![]() |
![]() |

మెగా కాంపౌండ్‌లో యంగ్ హీరోలకు కొదవలేదు. ఒకవైపు రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి యువ కథానాయకులు స్టార్స్‌గా చలామణి అవుతుంటే.. మరోవైపు వరుణ్ తేజ్, సాయి తేజ్, అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్ వంటి యంగ్ హీరోస్ తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే.. ఈ కాంపౌండ్ నుంచి మరో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ (సాయి తేజ్ తమ్ముడు) కూడా తెరంగేట్రం చేయనున్నాడు.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ కాంపౌండ్‌లో ఉన్న 'తేజ్' త్రయం (వరుణ్ తేజ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్) ముగ్గురు కూడా రాబోయే చిత్రాల విషయంలో డెబ్యూ డైరెక్టర్లతోనే సందడి చేయనున్నారు. ‘ఎఫ్ 2’, ‘గద్దలకొండ గణేష్’ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతోంది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ జరుపుకుంది. త్వరలోనే తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇక సాయి తేజ్ సంగతి తీసుకుంటే.. విడుదలకు సిద్ధమైన అతని కొత్త చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ డెబ్యూ డైరెక్టర్ కాంబినేషన్‌లోనే రూపొందింది. సుబ్బు అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా త్వరలోనే జనం ముందుకు రానుంది. ఇక సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ విషయానికొస్తే.. అతని డెబ్యూ మూవీ ‘ఉప్పెన’ నూతన దర్శకుడు కాంబినేషన్‌లోనే తయారైంది. విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా ద్వారా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా తొలి అడుగేస్తున్నాడు. థియేటర్లు ఓపెన్ అయిన వెంటనే ఈ సినిమా జనం ముందుకు వచ్చే అవకాశముంది.
మరి.. డెబ్యూ డైరెక్టర్లతో మెగా కాంపౌండ్ ‘తేజ్’ త్రయం చేస్తున్న ఈ ప్రయత్నాలు వారి కెరీర్‌కి ఏ మేరకు ప్లస్ అవుతాయో చూడాలి.
![]() |
![]() |