![]() |
![]() |

తమిళ డైరెక్టర్ ఎ.ఎల్. విజయ్‌తో ప్రేమలోపడి, పెళ్లాడిన అందాల తార అమలా పాల్, రెండేళ్లే అతడితో కాపురం చేసి, ఆ తర్వాత విడిపోయింది. వాళ్ల లవ్ స్టోరీ ఎంత ఆసక్తిని రేపిందో, వాళ్ల వైవాహిక బంధం రెండేళ్లకే తెగిపోయినప్పుడు అంతకుమించి సంచలనం రేకెత్తించింది. అమల, విజయ్ ఎందుకు విడిపోయారని బాధపడిన వారి శ్రేయోభిలాషులు చాలా మందే ఉన్నారు. 2009లో అమలా పాల్ సినిమాల్లోకి అడుగుపెట్టింది. తెలుగు, తమిళం సహా దక్షిణాది భాషల్లో గ్లామరస్ రోల్స్‌తో పాటు అభినయానికి అవకాశమున్న పాత్రలు చేసి మెప్పించింది.
అమల మలయాళీ అమ్మాయి. కేరళలో 1987లో జన్మించింది. మొదట మోడలింగ్ చేసింది. దాని ద్వారా వచ్చిన అవకాశంతో 2009లో మలయాళం సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. అలా మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో వరుసగా సినిమాలు చేసి టాలెంటెడ్ యాక్ట్రెస్‌గా గుర్తింపు తెచ్చుకుంది అమల. 2010లో ఏడో సినిమాకు సంతకం చేసిందామె. అది విక్రమ్ హీరోగా ఎ.ఎల్. విజయ్ డైరెక్ట్ చేసిన 'దైవ తిరుమగల్' సినిమా. ఆ సినిమాకు సంతకం చేయకముందే నటిగా అతడిని ఆకట్టుకోవడమే కాకుండా, తనపై ఇష్టాన్ని పెంచుకొనేలా చేసింది అమల. అందుకే విజయ్ తన సినిమాలో హీరోయిన్‌గా ఆమెను తీసుకున్నాడు. ఆ సినిమా సెట్స్‌పైనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు.
వారి ప్రేమ విషయం మొదట్లో ఆ సినిమా యూనిట్ మెంబర్స్‌కు మాత్రమే తెలుసు. 'దైవ తిరుమగల్' పూర్తయ్యే సమయానికి ఇండస్ట్రీ మొత్తానికీ తెలిసిపోయింది. దాంతో మీడియాలో వారి లవ్ స్టోరీ హాట్ టాపిక్ అయిపోయింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. రెస్టారెంట్లలో, పార్టీలలో కలిసి కనిపిస్తూ వచ్చారు. అయితే ఇంటర్వ్యూల్లో మాత్రం అందరు తారలూ చెప్పినట్లే తాము మంచి ఫ్రెండ్స్ అని చెప్పింది అమల. కెరీర్‌కే తన ప్రాధాన్యం అనీ, కనీసం 100 సినిమాలు చేశాకే జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నాననీ తెలిపింది.
అయితే విజయ్ తండ్రి, నిర్మాత అళగప్పన్ షష్టి పూర్తి వేడుకలో అమల పాల్గొనడం, అక్కడ విజయ్ కుటుంబ సభ్యులతో ఆమె నడచుకున్న విధానంతో అందరికీ వారి బంధం గురించి అర్థమైపోయింది. అయితే 2011 నుంచి 2014 వరకు జనం దృష్టిలో పడకుండా తమ తమ కెరీర్‌ల మీదే దృష్టి పెడుతూ వచ్చారు విజయ్, అమల. 2014 ఏప్రిల్‌లో అమలను పెళ్లాడాలనుకుంటున్నట్లు తొలిసారి బహిర్గతంగా వెల్లడించాడు విజయ్. జూన్ 7న క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం కొచ్చిలోని ఓ చర్చిలో వారి ఎంగేజ్‌మెంట్ జరిగింది. జూన్ 12న హిందూ సంప్రదాయం ప్రకారం చెన్నైలో పెళ్లి చేసుకున్నారు. అమల క్రిస్టియన్, విజయ్ హిందూ కావడంతో ఇలాంటి ఏర్పాటు చేసుకున్నారు. అలా ప్రేమపక్షులు జంటగా మారారు.

చక్కని ప్రేమజంటగా అందరూ భావించిన ఆ ఇద్దరూ రెండేళ్లు తిరిగేసరికి విడిపోతారని ఎవరూ ఊహించలేదు. దీనికి కారణం.. విజయ్ తల్లిదండ్రులేననీ, పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పాల్సిందిగా అమలను వారు తీవ్రంగా ఒత్తిడి చేశారనీ ఇండస్ట్రీలో బాగా ప్రచారంలోకి వచ్చింది. విజయ్‌తో జీవితం ఎంతో అందంగా, ఆనందంగా ఉంటుందని ఊహించుకున్న అమల.. ఉన్నపళాన సినిమాలకు దూరం కావాలనే ఆలోచనను భరించలేకపోయింది. పెళ్లికి ముందే ఆమె మూడు సినిమాలకు సంతకం చేసింది. విజయ్ కూడా దీనికి ఎలాంటి అభ్యంతరం తెలుపలేదు. కానీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఒత్తిళ్లకు ఒకానొక సందర్భంలో అతనూ లొంగిపోయాడంటారు.

విజయ్ కూడా తల్లిదండ్రులకు వత్తాసు పలుకుతాడని అమల ఊహించలేదు. తనకు కెరీర్ కూడా ముఖ్యమేనని ఆమె తెగేసి చెప్పింది. దాంతో 2016లో ఇద్దరూ ఎవరి దారి వారు చూసుకున్నారు. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన రెండేళ్లకే ఇద్దరూ దానికి ముగింపు చెప్పేశారు. 2017 ఫిబ్రవరిలో అధికారికంగా వారికి విడాకులు మంజూరయ్యాయి. విజయ్ నుంచి విడిపోయాక మరోసారి ప్రేమలో పడి, మ్యూజిషియన్ భవీందర్ సింగ్‌ను ఈ ఏడాది మార్చిలో రహస్య వివాహం చేసుకుంది అమల. అది ఇంకో కథ...

![]() |
![]() |