![]() |
![]() |
పది సంవత్సరాలపాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన టిఆర్‌ఎస్ గత ఎన్నికల్లో ఒక్కసారిగా తన ఉనికిని కోల్పోయే పరిస్థితి రావడం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిపోయాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అక్కడ అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించేందుకు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగాయి. సినిమా రంగంలోని ఎంతో మంది ప్రముఖులు జనసేన విజయాన్ని కాంక్షిస్తూ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌కు తమ మద్దతును ప్రకటించారు. ఇక మెగా ఫ్యామిలీ పవన్‌కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం వెళ్లి ప్రచారం కూడా చేశారు.
ఈ క్రమంలో హీరో అల్లు అర్జున్ మాత్రం వైసీపీని సపోర్ట్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. తన స్నేహితుడైన శిల్పారవిచంద్ర కిశోర్‌రెడ్డి వైసీపీ తరఫున నంద్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. బెస్ట్ విషెస్ చెప్పడానికి అంటూ నంద్యాల వెళ్ళి ఆయన్ని కలిసి వచ్చారు బన్ని. ఇది జనసేన పార్టీ శ్రేణులను, మెగా అభిమానులను బాధించింది. మెగా ఫ్యామిలీ హీరో అయి ఉండి జనసేన పార్టీని సపోర్ట్ చేయకపోవడాన్ని అందరూ విమర్శించారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. మొదటి నుంచీ వెనకబడి ఉన్న శిల్పారెడ్డి ఓటమి దాదాపుగా ఖరారైనట్టే కనిపిస్తోంది. దీంతో శిల్పారెడ్డిని సపోర్ట్ చేసిన అల్లు అర్జున్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.
ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ కొత్త సినిమా ‘పుష్ప2’ ఆగస్ట్ 15న విడుదల కాబోతోంది. ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, మెగా అభిమానుల ఆగ్రహం చూస్తుంటే ‘పుష్ప2’ చిత్రం భవితవ్యం ఏమిటి అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. ఏపీలో ఎన్నికల ఫలితాలను బట్టి వైసీపీ ఘోరంగా ఓడిపోవడం, కూటమి అఖండ విజయాన్ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లో ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో ఆగస్ట్ 15న విడుదలయ్యే ‘పుష్ప2’ చిత్రానికి ఏపీలో ఎలాంటి ఆదరణ లభిస్తుంది అనే విషయంలో బన్ని అభిమానులు చాలా ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ కెరీర్ పీక్స్‌లో ఉంది. ‘పుష్ప’తో పాన్ ఇండియా హీరోగా అవతరించిన బన్నీ.. త్వరలో ‘పుష్ప-2’తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లు కొల్లగొట్టినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలున్నాయి. ‘పుష్ప-2’ ఆశించిన విజయాన్ని అందుకుంటే.. అల్లు అర్జున్ స్టార్‌డమ్ ఎన్నో రెట్లు పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. అయితే ఇలాంటి తరుణంలో మెగా ఫ్యాన్స్ ‘పుష్ప-2’ని బాయ్ కాట్ చేస్తే మాత్రం.. కలెక్షన్ల పరంగా తెలుగునాట తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల అభిమానగణం భారీగా ఉంటుంది. వారిలో మెజారిటీ అభిమానులు అల్లు అర్జున్ సినిమాలను కూడా చూస్తుంటారు. అయితే ఇప్పుడు వారు ‘పుష్ప-2’ని బాయ్ కాట్ చేస్తే.. ఖచ్చితంగా వసూళ్లపై ఎంతోకొంత ప్రభావం ఉంటుంది. పైగా ‘పుష్ప పార్ట్-1’.. ఓవరాల్ గా హిట్ అయినప్పటికీ, భారీ బిజినెస్ కారణంగా తెలుగునాట మాత్రం నష్టాలనే చూసింది. ఇప్పుడు ‘పుష్ప-2’కి ఓ రేంజ్‌లో బిసినెస్ జరిగే అవకాశముంది. ఆ స్థాయి బిజినెస్‌కి లాభాలు రావాలంటే అల్లు, మెగా అభిమానులు మాత్రమే కాకుండా.. అందరు హీరోల అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకులు కూడా ఆదరించాల్సి ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మెగా అభిమానుల సపోర్ట్ లేకుండా.. తెలుగునాట ‘పుష్ప-2’ లాభాలను చూస్తుందో లేదో చూడాలి.
![]() |
![]() |