కల్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం
నారాయణవరం
Kalyana Venkateswara Swamy Temple (Narayanavaram)
శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారు, పద్మావతీ అమ్మవారు నెలకొని ఉన్ని దివ్యక్షేత్రం నారాయణవరం. ఆకాశరాజు కుమార్తె పద్మావతీ దేవిని శ్రీనివాసుడు పరిణయమాడిన పరమ పవిత్రస్థలమిది.
కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీనివాసుని దివ్య క్షేత్రానికి 34 కిలోమీటర్ల దూరంలో తిరుపతి - మద్రాసు మార్గంలో పుత్తూరుకు 5 కిలోమీటర్ల దూరంలో వెలసిన దివ్య క్షేత్రం నారాయణవరం. దీని అసలు పేరు నారాయణపురం. శ్రీనివాసుడు వేటకోసం వచ్చి నారాయణ వనోద్యానంలో చెలికత్తెలతో విహరిస్తున్న పద్మావతిని చూసి, మోహించి వివాహం చేసుకున్నాడు. కనుక దీనికి నారయణపురం అని పేరొచ్చింది. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడు పద్మావతిని వివాహమాడుటకై వరునిగా ఆవిర్భవించినందువల్ల ఈ క్షేత్రం నారాయణవరంగా నేటికీ పిలవబడుతోంది.
ఈ ఆలయ ప్రాభవ, ప్రాశస్త్యాల గురించి శ్రీ వెంకటాచల మహాత్మ్యంలో వివరించబడింది. ఇక్కడి ఆలయాన్ని ఆకాశరాజు కట్టించినట్లు భక్తుల విశ్వాసం. శిథిలమైన ఆలయాన్ని క్రీస్తుశకం 1245 సంవత్సరంలో అప్పటి రాజు వీరనరసింగ దేవ యాదవ రాయలు (1205 – 1245) జీర్ణోద్ధరణ చేశారు. పెనుగొండ వీరప్పన్న నారాయణవరంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని క్రీస్తుశకం 1541 42 కాలంలో పునర్నిర్మించినట్లు తెలుస్తోంది.
1967 వ సంవత్సరం ఏప్రిల్ నెల 29వ తేదీన ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానముల అధీనంలోకి వచ్చింది.
.png)
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి
ఇక్కడ అర్చామూర్తి శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారు. ఆయన సకలాభీష్ట ఫలప్రదుడు. స్వామివారు తూర్పుముఖంగా ఉన్నారు. వక్షస్థలంలో లక్ష్మీదేవి విరాజిల్లుతోంది. స్వామివారు నడుముకు దశావతార వడ్డాణం ధరించి ఉన్నారు. భుజంపై సాలగ్రామమాల ధరించి, కుడిచేతిలో చక్రం, ఎడమ చేతిలో ఖడ్గం ధరించి ఉన్నారు. చేతిలో వేట ఖడ్గం ఉంది.
పద్మావతీ అమ్మవారు

ఆకాశరాజు యజ్ఞం కొరకు భూమి దున్నుతుండగా ఒక పేటిక యందు పద్మంలో దొరికింది కనుక ఈమెకు పద్మిని, పద్మావతి అని పేర్లు. స్కంద పురాణంలో ఈమె పేరు పద్మినిగాను, భవిష్యోత్తర పురాణంలో పద్మావతిగాను చెప్పబడింది. ఈమెను ''పద్మవల్లి'' అని కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు స్వామివారికి కుడివైపు దక్షిణదిక్కు నందు మరొక ప్రత్యేక ఆలయంలో నెలకొని ఉన్నారు. అమ్మవారి ఆలయ విమానమును విష్ణుశ్చంద్రవిమానం అంటారు. ఆలయానికి నైరుతి దిశయందు అమ్మావారి సన్నిధి ఉంది. అమ్మవారి ఆలయ ముఖద్వారంవద్ద కుడివైపున సరస్వతీదేవి, ఎడమవైపున కల్పవృక్షం, కామధేనువులు దర్శనమిస్తాయి.
శ్రీ పద్మావతీ అమ్మవారు తూర్పుముఖంగా కొలువై ఉన్నారు. ఆమె పద్మపీఠంపై ఆసీనురాలై చతుర్భుజంగా దర్శనమిస్తుంది. పూర్వం వేదవతియే పద్మావతిగా జన్మించినట్లు శ్రీవేంకటాచల మహాత్మ్యం పేర్కొన్నది. ఆలయం చుట్టూ ప్రదక్షిణ మార్గం ఉంది. దానిచుట్టూ మరొక ప్రాకారం ఉంది. బయట మహా ప్రదక్షిణ మార్గం ఉంది.
ఆలయ వాయువ్యదిశలో మనకు ఆండాళమ్మ (గోదాదేవి) ఆలయం దర్శనమిస్తుంది. ఆలయ ఉత్తర ద్వారం ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశినాడు కాకుండా ఆ మర్నాడు ద్వాదశినాడు తెరుస్తారు.
కోదండరామస్వామి, రంగనాథ స్వామి
ఈశాన్యం వైపు ఉన్న మందిరంలో శ్రీరంగనాథ స్వామివారు కోదండరామస్వామివారు వేంచేసి ఉన్నారు. పక్కనే ఉన్న మండపంలో విశ్వక్సేనులు, తిరుక్కచ్చి నంబి, తిరుమంగై ఆళ్వారు, మలవాళముని విగ్రహాలున్నాయి.
శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయం తూర్పుముఖంగా ఉంది. రెండు పెద్ద రాతి గడపలు దాటి లోపలికి వెళ్తే మనకు రెండువైపులా వాహన మండపాలు దర్శనమిస్తాయి. ఆగ్నేయదిశలో వంటశాల ఉంది. ఇక్కడ స్వామివారికి, అమ్మవారికి నైవేద్యాలు తయారుచేస్తారు. అటునుండి దక్షిణదిశగా వెళ్తే ఒక పెద్ద మండపంలో పన్నిద్దరు ఆళ్వారులు కొలువుదీరి ఉండటం చూడవచ్చు.
ప్రధాన ఆలయానికి ముందుభాగాన పెద్ద ధ్వజస్తంభం కనబడుతుంది. దానికి పూర్తిగా రాగి తొడుగు ఉంది. దానిముందు బలిపీఠం ఉంది. ధ్వజస్తంభానికి ఆనుకుని ఉన్న గరుడ మండపం నందు గరుడాళ్వారు స్వామికి అభిముఖంగా సన్నిధి చేసి ఉన్నారు.
ఆలయ గోపురాలు
ఆలయ ప్రధాన రాజగోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు కట్టించాడు. ఇది ఏడు అంతస్తులతో 150 అడుగుల ఎత్తున శోభాయమానంగా కనబడుతుంది. రెండవ గోపురాన్ని వీరనరసింగదేవయాదవ రాయలు కట్టించారు. ఇది మూడు అంతస్తుల్లో ఐదు కళాశాలతో విరాజిల్లుతోంది. ఆలయం నాలుగు మూలలా బలిపీఠాలు ఉన్నాయి.
పంచబేరాలు
బేరం అంటే మూర్తి, విగ్రహం అని అర్ధం. స్వామివారి ఆలయంలో పంచబేరాలు కలవు. ఇంకా ఆండాళమ్మ విగ్రహం, శ్రీ భక్తాంజనేయ స్వామి విగ్రహం బహు సుందరంగా దర్శనమిస్తాయి.
ఉత్సవాలు
ఈ దేవాలయంలో వైఖానస ఆగమోక్త ప్రకారం నిత్యోత్సవ, వారోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలన్నీ సౌరమానం ప్రకారం జరుగుతాయి. సంకల్పం కూడా సౌరమానం ప్రకారమే చెప్తారు. స్వామివారికి ప్రతినిత్యం సుప్రభాతసేవ జరుగుతుంది. అలాగే అర్చన, నైవేద్యం, ఏకాంతసేవ ప్రతిరోజూ జరుగుతాయి.
శుక్రవారోత్సవం
ప్రతి శుక్రవారం ఉదయం స్వామివారికి, అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. స్వామివారికి, అమ్మవారికి ఇద్దరికీ శుక్రవారాభిషేకం జరగడం ఇక్కడి విశేషం. శ్రీ పద్మావతి అమ్మవారికి ప్రతి శుక్రవారం సాయంత్రం శుక్రవారోత్సవం జరుగుతుంది.
కళ్యాణోత్సవం
సాక్షాత్తూ శ్రీ పద్మావతీ శ్రీనివాసుల కల్యాణం జరిగిన పరమ పవిత్ర స్థలం నారాయణవర దివ్యక్షేత్రం. ఆర్జిత రుసుము చెల్లించిన భక్తుల కోరిక మేరకు ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల మధ్యకాలంలో స్వామివారి ముఖ మండపంలో శ్రీ పద్మావతీ కల్యాణ వేంకటేశ్వరుల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించబడుతుంది.
తెప్పోత్సవం
స్వామివారికి ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో శుద్ధ ఏకాదశి నుండి కార్తీక పౌర్ణమి వరకు, తొలినాడు శ్రీరామచంద్రమూర్తి, మరునాడు శ్రీకృష్ణ స్వామి, గోదాదేవి, తర్వాత మూడురోజులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారికి తెప్పోత్సవం వైభవంగా జరుగుతుంది.
బ్రహ్మోత్సవాలు
శ్రీ పద్మావతీ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో తొమ్మిదిరోజులు మహా వైభవంగా నిర్వహించబడతాయి. ఇవి చిత్తా నక్షత్రంతో ప్రారంభమై శ్రవణా నక్షత్రంతో ముగుస్తాయి.
ప్రథానాలయానికి ఎదురుగా ఆంజనేయస్వామివారి ఆలయం ఉంది. దానికి దక్షిణంగా పరాశరేశ్వర స్వామివారి ఆలయం ఉంది. చిత్రాంగి కోటకు వెళ్ళేదారిలో మొట్టమొదట శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయం దర్శనమిస్తుంది. చిత్రాంగి కోట ముఖద్వారంలో మనకు శక్తి వినాయకస్వామివారి ఆలయం దర్శనమిస్తుంది.
శ్రీ ఆగస్త్యేశ్వర స్వామివారి ఆలయం
ఇది పురాణ ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఉద్యానవనంలో శ్రీనివాసుని దర్శించిన పద్మావతి మోహ వివశురాలౌతుంది. ఆమె తల్లిదండ్రులు దైవజ్ఞులను ప్రశ్నించగా వారు అగంస్త్యేశ్వర స్వామివారికి అభిషేకం చేయించమని, అంతా శుభమే జరుగుతుందని చెప్తారు. అప్పుడు ఆకాశరాజు ఈ ఆలయంలో అగస్త్యేశ్వర స్వామివారికి అభిషేకం, పూజలు చేయిస్తాడు. ఈ విషయం స్కాందపురాణంలోని శ్రీవేంకటాచల మాహాత్మ్యంలో పేర్కొనబడింది. ఈ అగస్త్యేశ్వర స్వామి ఆకాశరాజు ఇలవేల్పు అని చెప్తారు. అరుణానడి దక్షిణతీరంలో వెలసిన మరొక ముఖ్యమైన ఆలయం అవనాక్షమ్మ దేవాలయం. ఈమె గ్రామదేవత. ఆదిపరాశక్తి అవనాక్షమ్మ రూపంలో ఇక్కడ వెలసింది. అష్టభుజములతో ఈమె అతి మనోహరంగా దర్శనమిస్తుంది. ఈమె సక్తిస్వరూపిణి.
స్థల పురాణం
బ్రహ్మదేవుని ఆజ్ఞమేరకు కాళికాదేవి ఆకాశరాజు కోటలో స్వయంభువుగా వెలసింది. అది చిన్న విగ్రహం. అగస్త్య మునీంద్రులు అమ్మవారికి ''ఆమ్నాయాక్షి'' అని నామకరణం చేశారు. ''ఆమ్నాయ''మనగా ''వేదం'' అని అర్థం. ''అక్షి'' అనగా నేత్రం. ఆమ్నాయాక్షి అంటే వేదాలు నేత్రాలుగా కలది అని అర్థం. ఈమెకు అవినాశినీదేవి అని కూడా మరొక పేరు ఉంది. ''ఆమ్నాయాక్షి పేరు కాలక్రమంలో ''అవనాక్షి''గా మారింది. అమ్మవారి నిలువెత్తు విగ్రహం అతి మనోహరంగా, అత్యంత ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది. శిరస్సుపై అగ్నిజ్వాల మకుటం, మకుటం మధ్యలో ఓ రాక్షసపాలం, మకుటానికి ఇరువైపులా సూర్యచంద్రులు ఉన్నారు. అమ్మవారు అష్టభుజాలతో శోభిల్లుతున్నారు. అత్యంత ఆకర్షణీయమైన ఈ ఆలయాన్ని దర్శించిన ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ తామ్రపత్రంపై శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారు.
Kalyana Venkateswara Swamy Temple near tirupati, Kalyana Venkateswara Swamy Temple in Narayanavaram, Kalyana venkateswara brahmotsavas in narayanavaram, agasthyeswara temple in tirupati, teppotsavam in narayanavaram




