వేణుగోపాల స్వామి ఆలయం
Venugopala swamy Temple

చిత్తూరు జిల్లాలో తిరుపతికి 35 కిలోమీటర్ల దూరంలోని కార్వేటినగరంలో ఉన్న వేణుగోపాలస్వామి ఆలయానికి చారిత్రక ప్రసిద్ధి ఉంది. పుత్తూరు మీదుగా కూడా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. అడవిని నరికి నగరం నిర్మించడంవల్ల దీనికి కార్వేటినగరం అనే పేరు స్థిరపడింది.
వేణుగోపాల స్వామి ఆలయాన్ని 15వ శతాబ్దంలో నిర్మించినట్లు పరిశోధకులు నిర్ణయించారు. ఈ గుడిలో వేణుగోపాలస్వామి, స్వామి వెనుక గోవు, స్వామివారికి ప్రభలాగా ఉన్న మకరతోరణం -అన్నీ ఏకశిలానిర్మితాలు కావడం విశేషం.
మూలవిరాట్టు వేణుగోపాలస్వామి చతుర్భుజాలతో ఇరుగడల శంఖచక్రాలను ధరించి, కుడివైపున రుక్మిణీదేవి, ఎడమవైపున సత్యభామాదేవి ఉండగా, భక్తులకు దివ్యానందాన్ని ప్రసాదించేలా దర్శనమిస్తాడు.
గర్భాలయంలో ఇలా కొలువు తీరిన స్వామివారి ఎదుట సింహపీఠికపై స్వామికి, రుక్మిణీ సత్యభామలకు ప్రతిరూపాలైన భోగమూర్తులు. కుడిపక్క నవనీత కృష్ణస్వామి, పక్కనే చక్రాయుధం (చక్రత్తాళ్వార్) ప్రకాశిస్తూ ఉంటారు.
ప్రాంగణంలో అనుబంధ ఆలయం .png)
కార్వేటినగరంలో వేణుగోపాల స్వామి గుడికి వెనుక భాగంలో, ఒకే ప్రాంగణంలో అనుబంధ దేవాలయంగా, శ్రీ కోదండ రామస్వామి ఆలయం దర్శనమిస్తుంది.
ఆలయానికి రెండు ద్వారాలు
వేణుగోపాలస్వామి ఆలయ నిర్మాణం తర్వాత నిర్మితమైన గాలిగోపుర ద్వారం ప్రధానమైన ముఖద్వారం కాగా, సూర్యవంశరాజులైన కార్వేటినగర పాలకులకు ఆరాధ్య దైవం అయిన కోదండరామస్వామి ఆలయానికి ఈ ప్రాకారంలోనే ఇంకోవైపున ఒకప్పుడు రెండో ద్వారం ఉండేది.
ప్రశస్తమైన స్కందపుష్కరిణి
వేణుగోపాల స్వామి ఆలయానికి రెండు ఫర్లాంగుల దూరంలో దీర్ఘ చతురస్రాకారంగా నిర్మించబడిన కోనేటికి స్కందపుష్కరిణి అని పేరు. వేణుగోపాలస్వామికి తెప్పోత్సవాలు రెండురోజులు, కోదండరామస్వామివారికి తెప్పోత్సవం ఒక్కరోజు జరిగే సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది ఈ కోనేటిలోనే. అన్ని మెట్ల మీద నీటి మట్టం సమంగా ఉండేది. ఈ కోనేటి నిర్మాణం ప్రఖ్యాతి చెందింది.
ఆలయ కుడ్య శాసనం
శ్రీ వేణుగోపాలస్వామి గుడిని ఖచ్చితంగా ఏ సంవత్సరం నిర్మించారో తెలీదు కానీ ఇక్కడి గాలిగోపుర నిర్మాణకాలం క్రీస్తుశకం 1779 అని తెలియడంవల్ల ఆలయం అంతకంటే చాలాముందే నిర్మితమైనట్లు తెలుస్తుంది. ఈ ప్రధాన గోపురం 80 అడుగుల ఎత్తులో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. గుడి వెనుక ఉన్న శిలాఫలకం మీద ఉన్న రాజరాజచోళుడు వేయించిన శాసనం ద్వారా ఈ ఆలయ ప్రాంగణంలో 80 రోజులు మహాయజ్ఞం ఒకటి జరిగినట్లు, ఆ సందర్భంలో రాజరాజ చోళుడు కాశీ విశ్వేశ్వరుని దేవాలయంతోపాటు ఎన్నో శివాలయాలకు భూదానం చేసినట్లు తెలుస్తోంది.
ఆలయ నిర్వహణ
కార్వేటినగర నిర్మాత శ్రీ వేంకట పెరుమాళ్రాజుగారిచే శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో నిరంతర సమారాధనలు జరిగేవి. వేణుగోపాలస్వామివారి గుడికి ఆనాడు పుష్కలంగా పంటలు పండే ''పుణ్యగ్రామం'' ఆదాయం 500 బస్తాల ధాన్యం. ఆ రోజుల్లోనే రూ. 1500/- శిస్తు ఖజానా నుండి ఆలయానికి వచ్చేది. ఈ ఆలయంలోనే పెద్ద ధాన్యాగారం ఉండేదని, దాని నుండి ధాన్యాన్ని తీసి దంచి సిద్ధం చేసుకునే బియ్యంతో స్వామివారికి వివిధ నైవేద్యాలకు సరిపడా ధాన్యం సమర్పించబడేదని తెలుస్తోంది.
ఈ ఆలయ ప్రాంతంలో కళ్యాణాలు జరిపించిన వారికి సంతానవృద్ధి జరిగి సౌభాగ్యాలు సమకూరుతాయని, స్వామిని నమ్ముకున్న వారికి ఏదో రూపంలో జీవనోపాధి లభిస్తుందని, స్వామిని అర్చించేవారికి సర్వకార్యానుకూలసిద్ధి, మనోభీష్టసిద్ధి జరుగుతుందని భక్తుల విశ్వాసం.
మేలుకొలుపు
వేణుగోపాలస్వామిని మునుపటి రాత్రి శయన మండపంలోని వెండి ఊయలలో నిద్రింపచేసి అర్చక స్వాములు ఉదయాన్నే మేలుకొల్పుతారు. షోడశోపచారాలు పూర్తయిన తర్వాత పుష్ప సమర్పణ జరుగుతుంది.
ఇప్పుడు స్వామివారికి ప్రతి నిత్యం త్రికాల సంధ్యల్లో మంగళవాద్యాలతో ఆరాధనలు, నైవేద్యాలు జరుగుతాయి.
రాత్రి 8 గంటలకు ఆలయంలో శుద్ధి జరిగి, ఏకాంతసేవ, పవళింపు సేవలు జరుగుతాయి.
విశేష పూజలు
కృష్ణపక్ష, శుక్లపక్ష, ఏకాదశుల్లో పరివార దేవతలైన ద్వారపాలకులకు, విష్వక్సేన, గరుడాది వాహనాలకు, ఇతర ఆళ్వారులకు ఆచార్య పురుషులకు తిరుమంజనం జరుగుతుంది.
శ్రీ వేణుగోపాలస్వామి జన్మ నక్షత్రమైన రోహిణీ నక్షత్రంలోనూ, శ్రీరాములవారి జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రంలోను, లక్ష్మీదేవి జన్మనక్షత్రమైన ఉత్తర ఫల్గుణి నక్షత్రంలోనూ ఆయా దేవతలకు మాశ త్రిమంజనాలు, విశేష నివేదనలు ఉంటాయి. శ్రీ వేణుగోపాలస్వామి వారికి వైశాఖమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
సంక్రాంతి మరుసటిరోజు పశువుల పండుగ సందర్భంగా గోపాలస్వామివారికి విశేష పూజాదికాలు నిర్వహిస్తారు. ఉగాదినాడు పంచాంగశ్రవణం, దీపావళినాడు ఆదాయ వ్యయ నివేదనలు జరుగుతాయి.
వైకుంఠ ఏకాదశి మరుసటిరోజున ద్వాదశి ఉత్సవంలో తనను దర్శించుకోడానికి గుడికి రాలేకపోయిన భక్తులకోసం స్వామివారే ఊరేగింపుగా తరలివచ్చి తిరువీధి దర్శనం ఇస్తారు.
ఈ ఆలయానికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహా సంప్రోక్షణాన్ని నిర్వహిస్తుంటారు.
ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు సుప్రభాతసేవ కొనసాగుతుంది. మధ్యాహ్నపూజతో సర్వదర్సనం, ధర్మదర్శనం జరుగుతుంది. మధ్యాహ్నం పన్నెండున్నరకు బీగముద్ర ముగిసిన తర్వాత గుడి తలుపులు మూసి తాళంవేసి లక్కతో సీలు వేస్తారు. ప్రతిరోజూ సాయంత్రం నాలుగు నుండి ఆరు వరకు సర్వదర్శనం ఉంటుంది. ఆరు తర్వాత సాయం సంధ్యారాధన ఉంటుంది.
Venugopala swamy Temple in Tirupati, Venugopala swamy Temple at Karveti, Venugopala swamy Temple vaikuntha Ekadashi, Venugopala swamy Temple special puja, Venugopala swamy Temple sankranti next day, Venugopala swamy Temple maha samprokshana




