![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లో క్రమేపీ పెరుగుతూ వస్తోంది. విక్రమ్, సూర్య, విశాల్, కార్తీ లాంటి హీరోలతో పోలిస్తే విజయ్ మార్కెట్ గతంలో బాగా డల్‌గా ఉండేది. ఐదారేళ్ల క్రితం వరకు ఆయనకు మార్కెట్ లేదనే చెప్పాలి. అలాంటిది ఇవాళ ఆయన మార్కెట్ వాల్యూ రూ. 10 కోట్లకు పెరిగింది.
లేటెస్ట్ ఫిల్మ్ మాస్టర్ ఆయన కెరీర్‌లో అత్యధికంగా రూ. 14 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేయడం విశేషం. రూ. 8.5 కోట్లకు తెలుగు వెర్షన్ హక్కులను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ కొనుగోలు చేస్తే, రూ. 5.5 కోట్లు లాభాలు తెచ్చిందన్న మాట. నెగటివ్ టాక్‌లోనూ ఈ రేంజ్‌లో సినిమా వసూళ్లు రావడంతో విశ్లేషకులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది తెలుగునాట విజయ్‌కు పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని వాళ్లంటున్నారు.
మాస్టర్ కంటే ముందు వచ్చిన విజయ్ సినిమా విజిల్ (2019) సైతం పది కోట్ల మార్కును దాటి, రూ. 11.5 కోట్లు వసూలు చేయడం ఇక్కడ గమనార్హం. 2017లో వచ్చిన ఏజెంట్ భైరవ మూవీ వసూలు చేసిన రూ. 1 కోటి షేర్‌తో పోలిస్తే, ఈ నాలుగేళ్లలో ఆయన మార్కెట్ వాల్యూ ఎంతగా పెరిగిందనేది అర్థమవుతుంది. అదిరింది (2017) మూవీ రూ. 5.4 కోట్లు, సర్కార్ (2018) సినిమా రూ. 8.7 కోట్లు వసూలు చేశాయి.
ఇలా సినిమా సినిమాకీ విజయ్ తెలుగు ప్రేక్షకుల ఆదరణను పెంచుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు నెగటివ్ టాక్‌లోనూ మాస్టర్ భారీ ప్రాఫిట్స్ తేవడంతో విజయ్ నెక్ట్స్ ఫిల్మ్ రైట్స్ భారీగా పెరిగే చాన్సులున్నాయి.
![]() |
![]() |