![]() |
![]() |

మలయాళం రైజింగ్ స్టార్, 'ఫోరెన్సిక్' హీరో టొవినో థామస్ షూటింగ్‌లో గాయపడి హాస్పిటల్ పాలయ్యాడు. అందిన సమాచారం ప్రకారం కొచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స కోసం చేరాడు. 'కళ' అనే తన లేటెస్ట్ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్న అతడు మంగళవారం ఓ యాక్షన్ సీక్వెన్స్‌లో నటిస్తుండగా అంతర్గత గాయాలకు గురయ్యాడు. కడుపు నొప్పిగా ఉందని అతను బాధపడటంతో, వెంటనే అతడిని దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కు తరలించారు. అతడిని ఐసీయూలో 24 గంటల సేపు అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు మీడియా సమాచారం. ఈ విషయం బయటకు పొక్కగానే దేశవ్యాప్తంగా ఉన్న టొవినో ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. అతను త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ సోషల్ మీడియాలో సందేశాలు పెడుతున్నారు.
అబ్జర్వేషన్ అనంతరం అతడికి సర్జరీ అవసరమవుతుందా, లేదా అనే విషయాన్ని డాక్టర్లు డిసైడ్ చేయనున్నారు. ఏదేమైనప్పటికీ, టొవినో ఆరోగ్యానికి సంబంధించి ఇంతవరకూ హాస్పిటల్ ఎలాంటి అఫిషియల్ స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. 'కళ' డైరెక్టర్ రోహిత్ వి.ఎస్. కానీ, టొవినో టీమ్ కానీ జరిగిన ఘటనపై పెదవి విప్పలేదు.
ఇటీవలే టొవినో 'కళ' మోషన్ పోస్టర్‌ను షేర్ చేసి, ఆ సినిమా చేస్తున్నందుకు ఎగ్జయిటింగ్‌గా ఉందని తెలిపాడు. అలాగే 'కానేక్కానే' అనే మరో సినిమా చేస్తున్నట్లు కూడా అతను ప్రకటించాడు. ఇందులో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ప్రస్తుతం మంచి డిమాండ్‌లో ఉన్న టొవినో చేస్తున్న సినిమాల లిస్ట్‌లో 'మిన్నల్ మురళి', 'కరాచీ 81', 'అజయంతే రండమ్ మోషనమ్' సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది విడుదలైన 'ఫోరెన్సిక్' సినిమా అతడికి మంచి పేరు తెచ్చింది. తెలుగులోనూ అదే పేరుతో ఈ మూవీ ఆహా ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందడం గమనార్హం.
![]() |
![]() |