![]() |
![]() |

తెలుగు, తమిళ భాషల్లో అగ్ర నాయికగా వెలిగిన త్రిష సినిమా టాలీవుడ్‌లో అడుగుపెట్టి డిసెంబర్ 6వ తేదీతో 17 సంవత్సరాలు పూర్తయ్యాయి. తరుణ్ సరసన ఆమె నటించిన 'నీ మనసు నాకు తెలుసు' విడుదలైంది 2003 డిసెంబర్ 6న. ఇప్పటి దాకా ఆమె అన్ని భాషల్లో కలుపుకొని 60కి పైగా సినిమాలు చేస్తే, వాటిలో తెలుగులో చేసినవి 20 దాకా ఉంటాయి. టాప్ హీరోలు, టాప్ డైరెక్టర్లు, టాప్ ప్రొడ్యూసర్లతో ఆమె కలిసి పనిచేశారు. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాల్లో ప్రదర్శించిన అభినయానికి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. అంటే మంచి మంచి పాత్రలు చేసే అవకాశం టాలీవుడ్ అమెకు కల్పించింది.
ఇన్నేళ్ల కెరీర్‌లో త్రిష ఇద్దరు హీరోయిన్లు ఉన్న చిత్రాలు చేసింది చాలా తక్కువ. నీ మనసు నాకు తెలుసు, దమ్ము, లయన్, తీన్ మార్ సినిమాల్లోని ఇద్దరు హీరోయిన్లలో ఒకరుగా ఆమె నటించారు. కావాలనే అలాంటి చిత్రాలకు దూరంగా ఉన్నారా? అనే ప్రశ్న త్రిష ముందుంచితే - ‘‘ఇద్దరు హీరోయిన్ల కథల మీద నాకు ఆసక్తి లేని మాట వాస్తవమే. కానీ, కొన్ని చిత్రాలు చేశాను. వాటిలో నా పాత్రలకు ప్రాముఖ్యత ఉంది. అందుకే చేశా. భవిష్యత్తులో కూడా మంచి పాత్ర వస్తే.. ఇద్దరు నాయికలున్న చిత్రంలో నటించడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ, సెకండ్ హీరోయిన్‌గా మాత్రం ఎప్పటికీ చేయను’’ అని తెలిపారు.
టాలీవుడ్ సినిమా చేసి ఆమె చాలా కాలమైంది. ద్విభాషా చిత్రం 'నాయకి' (2016) తర్వాత ఆమె మళ్లీ తెలుగు సినిమాలో కనిపించలేదు. 'ఆచార్య'లో చిరంజీవి జోడీగా చేసే అవకాశం వచ్చినా ఆమె వదులుకున్నారు.
![]() |
![]() |