Home »Temples In Tirupati » Padmavati Ammavari Temple
?>

పద్మావతీ అమ్మవారి ఆలయం

Padmavati Ammavari Temple

తిరుపతికి సుమారు మూడు కిలోమీటర్ల దూరాన తిరుచానూరులో పద్మావతీ అమ్మవారి ఆలయం ఉంది. తిరుచానూరు క్షేత్రాన్ని అలమేలుమంగాపురం అని, అలమేలు మంగపట్నం అని కూడా పిలుస్తారు.

పూర్వం ఇక్కడ వేదవ్యాస మహర్షి పుత్రుడైన శ్రీ శుకమహర్షి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని కొంతకాలం ఉన్న కారణాన ఈ క్షేత్రానికి శ్రీశుకనూరుగా పేరు వచ్చింది. కాలక్రమేణా ఆ పేరే తిరుచానూరుగా వ్యవహారంలోకి వచ్చింది.

వైకుంఠాన్ని వీడిన లక్ష్మీదేవిని పద్మావతీ శ్రీనివాసుల వివాహానంతరం శ్రీ మహాలక్ష్మి కొల్హాపురానికి వెళ్ళిపోయింది. ఆమె దర్శనం కోసం శ్రీనివాసుడు కొల్హాపురాంకి వెళ్ళాడు. ఆ క్షేత్రంలో శ్రీనివాసునికి శ్రీ మహాలక్ష్మి దర్శనం కాలేదు. ఆమెకోసం ఎంత వెతికినా ఎంత పరితపించిణా దర్శనం కాలేదు. కానీ ఇంతలో ''ఓ శ్రీనివాసా! నీవు వేంకటాచల క్షేత్రం దగ్గర్లో ఉన్న సువర్ణముఖీ నదికి సమీపాన ఒక పద్మసరోవరాన్ని నిర్మించి, అందులోని పద్మాలతో మహాలక్ష్మిని ఉపాసిస్తూ తపస్సు ఆచరించు. అక్కడ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి సంపూర్ణ కళలతో పరమశాంత స్వరూపంతో ప్రత్యక్షమై నిన్ను చేరగలదు. అక్కడే నీద్వారా ఆ సిరులతల్లి కొలువు ప్రత్యక్షంగా భక్తులందరికీ సిద్ధిస్తుంది'' అని అశరీరవాణి పలికింది.

పంచమీతీర్థం

శ్రీనివాసుడు తపస్సు చేసి పద్మసరోవరంలో కార్తీకమాసం శుక్లపంచమీ శుక్రవారం నాడు ఉత్తరాషాఢ నక్షత్రయుక్త విజయ లగ్నంలో దేదీప్యమానమైన వింత వింత తేజస్సులు విరజిమ్ముతుండగా ఆ సరోవర మధ్యభాగాన సహస్ర దళాల బంగారు పద్మంలో శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది.

పంచమీతీర్థ పద్మసరోవర తీరాన శ్రీనివాసునితో కూడి ఉన్న మహాలక్ష్మిని బ్రహ్మ, ఇంద్రాది దేవతలు, భక్తులు అనేక విధాల స్తుతించారు. ఆ ప్రార్థనలకు సంతోషించిన లక్ష్మీదేవి ''నేను ఆవిర్భవించిన ఈ పద్మసరోవరంలో శుభప్రదమైన ఈ పంచమీతీర్థం నాటి శుభ ముహూర్తంలో స్నానం చేసి నన్ను స్తుతించిన వారంతా దీర్ఘాయువుతోపాటు, ఐశ్వర్యాన్ని, విద్యను, తేజోవంతులైన సంతానాన్ని పొందగలరు'' అని వరాన్ని అనుగ్రహించింది. తర్వాత శ్రీ వేంకటేశ్వర స్వామివారు మహాలక్ష్మిని సంపూర్ణ కళాంశలతో వక్షస్థలంలో ''వ్యూహలక్ష్మిని ప్రతిష్టించుకుని వేంకటాచలక్షేత్రానికి పయనమయ్యాడు.

బ్రహ్మాది దేవతల ప్రార్థనమేరకు శ్రీనివాసుడు పద్మసరోవరం తీరాన శ్రీమహాలక్ష్మిని కేవలం ఒక అంశారూపంతో ''వీరలక్ష్మి'' ని (స్వామి లేకుండా ఉన్న అమ్మవారిని వీరలక్ష్మి అంటారు) అర్చామూర్తిగా తూర్పు ముఖంగా ఏర్పాటు చేసి మిగిలిన ప్రధాన అంశలతో కూడి ఉన్న మహాలక్ష్మిని తన వక్షస్థలంలో ''వ్యూహలక్ష్మి''గా ప్రతిష్ఠించుకుని తిరుమల క్షేత్రానికి గరుత్మంతునిపై వెళ్ళాడు. అప్పటినుంచి తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తుల పాలిట కల్పవల్లిగా అర్చించబడుతూ ఉంది.

బలరామ శ్రీకృష్ణ సుందరరాజ స్వామి

పద్మావతీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనే భక్తులు దర్శించవలసిన రెండు ఆలయాలు ఉన్నాయి. వాటిలో మహాద్వారానికి ఎదురుగా తూర్పు ముఖంగా శ్రీ బలరామకృష్ణుల సన్నిధి మొదటిది.

అలాగే శ్రీకృష్ణ బలరాముల ఆలయానికి దక్షిణాన తూర్పుముఖంగా శ్రీ సుందరరాజస్వామి ఆలయం ఉంది. శ్రీదేవి, భూదేవి సమేతంగా నిలువెత్తు శిలామూర్తులుగా ఉన్న స్వామివారిని వరదరాజస్వామి అని కూడా పిలుస్తారు.

శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం

తిరుచానూరులో భక్తులు తప్పక దర్శించవలసిన మరో ఆలయం శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం. పద్మసరోవరం పక్కనే పశ్చిమాభిముఖంగా సాక్షాత్తూ శ్రీనివాస భగవానుడే ప్రతిష్ఠించిన శ్రీ సూర్య భగవానునికి నిత్యార్చనలు, అభిషేక, అర్చన, ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి.

చారిత్రక ప్రశస్తి

క్రీస్తుశకం 830లో పల్లవరాణి సామవై తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయానికి ఒక భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని బహూకరించి అందుకోసమే తిరువిలాన్ కోయిల అనే ఆలయ ముఖ మండపాన్ని నిర్మించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. తర్వాత తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదటిరోజు ధ్వజారోహణ, చివరి రోజు ధ్వజావరోహణ తప్ప మిగిలిన బ్రహ్మోత్సవాలన్నీ తిరుచానూరులో జరిపే సంప్రదాయం ఉద్నేది. భగవద్రామానుజాచార్యులవారు ఈ సంప్రదాయాన్ని పూర్తిగా మార్చివేసి అన్ని ఉత్సవాలు తిరుమలలోనే జరిగేటట్లు ఏర్పాటు చేశారు. తిరుచానూరులో పంచమీతీర్థం నాడు అమ్మవారి అవభ్రుథోత్సవం పూర్తి అయ్యేంతవరకు తిరుమల ఆలయంలో ఎలాంటి అర్చన నివేదనలు జరగవు.


Tiruchanur Padmavati Ammavari Temple, Padmavati Ammavari Temple in Tirupati, Padmavati Ammavari Temple and Brahmotsavas, Padmavati Ammavaru veeralakshmi, Padmavati Temple panchameeteertham, Padmavati vyoohalakshmi, Alimela mangapuram Padmavati