం ఉంది. పట్టాభి రామాలయానికి తూర్పున కొద్దిదూరంలో పుష్కరిణి ఉంది. దీన్ని గరుడ పుష్కరిణి అంటారు. ఈ పుష్కరిణిలో పట్టాభిరాముని తెప్పోత్సవాలు జరిగేవి. ఇప్పుడు ఈ పుష్కరిణి, ఇందులో ఉన్న నీరాళి మండపం మంచి స్థితిలో ఉన్నాయి.
ఉత్సవ వైభవం
ఈ వాల్మీకిపురం పట్టాభి రామాలయంలో చైత్ర మాశ శుక్లపక్షంలో సీతాదేవి జన్మ నక్షత్రమైన ఆశ్లేష నాడు రాత్రిపూట సీతారామ కల్యాణం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పట్టాభిరామునికి ప్రతి శనివారం, ఏకాదశినాడు, పునర్వసు నక్షత్రంనాడు అభిషేకోత్సవం జరుగుతుంది. ఈ ఆలయంలో ముక్కోటి ఏకాదశినాడు స్వామివారి అభిషేక దర్శనం, ద్వాదశినాడు వైకుంఠ ద్వార దర్శనం జరుగుతాయి.
బ్రహ్మోత్సవ వైభవం
వాల్మీకిపురం పట్టాభి రామాలయంలో చైత్ర మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నవాహ్నికంగా శ్రీరామ నవమికి మూడు రోజులు ముందు ప్రారంభమై శ్రీరామనవమి తర్వాత అయిదు రోజులు (మొత్తం తొమ్మిది రోజులు) అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ప్రజలు తండోపతండాలుగా వచ్చి, శ్రీ పట్టాభిరాముని సేవించి ధన్యులౌతారు.
ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన జరిగే ఉత్సవంలో స్థానికి ముస్లింలు కూడా పాల్గొని శ్రీరామచంద్రుని ప్రసాదాలు స్వీకరిస్తారు. ''రామ్, రహీం ఏక్ హై'' అని కబీరుదాసు చెప్పిన సూక్తి ఇక్కడ నిజమైంది.
మహిమల వైభవం
క్రీస్తుశకం 1925 – 1930 మధ్యకాలంలో కడప జిల్లా కలక్టరుగా పనిచేసిన హార్డు హార్డింగుకు పట్టాభిరాముని మహిమచేత, అనుగ్రహంచేత ఉదర వ్యాధి నయమైంది. ఆరోగ్యం చేకూరింది. అప్పుడు కడప జిల్లా కలక్టరు హార్డింగు తన భక్తి విశ్వాసాలకు నిదర్శనంగా పట్టాభి రామాలయానికి ఎదురుగా నాలుగు స్తంభాల మండపం, దానిపై మూడంతస్తుల గోపురం నిర్మించాడు.
పునర్వైభవం
వాల్మీకిపురంలోని పట్టాభిరామాలయ పురాణ, చారిత్రక ప్రశస్తిని, ఆ రామునికి వేంకటేశ్వరునికి గల సంబంధమును గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తరువు మేరకు దేవాదాయ శాఖ నుండి తిరుమల తిరుపతి దేవస్థానం 23-2-1997 లో వాయల్పాడు పట్టాభి రామాలయాన్ని దత్తత తీసుకుని, పరిపాలనా బాధ్యతలను స్వీకరించింది. ఆనాటి నుండి తిరుమల తిరుపతి దేవస్థానఅధికారులు ఆలయ పునరుద్ధరణను, అభివృద్ధిని దశలవారీగా చేస్తున్నారు. దేవాలయం పరిసరాలు శుభ్రపరచి జీర్ణోద్ధరణ చేయబడింది. ఇప్పుడు ఆలయ గోపురాలు చూడటానికి శోభాయమానంగా ఉన్నాయి. మహర్షి వాల్మీకి విగ్రహం మండపం నుండి తరలించబడి విఠలాలయంలో ఓ మూల భద్రపరచబడింది. ఘంటామండపం పునర్నిర్మించబడింది. ఇందులో ప్రాచీనమైన, చారిత్రక ప్రశస్తి గల, సంప్రదాయ చిహ్నాలు గల పెద్ద కంచు ఘంట నెలకొల్పబడింది. నిత్యమూ దీన్ని ఉపయోగిస్తున్నారు. వాహనాలన్నీ బాగుచేయబడ్డాయి. కొత్త రథం నిర్మించబడింది. గరుడ పుష్కరిణి, అందున్న మండపం బాగుచేయబడింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉత్సవాలు కడు వైభవంగా, కన్నుల పండువుగా జరుగుతున్నాయి. జీర్ణోద్ధరణ, పునర్నిర్మాణ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత శ్రీ పట్టాభిరామునికి ఆగమరీత్యా 12-8-2005లో మహా సంప్రోక్షణ వైభవంగా జరిగింది.
tirumala Pattabhairama Swamy Temple, Vayalpadu Pattabhairama Swamy Temple, valmikipuram pattabhi ramalayam, vayalpadu Pattabhairama Swamy Temple brahmotsavas, Pattabhairamalayam sthala puranam, history of Vayalapadu Pattabhairama Swamy Temple




