![]() |
![]() |

శర్వానంద్ హీరోగా నటించిన 'రన్ రాజా రన్' మూవీతో డైరెక్టర్‌గా పరిచయమై అందరి దృష్టిలో పడ్డాడు సుజీత్. అదివరకు అతను తీసిన షార్ట్ ఫిలిమ్స్ ఆ సినిమా ఛాన్స్‌ను అతడికిచ్చాయి. తొలి సినిమాతోటే తనేమిటో చూపించాడు. 'రన్ రాజా రన్'ను రొమాంటిక్ థ్రిల్లర్‌గా అతను మలచిన విధానం ప్రభాస్‌కు తెగ నచ్చేసింది. దాంతో రెండో సినిమాలోనే తనను డైరెక్ట్ చేసే అవకాశాన్నిచ్చాడు ప్రభాస్. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందిన 'సాహో' సినిమా బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ ఫలితాన్నిచ్చింది. నార్త్‌లో హిట్టయిన ఆ మూవీ సౌత్‌లో ఫ్లాపయింది. హాలీవుడ్ రేంజ్‌లో తీసిన యాక్షన్ ఎపిసోడ్స్ మినహాయిస్తే ఆ యాక్షన్ సినిమాలో సరైన కథ కానీ, కథనం కానీ లేదని ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకులు తేల్చేశారు. అంటే ప్రభాస్ ఇచ్చిన చాన్స్‌ను సుజీత్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
ఆ సినిమా తెలుగు వెర్షన్ ఫ్లాపవడంతో వెంటనే అతడితో పనిచేయడానికి ఏ స్టార్ హీరో ముందుకు రాలేదు. అయితే అనూహ్యంగా 'లూసిఫర్' రీమేక్‌ను అతడితో చేయించాలని చిరంజీవి అనుకున్నారు. ఆ మేరకు ఆయన ప్రకటించారు కూడా. తలవని తలంపుగా వచ్చిన ఈ అవకాశాన్ని ఎట్లాగైనా ఉపయోగించుకొని, మళ్లీ లైమ్‌లైట్‌లోకి రావచ్చని సుజీత్ ఆశించాడు. మెగాస్టార్ లాంటి వాడు పిలిచి ఛాన్స్ ఇస్తే ఇంకేం కావాలి! కొద్ది రోజులు గడిచాయో, లేదో.. అంతలోనే అతడి ఆశలపై చిరంజీవి నీళ్లు చల్లేశారు. అతడిని ఆ ప్రాజెక్ట్ నుంచి తొలగించేశారు. సుజీత్ స్క్రిప్ట్‌కు ఆయన ఇంప్రెస్ కాలేదనీ, అందుకే తీసేశారనీ వినిపించింది. ఇందులో నిజమెంతో వారికే తెలియాలి.
దీంతో సుజీత్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అయితే అతడితో తొలి, మలి సినిమాలను నిర్మించిన యువి క్రియేషన్స్ సంస్థే మరోసారి అతడికి దిక్కయ్యింది. అతడి మూడో సినిమానీ నిర్మించడానికి అది ముందుకు వచ్చింది. గోపీచంద్‌తో సినిమా తీసే అవకాశం ఇచ్చింది. ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్‌ను డైరెక్ట్ చేశాక, ప్రస్తుతం మార్కెట్ పరంగా బాగా డౌన్‌లో ఉన్న గోపీచంద్‌తో సరిపెట్టుకోవాల్సిన స్థితిలోకి వచ్చేశాడు సుజీత్. కొత్తగా వచ్చిన డైరెక్టర్ స్టార్ హీరోతో ఫ్లాప్ తీస్తే.. ఏమవుతుందనేందుకు సుజీత్‌ను నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ మూడో సినిమా హిట్టయితే, మళ్లీ అతడికి ఓ స్టార్ హీరో నుంచి పిలుపు రావచ్చు. రాజకీయాల్లో మాదిరిగానే సినిమా ఇండస్ట్రీలోనూ ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం.
![]() |
![]() |