![]() |
![]() |

పాపులర్ టెలివిజన్ తార, పాండ్యన్ స్టోర్స్ సీరియల్‌తో టీవీ వీక్షకుల అభిమాన నటిగా మారిన చిత్ర చెన్నైలోని ఓ హోటల్‌లో బుధవారం మృతి చెందింది. యాంకర్‌గానూ పేరు సంపాదించుకున్న ఆమె వీజే చిత్రగా పాపులర్ అయ్యారు. పాండ్యన్ స్టోర్స్‌లోని ప్రధాన పాత్రల్లో ఆమె చేసిన ముల్లా పాత్ర ఒకటి. చెన్నైలోని నజ్రత్‌పేట్‌లో ఉన్న హోటల్‌లో డిసెంబర్ 9న ఆమె చీరతో ఉరివేసుకొని కనిపించింది. ఆమెది ఆత్మహత్యగా భావిస్తున్నారు. చిత్ర వయసు 29 సంవత్సరాలు.
పోలీసులు చెపుతున్న దాని ప్రకారం, సీరియల్ షూటింగ్‌కు ప్యాకప్ చెప్పి, తన హోటల్ రూమ్‌కు ఆమె మంగళవారం అర్ధరాత్రి దాటాక 1 గంటకు (తెల్లారితే బుధవారం) వచ్చారు. తెల్లవారుఝాము 3.30 గంటలకు హోటల్ మేనేజర్ పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్ 100కు ఫోన్ చేశారు. మృతికి కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
గత ఆగస్ట్‌లోనే ఓ వ్యాపారవేత్త హేమంత్‌తో చిత్రకు నిశ్చితార్ధం జరిగింది. అతను కూడా చిత్ర ఉరేసుకున్న హోటల్‌లోనే ఉంటున్నాడనీ, హోటల్ సిబ్బందికి మొదటగా సమాచారం ఇచ్చింది అతనేననీ తెలుస్తోంది. చిత్ర కుటుంబం చెన్నైలోని కొత్తుపురమ్‌లో నివాసం ఉంటోంది. ఓ తమిళ చిత్రంలోని కీలక పాత్ర చేయడానికి ఇటీవలే చిత్ర సంతకం చేసింది. ఆమె మృతితో తమిళ టీవీ ఇండస్ట్రీ షాక్‌కు గురైంది.
![]() |
![]() |