![]() |
![]() |

సీనియర్ నటుడు, 900 పైగా చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం ఏర్పరచుకున్న చంద్రమోహన్ పుట్టినరోజు వేడుకలు రెండు రోజుల పాటు జూమ్ క్లౌడ్ మీటింగ్ ద్వారా ఇటీవలే జరిగాయి. ఆయన పుట్టినరోజు మే 23. ఈ పుట్టినరోజు వేడుకల్లో మాట్లాడిన ఆయన తను ఇక సినిమాల్లో నటించకపోవచ్చని చెప్పారు. ఇదివరకు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల షూటింగ్ సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు.
అయితే తాజాగా ఆయన ఆరోగ్య స్థితిపై ఒక ఫేక్ న్యూస్ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. ఆయన ఇక లేరంటూ బాధ్యతారాహిత్యంగా ఎవరో తప్పుడు ప్రచారాన్ని సృష్టించారు. క్షణాల్లో ఇది వైరల్ అయ్యింది. అయితే ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో భార్య జలంధరతో నిక్షేపంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఆయన జన్మదిన వేడుకల నిర్వహణలో పాలుపంచుకున్న సినీ నిర్మాత, సంతోషం సినీ వారపత్రిక అధినేత సురేశ్ కొండేటి తెలియజేశారు. చంద్రమోహన్‌తో తాను మాట్లాడాననీ, ఆయన బాగున్నారనీ వెల్లడించారు. ఆయన గురించి వాట్సాప్‌లో ప్రచారమవుతోంది తప్పుడు వార్త అని స్పష్టం చేశారు.
తాను సినిమాలకు సెలవు చెపుతున్నానని చంద్రమోహన్ చెప్పిన విషయాన్ని మీడియా కవర్ చేసింది. ఈ వార్తలను చూసి, అందులోని విషయాన్ని చదవకుండానే హెడ్డింగ్ చూసి, తొందరపాటుతో తప్పుగా అర్థం చేసుకున్న దగుల్బాజీలెవరో ఈ వదంతుల్ని సృష్టించినట్లుగా ఉందని చంద్రమోహన్ అభిమానులు అంటున్నారు. ఇలాంటి సున్నితమైన విషయాల్ని ప్రచారంలోకి తెచ్చేముందు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలని, సంచలనం కోసం ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారంలోకి తేవద్దని వారు కోరారు.
![]() |
![]() |