వేదనారాయణ స్వామి ఆలయం
Vedanarayana swamy temple
.png)
తిరుపతి సమీపంలో ఉన్న నాగలాపురంలో ఉంది వేదనారాయణ స్వామి దేవాలయం. నాగలాపురం అసలు పేరు ''హరిగండపురం''. ఈ వేదనారాయణ స్వామి ఆలయానికి సంబంధించిన స్థల పురాణం ఇలా ఉంది. కృష్ణదేవరాయలు కళింగ యుద్ధం తర్వాత కుంభకోణంలో జరుగుతోన్న మహాముఖ ఉత్సవానికి వెళ్తూ మార్గమద్యంలో తిరుమల వేంకటేశ్వరుని దర్శించుకుని నాగలాపురంలో విడిది చేసినప్పుడు శ్రీహరి వేదనారాయణ స్వామి రూపంలో కనిపించి తనకు సప్త ప్రాకారాలతో ఆలయాన్ని నిర్మించమని కోరాడట. ఆలయ నిర్మాణానికి అయ్యే సొమ్మును ఇచ్చి స్వామి పూజాదికాల కోసం ''హరిగండపురం'' (ప్రస్తుత నాగలాపురం) గ్రామాన్ని హరిదాసుడైన వడమాల అనే వ్యక్తికి దానం ఇచ్చాడు. హరిదాసుకు ఆలయ నిర్మాణం అప్పజెప్పాడు. నాటి హరిగండాపురమే నేటి నాగలాపురం. కృష్ణదేవరాయల తల్లి నాగులాంబ పేరు మీదుగా కట్టించిన ఈ గ్రామం నాగలాపురంగా ప్రసిద్ధిచెందింది.
ఆలయ సంప్రదాయంలో రాముడు, కృష్ణుడు మొదలైన అవతారాలకు ఆలయాలు నిర్మించి పూజిస్తున్నాం. కానీ, వరాహ, కచ్ఛప, మత్స్య అవతారాలకు ఆలయాలు అరుదు. తిరుమలలో వరాహస్వామి ఆలయం ఉన్నట్లే శ్రీకూర్మంలో కచ్చపేశ్వర ఆలయం, మత్స్యావతారానికి నాగలాపురంలో ఆలయాలు వెలిశాయి.
చెన్నై - తిరుపతి రహదారిలో పుత్తూరు నుంచి ఊత్తుకొట్టై మార్గంలో పుత్తూరు నుంచి 35 కిలోమీటర్ల దూరంలోనూ తిరుపతి నుంచి 75 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది నాగలాపురం. హరిగండపురం అని ఈ నగరానికి పూర్వపు పేరు.
ఇక్కడ మత్స్యావతారం ధరించి సోమకాసురుని నుంచి వేదాలను తెచ్చిన విష్ణుమూర్తి వెలశాడు. ఇదెంతో ప్రసిద్ధి చెందింది.
ఆలయ నిర్మాణ వైభవం - శాసన సాక్ష్యం
ఈ ఆలయ కుడ్యాలపై తెలుగు, కన్నడం, తమిళం, సంస్కృత భాషల్లో వేసిన శాసనాలు కనిపిస్తాయి.
అనేక శాసనాలు ఆలయ నిర్వహణ, నిత్య నైమిత్తిక పూజలకోసం, ఉత్సవాల నిర్వహణ కోసం కృష్ణదేవరాయలు దానం చేసిన వివరాలు తెల్పుతున్నాయి.
నాగలాపుర ఆలయంలోని స్వామి మత్స్యావతారంలోని విష్ణువు. విష్ణుమూర్తి ఉభయ పార్శ్వాలలో శ్రీదేవి, భూదేవి ఉన్నారు. ఇది ఈ స్వామి విశిష్టత. ద్వారపాలకులుగా జయ, విజయులు ఉండాల్సిన చోట వినాయకుడు, వైష్ణవి (దుర్గ) నిలిచి ఉన్నారు. ఇంకో విశేషం ఏమిటంటే స్వామికి ఎదురుగా నిలబడాల్సిన గరుత్మంతుడు స్వామికి అభిముఖంగా కానరాడు. అసలు స్వామి పశ్చిమాభిముఖంగా ఉండటం మరో విశేషం. ప్రతి ఏటా మార్చి నెలలో సూర్యుని కిరణాలు అస్తమయం అయ్యేటప్పుడు మొదటిరోజు స్వామివారి మత్స్య పుచ్చం మీద, రెండోరోజు స్వామి నాభి పైన, మూడోరోజు స్వామి కిరీటంపై ప్రసరిస్తాయి. ఈ ఖగోళ సౌందర్య విశేషాన్ని మార్చి నెలలో తెప్పోత్సవాల సందర్భంలో తిలకించవచ్చు.
నాగలాపుర ఆలయం చుట్టుపక్కల ఉన్న ఆలయాల కంటే ఈ ఆలయ వైశాల్యం ఎక్కువ. నాలుగు వైపులా ప్రాకార గోపురాలు ఉన్నాయి. ప్రాకారమే రాజకోటలా ఉంటుంది. నాలుగువైపులా నాలుగు గోపురాలు ఉన్నప్పటికీ పశ్చిమం వైపు ఉన్న ద్వారం నుండి మాత్రమే లోనికి ప్రవేసించవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనలోకి ఈ ఆలయం వచ్చిన తర్వాత పశ్చిమ ద్వార గోపురాన్ని ఎత్తుగా కాకుండా వెడల్పుగా పునర్నిర్మించి 1976లో ధ్వజస్తంభాన్ని కూడా మార్పు చేసి శిథిల ప్రాంగణ మాళిగను జీర్ణోద్ధరణ కావించడం జరిగింది. మిగిలిన గోపురాలు జీర్ణోద్ధరణ చేయడం జరుగుతోంది.
రెండవ ప్రాకారం పడమటి గోపురం ద్వారానే లోనికి ప్రవేశించాలి. లోపలికి వెళ్ళగానే నాలుగువైపులా మండపాలను దర్సించవచ్చు. ఈ ఆలయ నిర్మాణం, వైశాల్యం, ఇంకా ''గ్రౌండ్ ప్లాను'' విజయనగర వాస్తు రీతిని అనుసరించి ఉన్నాయి. ఇక్కడ కుడివైపు వేదవల్లి అమ్మవారి ప్రత్యేకమైన గుడి ఉన్నది. ఇది వేదనారాయణ స్వామి ఆలయానికి ఎదురుగా నైరుతి దిక్కున ఉంది. వేదవల్లి అమ్మవారు తూర్పుముఖంచేసి ఉంది. ఇక్కడే గరుత్మంతుని పెద్ద విగ్రహం నిలుచున్న భంగిమలో ఉన్నది చుట్టూ ఉండే ప్రాకార మండపాల్లో నాలుగు మూలల్లోని వివిధోపయోగ గదులున్నాయి. ఈ రెండో ఆవరణలోకి వచ్చిన వెంటనే ఎడమవైపున వీరాంజనేయ, లక్ష్మీ నరసింహ, కోదండరాముడు, సీతాలక్ష్మణ సమేత ఆలయాలు మూడింటిని చూడవచ్చు. ఆలయానికి ఆగ్నేయదిశలో వంటశాల ఉంది. దానికి ఎదురుగా నైరుతి దిక్కులో ఆలయ పరిపాలన అధికారి కార్యాలయం ఉంది.
మూడవ ప్రాకారం లోపల ప్రధాన ఆలయం ఉంది. ఆలయం ముందు వేదవల్లి అమ్మవారి గుడికి కుడివైపున సుమారు 30, 40 అడుగుల విస్తీర్ణంగల ప్రాంగణం మధ్యలో వేదనారాయణ స్వామి ప్రధాన ఆలయం ఉంది. ఆలయద్వారంలో గణపతి, దుర్గామూర్తులు వెడల్పైన వరండాలో తిన్నెపై పహరా కాస్తున్నారు.
లోపల ముఖమండపం తగినంత పెద్దదిగా.. అంటే.. వేదవల్లి తాయారు గుడి కంటే పెద్దదిగా ఉంది. ముఖ మండపం తర్వాత ఒక అంతరాళం. ఇక్కడ ఎడమవైపు స్వామివారి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలు చిన్నగదిలో ఉన్నాయి. కుడివైపు గదిలో పన్నెండుమంది ఆళ్వారులు, రామానుజులు, విష్వక్సేనులవారి విగ్రహాలు ఉన్నాయి. ఆళ్వారుల విగ్రహాలు అన్నీ చక్కని నల్లని రాతితో మలచబడి ఉన్నాయి. ఇవి ఆలయంలో తవ్వకాలు జరిపినప్పుడు దొరికాయి.
స్వామివారి గర్భగుడి వెలుపల గోడలో వీణాదారి దక్షిణామూర్తి, నిల్చున్న గణపతి, దుర్గా, లక్ష్మీ వరాహస్వామి, బ్రహ్మ, హయగ్రీవుల విగ్రహాలు అపూర్వంగా ఉంటాయి.
స్వపనమండపం దాటిన తర్వాత గర్భగుడిలో వేదనారాయణ స్వామి విగ్రహాన్ని దర్సించవచ్చు. కిరీట, కర్ణకుండల, కంఠహారాలతో అలంకరణ చేసిన స్వామి ఉభయదేవేరులతో దర్శనం ఇస్తాడు. స్వామికి నడుము కింది భాగం మత్స్య రూపమే. స్వామికి నిత్య పూజలు సుప్రభాతంతో మొదలై ఏకాంతసేవ వరకూ జరుగుతాయి. మధ్యాహ్నం నాలుగు గంటలు విశ్రాంతి. తెప్పోత్సవం, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవం, సూర్య పూజ మొదలైన ఉత్సవాలు జరుగుతాయి. స్వామివారికి శనివారం అభిషేకం జరుగుతుంది. మార్చినెలలో జరిగే సూర్యపూజకు, బ్రహ్మోత్సవాలకు భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారి కృపకు పాత్రులౌతారు.
Tirupati Vedanarayana swamy temple, Nagalapuram Vedanarayana swamy temple, Tirupati surrounding temples, tirumala tirupati temples, tirupati local temples, Nagalapuram Vedanarayana swamy rituals




