![]() |
![]() |

ఒక సినిమా విజయంలో పబ్లిసిటీ కూడా కీలక పాత్ర పోషిస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. ఒక సినిమా హిట్టయ్యిందని ఎప్పుడు చెప్పుకుంటాం? ఆ సినిమా బడ్జెట్‌ను మించి, బిజినెస్‌ను మించి థియేటర్లలో కలెక్షన్ల రూపంలో, శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, ఇతర హక్కుల రూపంలో ఎక్కువ డబ్బులు వసూలైనప్పుడు. ఒకవేళ సక్సెస్ అయ్యే రీతిలో కలెక్షన్లు లేకపోయినా, కనీసం ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించాలంటే పబ్లిసిటీ చాలా ముఖ్యం. సినిమా పబ్లిసిటీ అనేది కాలంతో పాటే తీరు మార్చుకుంటూ వస్తోంది.
ఒకప్పుడు గోడల రాతలు, పత్రికల్లో యాడ్స్, రిక్షాల్లో మైక్ అనౌన్స్‌మెంట్ల రూపంలో ఉండే పబ్లిసిటీ పైనే సినిమావాళ్లు ఆధారపడేవాళ్లు. తర్వాత కటౌట్లు వచ్చాయి. ఆటోల్లో మైక్ అనౌన్స్‌మెంట్లు వచ్చాయి. వినైల్స్ వచ్చాయి. శాటిలైట్ చానల్స్, ఇంటర్నెట్ వచ్చాక పబ్లిసిటీ తీరే మారిపోయింది. టెలివిజన్‌లో టీజర్లు, ట్రైలర్లతో పాటు స్పెషల్ ప్రోగ్రామ్స్ పేరిట సినిమాలకు బోల్డంత పబ్లిసిటీ లభించింది. అయితే సోషల్ మీడియా రివల్యూషన్‌తో సినిమా పబ్లిసిటీ కొత్త పుంతలు తొక్కుతోంది. సోషల్ మీడియా రాకతో సినీ సెలబ్రిటీలే నేరుగా తమ సినిమాని పబ్లిసిటీ చేసుకొనే బ్రహ్మాండమైన అవకాశం లభించింది. దానికి యూట్యూబ్ లాంటి ఆన్‌లైన్ వీడియో చానల్ తోడయ్యింది. లేటెస్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై రిలీజైన ఒక చిన్న సినిమా 'కలర్ ఫొటో'కు లభించిన ప్రచారం, పేరు అంతా సోషల్ మీడియా చలవే!
సోషల్ మీడియాతో నేరుగా అభిమానులతో ఇంటరాక్ట్ అవడానికి ఇంతదాకా సంకోచించిన మహామహులు సైతం ఇప్పుడు దాని ప్రభావాన్నీ, దాని మహిమనూ గుర్తించక తప్పడం లేదు. మెగాస్టార్ చిరంజీవి సైతం 2020 మార్చిలో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్‌లో అకౌంట్ ప్రారంభించారు. అప్పట్నుంచీ తరచూ తనకు సంబంధించిన, తన ఫ్యామిలీకి సంబంధించిన, తన సినిమాలకు సంబంధించిన, తన జీవితంలోని పలు ఘట్టాలకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ అభిమానులకు ఆనందం పంచుతూ వస్తున్నారు. దాంతోపాటు ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌నూ ఆయన మొదలుపెట్టారు. ఈ ఎనిమిది నెలల కాలంలోనే ట్విట్టర్‌లో ఆయనను అనుసరిస్తున్న వారి సంఖ్య 7.95 లక్షలు దాటింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఆయన ఫాలోయర్స్ 1.1 మిలియన్ దాటారు.
మనదేశంలో ట్విట్టర్‌లో అత్యధికులు ఫాలో అవుతున్న సినీ సెలబ్రిటీ ఎవరనుకుంటున్నారు? ఏ యూత్ ఐకానో అనుకుంటే తప్పులో కాలేసినట్లే! వయసు మీద పడుతున్నకొద్దీ వ్యక్తిగత కరిష్మా అంతకంతకూ పెరుగుతూ వస్తున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చనే ఆ సినీ సెలబ్రిటీ!! ఆయనను 44.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆయన తర్వాత స్థానాల్లో 41.7 మిలియన్ ఫాలోయర్స్‌తో సల్మాన్ ఖాన్, 41.2 మిలియన్ పాలోయర్స్‌తో షారుఖ్ ఖాన్ నిలుస్తున్నారు.
టాలీవుడ్ విషయానికి వస్తే 10.8 మిలియన్ ఫాలోయర్స్‌తో మహేశ్ బాబు అందరికంటే ముందున్నాడు. టాలీవుడ్‌లోనే కాదు.. సౌత్ ఇండియాలోనే ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోయర్స్ ఉన్న యాక్టర్ ఆయన. అయితే సౌత్ ఇండియాలో అత్యధిక ఫాలోయర్స్ ఉన్న సినీ సెలబ్రిటీ వేరే ఉన్నారు.. ఆయన మ్యూజిక్ డైరెక్టర్.. ఎ.ఆర్. రెహమాన్. ట్విట్టర్‌లో ఆయనను ఫాలో అవుతున్న వారి సంఖ్య 23.4 మిలియన్. మహేశ్ తర్వాత టాలీవుడ్‌లో 6.1 మిలియన్ ఫాలోయర్స్‌తో నాగార్జున, రానా సమాన స్థాయిలో ఉన్నారు. అల్లు అర్జున్‌కు 5.3 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. దాదాపు హీరోలందరూ ట్విట్టర్‌లో తమ భావాలను, తమ విషయాలను పంచుకుంటున్నారు. టాప్ స్టార్స్‌లో ఒక్క ప్రభాస్ మాత్రమే ట్విట్టర్‌లో అడుగుపెట్టలేదు. కానీ 2019 ఏప్రిల్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన అతనికి ఇప్పుడు 5.6 మిలియన్ ఫాలోయర్స్ ఉండటం విశేషం.
హీరోయిన్లు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, రైటర్స్, సింగర్స్ ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను బాగా ఉపయోగించుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో బాలీవుడ్ హీరోయిన్లు అదరగొడుతున్నారు. శ్రద్ధా కపూర్, కత్రినా కైఫ్, ఆలియా భట్, దీపికా పడుకోనే లాంటి వాళ్లకు 40 మిలియన్ల నుంచి 50 మిలియన్ల మందికి పైగా ఫాలోయర్స్ ఉండటం గమనార్హం. టాలీవుడ్ హీరోయిన్ల విషయానికి వస్తే రకుల్ ప్రీత్ సింగ్ 15.6 మిలియన్ ఫాలోయర్స్‌తో టాప్‌లో ఉండగా, శ్రుతి హాసన్ 15 మిలియన్ ఫాలోయర్స్‌ను ఎంజాయ్ చేస్తోంది.
రెగ్యులర్‌గా అప్‌డేట్స్ చేస్తూ వస్తున్న సెలబ్రిటీలకు ఎక్కువ మంది ఫాలోయర్స్ ఉండటాన్ని మనం గమనించవచ్చు. అనేకమంది పేరుపొందిన సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఫాలోయర్స్ తక్కువ మంది ఉండటానికి కారణం వారు రెగ్యులర్‌గా సినీ ప్రియులను పలకరించకపోవడమే. అనేకమంది స్టార్ల కంటే డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మను ఫాలో అయ్యే వాళ్ల సంఖ్య ట్విట్టర్‌లో ఎక్కువ. ఆయనకు 4.6 మిలియన్ల మంది ఫాలోయర్స్ ఉంటే, పవన్ కల్యాణ్‌కు 4.1 మిలియన్ల మంది ఫాలోయర్సే ఉండటం గమనార్హం.
ఏదేమైనా గతంలో ఎన్నడూ లేని రీతిలో నేరుగా సెలబ్రిటీలే ఆన్‌లైన్ ప్రచారంలో భాగమవుతూ తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడమే కాకుండా, పర్సనల్ ఇమేజ్‌ను కూడా పెంచుకుంటూ వస్తున్నారు. తమ ఫ్యాన్స్‌తో, సినీ లవర్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ వారికి ఆనందాన్నీ చేకూరుస్తున్నారు. దీంతో సోషల్ మీడియా అనేది సినిమాకి ప్రధాన ప్రచారాస్త్రంగా మారిపోయిందనేది నిజ్జంగా నిజం.
![]() |
![]() |