![]() |
![]() |

థ్రిల్లర్లను ఇష్టపడే వారికి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈవిల్ ఐ మూవీ మంచి ఆప్షన్. అయితే ఆ మూవీని ఒంటరిగా చూస్తే భయంతో బిక్కచచ్చిపోయే అవకాశాలున్నాయి. అంత భయానకంగా, భీతిపుట్టించే స్క్రిన్‌ప్లేతో ఆ మూవీ నడుస్తుంది. పేరుకు హాలీవుడ్ ఫిల్మ్ అయినప్పటికీ ఇద్దరు భారతీయ తారలు సరితా చౌధరి (ఉషా ఖార్తి పాత్రధారి), సునీతా మణి (పల్లవి ఖార్తి పాత్రధారి) ఈ మూవీలో తల్లీ కూతుళ్లుగా కీలక పాత్రలు పోషించారు. ప్రియాంక చోప్రా సొంత నిర్మాణ సంస్థ పర్పుల్ పెబుల్ పిక్చర్స్, బ్లమ్‌హౌస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి.
ఈవిల్ ఐ అనేది మాధురి శేఖర్ రాయగా 2019 లో విడుదలైన ఆడియో బుక్. బెస్ట్ సెల్లర్‌గా నిలవడమే కాకుండా ఉత్తమ ఒరిజినల్ వర్క్‌కు 2020 ఆడి అవార్డును కూడా ఇది గెలుచుకోవడం విశేషం.
తన కుమార్తె బాయ్‌ఫ్రెండ్ గతంలో ఆమెను వేధించిన ఒక వ్యక్తితో గాఢానుబంధం కలిగి ఉన్నాడని గట్టిగా నమ్మే ఓ తల్లి చుట్టూ ఈవిల్ ఐ కథ నడుస్తుంది. ఆ బాయ్‌ఫ్రెండ్ పునర్జన్మ పొందిన ఒక చెడ్డ వ్యక్తి అనీ, తనపైనా, తన కుటుంబం పైనా ప్రతీకారం తీర్చుకోవడానికి అతను వచ్చాడనీ నమ్మిన ఆమె అతడి నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవాలని పడే తపనను మనం ఇందులో చూస్తాం.
మనుషుల్లో పాతుకుపోయిన మూఢనమ్మకాలను ఈ సినిమా ఎత్తిచూపుతుంది. ఈవిల్ ఐ నుంచి రక్షణ పొందే నిమిత్తం చేతికి ధరించమని కూతురికి ఆ తల్లి ఇచ్చే బ్రాస్‌లెట్ ఇందుకు ఓ ఉదాహరణ. ఆద్యంతం ఉత్కంఠభరితంగా, కుర్చీల్లో మునివేళ్లపై కూర్చోపెట్టేలా ఈ మూవీని డైరెక్ట్ చేశారు సోదరులైన ఎలన్, రాజీవ్ దస్సాని. కొన్ని సీన్లు వచ్చేటప్పుడు ఆ సస్పెన్స్ తట్టుకోలేక ఆ భయానికి కళ్లు మూసుకోవాలని కూడా అనిపిస్తుంటే.. అది దర్శకులుగా వాళ్లు సాధించిన విజయం.
'మిసిస్సిపి మసాలా', 'కామసూత్ర: ఎ టేల్ ఆఫ్ లవ్' లాంటి సినిమాలతో భారతీయ ప్రేక్షకులకు సుపరిచితురాలైన సరితా చౌధరి ఈ మూవీలో ఉషా ఖాత్రిగా తల్లి పాత్రలో అమోఘంగా రాణించారు. ఆమె హావభావాలు ఈ సినిమాకు పెద్ద ప్లస్.
హారర్ జానర్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ మూవీతో ప్రయత్నించింది ప్రియాంక. సినిమా చూశాక ఆమె మంచి నిర్ణయం తీసుకుందని అనిపిస్తుంది. ఈ సినిమాని వీక్షించినవాళ్లు డిజప్పాయింట్ చెందరని చెప్పవచ్చు.
![]() |
![]() |