Home »Temples In Tirupati » Govindaraja swamy Temple Tirupati
?>

గోవిందరాజస్వామి దేవాలయం

Govindaraja swamy Temple Tirupati

తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది గోవిందరాజస్వామి దేవాలయం. ఈ స్వామి పేరుతో తిరుపతిని ''గోవిందరాజ పట్నం'' అని కూడా పిలుస్తారు. తిరుమల ఏడుకొండలవానికి అన్నయ్యే గోవిందరాజస్వామి. శ్రీనివాసుని కల్యాణం కోసం ధనాన్ని కొలమానికతో కొలచి కొలచి అలసిపోయి, ఆ కొలమానికనే తలగడగా (దిండు) చేసుకుని సేదతీరినట్లు చెప్పే కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

గర్భగృహంలో సున్నంతో చేసిన శయనమూర్తి అయిన శ్రీ గోవిందరాజస్వామి విగ్రహం నెలకొని ఉంది. తలకింద స్వామికి తలగడ (దీన్ని ''కుంచెం'' అని కూడా అంటారు) నాభి నుండి ఉద్భవించిన పద్మంపై చతుర్ముఖ బ్రహ్మ, తూర్పువైపున లక్ష్మీదేవి స్వామి పాదాలకు ఉత్తరంగానూ, ఉత్తరం వైపున దక్షినాభిముఖంగా భూదేవి విగ్రహాలున్నాయి. స్వామి పాదాలచెంత మధుకైటభులు అనే రాక్షసుల విగ్రహాలున్నాయి. గోవిందరాజస్వామికి అభిముఖంగా ధ్వజస్తంభం, బలిపీఠాలతోపాటు సమీపంలోని ఎత్తయిన చిన్న మంటపంలో ఆంజనేయస్వామిని ప్రతిష్టించారు. అలాగే గోవిందరాజస్వామి దేవాలయంలో ద్వారపాలకులతోబాటు వసంత మంటపం, నీరాళి మంటపం, చిత్రకూట మంటపం, కుంభహారతి మంటపం, లక్ష్మీదేవి మంటపాలు, కల్యాణమంటపం, యాగశాల, అద్దాలమహల్ నిర్మించబడ్డాయి.

క్రీస్తుశకం 1129-30 మధ్యకాలంలో రామానుజాచార్యులు శ్రీ గోవిందరాజస్వామి ఆలయాన్ని తిరుపతిలో నిర్మించి, స్వామివారిని ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. విశాలమైన ఈ గోవిందరాజస్వామి ఆలయంలో అనేక గుళ్ళున్నాయి.

శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవాలు

గోవిందరాజస్వామివారికి అనేక ఉత్సవాలను ప్రాచీనకాలం నుండి నేటికీ నిర్వహిస్తున్నారు. అందులో నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలు జరుగుతాయి.

నిత్యోత్సవాలు

ఈ ఉత్సవాల్లో సుప్రభాతం, తోమాలసేవ, సహస్రనామార్చన, అర్చనఫలం, శుద్ధి - మొదటిగంట; బలి, శాత్తుమొర, శుద్ధి, నివేదన – రెండోగంట; శుద్ధి - తోమాలసేవ శాత్తుమొర – నైవేద్యం, ఏకాంతసేవ వంటి వాటిని పేర్కొనవచ్చును.

వారోత్సవాలు - పక్షోత్సవాలు - మాసొత్సవాలు

ఈ ఉత్సవాలలోని వారోత్సవాల్లో శుక్రవారోత్సవం ప్రధానమైంది. పక్షోత్సవాల్లో ఏకాదశి ప్రధానమైంది. మాసోత్సవాల్లో ఉత్తరా నక్షత్రం, రోహిణీ నక్షత్రం, శ్రవణానక్షత్రం, పూలంగి సేవలు ప్రధానమైనవి.

వార్షికోత్సవాలు

ఈ ఉత్సవాలల్లో రథసప్తమి, గోకులాష్టమి, విజయదశమి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ద్వాదశి, కైశిక ద్వాదశి, బుగ్గోత్సవం, పొన్నకాల్వ ఉత్సవం, స్వామి అహోబల మఠానికి వేంచేసే ఉత్సవం, శ్రావణ ఉపాకర్మ, స్వామి తిరువడి సన్నిధికి వేంచేసే ఉత్సవం, స్వామి రామచంద్ర తీర్థ కట్టమీదికి వేమ్చేసే ఉత్సవం, ఆండాళ్ నీరాట్టోత్సవం, ఉగాది ఆస్థానం, దీపావళి ఆస్థానం, కార్తీక దీపోత్సవం, ధనుర్మాసోత్సవం, భోగి పండుగ, భోగి తేరు, మకర సంక్రాంతి, కనుమ, ద్వాదశ ఆరాధన, వడాయత్తు ఉత్సవం, వసంతోత్సవం, కళింగోత్సవం, ఆణివార తిరునక్షత్రం, పెరియాళ్వార్, తిరుమంగై ఆళ్వారు, మధురకవి ఆళ్వారు, వేదాంత దేశికులు, ఇతర ఆళ్వారుల తిరు నక్షత్రం ఉత్సవాలు ప్రధానమైనవి.

బ్రహ్మోత్సవాలు

తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో అత్యంత వైభవంగా జరుగుతాయి.

శ్రీ గోవిందరాజస్వామి తెప్పోత్సవం

తిరుపతిలో జరిగే ఉత్సవాల్లో గోవిందరాజస్వామి తెప్పోత్సవం ప్రసిద్ధి చెందింది. గోవిందరాజస్వామివారి తెప్పోత్సవ తిరునాళ్ళు ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ ఏకాదశినాడు ప్రారంభమై పౌర్ణమి నాటికి ముగుస్తాయి. ఆలయానికి తూర్పువైపు నున్న గోవింద పుష్కరిణిలో తెప్పోత్సవాలు ఐదు రోజులపాటు ఎంతో వైభవంగా జరుగుతాయి. స్వామివారి తెప్పను, కోనేటి మంటపాన్ని, కోనేరును రంగురంగుల విద్యుద్దీపాలటో అలంకరించి తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు.

శ్రీ పార్థసారథిస్వామి దేవాలయం

రామానుజాచార్యులు శ్రీ పార్థసారథి మందిరానికి ఆనుకుని ఉత్తరంవైపున గోవిందరాజస్వామిని ప్రతిష్టించారు. అందుకే గోపురాలన్నీ పార్థసారథి స్వామికి ఎదురుగా ఉంటాయి. ఈ మందిరం చాలా పురాతనమైంది. ఈ మందిరంలో గర్భగృహంతోబాటు అంతరాళం, ప్రదక్షిణా పథం, ముఖ మండపాలు ఉన్నాయి. శ్రీ పార్థసారథి స్వామితోబాటు రుక్మిణీ సత్యభామలు కూడా ఈ మందిరంలో ఉన్నారు. శ్రీ పార్థసారథి స్వామికి ప్రతి రోహిణీ నక్షత్రంలో వైభవంగా తిరువీధి ఉత్సవం జరుగుతుంది. రామానుజాచార్యులు శ్రీ గోవిందరాజస్వామిని ప్రతిష్ఠించిన తర్వాత ఆలయం గోవిందరాజస్వామి ఆలయంగా ప్రచారంలోకి వచ్చింది.

శ్రీ గోదాదేవి ఆలయం

గోదాదేవిని ఆండాళ్ అని, సూడిక్కుడుత్తనాచ్చియార్ అని కూడా పిలుస్తారు. గోవిందరాజస్వామి మందిరానికి దక్షిణం వైపు ముందుభాగంలోని చిత్రకూట మండపంలో గోదాదేవి ప్రతిష్ఠించబడి ఉంది. ఈ మండపంలోని స్తంభాలు విజయనగర రాజుల శిల్ప రీతులతో కనిపిస్తాయి. ప్రతి శుక్రవారం సాయంత్రం గోదాదేవికి తిరువీధి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు.

తిరుమైగై ఆళ్వారు సన్నిధి

గోవిందరాజస్వామి ఆలయం లోపల పోటు పక్కన తిరుమంగై ఆళ్వారు ఆలయం ఉంది.

శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి మందిరం

గోవిందరాజస్వామి, పార్థసారథి స్వామి, గోదాదేవి ఆలయాలకు దక్షిణాన శిల్ప శోభితమైన అనేక స్తంబాలతో నిర్మించబడిన కల్యాణ మండపం ఉంది.

శ్రీ లక్ష్మీదేవి దేవాలయం

ఈ ఆలయంలోని లక్ష్మీదేవిని పుండరీకవల్లి తాయార్ లేదా సాలై నాచ్చియార్ అని కూడా పిలుస్తారు. రెండవ గోపురం లోపల దక్షిణం వైపు సాలైనాచ్చియార్ మందిరం ఉంది.

తిరుమల నంబి మందిరం

మూడవ గోపురానికి తూర్పువైపున రామానుజాచార్యుల మేనమామ అయిన తిరుమలనంబి మందిరం ఉంది.

భాష్యకారుల సన్నిధి (శ్రీ రామానుజ సన్నిధి)

శ్రీ రామానుజాచార్యుల శిష్యులు రామానుజ సన్నిధి నెలకొల్పారు. ఈ సన్నిధి తిరుమలమంబి సన్నిధికి పక్కన ఉంది.

మధురకవి ఆళ్వారు సన్నిధి

శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వాహనాల మండపానికి ఎదురుగా మధురకవి ఆళ్వారు సన్నిధి ఉంది. ఈ ఆలయంలోనే పరాశరభట్టారు ఆనందాళ్వారులు కూడా కొలువై ఉన్నారు.

వేదాంత దేశికుల సన్నిధి

ఈ మందిరంలోని గర్భగృహగోడలు, ఆరుకుడ్య స్తంభాలు చోళశిల్ప రీతిలో కనిపిస్తాయి. గర్భగృహంలో వేదాంత దేశికులు కొలువైఉన్నారు. వేదాంత దేశికుల ఆలయానికి గర్భగృహం, అంతరాళం, మండపం వసారాలు ఉన్నాయి. వసారాలోని కొన్ని స్తంభాలు విజయనగర శిల్ప రీతుల్లో ఉన్నాయి.


Tirupati Govindaraja swamy temple, Govindaraja swamy teppotsavam, Tirupati surrounding temples, tirumala tirupati temples, tirupati local temples, Govindaraja swamy rituals