![]() |
![]() |

రామ్‌గోపాల్ వర్మ 'పవర్ స్టార్' మూవీని అనౌన్స్ చేసినప్పట్నుంచీ ఆయనకూ, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కూ మధ్య తీవ్ర వైరం ఏర్పడిన వాతావరణం కనిపిస్తోంది. తన సినిమాకూ, పవన్ కల్యాణ్‌కూ ఎలాంటి సంబంధం లేదనీ, అలా ఉందని అనిపిస్తే అది కాకతాళీయమేననీ ఆర్జీవీ ప్రకటించారు. అయితే ఆ సినిమా టైటిల్ దగ్గర్నుంచీ, ఆయన రిలీజ్ చేస్తున్న స్టిల్స్, వీడియోలు అన్నీ పవన్ కల్యాణ్‌ను తలపిస్తున్నాయి. ఆయనపై సెటైరికల్‌గా 'పవర్ స్టార్'ను ఆర్జీవీ తీస్తున్నట్లు అర్థమైపోతోంది. పవన్ కల్యాణ్‌లా ఉన్న ఆ సినిమాలోని ప్రధాన పాత్రధారికి 'ప్రవన్ కల్యాణ్' అని పేరు పెట్టారు ఆర్జీవీ. దీంతో అగ్గిమీద గుగ్గిలమవుతున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ ఒకదాని తర్వాత ఒకటిగా ఆర్జీవీపై సినిమాలు ప్రకటిస్తున్నారు. పరాన్న జీవి, పార్న్ జీవి, డేరా బాబా, ఒన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ టాలీవుడ్: ఎ ఫ్లాప్ డైరెక్టర్ అంటూ సినిమాలు తీస్తున్నారు. వీటికి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తీస్తున్న సినిమా 'ఆర్‌జీవీ: రోజూ గిల్లే వాడు' అదనం.
పవన్ కల్యాణ్ ఇమేజ్‌ను దెబ్బతియ్యాలని చాలా రోజుల నుంచీ ఆర్జీవీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన తీస్తున్న 'పవర్ స్టార్' మూవీని పీకే ఫ్యాన్స్ సీరియస్‌గా తీసుకున్నారు. ఆ సినిమాని జీర్ణం చేసుకోలేకపోతున్న వాళ్లు ఆర్జీవీకి గట్టి పాఠం నేర్పాలని కంకణం కట్టుకున్నారు. వారిలో ఒకరైన నటుడు నూతన్ నాయుడు 'పరాన్న జీవి' మూవీ పోస్టర్‌ను షేర్ చేసి, రామ్‌గోపాల్ వర్మ భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నప్పటికీ, అతని చర్యలను ఎవరూ ప్రశ్నించకపోవడం, ఆపకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. తన సినిమాలో పవన్ కల్యాణ్ గురించి ఆర్జీవీ అల్లే కాకమ్మ కథలు ఎలా ఉంటాయో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదనీ, అయితే ఆర్జీవీ గురించి బయటకు తెలీని రహస్యాలను పవన్ ఫ్యాన్స్ ఏం చూపించబోతున్నారనేది ఆసక్తి కలిగిస్తోందనీ అన్నారు.
ఇప్పటికే 'పరాన్న జీవి' టైటిల్ సాంగ్ వచ్చి ఆసక్తిని పెంచింది. ఇవాళ మరో పోస్టర్‌ను వదిలారు. "చీమూ నెత్తురూ ఎప్పుడో వోడ్కాలో కలిసిపోయాయ్. సిగ్గూ.. ఎగ్గూ.. రెండో పెగ్గుకే ఎగిరిపోయాయ్. బంధం, బంధుత్వం లేదు. ఇల్లు.. వాకిలి అక్కర్లేదు. సినిమాపై ప్యాషన్ చచ్చిపోయి, మెదడు పుచ్చిపోయి, టాలెంట్ ఖర్చయిపోయి, ట్విట్టర్‌లో రెచ్చిపోయే ఓ వింత జీవి కథ పరాన్న జీవి" అని అందులో రాసుకొచ్చారు. ఈ నెల 25న ఈ మూవీని ఏటీటీ ప్లాట్‌ఫామ్స్.. శ్రేయాస్ ఈటీ, 99 థియేటర్‌పై రిలీజ్ చేస్తున్నారు. ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌తో పాటు ప్రయాణం ప్రారంభించి, ఆయన సినిమాలను రిలీజ్ చేస్తూ వస్తోన్న శ్రేయాస్ ఈటీ 'పవర్ స్టార్'ను స్ట్రీమింగ్ చేయడానికి నిరాకరించి, 'పరాన్న జీవి'ని స్ట్రీమింగ్ చేయడానికి అంగీకరించడం గమనార్హం.
![]() |
![]() |