Home »Temples In Tirupati » Tirumala Kapila Theertham
?>

ప్రఖ్యాత కపిలతీర్థం

Tirumala Kapila Theertham

తిరుమల కొండల పాదాల వద్ద వెలసిన పుణ్యతీర్థం కపిలతీర్థం. ఇది చాలా ప్రాచీనమైంది. దీన్ని ''ఆళ్వారుతీర్థం'' ''చక్రతీర్థం'' అని కూడా పిలుస్తారు. కపిలేశ్వరస్వామి, కామాక్షీదేవి ఆలయ దేవతలు. గుడి ప్రాంగణంలో వేణుగోపాలస్వామి, లక్ష్మీనారాయణస్వామి వార్ల ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడి శివలింగాన్ని కపిల మహర్షి ప్రతిష్ఠించి పూజించినందువల్ల ఈ ఆలయంలోని ఈశ్వరుని కపిలేశ్వరుడు అంటారు. కపిలతీర్థం క్రీస్తుశకం 11నాటిదని తెలుస్తోంది. తిరుపతికి సమీపంలో ప్రస్తుత ఖాదీ కాలనీ వద్ద కొత్తూరు గ్రామాధికారి అయిన రాజేంద్రచోళుడు క్రీస్తుశకం 1012-1044 సంవత్సరాల పాలన కాలంలో శ్రీ కపిలేశ్వరస్వామి గర్భాలయంలోని ముఖ మండపాలు నిర్మించినట్లు తెలుస్తోంది. తర్వాత విజయన రాజైన అచ్యుత దేవరాయలు క్రీస్తుశకం 15వ శతాబ్దంలో కపిలతీర్థానికి సుదర్శన చక్రతీర్థం పేరుతో ప్రత్యేకతను కల్పించాడు. ఆ తర్వాత ఆరవీటి రాజైన పోట్లపాటి తిమ్మరాజు క్రీస్తుశకం 1647 సంవత్సరంలోనూ, తర్వాత సదాశివ రాయల కాలంలో క్రీస్తుశకం 1663 సంవత్సరంలోనూ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. తర్వాత ఈ ఆలయం కరకంబాడి పాలెయగార్ల అధీనంలోనూ, మహంతుల పాలనలోనూ చేరింది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం పాలన లోని ఆలయాల్లో ఈ శివాలయం ఎంతో ప్రముఖమైంది.

కపిలతీర్థం ఆలయంలోని పార్వతీ అమ్మవారు ''కామాక్షీదేవి'' పేరుతో పిలవబడుతోంది. ఇంకా ఈ ఆలయంలో దక్షిణామూర్తి, కాలభైరవస్వామి, మహాగణపతి, మహా శాస్త్ర, కాశీ విశ్వేశ్వరస్వామి, ఉమామహేశ్వరస్వామి, రామలింగేశ్వరస్వామి, ప్రమథ గణపతి, శ్రీ శివసూర్యస్వామి వారల మూర్తులున్నాయి.

పరివార దేవతా మండపంలోని ఏకాంత మండపంలో ఉత్సవమూర్తులైన శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షీదేవి, శ్రీ శుక్రవారపుదేవి, శ్రీ చంద్రశేఖర, శ్రీ మనోన్మణి అమ్మవార్లు, శ్రీ నటరాజ, శివకామసుందరి, శ్రీ వినాయక, శ్రీ కుమారస్వామి, శ్రీ త్రిశూలస్వామి, శ్రీ చండీకేశ్వరస్వామి, శ్రీ మాణిక్య వాచకర్ స్వామి మొదలైన పంచలోహమూర్తులు వెలసి ఉన్నాయి.

కపిలతీర్థ పుష్కరిణి

అనాదిగా తిరుమలకు వెళ్ళే యాత్రికులు కపిలతీర్థం పుష్కరగిరిలో తీర్థవిధులు నిర్వహించి తర్వాత శ్రీ కామాక్షి కపిలేశ్వరులను దర్శించి తర్వాత తిరుమలేశుని దర్శించుకోవడం సంప్రదాయంగా కొనసాగుతోంది. కార్తీకమాసంలో కపిలతీర్థంలోని జలపాతంలో స్నానం చేయడం ఎంతో పుణ్యప్రదం.

ఇతర ఆలయాలు

కపిలతీర్థం పుష్కరిణికి దక్షిణ దిక్కున రంగమండపంలో ఉత్తరాభిముఖంగా శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఆలయం, తూర్పు ముఖంగా లక్ష్మీనారాయణస్వామి ఆలయాలు ఉన్నాయి.

ఉత్సవ విశేషాలు

కపిలేశ్వర స్వామి డోలోత్సవం

కపిలతీర్థ ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీ కామాక్షి, కపిలేశ్వర స్వామి వారికి ప్రతి సోమవారం సాయంత్రం ఊంజల్ సేవ జరుగుతుంది. దేవీ నవరాత్రుల్లోనూ డోలోత్సవం జరుగుతుంది.,

తెప్పోత్సవం

కపిలేశ్వర క్షేత్రంలో ప్రతి సంవత్సరం మార్గశిర త్రయోదశి, చతుర్దశి , పౌర్ణమి రోజుల్లో తెప్పోత్సవాలు నిర్వహించబడతాయి.

కళ్యాణోత్సవం

శ్రీ కామాక్షీ సమేత కపిలేశ్వరస్వామి వారికి ప్రతి నెలా మాస శివరాత్రి రోజున సాయంసంధ్యలో కళ్యాణోత్సవం జరుగుతుంది. ఇందులో పాల్గొన్న దంపతులకు ఒక లడ్డూ అన్నప్రసాదాలు అందజేస్తారు. ఇది ఆర్జితసేవగా కొనసాగుతోంది. ఇంకా మాఘమాసంలో మహాశివరాత్రి మరుసటిరోజు సాయంత్రం కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతోంది.

బ్రహ్మోత్సవాలు

ప్రతి సంవత్సరం మాఘమాసంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ కపిలేశ్వర, శ్రీ కామాక్షీవారలకు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ఈ ఉత్సవాల్లో స్వామివారిని వివిధ వాహనాలపై తిరుపతి పురవీధుల్లో ఊరేగిస్తారు. బ్రహ్మోత్సవం చివరి రోజున స్వామివారి ఆయుధమైన త్రిశూలస్వామికి పుష్కరిణిలో త్రిశూల స్నానం జరుగుతుంది.

కార్తీక దీపోత్సవం

ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో కృత్తిక నక్షత్రం ఉన్న రోజున శ్రీ కపిలేశ్వరస్వామి వారి ఆలయంలో దీపోత్సవం వైభవంగా నిర్వహించబడుతుంది.

కార్తీకదీపం - ఆకాశదీపం

కృత్తిక దీపోత్సవం రోజు శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయం పై భాగాన ఉన్న పెద్ద గుడిలో తిరుపతిలో అఖండజ్యోతి తిరుపతి, పరిసరవాసులకు దర్శనమిస్తూ కార్తీక దీపోత్సవంఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

అన్నాభిషేకం

కపిలతీర్థం ముక్కోటిగా ప్రసిద్ధి గాంచిన ఉత్సవం అన్నాభిషేకం. సౌరమానం ప్రకారం తులామాసం పౌర్ణమిరోజున శ్రీ కపిలేశ్వరస్వామివారి మూలమూర్తిగా అన్నాభిషేకం అనే విశేష ఉత్సవం జరుగుతుంది. ఈ అభిషేక ఉత్సవం మధ్యాహ్న విశేష పూజ. ఈ అన్నాభిషేకం తర్వాత సర్వదర్శనం నిర్వహిస్తారు.

సర్పదోష నివారణ (రాహుకేతు) పూజలు

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆర్జితసేవగా సర్పదోష నివారణ పూజలు ప్రారంభించారు. ప్రతి ఆది, మంగళ, శుక్రవారాలలో ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు, తిరిగి సాయంత్రం మూడు నుండి ఆరు వరకు జరుగుతాయి.

 

kapila theertham, kapila theertham photos, kapila tirtha tirumala, kapila tirtha tirumala, kapila tirtham pictures, kapila thirtha temple tirupati, kapila theertham waterfall