![]() |
![]() |

సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి తర్వాత ఆయన అభిమానులు బాలీవుడ్‌లో ఆశ్రిత పక్షపాతం, వారసత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఫలితంగా అనేకమంది స్టార్ కిడ్స్ సోషల్ మీడియాలో వ్యతిరేకతను ఎదుర్కొంటూ వచ్చారు. ఆ తీవ్ర వ్యతిరేకత కారణంగానే ఆలియా భట్ సినిమా 'సడక్ 2' మూవీ ఘోరాతి ఘోరంగా ఆడియెన్స్ చేతిలో భంగపాటుకు గురైంది. అయితే బాలీవుడ్‌లో వారసత్వంపై సోషల్ మీడియాలో వచ్చిన వ్యతిరేకత సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాకపోవడం ఇక్కడ గమనార్హం.
బాలీవుడ్ తరహాలోనే టాలీవుడ్‌నూ కొన్ని కుటుంబాలు ఏలుతున్నాయనే విషయం తెలిసిందే. ఆరేడు కుటుంబాలకు చెందిన నటులు వారసత్వాన్ని అందిపుచ్చుకొని స్టార్లుగా ఎదిగి, అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. అయితే వారసత్వంగా సినిమాల్లోకి రావడాన్ని ఓ వారసుడు ఇదివరలోనే వ్యతిరేకించడం గమనార్హం. ఆయన ఎవరో కాదు.. జూనియర్ ఎన్టీఆర్. అవును. నటరత్న నందమూరి తారకరామారావు వారసుడిగా సినిమాల్లోకి వచ్చినప్పటికీ తాను వారసత్వాన్ని నమ్మనని ఆయన తేల్చేశారు.
'జై లవ కుశ' సినిమా విడుదల సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, "నేను లెగసీని నమ్మను. వారసత్వంగా దేన్నయినా కొనసాగించడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నేను హీరోను కాబట్టి మా అబ్బాయి అభయ్ హీరో అవ్వాలంటే కుదరదు." అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అలా చెప్పగల హీరోలు ఎంతమంది ఉంటారు? ఈ విషయంలో తారక్‌ను అభినందించి తీరాల్సిందే.
![]() |
![]() |