![]() |
![]() |

ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే ఈతరం అగ్ర కథానాయకుల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. నటన, నర్తనం, సంభాషణలు పలికే విధానం.. ఇలా ప్రతీ అంశంలోనూ తనదైన ముద్ర వేసి ఆల్ రౌండర్ అనిపించుకున్నారు తారక్. బాలనటుడిగా `రామాయణం` (1997)లో శ్రీరాముడిగా అలరించిన ఎన్టీఆర్.. నాలుగేళ్ళ తరువాత `నిన్ను చూడాలని`(2001)తో కథానాయకుడి అవతారమెత్తారు. `చిత్రం`,
`నువ్వే కావాలి` (2000)వంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన దిగ్గజ నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని.. `నువ్వు వస్తావని` (2000) వంటి బ్లాక్ బస్టర్ మూవీని రూపొందించిన వీఆర్ ప్రతాప్ తెరకెక్కించారు. తారక్ కి జోడీగా నటించిన రవీనా రాజ్ పుత్ కి కూడా నాయికగా ఇదే తొలి చిత్రం కావడం విశేషం. కె. విశ్వనాథ్, కైకాల సత్యనారాయణ, అన్నపూర్ణ, రాళ్ళపల్లి, సుధ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు.
మెలోడీ స్పెషలిస్ట్ ఎస్. ఎ. రాజ్ కుమార్ స్వరపరిచిన పాటల్లో ``ఊపిరొచ్చిన బాపు బొమ్మ``, ``ఏ చోట నేనున్నా``, ``ఎన్నాళ్ళో వేచాక``, ``ముద్దబంతి పువ్వమ్మో``, ``ఏమైందో ఏమోగానీ``, ``క్యాంపస్ లో
కాలెట్టి``.. ఇలా అన్నీ గీతాలు కూడా వీనులవిందుగానూ, కనువిందుగానూ సాగాయి. 2001 మే 25న విడుదలైన `నిన్ను చూడాలని` బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించనప్పటికీ.. ఎన్టీఆర్ కి
నటుడిగా మంచి గుర్తింపునే తీసుకువచ్చింది. నేటితో కథానాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్థానానికి 20 ఏళ్ళు పూర్తవడం విశేషం.
![]() |
![]() |