![]() |
![]() |
సినిమా రంగంలో, రాజకీయ రంగంలో వారసత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఈ వారసత్వం అనేది ఎక్కువ. సినిమా రంగంలోని వివిధ శాఖల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఎంతో మంది పిల్లలు సినిమా రంగంలోనే రాణించారు. అయితే కొందరు మాత్రం తమ లక్ష్యం వేరు, తమ గమ్యం వేరు అని ఆలోచిస్తారు. ఆ దిశగా తమ ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి ఓ యువకుడు తండ్రి బాటలో వెళ్లకుండా తనకెంతో ఇష్టమైన చదువుపై ధ్యాస పెట్టాడు. ఇప్పుడు సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
వివరాల్లోకి వెళితే తమిళ స్టార్ కమెడియన్ చిన్ని జయంత్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తమిళ్‌లో ఇప్పటివరకు 100కి పైగా సినిమాల్లో నటించడమే కాకుండా మూడు సినిమాలను డైరెక్ట్ చేశారు. తెలుగులోకి డబ్ అయిన తమిళ సినిమాల వల్ల తెలుగు ప్రేక్షకులకు కూడా అతను సుపరిచితుడే. 1984లో సినిమారంగంలోకి వచ్చిన చిన్ని జయంత్ ఇప్పటికీ తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. తన కుమారుడు శృతంజయ నారాయణన్‌ను సినిమా రంగంలో కొనసాగించాలనుకున్నాడు. కానీ, చిన్నతనం నుంచే నారాయణన్ ఆలోచనలు వేరు. సినిమా రంగంపై మక్కువ లేని అతను చదువుపైనే ఎక్కువ ధ్యాస పెట్టారు. చదువుకునే రోజుల్లో నాటకాల్లో నటించినప్పటికీ నటన జోలికి వెళ్ళకుండా చదువుకొని ఏదో సాధించాలన్న తపనతో కృషి చేశాడు. చదువులో టాపర్‌గా వస్తుండడంతో అతన్ని చదువులోనే ప్రోత్సహించారు తల్లిదండ్రులు.
నారాయణన్ మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న తర్వాత ఓ కంపెనీలో భారీ వేతనానికి ఉద్యోగంలో చేరాడు. నైట్ షిఫ్ట్స్‌లో మాత్రమే ఉద్యోగం చేస్తూ.. ఉదయం సమయాల్లో యూపీఎస్సీ పరీక్షకు సన్నద్ధం అయ్యేవారు. అలా రాత్రంతా పనిచేసినా.. ఉదయం వేళ కనీసం ఐదు గంటలు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాడు. చివరికి 2015లో అందులో విజయం సాధించి ఆల్ ఇండియా స్థాయిలో 75వ ర్యాంకు సాధించాడు. ఇది సామాన్యమైన విషయం కాదు. ప్రస్తుతం తమిళనాడులోని త్రిపూర్ జిల్లాలో సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు నారాయణన్. అనుకున్న లక్ష్యాన్ని సాధించిన నారాయణన్ ప్రస్తుతం యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సినిమా రంగంలో కొనసాగాలంటే తండ్రి ప్రోత్సాహం ఎలాగూ ఉంటుంది. కానీ, దానికి భిన్నంగా ఆలోచించిన నారాయణన్ తన కృషి, పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదిగిన తీరు అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.
![]() |
![]() |